• facebook
  • whatsapp
  • telegram

మెయిన్స్‌ తెలుగులో.. మేలెంత?

ప్రాంతీయ భాషల్లో జేఈఈ ప్రశ్నపత్రాలు

అఖిలభారత స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ పరీక్షను వచ్చే ఏడాది నుంచి మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించబోతున్నారు. 23 ఐఐటీల ఉమ్మడి ప్రవేశ బోర్డు (జేఏబీ) ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలు కానుంది. మాతృభాషలో ప్రశ్నపత్రాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు ప్రశ్నలను మరింత మెరుగ్గా, సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతారనేది ఈ విధాన నిర్ణయం వెనకున్న ఉద్దేశం. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సివుంది. తెలుగు విద్యార్థుల పరంగా ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉండబోతోంది? వారు గమనించాల్సిన అంశాలేమిటి? 
 

2021 విద్యాసంవత్సరం నుంచి వివిధ ప్రాంతీయ భాషల్లో జేఈఈ రాసే అవకాశాన్ని విద్యార్థులు పొందబోతున్నారు. ఎక్కువ సంఖ్యలో దీన్ని రాస్తున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోబోతున్నారు. 
 

సాధారణంగా జేఈఈ స్థాయి పరీక్షకు సంసిద్ధమవుతున్నవారికి ఆంగ్లంలోనూ ప్రావీణ్యం ఉంటుంది. కాబట్టి, పరీక్ష ఇంగ్లిష్‌లో ఉన్నా పెద్ద సమస్య ఉండదు. కానీ ఇంగ్లిష్‌ భాషపై ఎక్కువ పట్టు లేనివారికి తెలుగులో ఉండటం లాభిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధన అవకాశాలు లేని గ్రామీణ విద్యార్థులూ ఇకపై జేఈఈ మెయిన్‌ పరీక్ష రాయడానికి ఉత్సాహం చూపుతారు. తద్వారా పరీక్ష రాసేవారి సంఖ్యతోపాటు పోటీ కూడా పెరుగుతుంది. మాతృభాషలో ప్రశ్నలు ఉండటం వల్ల అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.
 

ఆంగ్ల పదజాలం 
కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జేఈఈ మెయిన్‌ను తెలుగులో రాయొచ్చు. కానీ అడ్వాన్స్‌డ్‌ గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాబట్టి విద్యార్థులు కేవలం తెలుగుపైనే ఆధారపడకుండా ఇంగ్లిష్‌ సాంకేతిక పదజాలం (టర్మినాలజీ) సాధన చేయాలి. పరీక్షలోని సబ్జెక్టులు- భౌతిక, రసాయన, గణిత శాస్త్రాల్లోని నిర్వచనాలు, సమీకరణాలు, సిద్ధాంతాల్లో ఎక్కువగా ఇంగ్లిష్‌ పదాలు ఉంటాయి. ఒక్కోసారి ఇంగ్లిష్‌ పదాలకంటే తెలుగు పదాలే కఠినంగా ఉంటాయి. ఉదాహరణకు- ‘ప్రస్తారాలు-సంయోగాలు’ కంటే పర్ముటేషన్స్‌- కాంబినేషన్స్‌ అంటే సులభంగా అర్థం అవుతుంది. కారణాంకాలు బదులు ఫాక్టర్స్‌ అనడం తేలికగా ఉండొచ్చు. ఇలా ఎన్నో పదాలను విద్యార్థులు తెలుగుతోపాటు ఇంగ్లిష్‌లోనూ గుర్తుపెట్టుకోవడం మంచిది. పరీక్ష రాసే సమయంలో కంటే సంసిద్ధత సమయంలో తెలుగులో చదువుకోవడం ఎక్కువ ఉపయోగకరం. జేఈఈ మెయిన్‌ సన్నద్ధతకు వెలువడే పుస్తకాలు కూడా తెలుగులో ముద్రిస్తే విద్యార్థులకు ఇంకా ఉపయోగపడతాయి.
 

ఇప్పటివరకూ జేఈఈ మెయిన్స్‌ను ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ భాషల్లో మాత్రమే కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2021 విద్యాసంవత్సరం నుంచి జేఈఈ మెయిన్‌ను తెలుగులోనూ నిర్వహిస్తున్నట్లు వెలువడిన ప్రకటనపై విద్యార్థులూ, వారి తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 3 లక్షల మందికిపైగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షకు హాజరవుతున్నారు. అందులో సుమారు లక్ష మందికిపైగా తెలుగు మాధ్యమం విద్యార్థులు ఉండొచ్చని అంచనా. 
 

కాబట్టి జేఈఈ మెయిన్‌ పరీక్షకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జేఈఈ మెయిన్‌కు ఇంటర్మీడియట్‌ తెలుగు మీడియంలో చదువుతున్నవారు...
 

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఒకసారి చదివి, వాటిలోని అంశాలు తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని క్షుణ్ణంగా చదవాలి.
 

ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రచురించిన పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌ఈ పుస్తకాల్లోని వివిధ అభ్యాసాల్లో ఉన్న ప్రశ్నల శైలిని గమనించుకుని వాటిని క్షుణ్ణంగా సాధన చేయాలి.
 

గణితం వరకూ కొన్ని అధ్యాయాల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాలకు పెద్ద తేడా ఉండదు. వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఈ వ్యత్యాసం చాలా ఉంటుంది. కాబట్టి, అకాడమీ పుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్‌ రెండు మాధ్యమాలవీ దగ్గరుంచుకుని వాటి సాయంతో ఎన్‌సీఈఆర్‌టీలోని అంశాలు తెలుగు పుస్తకాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తుంచుకుని సాధన చేయాలి.
 

గత పదేళ్ల తెలుగు మాధ్యమ ఎంసెట్‌ ప్రశ్నపత్రాలనూ గమనించుకుని సాధన చేయాలి.
 

తెలుగు రాష్ట్రాల్లో ఎంపీసీ తెలుగు మాధ్యమంలో చదువుతున్నవారు లక్షమందికి పైనే. దాన్ని ఎంచుకోవడానికి ఆర్థిక స్థోమత లేదా సరైన విద్యా సౌకర్యాలు లేదా సరైన దిశా నిర్దేశం లేకపోవడం ఇలా కారణమేదైనా కావొచ్చు. వీరిలో చాలామంది ఇంజినీరింగ్‌ను చదవడానికి ఎంసెట్‌ను ఎంచుకుంటున్నారు. అలాంటివారికి జేఈఈ మెయిన్‌ తెలుగులో అందుబాటులో ఉండటం వరం లాంటిదే. జాతీయస్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఇంజినీరింగ్‌ కళాశాలలో తెలుగు మీడియం వారికీ స్థానం ఉండాలి. దాన్ని సాధించాలంటే విద్యార్థి కొంత కృషి చేయక తప్పదు.
 

జేఈఈ మెయిన్స్‌ రాసే విద్యార్థులు కేవలం తెలుగుపైనే ఆధారపడకుండా ఇంగ్లిష్‌ సాంకేతిక పదజాలం (టర్మినాలజీ) తెలుసుకోవాలి; సాధన చేయాలి.  
 

ఎంపీసీ తెలుగు మాధ్యమంలో చదువుతున్నవారిలో చాలామంది ఇంజినీరింగ్‌ను చదవడానికి ఎంసెట్‌ను ఎంచుకుంటున్నారు. అలాంటివారికి జేఈఈ మెయిన్‌ తెలుగులో అందుబాటులో ఉండటం వరమే!  
 

1. మాతృభాషలో ప్రశ్నలుండటం వల్ల అర్థం చేసుకోవడం సులువు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 
 

2. తప్పులు చేసే అవకాశం తక్కువై నెగెటివ్‌ మార్కుల ఇబ్బంది చాలావరకు తొలగుతుంది.
 

3. అకాడమీ పుస్తకాలు రెండు మాధ్యమాలవీ దగ్గరుంచుకుని ఎన్‌సీఈఆర్‌టీ ఫిజిక్స్, కెమిస్ట్రీలోని అంశాలను తెలుగు పుస్తకాల్లో సాధన చేయాలి.
 

4. గత పదేళ్ల తెలుగు మాధ్యమ ఎంసెట్‌ ప్రశ్నపత్రాలనూ అభ్యసించటం మేలు.
 

ఇలా చేస్తే మంచిది
తెలుగు మీడియం పుస్తకాల్లోని సాంకేతిక పదాలను తెలుగుతోపాటు బ్రాకెట్‌లో ఆంగ్లంలోనూ ఇస్తే విద్యార్థులు త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఉపాధ్యాయులు కూడా తెలుగు మాధ్యమంలో బోధిస్తూ సాంకేతిక పదాలను ఇంగ్లిష్‌లోనూ తెలియజేస్తే మంచిది. ఇది విషయాన్ని త్వరగా గ్రహించడంలో తోడ్పడుతుంది. తెలుగులో పరీక్ష ఉండటం వల్ల కలిగే ఇంకో ప్రయోజనం- విద్యార్థికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తప్పులు చేసే అవకాశం తక్కువ. తద్వారా నెగెటివ్‌ మార్కుల ఇబ్బందీ చాలావరకు తొలగుతుంది. కానీ వివిధ ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహించడం అంత సులభం కాదు. ఎందుకంటే అనువాదం సరిగా జరగకపోతే ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లుతాయి. ఆ విద్యార్థులకు అదనంగా మార్కులు కలిపితే మిగతావారికి నష్టం జరుగుతుంది. - ధాగం కృష్ణమూర్తి, విద్యావేత్త
 

అడ్వాన్స్‌డ్‌ సాధ్యమేనా?
ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను కేవలం ఇంగ్లిష్, హిందీల్లోనే నిర్వహిస్తున్నారు. దీని స్థాయికి చేరుకోవాలంటే తెలుగు మాధ్యమ విద్యార్థులకు కొంత కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. చాలావరకూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివి ఇంటర్మీడియట్‌లో మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతారు. ఇలాంటివారు మొదటి 2-3 నెలలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చే ముఖ్య పదాలు, పదజాలాలు  వాటి అప్లికేషన్స్, ప్రజెంటేషన్స్‌ల్లో కొంత కష్టాలను అనుభవిస్తారు. తరువాత వాటిని పూర్తిగా అధిగమించి పూర్తిస్థాయి ఇంగ్లిష్‌ మీడియంలో చదివిన విద్యార్థితో పోటీపడి వారికంటే అత్యుత్తమ ఫలితాలు సాధించినవారు ఎందరో ఉన్నారు.  కాబట్టి, తెలుగు మాధ్యమ విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో పదజాలంపై కొద్దిగా పట్టు బిగిస్తే అడ్వాన్స్‌డ్‌ పరీక్షను కూడా చక్కగా అధిగమించవచ్చు. ఏదైనా అందరు విద్యార్థులకూ న్యాయం జరగాలనీ సామాన్య విద్యార్థికీ జాతీయస్థాయి ఉన్నతిని కల్పించాలనే ఈ నిర్ణయ ఉద్దేశం. - ఎం. ఉమాశంకర్, విద్యావేత్త 
 

Posted Date : 17-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌