• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ పోరుకు తుది మెరుగులు

తెలుగు రాష్ట్ర విద్యార్థులకు ఎంసెట్‌ అతిముఖ్యమైన పరీక్ష. దీని ఆధారంగానే అధిక శాతం విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌, ఫార్మసీ లాంటి వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న ఈ తరుణంలో సన్నద్ధతను వేగవంతం చేసుకుని, గరిష్ఠంగా ప్రయోజనకరంగా మల్చుకునేదెలా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఆన్‌లైన్‌లో అంటే కంప్యూటర్‌పై నిర్వ‌హించారు. మొత్తం ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఆరుసార్లు, అగ్రికల్చరల్‌ పరీక్ష రెండుసార్లు జరుగుతాయి.
విద్యార్థి ఏదో ఒక రోజు ఒకసారి మాత్రమే పరీక్ష రాయవలసి ఉంటుంది. ఆరుసార్లు పరీక్ష జరిగినప్పటికీ ఆరు వేర్వేరు ప్రశ్నపత్రాలు అయినప్పటికీ ప్రశ్నల సామర్థ్యం ఒకే విధంగా ఉండేవిధంగా నిర్వహిస్తారు. పేపర్లు చాలా కష్టమైనవనో, మరీ తేలికయినవనో ఇబ్బంది ఏర్పడదు.
ఒకవేళ పరీక్ష పేపర్లలో స్వల్ప వ్యత్యాసమున్నప్పటికీ విద్యార్థి నష్టపోకుండా ఉండటానికి నార్మలైజేషన్‌ విధానాన్ని అవలంబిస్తారు. అందువల్ల ఎటువంటి ఒత్తిడీ లేకుండా పరీక్ష రాసుకోవచ్చు. నార్మలైజేషన్‌ వల్ల ఒకవేళ క్లిష్టమయిన పేపరు వస్తే మార్కులు కలవడం, సులభమైన పేపరు వస్తే మార్కులు తగ్గడం జరుగుతుంది. అందుకని ఎటువంటి పేపరు వచ్చినా ఆదుర్దా లేకుండా నిశ్చింతగా పరీక్ష రాసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో కాగితం, కలం ఆధారంగానే పరీక్ష జరుగుతుంది. అందుకని విద్యార్థి అలవాటైన పద్ధతిలోనే తడబాటు లేకుండా పరీక్షకు హాజరుకావొచ్చు.

ప్రతి విద్యార్థీ ఇంజినీర్‌ కావచ్చు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ సీట్లు కూడా సుమారుగా ఇన్నే ఉన్నందున ప్రతి విద్యార్థీ ఇంజినీర్‌ కావచ్చు. అయితే కోరుకున్న ఇంజినీరింగ్‌ కళాశాలలో, ఆశించిన బ్రాంచి కావాలంటే మాత్రం మంచి ర్యాంకు తెచ్చుకోవాల్సిందే. దీనికి సరైన ప్రణాళిక, అవగాహనతో కూడిన సాధన అవసరమవుతుంది.
ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంసెట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో అధిక శాతం విద్యార్థులు యూనివర్సిటీ కళాశాలల్లో గానీ, తొలి 20 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో గానీ సీటు సాధించడానికి ప్రయత్నిస్తారు. వీటిలో సీటు సాధించాలంటే ఇంజినీరింగ్‌ విభాగంలో 160 మార్కులకు 120 మార్కులపైన సాధించేలా ప్రణాళిక వేసుకోవాలి.
వివాదాస్పదమైన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఇలాంటి ప్రశ్నలకు అధ్యాపకులు ఏ సమాధానాన్ని బలపర్చారో దాన్ని అదే విధంగా తీసుకోవడం మేలు. ఒకవేళ పరీక్షలో ఇటువంటి ప్రశ్న ఉన్నా తుది కీలో అటువంటివి తప్పకుండా తొలగిస్తారు. అటువంటి ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటే విద్యార్థిపై కనీసం బయాలజీలో 40% ఒత్తిడి తగ్గుతుంది. ప్రశ్నలోని నాలుగు సమాధానాలను సరిగా చదవడం అలవాటు చేసుకోవాలి.
బయాలజీలో 75, రసాయనశాస్త్రంలో 30, భౌతికశాస్త్రంలో 25 మార్కులు సాధిస్తే అగ్రికల్చరల్‌ విభాగంలో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.

ఏపీ ఎంసెట్‌కు పాటించవలసినవి
1) వారం రోజుల వ్యవధిలో కనీసం 3 లేదా 4 పరీక్షలను పరీక్ష సమయంలోనే కంప్యూటర్‌పై రాయడం అలవాటు చేసుకోవాలి.
2) తెలియని అంశాలను వదిలివేసి తెలిసిన అంశాలనే పునశ్చరణ చేయాలి.
3) ప్రతిరోజూ సగం కాలాన్ని మేథమేటిక్స్‌/ బయాలజీ పునశ్చరణకు వినియోగించాలి. మిగిలిన సగ భాగాన్ని భౌతిక రసాయన శాస్త్రాలకు కేటాయించాలి.
4) గుర్తుంచుకోవలసిన అంశాలను ఒక కాగితంపై రాసుకుంటూ ప్రతిరోజూ ఆ కాగితాన్ని చదవాలి.
5) ఆహార నియమాల విషయాల్లో కావలసిన జాగ్రత్తలు పాటించాలి.
6) పరీక్షలు దగ్గరగా ఉన్నాయని రాత్రి సమయాల్లో అధిక కాలాన్ని చదవడానికి కేటాయించవద్దు. పరీక్షలు దగ్గర కొచ్చేకొద్దీ శారీరక విశ్రాంతి చాలా అవసరం.

టీఎస్‌ ఎంసెట్‌కు పాటించవలసినవి
1) పరీక్షకు నేర్చుకోవాల్సిన అంశాలను ప్రాధాన్య క్రమంలో చదవాలి.
2) కాగితం, కలంతో రాసే పరీక్షే కాబట్టి తుది పరీక్ష ఏ సమయంలో జరుగుతుందో అదే సమయంలో నమూనా పరీక్షలు అలవాటు చేసుకోవాలి.
3) నమూనా పరీక్షలు రాసేటప్పుడు ఏ ప్రశ్నకు ఆ ప్రశ్న పూర్తిచేసిన వెంటనే బబ్లింగ్‌ చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఎక్కువమంది విద్యార్థులు అన్నింటికీ జవాబులు గుర్తించిన తర్వాత ఒకేసారి ఓఎంఆర్‌ షీట్లో గుర్తిస్తున్నారు. అది పూర్తిగా తప్పు. ఒకవేళ ఒక ప్రశ్న వరుస క్రమం తప్పితే అన్నింటికీ మార్కులు పోయే ప్రమాదం ఉంది. కలంతో జవాబులను గుర్తిస్తున్నందున ఒకసారి గుర్తించిన జవాబును మార్చుకొనే అవకాశమే లేదు.
4) ఇప్పటి నుంచి కనీసం 10 నమూనా పరీక్షలు తుది పరీక్ష తరహాలో రాయాలి.
5) నమూనా పరీక్ష రాసిన తర్వాత, తొలిగా తెలిసిన ప్రశ్నలు ఎన్నింటికి తప్పు సమాధానాలు గుర్తించారో గమనించాలి. ఆ తప్పులు తర్వాతి పరీక్షలో పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి.
6) తెలియని ప్రశ్నల్లో కూడా సులువుగా నేర్చుకోగల ప్రశ్నలు ఏమున్నాయో తెలుసుకోవాలి. వాటిని అభ్యాసం చేయడానికి ప్రయత్నించాలి.
7) గణితానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాతి ప్రాధాన్యం రసాయన శాస్త్రానికి ఇచ్చి తయారుకావాలి.
8) అగ్రికల్చరల్‌ విభాగం విద్యార్థులు అధిక సమయం బయాలజీకి కేటాయించాలి.
9) మైండ్‌ మ్యాప్స్‌ తయారు చేసుకొని పునశ్చరణకు ఉపయోగించాలి.
10) సరైన సమయం నిద్రకు కేటాయించి తేలికైన శాకాహారం తీసుకుంటే మంచిది.
11) ఏకాగ్రత పెరగడానికి ధ్యానం చేయటం, గాఢంగా వూపిరి తీసుకోవటం లాంటివి ఉపయోగపడతాయి.
ఒకవేళ పరీక్ష పేపర్లలో స్వల్ప వ్యత్యాసమున్నప్పటికీ విద్యార్థి నష్టపోకుండా ఉండటానికి నార్మలైజేషన్‌ విధానాన్ని అవలంబిస్తారు. క్లిష్టమయిన పేపరు వస్తే మార్కులు కలవడం, సులభమైన పేపరు వస్తే మార్కులు తగ్గడం జరుగుతుంది. అందుకని ఎటువంటి పేపరు వచ్చినా నిశ్చింతగా పరీక్ష రాసుకోవచ్చు.

సబ్జెక్టుల వారీగా వ్యూహం గణిత శాస్త్రం
ఇంజినీరింగ్‌ ఎంసెట్‌-పరీక్షలోని 160 ప్రశ్నల్లో సగభాగం 80 ప్రశ్నలు గణితం నుంచే! విద్యార్థి అధిక ప్రాధాన్యం ఇవ్వవలసింది ఈ సబ్జెక్టుకే. మంచి కళాశాలలో చేరాలంటే ఉపకరించే ర్యాంకును గణితం మార్కులే నిర్ధారిస్తాయి.
మేథమేటిక్స్‌లోని 80 ప్రశ్నలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి దాదాపు సమానంగా 40 చొప్పున వస్తాయి. అలాగే పేపర్‌ ఎ, బిలు రెండున్నాయి కాబట్టి వాటి నుంచి కూడా సమంగానే వస్తున్నాయి.
అన్ని చాప్టర్ల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. నిడివిగా ఉన్న చాప్టర్ల కంటే, సులభంగా తక్కువ పరిమాణంలో ఉండే చాప్టర్లకు అధిక ప్రాధాన్యం ఇస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు. ఉదాహరణకు Mathematical Induction, Partial Fractions, Polar Co-Ordinations, Random Variablesలాంటి చాప్టర్లను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. మార్కులు కూడా సులభంగా సాధించుకోవచ్చు.
అకాడమీ పుస్తకాలతో పాటు, ఆబ్జెక్టివ్‌ ఓరియంటేషన్‌ ఉండే పుస్తకాలను అభ్యాసం చేయాలి. గణితంలో 80 మార్కులకు కనీసం 65పైన మార్కులు సాధించాలి. అంటే సాధన, పునశ్చరణ ఎక్కువగా జరగాలి. ఈ సబ్జెక్టుకి పరీక్షలో గంట పదిహేను నిమిషాలు మించి వాడరాదు. అందుకు పెరగాల్సిన వేగం, కచ్చితత్వం కోసం పునశ్చరణ తప్పనిసరి.
పునశ్చరణ చేసుకొనే అంశాలను/ సంబంధిత ఫార్ములాలను వేరొక పేపరులో రాసుకొంటూ ప్రతిరోజూ వాటికి ఒకసారి తర్ఫీదు పొందుతూ వెళ్ళాలి. అప్పుడే తుది పరీక్షలో బాగా రాయగల్గుతారు. పోటీ పరీక్షలలో నిడివిగా ఉన్న లెక్కలను మొదట చేయడానికి ప్రయత్నించవద్దు. తెలిసినప్పటికీ ఆ ప్రశ్నలు మూడు సబ్జెక్టులు పూర్తి చేసుకొన్న తర్వాతనే ఆలోచించాలి.

భౌతిక శాస్త్రం
ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చరల్‌ విభాగాలలో విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సబ్జెక్టు ఈ ఫిజిక్స్‌. అయితే గత నాలుగు సంవత్సరాల ఎంసెట్‌ ఫిజిక్స్‌ పేపర్ల విశ్లేషణను చూస్తే మూడు సబ్జెక్టుల్లోనూ ఇదే సులభంగా ఉంటోంది.
పోటీ పరీక్షల్లో విద్యార్థి స్థాయిని ప్రభావితం చేసేది పరీక్ష హాల్లోని మూడు గంటల్లో విద్యార్థి మానసిక స్థితి. భయాందోళనలకు గురి అయి ప్రశ్న చదివినప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేక రెండు మూడుసార్లు చదివి సమయాన్ని కోల్పోతున్నారు. భౌతికశాస్త్ర విషయంలో విద్యార్థి తన మీద ఆత్మవిశ్వాసంతో ప్రశ్నను చదవడం ప్రారంభిస్తే కనీసం 60 శాతం ప్రశ్నలకు జవాబులు గుర్తించగల్గుతారు.
2016 పేపరు విశ్లేషణ చూస్తే... దాదాపు 60 శాతం ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అంటే కేవలం ఇంటర్మీడియట్‌ పరీక్షకు తయారైన విద్యార్థి కూడా ఈ ప్రశ్నలకు జవాబులు సులువుగా గుర్తించవచ్చు.
ప్రథమ సంవత్సరం సిలబస్‌ నుంచి 20 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. దీనిలో తక్కువ నిడివితో ఉన్న అభ్యాసాలు... ప్రమాణాలు మితులు, ఆధునిక భౌతిక శాస్త్రంలోని Atom, Nuclei, Communications లాంటివి. వీటిని చాలా తక్కువ వ్యవధిలో చదవడం పూర్తి చేసుకోవచ్చు. తుది పరీక్షలో కూడా సులభమైన ప్రశ్నలే ఉంటున్నాయి. జవాబులు తేలిగ్గా గుర్తించవచ్చు.
తుది పరీక్షలో భౌతికశాస్త్ర జవాబులు గుర్తించడానికి ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చర్‌ విభాగపు విద్యార్థులు ఒక గంటకు మించి కాలాన్ని తీసుకోకూడదు. పేపరులో కూడా జవాబులు గుర్తించేటప్పుడు రెండు సార్లుగా జవాబులు గుర్తించాలి. అంటే సులభంగా ప్రశ్నను చదివేటప్పుడే జవాబులు గుర్తించగల ప్రశ్నల జవాబులు ముందుగా గుర్తించాలి; నిడివిగల ప్రశ్నల జవాబులు రెండోసారి మాత్రమే ప్రయత్నించాలి. సాధారణంగా విద్యార్థి ప్రథమ సంవత్సర సిలబస్‌ కంటే ద్వితీయ సంవత్సర సిలబస్‌ సులభంగా భావిస్తాడు. అందుకని దానికే ప్రాధాన్యం ఇస్తే అధిక లాభం చేకూరుతుంది.

రసాయన శాస్త్రం
దీనిలో కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి సమ విభజన ఉంది. కర్బన, అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాల నుంచి కూడా ప్రశ్నలు సమంగా వస్తున్నాయి. విశ్లేషణ చేస్తే... అకర్బన రసాయన శాస్త్రం తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు నేర్చుకోవడానికీ, తుది పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికే ప్రాధాన్యం ఇవ్వడం మేలు. గ్రూపులకు పట్టికలు ఏర్పరుచుకొని వాటిని ప్రతిరోజూ పునశ్చరణ చేయడం వల్ల తుది పరీక్షలో 13 ప్రశ్నల వరకు జవాబులు సులువుగా గుర్తించవచ్చు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ రెండు విభాగాలలో కూడా రసాయనశాస్త్రానికి 45 నిమిషాలు మించి కాలాన్ని వ్యయపరచకూడదు. కొన్ని చాప్టర్లు భౌతిక, రసాయన శాస్త్రాలు రెండింటిలో ఉన్నాయి కాబట్టి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ఉదా: Thermodynamics. Atom, nuclei లాంటివి రెండింటిలో ఉన్నాయి. వాటిపై పట్టు ఏర్పరచుకొంటే అధిక మార్కులకు ఆస్కారం కలుగుతుంది.

జీవ శాస్త్రం
అగ్రికల్చరల్‌ విభాగం జీవశాస్త్రం (బయాలజీ)లోని బోటనీలో 40 ప్రశ్నలు, జువాలజీలో 40 ప్రశ్నలు ఉంటున్నాయి. ఇవన్నీ తెలుగు అకాడమీ పుస్తకాల్లోని వాక్యాల నుంచే ఉంటున్నాయి. అందుకని విద్యార్థి ఆ పుస్తకాలను మాత్రమే చదివినా సరిపోతుంది. అభ్యాసం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ సమయాన్ని అకాడమీ ప్రశ్నల నిధిలోని ప్రశ్నల తర్ఫీదుకు కేటాయించుకోవాలి. ప్రశ్నలను బహుళ ఐచ్ఛిక రూపంలో ఇస్తారు కానీ ఖాళీలను పూరించే విధంగా తయారు కాగలిగితే వాటి కచ్చితత్వం పెరుగుతుంది. బయాలజీలోని 80 ప్రశ్నలు 45 నిమిషాలలో జవాబులు గుర్తించవచ్చు కానీ, ప్రశ్నలు సరిగా చదివే అలవాటు ఏర్పరుచుకొంటూ గంట కాలవ్యవధి వరకు తీసుకోవడం మేలు. మార్కులు సులభంగా పొందవచ్చు కాబట్టి దీనికే ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాలి. 80 ప్రశ్నల్లో కనీసం 75 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించేలా తయారుకావాలి.
 

Posted Date : 22-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌