• facebook
  • whatsapp
  • telegram

ఉత్తమ కళాశాల ఎంపిక ఎలా?

వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌లో ఎంసెట్‌ ర్యాంకుకు తగిన, ఉత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలలను ఆప్షన్లుగా పెట్టుకోవటం ముఖ్యమైన అంశం. తగిన వసతులు లేనందున కౌన్సెలింగ్‌లో పాల్గొనటానికి అర్హత పొందని కళాశాలలు కూడా ఉంటున్నాయన్న సంగతి గుర్తించాలి. విద్యార్థి కెరియర్‌ మొత్తం కళాశాల ఎంపికపైనే ఆధారపడివుంటుంది. ఈ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకునేముందు వేటిని పరిగణనలోకి తీసుకోవాలో పరిశీలిద్దాం!

 

నాణ్యమైన ఉత్తమ విద్యనందించే ఇంజినీరింగ్‌ కళాశాలలను ఎంచుకోవడానికి వివిధ మార్గాల్లో సమాచారం సేకరించాలి. మిత్రుల, అధ్యాపకుల అభిప్రాయాలను కొంతమేరకు పరిగణనలోకి తీసుకోవచ్చు. కళాశాలకు సంబంధించిన ముఖ్య సమాచారం సంస్థ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. ఎన్‌ఏఏసీ/ ఎన్‌బీఏ గుర్తింపు ఉంటే స్థూలంగా మంచి కళాశాలగానే చెప్పవచ్చు.అయినప్పటికీ కళాశాలను స్వయంగా సందర్శించటం మంచిది. దీనివల్ల సందేహాతీతంగా అవగాహన ఏర్పరుచుకోవచ్చు. కళాశాలలో తృతీయ, చతుర్థ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో మాట్లాడితే బోధన, మౌలిక వసతుల గురించి కచ్చితంగా తెలుస్తుంది.

 

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు ఉంటున్నాయని విని ఆ ఒక్క కారణంతో ప్రవేశం పొందాలని నిర్ణయించుకోకూడదు. మిగిలిన అంశాలు కూడా ముఖ్యమే. ప్లేస్‌మెంట్ల విషయం చూసినా మొత్తం విద్యార్థుల్లో ఏ సంవత్సరం ఎంతమందికి ఉద్యోగాలు లభించాయో, ఏ ప్రముఖ సంస్థలు నియామకాలు జరిపాయో నిర్దిష్టంగా తెలుసుకోవాలి.

 

వివిధ అంశాలపై సెమినార్లు, వర్క్‌షాపులు, కాన్ఫరెన్సులు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటే ఆ ఇంజినీరింగ్‌ కళాశాల నాణ్యతపై మంచి అభిప్రాయానికి రావొచ్చు.

 

కళాశాలలో బోధన సిబ్బందికి ఏ మేరకు పేరుప్రఖ్యాతులున్నాయో గమనించాలి. అధ్యాపకుల్లో పీహెచ్‌డీ, ఎంటెక్‌ చేసినవారూ; ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చినవారూ ఎంతమంది ఉన్నారో గమనించాలి. వీరి కంటే తక్కువ విద్యార్హతలున్నవారే ఎక్కువమంది ఉంటే కళాశాల యాజమాన్యం నాణ్యతలో రాజీ పడుతోందని గ్రహించాలి. కళాశాలలో విద్యానుబంధ కార్యకలాపాలూ, విద్యేతర కార్యక్రమాలూ ఏమేరకు జరుగుతున్నాయో వాకబు చేయాలి. వివిధ అంశాలపై సెమినార్లు, వర్క్‌షాపులు, కాన్ఫరెన్సులు క్రమం తప్పకుండా నిర్వహిస్తుంటే కళాశాల నాణ్యతపై మంచి అభిప్రాయానికి రావొచ్చు.

 

ఏ కళాశాలలోనైనా అధ్యాపకులు తక్కువమంది ఉంటే వారిపై పనిభారం పడుతుంది. బోధన సవ్యంగా సాగదు. పరిశోధనకు కూడా సమయం కేటాయించటం సాధ్యం కాదు. విద్యార్థులకు తగిన అసైన్‌మెంట్లు ఇచ్చే వీలుండదు. అందువల్ల తగినంతమంది అధ్యాపకులు ఉండటం కీలకాంశమే.

 

సదుపాయాలు

ఎంచుకోబోయే బ్రాంచికి సంబంధించిన ప్రయోగశాలల తీరు గమనించాలి. ఆధునిక పరికరాలున్నాయో లేదో తెలుసుకోవాలి. విద్యార్థులందరికీ ఉపయోగపడే స్థాయిలో గ్రంథాలయం ఉందా, ఈ-పత్రికలను తెప్పిస్తారా చూడాలి.ప్రొజెక్టర్‌, స్క్రీన్‌, ఆడియో సౌకర్యాల సమాచారం సేకరించాలి. క్యాంపస్‌లోనే హాస్టల్‌ సదుపాయం ఉండటం వాంఛనీయం. విద్యార్థులు విద్యాపరంగా పరిణతి సాధించటానికి అనువైన వాతావరణాన్ని ఇది అందిస్తుంది. గేట్‌, క్యాట్‌లాంటి పరీక్షల్లో విద్యార్థులు ఏ స్థాయిలో ప్రతిభ చూపిస్తున్నారో తెలుసుకోవాలి.

 

సామాజిక అనుసంధాన వేదికల్లో, అంతర్జాలంలో వివిధ కళాశాలల ర్యాంకింగులూ, మంచి చెడుల చర్చలూ ఉంటాయి. వాటిని యథాతథంగా నూరుశాతం వాస్తవంగా భావించకూడదు. కానీ ఒక కోణంలో సమాచార వనరుగా తీసుకోవచ్చు. పూర్వ విద్యార్థిసంఘం చురుకుగా పనిచేస్తుంటే వారి మార్గదర్శకత్వం కొత్త విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.

Posted Date : 28-09-2021

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌