• facebook
  • whatsapp
  • telegram

ఎంతో ప్రత్యేకం... ఈఐఈ

ఇంజినీరింగ్‌ విద్యలో ఎలక్ట్రానిక్స్‌ అనగానే గుర్తొచ్చేవి ఈసీఈ, ఈఈఈ. ఇవి రెండూ కాక ఈఐఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌) కూడా చదవవచ్చు. ఇందులో 40- 60% సబ్జెక్టులు ఈసీఈ విద్యార్థులు కూడా చదివేవే అయినా ఈఐఈ చాలా ప్రత్యేకమైన కోర్సుగా చెప్పవచ్చు.

సమాచార సాంకేతికత (ఐటీ) ఎలాగైతే అన్ని రంగాల్లోనూ తప్పనిసరైన ఆధునిక అవసరంగా ఉందో అలాగే ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కూడా అన్ని ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించిన తయారీ/ ఉత్పాదన ప్రక్రియల్లో తప్పనిసరి అవసరం. కొన్ని దశాబ్దాల క్రితం మెకానికల్‌ పరికరాలే ఎక్కువగా వాడడం మూలాన ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ప్రత్యేక రంగంగా రూపొందలేదు. కానీ యంత్ర పరికరాలు ఆధునికతను సంతరించుకునే క్రమంలో ఎలక్ట్రానిక్స్‌ వాడకం పెరిగి ఈఐఈ ప్రత్యేక ఇంజినీరింగ్‌ రంగంగా అవతరించింది.కొలతలు అనగానే సాధారణంగా గుర్తొచ్చే ఒడ్డు, పొడుగు, బరువు వంటివి అందరికీ తెలిసినవే. ఇవి కాక పరిశ్రమల్లో ఉష్ణోగ్రత, పీడనం, తేమ, ఘన, ద్రవపదార్థ పరిమాణాలు వంటి పరామితులు parameters) ఎంత ఉండాలన్న ప్రమాణాలు, ఏ సమయంలో వేటి స్థాయులు ఎంతెంత ఉండాలన్న పరిమితులు, భౌతిక రసాయనిక ప్రక్రియలు, నాణ్యత ప్రమాణాలు వంటివన్నీ కూడా నిర్దేశిత పరిమితుల్లో ఉండక తప్పదు. వీటన్నింటినీ సందర్భానుసారంగా కొలుస్తూ, తదనుగుణంగా పలు పారిశ్రామిక ప్రక్రియలను నియంత్రిస్తూ ఉత్పాదన/ తయారీ సరైన క్రమంలో సాగేలా చూడడం 'ఇన్‌స్ట్రుమెంటేషన్‌'గా చెప్పుకోవచ్చు. వీటిని ఆధునికీకరించడానికీ, స్వయంనియంత్రితంగా (automate) చేయడానికీ ఎలక్ట్రానిక్స్‌ రంగంలోని సాంకేతికతను వాడుకునే వీలుగా ఏర్పడిందే ఈఐఈ విభాగం.

 

ఈ కోర్సులో ప్రధానంగా ప్రస్తావించవలసిన అంశాలేమిటంటే: కొలమానాలు- కొలతలు (Sensors & Measurement) , నియంత్రణా వ్యవస్థలు (Control Systems), పారిశ్రామిక ప్రక్రియా నియంత్రణ (Industrial Process Control) , విశ్లేషక సాధనాసంపత్తి (Analytical Instrumentation) వంటివి.

 

పరిధి అపరిమితం

ఆధునిక పరిశ్రమలన్నింటిలోనూ ఈ అంశాలకు అత్యంత ప్రాముఖ్యం ఉండడం ఈఐఈ కోర్సు అవసరాన్ని నొక్కి చెబుతుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ సంస్థలు, చిన్న/ మధ్య తరహా పరిశ్రమలు- భారీ పరిశ్రమలు, ఫార్మా- పెట్రోకెమికల్‌ రంగాలతోసహా అన్ని పారిశ్రామిక/ ఉత్పాదక రంగాలు, రక్షణ రంగాలు, రక్షణ పరిశోధక సంస్థలు- 'ఇందుగల దందులేదని సందేహము వల'దన్నట్టుగా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ రంగానికున్న పరిధి అపరిమితం.
అందువల్ల ఈఐఈ కోర్సులో బీటెక్‌ చదివే విద్యార్థులు ఈసీఈ విద్యార్థుల్లాగా ఎలక్ట్రానిక్స్‌ రంగంలో, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లాగా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ రంగంలో, కెమికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లాగా పారిశ్రామిక ప్రక్రియ నియంత్రణ రంగంలో కూడా తమ ఉనికి చాటుకోవడమే కాక ఆయా రంగాల్లో తమకు తామే సాటి అని ప్రకటించుకునే అవకాశం ఉంటుంది.

 

ఉన్నత విద్యావకాశాలు

బీటెక్‌ తరువాత ఉన్నత విద్యను అభ్యసించదలచిన ఈ బ్రాంచి విద్యార్థులకు అవకాశాలకు ఏ మాత్రం కొదవ లేదు. ఐఐటీల్లోనూ, బెంగళూరులోని ఐఐఎస్సీలోనూ కలిపి 20 రంగాల్లో పైగానే ఎంటెక్‌ కోర్సులు చేసే అవకాశముంది. ఇవికాక ఎన్‌ఐటీల్లో, ఇతర విశ్వవిద్యాలయాల్లోనూ మరిన్ని విద్యావకాశాలున్నాయి.
కంట్రోల్‌ సిస్టమ్స్‌, ప్రాసెస్‌ కంట్రోల్‌, డిజిటల్‌ సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, రోబోటిక్స్‌, బయోమెడికల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మైక్రో ఎలక్ట్రానిక్స్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వీఎల్‌ఎస్‌ఐ, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, ఏరోస్పేస్‌ తదితరాలు ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్న ఉన్నత విద్యాకోర్సులుగా చెప్పవచ్చు.
విదేశాలకు వెళ్లదలచుకున్నా కూడా పైన పేర్కొన్నవే కాక ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌, ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌, నానోటెక్నాలజీ వంటి రంగాల్లో కూడా విస్తృతమైన విద్యావకాశాలున్నాయి. ఈ దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సైతం ఈఐఈ విద్యార్థులు ఎంఎస్‌ మాత్రమే కాక పీహెచ్‌డీ కూడా చేసే వీలవుతుంది. ముఖ్యంగా జర్మనీ, స్వీడన్‌, యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఈ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. ఆయా దేశాల్లోనే ఉన్నత విద్య పూర్తయ్యాక ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా పుష్కలం.

 

మెరుగైన భవిష్యత్తు

ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థల్లో ఈఐఈ విద్యార్థులకు ఉద్యోగావకాశాలున్నాయి. హనీవెల్‌, ఫిలిప్స్‌, యోకోగవా, నేషనల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, టెక్సస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, డాన్ఫోస్‌, బెక్‌టెల్‌, రాక్‌వెల్‌ ఆటోమేషన్‌, ఎబీబీ గ్రూప్‌, రిలయన్స్‌ గ్రూప్‌, డా. రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, టాటా గ్రూప్‌, సైబర్‌నెటిక్స్‌ వంటి ప్రముఖ సంస్థలన్నింటిలోనూ ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. వాహన తయారీ, రోబోటిక్స్‌, ఏరోస్పేస్‌, ఫార్మాస్యూటికల్‌, పెట్రోకెమికల్‌, ఎలక్ట్రానిక్‌ డిజైన్‌, రక్షణ రంగాల్లో కూడా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలున్నాయి.

 

బీటెక్‌ (ఈఐఈ) విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు సంపాదించడం కూడా సాధారణంగా జరిగేదే. బీటెక్‌ కోర్సులో భాగంగానే వీరు సి, సి++ లేదా జావా ప్రోగ్రామింగ్‌ తదితరాలు నేర్చుకోవడంతోపాటుగా మల్టీసిమ్‌, ల్యాబ్‌వ్యూ, మ్యాట్‌ ల్యాబ్‌ వంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కూడా నేర్చుకునే అవకాశముంటుంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఆక్సెంచర్‌, టెక్‌ మహీంద్రా, క్యాప్‌జెమిని, డెలాయిట్‌, నియోడెసిక్‌, ఎన్టీటీ డేటా వంటి ఐటీ రంగ సంస్థలు ప్రాంగణ నియామకాల ద్వారా కూడా ఈ బ్రాంచి విద్యార్థులను తమ సంస్థల్లోకి తీసుకుంటాయి

 

ఉన్నత విద్య కోసమైనా, ఉద్యోగంలోనైనా కూడా మెరుగైన భవిష్యత్తుని అందించే బీటెక్‌ (ఈఐఈ) కోర్సు చేయాలంటే ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చదవవలసిన అంశాలు కానీ లేకపోవడం గమనార్హం. కావాల్సినదల్లా ఒక్కటే: అన్ని రంగాల్లోనూ తమ అవసరం ఎప్పటికీ ఉంటుందని గ్రహించి అందుకు తగినట్టు అన్ని ఇంజినీరింగ్‌, శాస్త్రసాంకేతిక రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే! తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా కళాశాలల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా బీటెక్‌ (ఈఐఈ) కోర్సు చదివే అవకాశముంది

 

Posted Date : 11-10-2021

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌