• facebook
  • whatsapp
  • telegram

అడుగేసే ముందు.. అన్నీ చూసుకో!

* ఇంజినీరింగ్‌ బ్రాంచా.. కళాశాలా?

ప్రవేశ పరీక్షల ర్యాంకులు ప్రకటించేశారు. ఇప్పుడు ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు కొత్త ప్రశ్న ప్రారంభమైంది. ఇష్టమైన బ్రాంచి తీసుకోవాలా... మంచి కాలేజీలో చేరాలా? చిక్కు సమస్యే. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెబుతుంటారు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధత. ఇది ఏటా అందరికీ ఎదురయ్యే ఇబ్బందే. నిజానికి రెండూ ముఖ్యమే. కానీ మనకున్న అవకాశాలూ, మన ఇష్టానిష్టాలు, భవిష్యత్తు... ఇంకా ఇతర అంశాలను బేరీజు వేసుకొని అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులను ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసుకోవాలి.

ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు, తల్లిదండ్రుల ముందు ఎన్ని రకాల ప్రశ్నలు... మంచి కళాశాలలో చేరాలా.. నచ్చిన బ్రాంచిని ఎంచుకోవాలా? ఏ కాలేజీ మంచిదో ఎలా తెలుస్తుంది? ఏ బ్రాంచి తీసుకోవాలి? ఇప్పుడు అవకాశాలు బాగా ఉన్న బ్రాంచిలకి తర్వాత భవిష్యత్తు బాగుంటుందా? ఫలానా బ్రాంచి తీసుకుంటే చదవగలుగుతారా? ఈ సందేహాలతోపాటు ఏ ర్యాంకుకి ఏ కాలేజీలో సీటు వస్తుంది? అయ్యో.. ఆ బ్రాంచి రావాలంటే ఇంకా మంచి ర్యాంకు కావాలి కదా? కాలేజీ ముఖ్యం అనుకుంటే కావాల్సిన బ్రాంచి అందడం లేదు. బ్రాంచి ప్రధానం అని భావిస్తే కాలేజీ సరిగా ఉండటం లేదు. ఏం చేయాలి? ఏమీ పాలుపోవడం లేదు. టాప్‌ ర్యాంకర్లు మినహా మిగతా అభ్యర్థులందరూ దాదాపు ఇవే ప్రశ్నలతో సతమతమవుతుంటారు. ఇంత గందరగోళానికి గురికావాల్సిన పనిలేదు. మనకి ఏం కావాలో తేల్చుకోడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటి ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చు.

ఏ విషయం గురించి తేల్చుకోవాలన్నా.. అన్నీ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. సీనియర్లతో మాట్లాడాలి. కాలేజీలకు సంబంధించి తెలిసిన అన్ని వివరాలను పరిశీలించాలి. ప్రాంగణాలను సందర్శించాలి. మౌలికవసతులను గమనించాలి.

బ్రాంచీ ముఖ్యమని భావిస్తే..!
ఎంత ఆలోచించినా ఏ బ్రాంచి తీసుకోవాలి అనేది ఎంతకీ తెగని సమస్యగా కనిపిస్తుంది. కానీ కొన్ని వివరాలను సేకరించుకోవడం ద్వారా ఒక మంచి నిర్ణయానికి రావచ్చు. మొదట అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మంచి బ్రాంచి, చెడ్డ బ్రాంచి అని ఏదీ లేదు. దేని ప్రత్యేకత దానిదే. విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులు, భవిష్యత్తులో తాము ఏం చేయాలనుకుంటున్నారనే అంశాల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇంజినీరింగ్‌లో వందల సంఖ్యలో స్పెషలైజేషన్లు ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌ వంటి మౌలికమైన బ్రాంచిలు దాదాపు అన్ని కళాశాలల్లో ఉన్నాయి. కొన్ని కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. అన్నింటినీ పరిశీలించాలి.

ఫలానా బ్రాంచి తీసుకుంటే జీతాలు ఎక్కువనే అపోహలు ఉన్నాయి. ఆ బ్రాంచిలో చేరిన అందరికీ అలాంటి జీతాలు లేవనే సత్యాన్ని గ్రహించాలి. నిజానికి ఏ ఇంజినీరుకైనా పెద్ద జీతం అందుతోందంటే అందులో బ్రాంచి గొప్పదనం కన్నా ఆ అభ్యర్థి శ్రమే ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని విస్మరించకూడదు. నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే ఏ బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చేసినా మంచి జీవితాన్ని అందుకోవచ్చు. అందుకే అభిరుచులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి.

ఇప్పుడు ఈ బ్రాంచికే డిమాండ్‌ అంటూ కొందరు ప్రచారం చేస్తుంటారు. అలాంటి వాటిని అసలు నమ్మవద్దు. ఇప్పుడు డిమాండ్‌ ఉంటే నాలుగేళ్ల తర్వాత ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కానీ ప్రతి బ్రాంచికి ప్రత్యేకమైన డిమాండ్‌ ఉంటుంది. అందులో విద్యార్థి శ్రమతో సాధించుకునే నైపుణ్యాల ఆధారంగానే ఉద్యోగ జీవితం ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కమ్యూనికేషన్‌, లాంగ్వేజ్‌ స్కిల్స్‌ తదితరాలు ఉద్యోగసాధనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఏ బ్రాంచికైనా అవకాశాలు కాలక్రమంలో మారుతుంటాయి. కొత్త కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు వాటిపై ప్రభావాన్ని చూపుతాయి. అందుకే డిమాండ్‌ ఉందని ఇష్టంలేని బ్రాంచిలో చేరితే తర్వాత తంటాలు పడాల్సి ఉంటుంది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కాలేజీలు కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. ఏయే బ్రాంచిలకు ఎలాంటి ప్రోగ్రామ్‌లు జరుగుతున్నాయో గమనిస్తే కొంత సమాచారం లభిస్తుంది. ప్రతి కాలేజీలో అన్ని బ్రాంచిలు సమానంగా ఉండటం సాధ్యం కాదు. కానీ కొన్ని బ్రాంచిలకు కొన్ని కాలేజీల పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తుంటుంది. కారణం అలాంటి కార్యక్రమాల ప్రణాళికను అమలు చేయడమే.

అధ్యాపకులు, వసతులకు ప్రాధాన్యం
బ్రాంచా, కాలేజా అని అడిగితే ముందుగా కాలేజీకే ప్రాధాన్యం ఇవ్వాలి. కావాల్సిన బ్రాంచిలో చేరిన తర్వాత ఆ కళాశాలలో మౌలిక వసతులు లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మంచి పేరున్న కాలేజీలో ఏ బ్రాంచి తీసుకున్నా భవిష్యత్తు ఉంటుంది. కాలేజీని ఎంచుకునే ముందు అక్కడి ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పరిశీలించాలి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకులు, డిజిటల్‌ లైబ్రరీ వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. సరైన వసతులు, అధ్యాపకులు ఉంటేనే విద్యార్థికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బ్రాంచి ఏదైనా డిగ్రీ పూర్తయ్యేనాటికి అభ్యర్థులు టాప్‌లో ఉండాలి. అరకొర మార్కులతో పాసైతే లాభం లేదు. దాంతోపాటు కమ్యూనికేషన్‌ (ఓరల్‌, రిటెన్‌), లాజిక్‌, వివిధ టెక్నాలజీను ఉపయోగించడం వంటి నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి.
     - ప్రొఫెసర్‌ ఎం. కుమార్‌, ప్రిన్సిపల్‌, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఉస్మానియా యూనివర్సిటీ
 

అన్ని బ్రాంచీలు మంచివే
పరిశ్రమలకు అన్ని ఇంజినీరింగ్‌ బ్రాంచిలూ అవసరమే. అన్నీ మంచివే. సర్క్యూట్‌ బ్రాంచిల (ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్స్‌, ఎలక్ట్రికల్‌) తర్వాత మెకానికల్‌, సివిల్‌, కెమికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచిలకు మంచి అవకాశాలు ఉంటున్నాయి. ఆసక్తి ఉంటే అరుదైన బ్రాంచిలను ఎంచుకోడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. నావెల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌, పెట్రోలియం ఇంజినీరింగ్‌ వంటి వాటిల్లో తక్కువ సీట్లు ఉండటం వల్ల నిపుణుల కొరత ఉంది. దీంతో వీరికి ఉద్యోగాలు వెంటనే లభిస్తున్నాయి. ఆంధ్రాయూనివర్సిటీలో జియో ఇన్‌ఫర్మేటిక్స్‌లో బీటెక్‌ చేసినవారిని టీసీఎస్‌ ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. దీంతోపాటు బ్రాంచి ఏదైనా మంచి కాలేజీ చూసుకొని చేరడం ముఖ్యం. మౌలిక వసతులు, సరైన అధ్యాపకులు లేకపోతే ఎంత మంచి బ్రాంచిలో చేరినా ప్రయోజనం ఉండదు.
     - ప్రొఫెసర్‌ పి. శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఆంధ్రాయూనివర్సిటీ
 

మరికొన్ని అంశాలు
కాలేజీ, బ్రాంచిల్లో ఏది ముఖ్యమని నిపుణులను ప్రశ్నిస్తే రెండూ అనే సమాధానమే ఎక్కువగా వస్తోంది. కాస్త వివరంగా విచారిస్తే కొద్దిగా కాలేజీ వైపు మొగ్గు చూపుతున్నారు. మంచి వసతులు ఉన్న కాలేజీ అయితే ఏ బ్రాంచి అయినా ఫర్వాలేదని చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలానా బ్రాంచినే కావాలని పట్టుబట్టడం సమంజసం కాదంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఒక్కటే కాకుండా కోర్‌ బ్రాంచిలైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ తదితరాలకు సంబంధించి క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లు జరిగే కాలేజీలను ఎంచుకోవడం మంచిదంటున్నారు. కాలేజీలు ఏర్పాటు చేసుకునే కన్సల్టెంట్ల మాయలో పడకుండా ఉండటం మరో ముఖ్యమైన అంశం. కమిషన్ల కోసం అభ్యర్థులను ప్రలోభ పెట్టే అవకాశాలు ఉన్నాయి. వాళ్లు చెప్పిన ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా స్వయంగా చెక్‌ చేసుకోవాలి.

ఏ రంగంలో పనిచేయాలనుకుంటున్నారనే అంశం కూడా బ్రాంచి నిర్ణయంపై ప్రభావం చూపుతుంది. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సీఎస్‌ఈ, ఐటీ వంటివి తీసుకుంటే విదేశాలు, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు ఎక్కువ. కానీ రెండు రంగాల్లోనూ ఉద్యోగాలు వెతుక్కోవాలని భావించే వారికి మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఆటోమొబైల్‌ బ్రాంచిలు ఉత్తమం. అరుదైన బ్రాంచిలను ఎంచుకుంటే అవకాశాలు తక్కువై అటూ ఇటూ కాకుండా పోతామనే అపోహ కూడా చాలామందిలో కనిపిస్తుంది. ఇది నిజం కాదు. సాఫ్ట్‌వేర్‌, కోర్‌ బ్రాంచిల తర్వాత ముఖ్యమైన ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, నావెల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌, జియోఇన్‌ఫర్మేటిక్స్‌ వంటి వాటిని ఎంచుకుంటే అవకాశాలు ఉన్నాయి. తక్కువ సీట్లు ఉండటం వల్ల ఈ నిపుణులకు డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. పరిశ్రమల అవసరాలను, ప్రస్తుత ధోరణులను పరిశీలించి అభ్యర్థుల అభిరుచులు, ఆసక్తులకు అనువైన మార్గాన్ని ఎంచుకోవడం అన్ని విధాలుగా ఉత్తమం.

కాలేజీ ప్రధానం అనుకుంటే!
1. మంచి కాలేజీ ముఖ్యం అనుకునేవారు ముందుగా దానికి న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌) గుర్తింపు ఉందా అని చెక్‌ చేసుకోవాలి. విద్యా సంస్థ నిర్ణీత ప్రమాణాలను పాటిస్తేనే న్యాక్‌ గుర్తింపు ఇస్తుంది. ఆ గుర్తింపు ఉన్న కాలేజీలోనే చేరడం మంచిది. తర్వాత ఆ కళాశాల నిర్వహించే ఇంజినీరింగ్‌ బ్రాంచిలకు ఎన్‌బీఏ (నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రెడిటేషన్‌) గుర్తింపు ఉందో లేదో చూసుకోవాలి. దీన్ని ప్రభుత్వం ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) ద్వారా ఇస్తుంది. ప్రతి బ్రాంచికి విడివిడిగా ఎన్‌బీఏ గుర్తింపు తీసుకోవాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన ఉంటేనే ఎన్‌బీఏ పత్రం అందుతుంది. భవిష్యత్తులో ఉద్యోగాలకు ఎలాంటి అడ్డంకులు ఎదురవకుండా ఉంటాయి.
2. తర్వాత చూడాల్సింది కరిక్యులమ్‌ (బోధనా ప్రణాళిక), సిలబస్‌. దీన్ని విశ్వవిద్యాలయాలు నిర్దేశిస్తాయి. అటానమస్‌ కాలేజీలు, డీమ్డ్‌ యూనివర్సిటీలు కరిక్యులమ్‌, సిలబస్‌లను స్వయంగా నిర్ణయించుకుంటాయి. అయితే ఈ రెండూ భవిష్యత్తు అవసరాలకు ఎంతవరకు దీటుగా ఉన్నాయో పరిశీలించుకోవాలి. అప్‌డేట్‌ కాని సిలబస్‌ల వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది.
3. కాలేజీ చెక్‌ చేశారు. సిలబస్‌ ఓకే. ఇప్పుడు ఆ పాఠ్యప్రణాళికను సమర్థంగా అమలు చేయడానికి తగిన అధ్యాపకులు ఉన్నారో లేదో తెలుసుకోవాలి. తగిన విద్యార్హతలు, అనుభవం ఉన్న లెక్చరర్లు ఉన్నారా? వారికి పరిశ్రమలతో పరిచయం లేదా పనిచేసిన అనుభవం ఉందా? పరిశోధన పేపర్లను ప్రచురించారా? ఇంజినీరింగ్‌ సంబంధిత పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి ఉన్నారా? ఇవన్నీ ఉంటే మంచి అధ్యాపక బృందం ఉన్నట్లే. కనీసం తీసుకునే బ్రాంచికి సంబంధించి అయినా ఈ వివరాలను పరిశీలించుకోవాలి.
4. అధ్యాపకుల అర్హతలు, అనుభవాలతోపాటు తగినంత మంది సిబ్బంది ఆ కాలేజీలో ఉన్నారో లేదో చూసుకోవాలి. ఏఐసీటీఈ తాజా నిబంధనల ప్రకారం స్టూడెంట్‌, ఫ్యాకల్టీ రేషియో 1:20. ఇంకా ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నిష్పత్తినీ పరిశీలించాలి.
5. అధ్యాపకుల తర్వాత ముఖ్యమైనది కాలేజీలోని మౌలిక వసతులు. లైబ్రరీ, ప్రయోగశాలలు సరిగా ఉన్నాయో లేదో చూడాలి. కొత్త కొత్త ఆవిష్కరణలకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నారా, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ ఉందా? ఉంటే ఎలా ఉంది తదితర వివరాలను సేకరించుకోవాలి.
6. ఇంజినీరింగ్‌ అంటే కేవలం డిగ్రీ కాదు. ఇతర జీవన నైపుణ్యాలను నేర్చుకునే వేదిక కూడా. విద్యార్థి రోజులో ఎక్కువ భాగం ఇక్కడే గడుపుతారు. అందుకు అనువైన వాతావరణ పరిస్థితులను పరిశీలించాలి. క్రమశిక్షణ, తగినంత స్వేచ్ఛ కాలేజీలో ఇస్తున్నారో లేదో చూడాలి. ఈ సమాచారం సీనియర్‌ విద్యార్థులను అడగటం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రాజెక్టులు, ప్రయోగాల వివరాలను తెలుసుకోవాలి. సహవిద్యార్థులతో సంప్రదింపులకు వీలు, ఆటలకు ప్రోత్సాహం ఎలా ఉన్నాయో చూడాలి. వీలైతే క్రీడా మైదానాలను సందర్శించాలి.
7. కాలేజీ ప్రతిష్ఠ కూడా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఫలానా కళాశాల విద్యార్థి అనగానే ఒక అభిప్రాయం ఎదుటివారిలో ఏర్పడుతుంది. స్థాపన నుంచి అభివృద్ధి చెందిన విధానం కాలేజీకి ప్రజల్లో ఒక పేరును తెస్తుంది. క్రమశిక్షణను, విలువలను పాటించే కళాశాలల విద్యార్థులకు ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
8. కాలేజీ వివరాల సేకరణ అనేక రకాలుగా చేయవచ్చు. వాటిలో కరపత్రాలు, ప్రకటనలు కూడా ఉన్నాయి. కేవలం వాటినే ఆధారం చేసుకొని అడ్మిషన్లు తీసుకోకూడదు. అలా అని పూర్తిగా విస్మరించకూడదు. ప్రకటనల్లో, కరపత్రాల్లో ఆయా కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన సమాచారాన్ని స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలి. పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఏయే ప్రోగ్రామ్‌లను చేపడుతున్నారో అడగాలి.
అన్నీ పరిశీలించిన తర్వాత కాలేజీ దూరంగా ఉందని చేరకుండా ఉండవద్దు. తగిన ఏర్పాట్లు చేసుకొని మంచి కళాశాలలోనే చేరడం శ్రేయస్కరం.
 

Posted Date : 02-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌