• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ ఎంసెట్‌..అభ్యాసం చేస్తే సులువే!

బైపీసీ, ఎంపీసీ గ్రూపులతో ఇంటర్‌ పరీక్షలు రాసినవారు వృత్తివిద్యాకోర్సుల్లో చేరటానికి రాసే పరీక్ష..ఎంసెట్‌. తెలుగు రాష్ట్రాల్లో దీన్ని  ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుపై పట్టు సాధించటానికి కృషి చేయటంతోపాటు ఆన్‌లైన్‌ పద్ధతికి అలవాటుపడేలా సాధన చేయటం కూడా విద్యార్థులకు ఇప్పుడు చాలా అవసరం. అప్పుడే ఆశించిన ర్యాంకును సులువుగా సాధించగలుగుతారు!

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం ఇంటర్‌ విద్యార్థుల్లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపుల్లోనే ఉంటున్నారు. సీనియర్‌ ఇంటర్‌ పూర్తి చేస్తున్న విద్యార్థులు 12 లక్షల వరకూ ఉంటే వారిలో దాదాపు ఆరు లక్షలమంది ఇంజినీరింగ్‌ లేదా మెడికల్‌ కోర్సుల్లో చేరడానికి ఇష్టం చూపుతున్నారు. వీరిలో దాదాపు 3.5 లక్షల మంది ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చరల్‌, ఫార్మసీ, వెటర్నరీ గ్రాడ్యుయేషన్‌లలో చేరడానికి ఉపయోగపడే పరీక్ష ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌).
రెండేళ్ల నుంచి వైద్య విద్య ఈ పరిధిలో లేదు. నీట్‌ ప్రత్యామ్నాయ పరీక్ష అయ్యింది. ఇంజినీరింగ్‌ విభాగపు విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్స్‌, బిట్‌శాట్‌ లాంటివి ఉన్నప్పటికీ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరడానికి ఎక్కువమందికి ఉపయోగపడుతున్నది ఎంసెట్‌ మాత్రమే.
గత ఏడాది (2017) ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షకు హాజరైన విద్యార్థులు తెలంగాణ- 1,31,899, ఆంధ్రప్రదేశ్‌- 1,87,484. వీరిలో క్వాలిఫై అయిన విద్యార్థులు తెలంగాణ నుంచి 98,596, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,23,974. ఉన్న సీట్ల సంఖ్య క్వాలిఫై అయినవారి కంటే ఎక్కువగానే ఉంది. అయితే విద్యార్థికి గ్రాడ్యుయేషన్‌ ద్వారా సంపూర్ణ ఫలితం పొందాలంటే సరైన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీటు సాధించాలంటే మంచి ర్యాంకు సాధించి యూనివర్సిటీ కళాశాలల్లో తాను ఆశించిన బ్రాంచిలో సీటు పొందే విధంగా ప్రణాళిక, తయారీ ఉండాలి.
ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షల్లో 90%పైగా మార్కులు సాధించే విద్యార్థులు లక్షకు పైగా ఉంటున్నారు కానీ ఎంసెట్‌లో 160 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 80 మార్కులకుపైగా సాధించే విద్యార్థులు రెండు రాష్ట్రాల్లో కలిపి 10వేల నుంచి 15 వేలలోపే ఉంటున్నారు. దీనికి కారణం విద్యార్థులకు పరీక్షపై అవగాహన లోపం లేదా ప్రణాళిక పటిష్ఠంగా ఏర్పరచుకోలేకపోవడం! అగ్రికల్చరల్‌, ఫార్మసీ విభాగపు ఎంసెట్‌కు కూడా గత ఏడాది హాజరైన విద్యార్థులు తెలంగాణ నుంచి 73,000, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 75,489. ఈ సంఖ్య నీట్‌కు హాజరైన విద్యార్థుల కంటే ఎక్కువ.వారిలో అర్హత పొందినవారు వరుసగా 63,570, 55,288.
 

వంద మార్కులు కష్టం కాదు
ఇంటర్‌ పూర్తిచేసిన ఎంపీసీ లేదా బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువశాతం వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఉపయోగపడే పరీక్ష ఎంసెట్‌. ఇది కష్టమైన పరీక్ష కాదు. ఎందుకంటే అన్ని ప్రశ్నలూ కచ్చితంగా తెలుగు అకాడమీ పుస్తకాల్లోని వాక్యాల నుంచే వస్తున్నాయి. అందుకే గత ఏడాది తొలి పది ర్యాంకుల విశ్లేషణ చూస్తే 3-5 మార్కులలోపే పూర్తవుతున్నాయి. అంటే పోటీ ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. కొందరు విద్యార్థులు 95 శాతంపైగా తెచ్చుకోగలిగితే సాధారణ విద్యార్థి 160 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 100 మార్కులు సాధించడం కష్టతరమేమీ కాదు.కావాల్సింది సరైన ప్రణాళిక మాత్రమే.

Posted Date : 22-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌