• facebook
  • whatsapp
  • telegram

బ్రాంచా.. కళాశాలా.. ఎంపికలో ఏదిముఖ్యం?  

సాహితికి ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. టాప్‌ కాలేజీలో చేరతా అని తల్లిదండ్రులను అడిగింది. దాంట్లో ఫీజు ఎక్కువ పైగా సీఎస్‌ఈ అంతగా బాగోలేదట... ఫలానా కళాశాలలో చేరమని తండ్రి సూచన. అయితే గ్రూప్‌ మార్చుకుంటా అని కూతురు మొండిపట్టు. దానికి ఉద్యోగాలు సరిగా లేవు అని తల్లి వాదన. బ్రాంచా.. కాలేజీనా.. ఏదో తేలట్లేదు. ఆ రెండిటిలో దేన్ని ఎంచుకోవాలన్నా కొన్ని అంశాలను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు. ఫలానా కాలేజీనే కావాలని అనుకుంటే, అది నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఏ బ్రాంచీ అయినా చేరవచ్చు. కాదు బ్రాంచే ముఖ్యమని అభ్యర్థి పట్టుబడితే కళాశాలలో కావాల్సిన పరిస్థితులు ఉన్నాయో లేదో చూసి చేరాలి. అటు బ్రాంచైనా, ఇటు కాలేజీ అయినా విద్యార్థి ఆసక్తులు, అభిరుచులకు అనుగుణంగా నిర్ణయం జరగాలి. అంతకంటే ముందు కొన్ని చెక్‌పాయింట్లు చూసుకోవాలి.
పిల్లలకు ఫలానా ర్యాంకు వచ్చింది. అదుగో ఆ కాలేజీలో సీటు వస్తుందని అంచనా. కానీ కావాల్సిన బ్రాంచి రాదు. అవకాశాలు తక్కువగా ఉండే మరో బ్రాంచిలో చేరదామంటే మనసు ఒప్పుకోవడం లేదు. పోనీ కోరుకున్న బ్రాంచిలో చేరదాం అంటే కాలేజీ అంతగా బాగోలేదు. మేనేజ్‌మెంట్‌ సీటు అనుకుంటే ఆర్థిక భారం మోయడం కష్టం. ఇవే ఈ దశలో ఎదురవుతున్న సందేహాలు, సందిగ్ధతలు.
ఏ బ్రాంచి మంచిది? ప్రస్తుతం దేనికి అవకాశాలు బాగున్నాయి? అన్నింటిలోకీ సులువైన ఇంజినీరింగ్‌ బ్రాంచి ఏది? ఏ కాలేజీలో ఏ బ్రాంచి బాగుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలను సాధారణంగా అందరూ వెతుక్కుంటుంటారు. అయితే మంచి నిర్ణయం తీసుకోడానికి కేవలం ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టుకుంటే చాలదు. వాటికి నిర్దిష్టమైన సమాధానాలు రావాలంటే మరికొన్ని అనుబంధ, అదనపు ప్రశ్నలకు సంతృప్తికరమైన వివరాలు తెలుసుకోవాలి.
మీ ప్రాధాన్యం కాలేజీ అయితే!
కాలేజీ ముఖ్యమని విద్యార్థి, తల్లిదండ్రులు భావిస్తే ఈ కింది అంశాలను పరిశీలించాలి.
సిలబస్‌, కరిక్యులమ్‌: దాదాపు అన్ని కళాశాలలకు కరిక్యులమ్‌ (బోధనా ప్రణాళిక)ను విశ్వవిద్యాలయం నిర్ణయిస్తుంది. అయితే స్వయం ప్రతిపత్తి ఉన్న కళాశాలలకు కొంత వెసులుబాటు ఉంటుంది. కరిక్యులమ్‌ దీర్ఘకాలంలో మంచి కెరియర్‌కు ఎంతమేరకు ఉపయోగపడుతుందో పరిశీలించుకోవాలి. దానికి నిపుణుల సాయం తీసుకోవచ్చు.
అధ్యాపక బృందం: కాలేజీలోని బోధనా సిబ్బంది పని అనుభవం వివరాలు తెలుసుకోవాలి. వారికి పరిశ్రమల్లో పూర్వ అనుభవం లేదా ప్రస్తుతం అనుబంధం ఉందా అని కనుక్కోవాలి. వివిధ రీతుల్లో బోధన చేసిన అనుభవం, పోటీపరీక్షలకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులు కళాశాలలో ఉంటే మరీ మంచిది. రిసెర్చ్‌ ప్రచురణలు చేసే సిబ్బంది అయితే విద్యార్థుల ఆశయాల సాధనకు సాయపడతారు.
కొత్త ఆవిష్కరణలు - ప్రోత్సాహకాలు: కాలేజీలో ప్రయోగశాలలు సరిగా ఉన్నాయా, ఆవిష్కరణలకు తగిన ప్రోత్సాహం అందుతుందా, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణల పూర్వాపరాలు తెలుసుకోవాలి.
కాలేజీలో విద్యార్థి జీవనం: విద్యార్థి రోజులో ఎక్కువభాగం కళాశాలలో గడపాల్సి ఉంటుంది. అందుకు తగిన వాతావరణం ఉందా అని సీనియర్లను అడగాలి. క్రమశిక్షణతోపాటు పరిమితులతో కూడిన స్వేచ్ఛ కూడా విద్యార్థులకు అవసరమే. ఇంజినీరింగ్‌ అంటే కేవలం పాఠ్యపుస్తకాల పఠనం కాదు. ప్రయోగాలు, సహవిద్యార్థులతో సమాలోచనలు, సంప్రదింపులు, గ్రంథాలయంలో వివిధ వనరుల అన్వేషణ వంటి పలు అంశాలు ఉంటాయి. ఇవన్నీ సరిగా నిర్వర్తించాలంటే కొంతమేరకు స్వేచ్ఛ కావాలి. అది కాలేజీలో ఉండాలి. క్రీడలకు ప్రోత్సాహం, మైదానాల ఏర్పాటును పరిశీలించాలి.
విద్యార్థి సముదాయం: సాధారణంగా ఇంజినీరింగ్‌ స్థాయిలో అధ్యాపకుల ద్వారా పాఠ్యాంశాల పరిచయం జరిగితే స్నేహితుల సాయంతో పూర్తిస్థాయిలో నేర్చుకుంటారు. అలా విద్యార్థులను చిన్న బృందాలుగా ఏర్పరచడంలో కళాశాల ఎలాంటి చొరవ చూపిస్తోందో కనుక్కోవాలి.
దూరం: కాలేజీ ఎంత దూరంలో ఉందనే అంశాన్ని ఒక ప్రతిబంధకంగా మార్చుకోవద్దు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్‌ వంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలన్నీ నిర్జన ప్రదేశాల్లోనే ప్రకృతి ఒడిలో ఉంటాయి. ఇతర విషయాలన్నీ సంతృప్తికరంగా ఉంటే దూరాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు.
కాలేజీ వారసత్వం: ఫలానా కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిగా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. స్థాపితమైన నాటి నుంచి ఆ కాలేజీ పాటించిన నియమావళి, విలువలు, అభివృద్ధి చెందిన తీరు వంటివి ఆ కాలేజీకి ఒక పేరును తెచ్చిపెడతాయి. ఇది కూడా కళాశాల ఎంపికలో విద్యార్థి గుర్తించాల్సిన విషయం. అదే సమయంలో పిల్లల్లో నాయకత్వ లక్షణాలను కాలేజీ పెంపొందిస్తోందో లేదో కూడా తెలుసుకోవాలి.
ప్రకటనల ఆకర్షణ: కాలేజీ విశేషాలను కరపత్రాల రూపంలో యాజమాన్యాలు పంచుతాయి. కొందరు వాటిని అసలు పట్టించుకోరు. మరికొందరు దాని ఆధారంగానే కళాశాలలో పిల్లలను చేర్పించేస్తారు. ఈ రెండూ అంత మంచి పద్ధతులు కాదు. కాలేజీ ప్రాంగణాలను స్వయంగా సందర్శించి అన్ని వసతుల వివరాలు కనుక్కోవాలి. యంత్రాంగ సామర్థ్యాన్ని ఆరాతీయాలి. అలాగే కాలేజీ సామాజిక బాధ్యతగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో కూడా అడగాలి. మంచి నిర్ణయం తీసుకోవడంలో ఈ అంశాలు సాయపడతాయి. ప్రయోగశాలలు, ప్రయోగాలు, ప్రాజెక్టులు చేయిస్తున్న తీరు తదితరాలను గ్రహించాలి.
విద్యార్థి - అధ్యాపక నిష్పత్తి: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అధ్యాపకుల తోడ్పాటు తప్పనిసరి. ఏఐసీటీఈ నిబంధనల మేరకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. ఇందులో మళ్లీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తగిన నిష్పత్తిలో ఉండాలి. ఈ సంవత్సరం నుంచే 1 : 20 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొన్ని సంస్థలు 1 : 15 నిష్పత్తిలోనే అధ్యాపకులను నియమించుకున్నాయి. ఇలాంటి కాలేజీల్లో అడ్మిషన్‌ తీసుకుంటే విద్యార్థి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతాయి.
ఎన్‌బీఏ, న్యాక్‌ ప్రమాణాలు: కళాశాలల్లో ఇంజినీరింగ్‌ బ్రాంచీల నిర్వహణ ప్రమాణాల నాణ్యతకు గుర్తుగా ప్రభుత్వం ఏఐసీటీఈ ద్వారా ఎన్‌బీఏ అక్రెడిటేషన్‌ పత్రం ఇస్తుంది. ఈ గుర్తింపును కాలేజీలోని ప్రతి బ్రాంచికి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన ఉంటేనే ఎన్‌బీఏ అర్హత లభిస్తుంది. అలాగే విద్యాసంస్థ నిర్వహణలో ప్రమాణాలు పాటిస్తే న్యాక్‌ గుర్తింపు వస్తుంది. ఒక కళాశాలకు ఈ రెండు గుర్తింపులు చాలా ముఖ్యం. అందులోనూ ఎన్‌బీఏ పత్రం అత్యవసరం. ఈ గుర్తింపులు ఉన్న కళాశాలలో కోర్సు చేస్తే దేశవిదేశాల్లో ఉద్యోగం, ఉన్నత విద్యకు మార్గాలు సులభమవుతాయి.
ఇతర అంశాలు
కాలేజీ, బ్రాంచీల గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు మరికొన్ని ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రాంగణ నియామకాలు: కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతున్న తీరు గమనించాలి. సాధారణంగా సేవల రంగంలో ఉన్న కంపెనీలకు ఎక్కువమంది ఇంజినీర్ల అవసరం ఉంటుంది. అందుకే అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలే కాకుండా మౌలిక బ్రాంచీలైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ రంగాలకు చెందిన కంపెనీలు ప్రాంగణ నియామకాలు జరిపే కాలేజీలను ఎంచుకోవడం మంచిది. ఫలానా బ్రాంచికి ఫలానా కాలేజీలో అధిక నియామకాలు జరుగుతుంటే అది కూడా పరిగణనీయ అంశమే.
ఉద్యోగావకాశాలు: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ రంగంలో పని చేయాలనుకుంటున్నారనేది కూడా నిర్ణయాలను ప్రభావితం చేసే అంశమే. ఉదాహరణకు ప్రభుత్వ, ప్రైవేటుల్లో రెండింటిలోనూ సమాన అవకాశాలు ఉన్న బ్రాంచి కావాలనుకుంటే ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ లేదా ఆటోమొబైల్‌ బ్రాంచీలు ఎంచుకోవాలి. విదేశాలు, ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటే సీఎస్‌ఈ, ఐటీ, బయోటెక్‌ లాంటివి తీసుకోవచ్చు. ఇతర బ్రాంచీలకు కూడా విదేశీ అవకాశాలు ఉన్నాయి.
కన్సల్టెంట్‌ల సహాయం: కాలేజీలు ఎక్కువై, సీట్లు పెరిగే కొద్దీ కొన్ని కాలేజీలు కన్సెల్టెంట్ల సహాయం తీసుకుంటాయి. కమీషన్‌కు ఆశపడేవారిని పూర్తిగా నమ్మకూడదు. కొందరు కన్సల్టెంట్లు తమకు వచ్చిన కమీషన్‌లో కొంత సొమ్ము ఇస్తామని ప్రలోభ పెట్టవచ్చు. అలాంటి ప్రలోభాలకు అసలు లొంగవద్దు. కన్సెల్టెంట్లు చూపిన కాలేజీ అయినా, స్వయంగా అన్ని విషయాలనూ బేరీజు వేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.
కోరుకున్న బ్రాంచిలో చేరాలంటే!
ఇది మరో చిక్కు ప్రశ్న. కొంత విషయసేకరణతో దీని పట్ల కూడా స్పష్టత ఏర్పరచుకోవచ్చు. తగిన నిర్ణయం తీసుకోడానికి అది సాయపడుతుంది. దేశంలో దాదాపు రెండువందలకు పైగా స్పెషలైజేషన్లు బీటెక్‌ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలావరకు కొత్త కోర్సులన్నీ ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోనూ, అనుబంధ కాలేజీల్లోనూ దాదాపు మౌలిక బ్రాంచీలే ఉన్నాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆటోమొబైల్‌, మెటీరియల్‌ సైన్స్‌ వంటి కోర్‌ బ్రాంచీల్లో బీటెక్‌ చేయడం మంచిదే. అలా అని ఇతర బ్రాంచీలు పనికిరావని కాదు. దేని ప్రత్యేకత దానిదే. ఆసక్తి, అభిరుచి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నామనే అంశాలే బ్రాంచిని నిర్ణయిస్తాయి.
ఒకప్పుడు ఇంజినీరింగ్‌ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సిద్ధంగా ఉండేవి. కాలేజీలో బి.టెక్‌ ముగించిన విద్యార్థులకు అప్పట్లో సంస్థలు శిక్షణ ఇచ్చేవి. తమ అవసరాలకు అనుగుణంగా మలచుకునేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విపరీతంగా పెరుగుతున్న పోటీ, వేగంగా మారుతున్న టెక్నాలజీలు, ప్రైవేటైజేషన్‌, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ప్రాపంచిక జ్ఞానం, భావప్రకటనా సామర్థ్యం, బహుభాషా పాటవం కూడా చాలా అవసరమైన ఆయుధాలుగా పరిణమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక బ్రాంచి ఉద్యోగం తెప్పిస్తుందని అనుకోవడం పొరపాటు. ఫలానా బ్రాంచికి ఉద్యోగం వస్తుందని భావించడం అపోహే. లేదా ఒక బ్రాంచి మిగిలినవాటికన్నా సులభం అనుకోవడం కూడా మభ్యపెట్టుకోవడమే.
ఒకరు ఒక బ్రాంచిలో బీటెక్‌ చేసి ఎక్కువ జీతం తెచ్చుకున్నారనే విషయంలో బ్రాంచి గొప్పదనం కంటే విద్యార్థి శ్రమే అధికంగా ఉంటుంది. కాబట్టి ఒక బ్రాంచి అందరికీ గొప్ప జీవితాన్ని ఇచ్చేస్తుందనుకోకూడదు. సహజమైన అభిరుచితో ఏ బ్రాంచిలో బీటెక్‌ చేసినా, పొందిన నైపుణ్యాల ఆధారంగా మాత్రమే కెరియర్‌ ఉంటుందనేది అక్షర సత్యం. అందుకే అభిరుచి ప్రధానంగా బ్రాంచి ఎంచుకోవాలి. అందుకు నిపుణుల సాయం తీసుకోవచ్చు.
ఇప్పుడు ఏ బ్రాంచికి గిరాకీ ఉంటుందనే విచారణలు కొందరు చేస్తుంటారు. ఇది మరీ అసంబద్ధం. కోర్సులో చేరడానికి ముందు ఫలానా బ్రాంచికి డిమాండ్‌ ఉందనిపిస్తే నాలుగేళ్ల తర్వాత అదే పరిస్థితి ఉంటుందన్న గ్యారంటీ ఉంటుందా? కష్టం. నిజానికి ప్రతి బ్రాంచికి తనదైన డిమాండ్‌ ఉంటుంది. విద్యార్థి పడే శ్రమ మాత్రమే ఉద్యోగ భద్రతను ఇస్తుంది.
అన్నింటికీ అవకాశాలు
అభిరుచికి తగినట్లు బ్రాంచిని ఎంచుకుంటే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అంతేకానీ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలానా బ్రాంచే కావాలని పట్టుపట్టడం సరికాదు. అభిరుచి, సామర్థ్యం, భవిష్యత్తులో కెరియర్‌ ఎలా ఉండాలనుకుంటున్నామనే అంశాలే కీలకం. విద్యార్థి సామర్థ్యాలపై కూడా సరైన స్పష్టత ఉండాలి.
కాలేజీ, బ్రాంచీల్లో ఏది ముఖ్యం అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే రెండూ అనాల్సిందే. అయితే ఆ పరిస్థితుల్లో ఎదురయ్యే సందిగ్ధతను తొలగించాలంటే విద్యార్థి తనకున్న అవకాశాలను బేరీజు వేసుకోవాలి. ఇప్పటివరకు చర్చించిన అంశాల ప్రాతిపదికన కాలేజీని అంచనా వేయాలి. బ్రాంచి ముఖ్యమనుకున్నప్పుడు అంచనాలో తేలిన కాలేజీల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ స్పష్టమైన సమాధానం దొరక్కపోతే మంచి కాలేజీ వైపే మొగ్గు చూపడం అభిలషణీయం.
తల్లిదండ్రుల ఒత్తిడి, స్నేహితులు, బంధువుల ప్రభావం కన్నా విద్యార్థి అభిరుచికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ అందుకు తగిన శ్రమ కూడా విద్యార్థి పడాలి. కేవలం నాలుగేళ్ల చదువుకే పరిమితం కాకుండా జీవితానికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. అందులో స్వీయ ఆసక్తులదే ప్రధానపాత్ర.
ఎప్పుడూ ఒకేలా ఉండదు
ఒక బ్రాంచిలో ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయని దానిలోనే అడ్మిషన్‌ తీసుకుంటే బాగుంటుందనే ధోరణి చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది సరైంది కాదు. ఒక బ్రాంచిలో దొరికే అవకాశాలు కాలక్రమేణా మారుతుంటాయి. కొత్త ఆవిష్కరణలు, మార్పులు ప్రతి బ్రాంచిలోనూ సహజమే. అందువల్ల డిమాండ్‌ ఉందని ఇష్టం లేని బ్రాంచిలో చేరితే తరువాత బాధపడాల్సి ఉంటుంది.
అన్ని కాలేజీలు తమ వెబ్‌సైట్‌ల్లో తమ కాలేజీల్లో జరిగే విద్యా బోధనాపద్ధతులు, విద్యార్థి అభివృద్ధి కేంద్రిత కార్యక్రమాల వివరాలు పొందుపరుస్తుంటాయి. వీటి ద్వారా ఒక కాలేజీలో ఆయా బ్రాంచీలు తమ విద్యార్థుల అవసరాలను ఎలా గుర్తించి, వివిధ కార్యక్రమాల ప్రణాళిక అమలు చేస్తున్నాయో తెలుస్తుంది. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులను కలిసి అదనపు సమాచారం సేకరించాలి. ఒక కాలేజీలో అన్ని బ్రాంచీలు సమానంగా ఉండకపోవచ్చు. ఆ విషయంలో ఐఐటీలకు కూడా మినహాయింపు లేదు. ఫలానా ఐఐటీలో ఫలానా బ్రాంచి బాగుందనే మాటలు వినిపించడానికి కారణం అదే. కాలేజీ, బ్రాంచీల చర్చ వస్తే ఐఐటీలను కూడా ఈ కోణంలోనే ఆలోచించాలి.

Posted Date : 02-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌