• facebook
  • whatsapp
  • telegram

ఇంటిగ్రేటెడ్‌ ఎంత మెరుగు?

పరిశోధనా రంగానికైనా, పరిశ్రమల అవసరాలకైనా మౌలికాంశాల్లో ప్రతిభావంతులైన అభ్యర్థులు కావాలి. అందుకే సుప్రసిద్ధ ఐ.ఐ.టి.లు చొరవ తీసుకుని ఐదు సంవత్సరాల డ్యూయల్‌/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాయి. వీటిపై ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో కొన్ని అపోహలున్నాయి. వాటిని నివృత్తి చేసుకుని, అవగాహన పెంచుకోవడం అవసరం!
సమకాలీన సమాజ అవసరాలనూ, సమీప భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే అవకాశాలనూ దృష్టిలో ఉంచుకునే కోర్సుల రూపకల్పన జరుగుతుంది. విశ్వవిద్యాలయాలు ఈ దిశలోనే కొత్తకోర్సులను ప్రవేశపెడుతుంటాయి. సాంప్రదాయికంగా బీటెక్‌ నాలుగు సంవత్సరాలు, ఆపైన ఎం.టెక్‌ లేక ఎంబీఏ చెయ్యాలంటే రెండు సంవత్సరాలు కలిపి మొత్తం కోర్సు కాలం ఆరు సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ ఉభయ డిగ్రీ కోర్సుల్లో ఒక సంవత్సరం కలసి వస్తుంది. బీటెక్‌ తరువాత అభ్యర్థి అభిరుచిని బట్టి ఎంటెక్‌ లేదా ఎంబీఏ చెయ్యవచ్చు.
సాధారణంగా ఇంజినీరింగ్‌లో చేరే అత్యధిక శాతం విద్యార్థులు బీటెక్‌ తరువాత ఏమి చెయ్యాలి అనే అంశం గురించి మూడో/ నాలుగో సంవత్సరంలో ఆలోచిస్తారు. అటువంటి వారికి బీటెక్‌ తరువాత ఎంటెక్‌/ ఎంబీఏ కోర్సు కాలంలో బీటెక్‌లోని కొన్ని మౌలిక కోర్సుల పునశ్చరణ జరుగుతుంది. అందువల్ల ఈ కోర్సులు రెండు సంవత్సరాల కాలవ్యవధితో ఉంటాయి. అయితే తమ కెరియర్‌ను ఎలా మలచుకోవాలో ముందుగానే నిర్ణయించుకున్నవారి విషయంలో చదువు అంతరాయం లేకుండా సాగే సౌలభ్యం కోసం ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను ప్రవేశపెట్టారు.
ఇంజినీరింగ్‌ విద్యతోపాటు యాజమాన్యపు మెలకువలున్న అభ్యర్థులనూ, సాంకేతిక నైపుణ్యమున్న ఎంటెక్‌లను పరిశ్రమలకు అందివ్వడం, పరిశోధనల వైపు ఆసక్తి ఉన్నవారికి మెలకువలను నేర్పి వారి పురోగతికి సహాయం చెయ్యడం ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల ముఖ్య ఉద్దేశం. మనదేశంలో చాలా విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

ఇవి ఎన్ని రకాలు?
ప్రధానంగా బీటెక్‌-ఎంటెక్‌, బీటెక్‌ ఎంబీఏ, బీటెక్‌-ఎంటెక్‌-పీహెచ్‌డి కలయికలలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలావరకు బీటెక్‌ మొదటి, రెండో సంవత్సరంలోనే ఎంటెక్‌, ఎంబీఏల మధ్య నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఒకసారి తీసుకున్న నిర్ణయం మార్చుకునే అవకాశం ఉండదు.
అయితే జె.ఎన్‌.టి.యు.హెచ్‌. పరిధిలో కౌన్సెలింగ్‌ సమయంలోనే ఎం.టెక్‌, ఎంబీఏలకు సంబంధించిన కోర్సుల మధ్య నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఈ రెండు కోర్సులకూ అభ్యర్థులు తమ ఐచ్ఛికాలను వెబ్‌ఆప్షన్‌ సమయంలో పెట్టుకోవచ్చు. బీటెక్‌ స్థాయిలో సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, మెకానికల్‌, సీఎస్‌ఈ శాఖల్లో బీటెక్‌తో పీజీ స్థాయిలో ఎం.టెక్‌/ ఎంబీఏ కోర్సులకు విడివిడిగా ప్రవేశాలు ఎంసెట్‌ ర్యాంకు ప్రాతిపదికన జరుగుతాయి. అంటే అభ్యర్థులు విడివిడిగా ఈ కోర్సులకు తమ ఐచ్ఛికాలను పెట్టుకోవచ్చు.
ఈ కోర్సుల ప్రధాన ఉద్దేశం- ఉద్యోగంతోపాటు ఉన్నత విద్య. కాబట్టి ఇవి ఏ ఇతర కోర్సులకూ పోటీ కావు. పైగా వీటికి రెండు ముఖ్య విశిష్టతలున్నాయి. 1) సంవత్సర కాలం తక్కువ వ్యవధి ఉండడం 2) పీజీ చెయ్యాలంటే గేట్‌, పీజీ సెట్‌, క్యాట్‌, జీమ్యాట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో మళ్లీ అర్హత సాధించవలసిన అవసరం లేకపోవడం. పైగా భవిష్యత్తు గురించి ముందే నిర్ణయం తీసుకున్నందున ఎక్కువ శ్రద్ధతో కోర్సును పూర్తి చెయ్యవచ్చు.
నాణానికి రెండో వైపు చూస్తే... మార్కెట్‌లో, తమ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అవసరమైన కోర్సులను బీటెక్‌ తరువాత చేసే అవకాశం ఉండదు. ఒకసారి దారి ఎన్నుకున్న తరువాత మళ్లీ మార్చుకునే అవకాశం కూడా ఉండదనే ఆలోచనలు చాలామందిలో ఉన్నాయి. అయితే ఇది సరికాదు. అవసరాలకు తగిన మెలకువలు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా గమ్యం నిర్ణయించుకున్న తరువాత ప్రయాణం లక్ష్యసాధన వైపే ఉంటుంది.

ఈ కోర్సుల్లో చేరాలంటే..
ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల మాదిరే ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఎంపీసీ చదివిన అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు అర్హులు. ప్రవేశం ఎంసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా జరుగుతుంది. అయితే ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయం తాత్కాలికంగా వాయిదా వేసే ఆలోచనల వల్లనో, బీటెక్‌ తరువాత కొన్నాళ్లు ఉద్యోగం చేసి అనుభవం సంపాదించిన తరువాత అప్పటి పరిస్థితులకు తగిన పైచదువుల నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనల ప్రభావం చేతనో బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం దొరకనివారు ప్రత్యామ్నాయంగా ఈ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల బీటెక్‌ అభ్యర్థులకంటే వీరు తక్కువ ప్రతిభ కలిగినవారు అనే పొరపాటు అభిప్రాయం రావడానికి ఆస్కారం ఏర్పడింది. సాధారణంగా బీటెక్‌ స్థాయిలో ఆ శాఖకు సంబంధించిన వివిధ రకాల ఉద్యోగావకాశాలను, కెరియర్‌ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్‌ నిర్ణయం జరుగుతుంది. బీటెక్‌ స్థాయిలో అవసరమైన సబ్జెక్టులు, కొన్ని ఐచ్ఛికాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు శిక్షణనిస్తారు. ఈ శిక్షణ సహాయంతో విద్యార్థులు తమకు నచ్చినట్టు సముచిత కెరియర్‌ నిర్ణయాలు తీసుకోగలరు. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులలో చేరడానికి ముందే తమ కెరియర్‌ పట్ల నిర్దిష్టమైన కార్యాచరణను ఏర్పరచుకున్న విద్యార్థులు చేరడం వల్ల ఆ శాఖకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ కోర్సులను ప్రవేశపెట్టి, విద్యార్థులకు ఉపయోగపడే వీలుంటుంది. వీలైవన్ని ఎక్కువ ఐచ్ఛికాలను కోర్సులో అంతర్భాగంగా పెట్టే వీలుంటుంది. దీనివల్ల పీజీ స్థాయిలో కొన్ని మౌలిక సబ్జెక్టుల పునశ్చరణ అవసరం లేకుండా పోయి, ఏడాది కాలం తగ్గే వీలుంటుంది. బీటెక్‌ స్థాయిలో ప్రాజెక్టు, ఎంటెక్‌/ఎంబీఏ స్థాయిలో సమర్పించే ప్రతిపాదన (థీసిస్‌)ల మధ్య అతివ్యాప్తి కనిపిస్తుంది. అందువల్ల బీటెక్‌ స్థాయిలో ప్రాజెక్టుకు మినహాయింపునిచ్చి పీజీ స్థాయిలోని థీసిస్‌కి ప్రాముఖ్యమిస్తారు. అంతేకాకుండా విద్యార్థులపై కొన్ని సెమిస్టర్లలో ఒకటి రెండు ఎక్కువ సబ్జెక్టులు పెంచి కోర్సు పూర్తిచేయడానికి సరిపడా క్రెడిట్లు సంపాదించుకుని కోర్సు తక్కువ వ్యవధిలో ముగించే వీలు కల్పిస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి వేసవి సెలవుల్లో అదనపు కోర్సులు చేసే వీలు కల్పించవచ్చు.

ఉద్యోగావకాశాలు
సాధారణంగా బీటెక్‌ వారితో సమానంగా వీరికి కూడా ఉద్యోగావకాశాలుంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఎంటెక్‌ చేసినవారికి ప్రాధాన్యమిచ్చే అవకాశాలూ ఉంటాయి. అయితే గమనించవలసిన ముఖ్య విషయం- సేవారంగాలలో వ్యాపారం ఉన్న కంపెనీలు బీటెక్‌ అభ్యర్థులకు నియమించుకునే అవకాశాలు ఎక్కువ. అదే సృజనాత్మక, పరిశోధనలకు అవకాశంలో ఉన్న సంస్థల్లో ఎంటెక్‌ లేదా ఎంబీఎ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల లక్ష్యాలకు, తమ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న సంస్థలు వచ్చినప్పుడు విద్యార్థులు తమ ప్రతిభను చూపి, అవకాశం చేజిక్కించుకోవటం మేలు.
దశాబ్ద కాలంగా విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యు.జి.సి.) ఐచ్ఛిక ఆధారిత క్రెడిట్స్‌ పద్ధతి (చాయిస్‌ బేస్‌డ్‌ క్రెడిట్‌ సిస్టం) ప్రవేశ పెట్టాలని ప్రతిపాదిస్తోంది. కొన్ని విద్యాసంస్థలు వీటిని అమలు చేస్తున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల ప్రాధాన్యం పెరిగి, ఇవి మరింత పరిగణనలోకి వచ్చే అవకాశాలున్నాయి.
ఒక విద్యాసంవత్సరం మిగుల్చుకోవచ్చునో, మరో కోర్సులో రాలేదు కాబట్టి దీనిలో చేరదామనో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులవైపు మొగ్గటం సరి కాదు. ఈ కోర్సుల ప్రధాన ఉద్దేశం పూర్తిగా అర్థం చేసుకుని, ఆ అవగాహనతోనే వీటిలో చేరడం సముచితం.

Posted Date : 02-09-2021

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌