• facebook
  • whatsapp
  • telegram

గెలిచారు నీట్‌.. దీటుగా! 

నీట్‌.. లక్షల మంది విద్యార్థులు స్కోరు చేయాలనుకునే ప్రవేశపరీక్ష! వైద్య రంగంలోకి అడుగులు వేసేందుకు ఎక్కాల్సిన సోపానం. అయితే ఆ అడుగులు అంత సులువేం కాదు. ఇది ఇతర పోటీ పరీక్షల్లాంటిదీ కాదు. నిరంతర శ్రమ.. సాధించాలన్న సంకల్పంతో పాటు ఏకాగ్రత, విషయ నైపుణ్యం.. అన్నింటికీ మించి ప్రతి అంశంపై స్పష్టత అవసరం. అలా ఉన్నప్పుడే 720/720 కల నెరవేరుతుంది. ఆ లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచి ఆలిండియా టాప్‌ ర్యాంకులు సాధించిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ‘ఈనాడు చదువు’తో ముచ్చటించారు. లక్ష్యం చేరేందుకు తాము చేసిన కృషిని పంచుకున్నారిలా..!
 

విశ్లేషిస్తూ చదివితే విజయం 
 

నీట్‌లో 720 మార్కుల్లో 700 గీత దాటారంటే మామూలు విషయం కాదు. మూడు సబ్జెక్టులనూ ఆపోశన పడితే కానీ అది సాధ్యం కాదు. 710 మార్కుల మార్కుని అందుకున్న హైదరాబాద్‌ కుర్రాడు అనంత పరాక్రమ భార్గవ... నీట్‌లో ప్రతి ప్రశ్ననూ ఎదుర్కొనేంత విషయ పరిజ్ఞానం రావాలంటున్నాడు. అదే తనకు ఆలిండియా 11వ ర్యాంకు తెచ్చిపెట్టిందంటూ తను సన్నద్ధమైన తీరుని ఇలా చెప్పుకొచ్చాడు.. 
 

మాది ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లి. నాన్న డాక్టర్‌ నారాయణరావు మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ. అమ్మ ఆర్యనారాయణ గృహిణి. నాన్న ఉద్యోగరీత్యా చదువులన్నీ హైదరాబాద్‌లోనే. పదోతరగతి ఐసీఎస్‌సీ సిలబస్‌ 95 శాతం సాధించాను. ఇంటర్మీడియట్‌ నారాయణగూడ శ్రీచైతన్య కాలేజీలో 95శాతం మార్కులొచ్చాయి. అక్కడే నీట్‌ శిక్షణ కూడా తీసుకున్నాను. 
 

చిన్నతనం నుంచే వైద్యరంగమంటే ఇష్టం. దానికి నాన్నే ప్రేరణ. ఆయన ఆసుపత్రిలో చూసే విషయాల గురించి ఇంట్లో చర్చించేవారు. ఆయన మాటల్లో వచ్చిన ‘నర్వ్‌ రీ జనరేషన్‌’ అనే అంశం నన్ను ఆకర్షించింది. ఈ రంగంలో పరిశోధకుడిగా రాణించాలనుకున్నాను. అక్కడే ఈ రంగానికి రావాలనే ఆలోచనకు బీజం పడింది. ఆ వైపు అడుగులేసేందుకే బైపీసీ తీసుకున్నాను. ఆ తర్వాత నీట్‌కి సన్నద్ధమయ్యాను. ఆలిండియా ర్యాంకు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. సాధారణంగా స్టడీస్‌లో నేను సగటు విద్యార్థినే. కానీ వైద్యరంగంలో పరిశోధకుడినవ్వాలనే తపన నీట్‌కు సన్నద్ధమయ్యేలా చేసింది. పట్టుబట్టి చదివాను ఆఖరికి సాధించాను. 
 

ప్రశ్నల్లా చదవొద్దు..!

నీట్‌కు సన్నద్ధమవ్వాలంటే ఏ విషయమైనా పరీక్షలు, ప్రశ్నలు అనే కోణంలో కాకుండా దానిపై పూర్తి అవగాహన వచ్చేలా విశ్లేషిస్తూ చదవాలి. ప్రతి అంశాన్నీ విశ్లేషించి అవగాహనతో ముందుకు తీసుకుపోయే పుస్తకాలు చదవాలి. ఒక అంశంపై ఒక పుస్తకానికి మాత్రమే పరిమితమై చదివి రివిజన్‌ చేయడం ప్రయోజనముంటుంది. కానీ చాలామంది ఎక్కువ పుస్తకాలు చదివేందుకు ప్రయత్నిస్తుంటారు. దానివల్ల అంశంపై లోతైన విశ్లేషణ దొరకడం కష్టం. పరీక్షల విషయంలోనూ లక్ష్యం కచ్చితంగా మెడికల్‌ సీటు కాబట్టి మనం రూపొందించుకునే ప్రణాళికలో ఇంటర్మీడియట్‌ పరీక్షలతో పాటు నీట్‌ సిలబస్‌ అధ్యయనానికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి.
 

అభ్యాసమే అసలు గెలుపు

నీట్‌ విషయంలో డిసైడింగ్‌ సబ్జెక్టు భౌతికశాస్త్రం. కేవలం ఓ సీటొస్తే చాలు అనుకుంటేనే బయాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. టాప్‌ 10లో ర్యాంకు రావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ప్రతి విషయంపై పట్టు సాధించాల్సి ఉంటుంది. చాలామంది ఫిజిక్స్‌ని కఠినతరమని భావించి వదిలేస్తుంటారు. కానీ దానిలో విషయం ఒక్కసారి అర్థమైతే ఏ ప్రశ్ననైనా ఎదుర్కోగలం. బయాలజీ సులువుగా ఉంటుందనే ఆలోచనలో ఉంటారు. నా వరకు ఎక్కువ సమయం భౌతిక శాస్త్రం కేటాయించాను. మొదటి ఏడాదిలో బాటనీ, జువాలజీ పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత మిగతా సమయంలో ఎక్కువ పునశ్చరణకు కేటాయించాను. ఇంకా పరీక్షకు రెండు నెలల సమయం ఉంది అనుకున్నప్పుడు ఎక్కువ అసైన్‌మెంట్స్‌ భౌతికశాస్త్రానికి సంబంధించినవే చేశాను. 
 

లాక్‌డౌన్‌ కాలం సద్వినియోగం 

లాక్‌డౌన్‌ సమయానికి ముందు ఆఫ్‌లైన్‌లో శిక్షణ, పరీక్ష రాసేవాణ్ణి. నోట్స్‌ రాసుకునేవాణ్ణి. కరోనా ఒకరకంగా కలిసొచ్చింది. కాలేజీకి వెళ్లి రావడానికి పట్టే సమయం మిగిలింది. ఆ సమయంలో పూర్తిగా అసైన్‌మెంట్స్‌ చేశాను. అన్ని ప్రశ్నలకు చూడకుండా సమాధానం గుర్తించే ప్రయత్నం చేశాను. ఆ కాలం పరీక్షలకు మరింత సన్నద్ధమయ్యేందుకు సాయం చేసింది. 

ఎప్పటికప్పుడు నోట్స్‌ 

ప్రతిరోజూ చదివే అంశం గుర్తుండేందుకు.. చివరి దశలో పునశ్చరణ సులువు అయ్యేందుకు సొంతంగా నోట్స్‌ రాసుకునేవాణ్ణి. భౌతికశాస్త్రంలో సమస్యల అభ్యాసానికీ, ఇతర కీ పాయింట్లు రాసుకునేందుకూ, రఫ్‌ వర్క్‌కీ దీన్నే వాడుకున్నాను. ఫలితంగా చివర్లో మళ్లీ చూసేటప్పుడు ఇవన్నీ గుర్తొచ్చేవి. అది పునశ్చరణలో కీలకమవుతుంది. 

అన్నింటినీ తాకట్లేదు..

బయాలజీ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. దానికోసం పుస్తకాలన్నీ తిప్పేసి భౌతిక, రసాయనశాస్త్రాల్ని తేలికగా తీసుకుంటున్నారు. చాలామంది చదివిన దాన్నే మళ్లీమళ్లీ చదువుతారు. అన్నింటినీ తాకే ప్రయత్నం చేయరు. ఎక్కువ ప్రశ్నల్ని ఎదుర్కోకుండా సబ్జెక్టు చదువుతూ వెళ్తుంటారు. అభ్యాసం చేస్తేనే గుర్తుంటుంది. రెండు, మూడు నెలల సమయం ఉంది అనగానే ఎంత అభ్యాసం చేస్తే అంత మంచిది. దాంతోపాటు తొలిసారే సాధించాలనే సంకల్పం ఉండాలి. శిక్షకులు చెప్పిన అసైన్‌మెంట్స్, సబ్జెక్టుల విషయంలో చురుగ్గా ఉంటే కచ్చితంగా మొదటిసారే టాప్‌ 10లో చోటు సాధించే అవకాశముంది.  ప్రశ్నకు సరైన సమాధానం తెలియకపోతే వదిలేయటమే ఉత్తమం. అలా కాకుండా రెండింట్లో అనుమానం ఉందంటే ఎలిమినేషన్‌ విధానం ద్వారా కొన్నిసార్లు రిస్క్‌ తీసుకున్నా పర్లేదు. నా విషయంలో ఓ రెండు ప్రశ్నల విషయంలో ఎలిమినేషన్‌ పద్ధ్దతిని అనుసరించడంలో విఫలమయ్యాను. ఓ ప్రశ్న అలా చేసినా మార్కు పోయింది. రెండు పెట్టాను. కానీ రెండు సందేహంగా ఉన్నాయి. చివరికి చూస్తే అది తప్పని తెలిసింది. కెమిస్ట్రీలో ఒకటి, భౌతికశాస్త్రంలో ఒకటి. వస్తే 8 మార్కులు, పోతే 2 మార్కులు అని రిస్క్‌ తీసుకున్నా.. దగ్గరగా ఉన్న సమాధానమే పెట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదు. 

మళ్లీ మళ్లీ అదే తప్పు!

లాంగ్‌టర్మ్‌లో సన్నద్ధమయ్యేవారు అన్నిసార్లు ప్రయత్నించినా రాకపోవడానికి కారణం సరైన ప్రణాళిక లేకపోవడమే. ఏ విషయం మీద ఎక్కువ ప్రశ్నలు చేయాలో, దేన్ని క్షుణ్నంగా చదవాలో చూడకుండా గుడ్డిగా వెళ్లిపోతుంటారు. బలంగా ఉన్నదానిపైనే దృష్టిపెట్టి బలహీనంగా ఉన్నవి చివర్లో చూద్దామనే ఆలోచన మారాలి. అదే మార్కులు పోగొడుతోంది.  
 

పక్కా ప్రణాళికతో ఫలితం
 

నీట్‌లో  710 మార్కులు సాధించాడు  విజయవాడ విద్యార్థి కోట వెంకట్‌. ఒక్కో సబ్జెక్టూ చదువుతూ అభ్యాసం చేస్తున్నకొద్దీ టాప్‌ 100పై ఆశ మొదలైంది. అదే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ఆలిండియా 13వ ర్యాంకు కొట్టాడీ కుర్రాడు. ప్రణాళిక, సమయపాలనే నీట్‌లో దీటుగా రాణించేందుకు దారంటూ తన మనోగతం  పంచుకున్నాడు.. 
 

మా సొంతూరు విజయవాడ. నాన్న ప్రసాద్‌రావు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగి. అమ్మ మాధవి ప్రయివేట్‌ ఉపాధ్యాయిని. చదువులో ఎప్పుడూ ఫస్టే. పదోతరగతిలో 9.8 సాధించాను. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివాను. అందులో 98 శాతం మార్కులొచ్చాయి.
 

చిన్నతనం నుంచి గణితంపై ఆసక్తి ఎక్కువ. పాఠశాల    స్థాయిలో ఉన్నప్పుడు ఇంజినీర్‌ అవ్వాలనుకునేవాణ్ణి. కానీ, ఎనిమిదో తరగతిలో ఓసారి నాన్నకి ఆక్సిడెంట్‌ అయి చాలారోజులు ఆయన కోసం ఆసుపత్రిలో ఉన్నాను. అప్పుడే వైద్యరంగం మీద ఏదో తెలియని ప్రేమ పుట్టింది. దాని ద్వారా మనం సాధించే విజయాలు కనిపించాయి. అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ రంగంలోకి రావాలని. అదే లక్ష్యంతో ఇంటర్మీడియట్‌లో బైపీసీ తీసుకున్నాను. అటు అకడమిక్‌తో పాటు నీట్‌కి సంబంధించిన సబ్జెక్టులు, పరీక్షా విధానం మీద కాలేజీ శిక్షకుల సహకారంతో దృష్టి పెట్టాను. మొదట్లో సబ్జెక్టుల మీద పట్టు వచ్చిన కొద్దీ టాప్‌ 100లోపు వస్తుందనే నమ్మకం ఉండేది. పరీక్ష రాశాక కీ చూసుకుని మార్కులు లెక్కపెట్టుకున్నాక టాప్‌ 10 ఆశ ఉండేది. చివరకు ఆలిండియా 13వ ర్యాంకు వచ్చింది.  
 

సమయపాలనే కీలకం 

నీట్‌లో రాణించడం లక్ష్యంగా పెట్టుకున్నవారికి సమయపాలనే కీలకం. ఉన్న తక్కువ సమయంలో ఎంత ఎక్కువ విషయ నైపుణ్యం పరిమితి పెంచుకుంటే అంత ఉపయోగం. అదే మనం ఏ ప్రశ్న వచ్చినా ఎదుర్కొనే శక్తినిస్తుంది. దీనికోసం పెద్దపెద్ద పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పనిలేదు. పాత పరీక్ష పత్రాల్ని చూస్తే పరీక్షా విధానం అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఎలా చదవాలన్నది నిర్ణయించుకోవాలి. సన్నద్ధమయ్యేటప్పుడు సమయం ఎంత విలువగా వాడతామో పరీక్ష రాసేటప్పుడూ అంతే పొదుపు ఉండాలి. 
 

కష్టమైనా కలిసొచ్చింది 

కాలేజీలో మాకు ఆఫ్‌లైన్‌ తరగతులు ఉండేవి. రెండేళ్ల పాటు దీనికోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాము. ఇక పరీక్ష దగ్గరికి వస్తుందనుకునే సమయంలో లాక్‌డౌన్‌. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ వాడుకోవాలని మాకు ఆన్‌లైన్‌ తరగతులు మొదలుపెట్టారు. మొదట్లో ఆన్‌లైన్‌ శిక్షణ కష్టంగా అనిపించినా తర్వాత అభ్యాసం చేయడానికి కలిసొచ్చింది. ఈ కాలంలో ఇంటికే పరిమితమవడంతో రోజులో కనీసం 14 గంటలు అభ్యాసానికి కేటాయించాను. 
 

ఫిజిక్స్‌ కోసం కష్టపడ్డాను 

పరీక్షలో ఉండే మూడు సబ్జెక్టుల్లో నావరకు ఫిజిక్స్‌ కష్టమైన సబ్జెక్టు. బయాలజీ కొట్టిన పిండి. రసాయనశాస్త్రమూ పెద్దగా సమస్య లేదు. కానీ ఫిజిక్స్‌లో ఉండే గణాంకాలు, ఫార్ములాలూ గుర్తుండవు. అందుకే ఎక్కువ సమయం ఫిజిక్స్‌కే కేటాయించాను. ఉదాహరణకు.. నా ప్రిపరేషన్‌ని ఓ 100గంటలుగా చూస్తే అందులో 360 మార్కులున్న బయాలజీకి 40గంటలు.. 180 మార్కులున్న ఫిజిక్స్‌కి 30, 180 మార్కుల కెమిస్ట్రీకి మరో 30 గంటలు కేటాయించాను. 
 

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కీలకం 

మొదటిసారే నీట్‌ సాధించడంలో విఫలమయ్యేవారిలో సరైన ప్రణాళిక లేనివారే అధికం. ఎక్కువమంది బయాలజీ వచ్చు కదా అని చదివి వదిలేస్తారు. దాన్ని పునశ్చరణ చేయరు. ఓ విషయంపై అవగాహన వచ్చాక అలాగే వదిలేయకుండా పునశ్చరణ చేస్తూ ఉండాలి. అన్ని రకాల ప్రశ్నల్ని మనకు మనమే సంధించుకుని సాధించాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్ని అనుసరించి.. ఓ ప్రణాళిక ప్రకారం సబ్జెక్టులు ఎంచుకుని చదవాలి. ఫిజిక్స్‌ థీరీలను గుడ్డిగా బట్టీ పట్టొద్దు. దాని వెనకాల ఉన్న విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తే సులువుగా రాణించొచ్చు. 

వదిలేయటం ఉత్తమం 

పరీక్ష సమయంలో రాని ప్రశ్నల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తప్పనిసరి అయితేనే ఎలిమినేషన్‌ విధానాన్ని అనుసరించాలి. అలా కాకుంటే తెలియని ప్రశ్నను ఏదో ఓ సమాధానం లాటరీలో పెట్టే బదులు దాన్ని వదిలేయడమే ఉత్తమం. పరీక్షలో నెగెటివ్‌ మార్కులు ఇలానే కాదు.. ఒకటి పెట్టబోయి మరొకటి పెట్టడం ద్వారానూ వస్తుంటాయి. అందుకే పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండాలి. జాగ్రత్తగా బబ్లింగ్‌చేయాలి. 

ఓసారి పరీక్ష రాసిన తర్వాత మనం చేసిన తప్పులేంటో కీ చూసుకుంటే తెలిసిపోతుంది. లాంగ్‌టర్మ్‌ రాసేవారు ఒకసారి చేసిన తప్పును రెండోసారి గుర్తించలేకపోవడమే వారిని విఫలమయ్యేలా చేస్తోంది. గత సంవత్సరాల్లోని నీట్‌ ప్రశ్నపత్రాల్ని జవాబుల్ని చూడటం ద్వారా తప్పుల్ని తెలుసుకుని మళ్లీ అవి చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. బలహీనతలను అధిగమించి ఆత్మవిశ్వాసం ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. మనలో సాధించాలనే సంకల్పం ఉంటే ఏవీ అడ్డు కావు. 
 

Posted Date : 14-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌