• facebook
  • whatsapp
  • telegram

అవకాశాల గని: ఐటీ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)  

సాంకేతిక రంగంలో వస్తున్న వివిధ కొత్త ఆవిష్కరణల ఫలితం కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాలైతే, ఆ ఆవిష్కరణల ఫలం సామాన్య ప్రజలు ఉపయోగార్థం ప్రభవించిన సరికొత్త రంగం ఐటీ రంగం. ప్రోగ్రామింగ్‌ మెలకువలు, హార్డ్‌వేర్‌లో ప్రవేశం, వివిధ రకాల వ్యవస్థల పట్ల అవగాహనలను మిళితం చేసి పరిశ్రమల, సార్వజనీన సౌలభ్యం కోసం కంప్యూటరీకరణను అమలుపరిచేది ఐటీ.

 

ఈ రంగం స్వల్పకాలంలోనే గుర్తింపు పొందింది. ఈనాడు జనం ఉపయోగిస్తున్న ఈ-సేవ వసతులు, సులభతరమైన బస్సు, రైల్వే, విమాన ప్రయాణాలకు అనుకూలించే రిజర్వేషన్‌ వ్యవస్థ, ఆన్లైన్‌ క్రయ విక్రయాలు, సింగిల్‌ విండో పద్ధతుల సహకారంతో అందుకుంటున్న సేవలన్నీ కూడా ఐటీ రంగం చలవే. భారీ సంఖ్యలో వివిధ స్థాయుల్లో ఉద్యోగావకాశాల లభ్యత కూడా ఈ రంగం వల్లనేననేది నిర్వివాదాంశం.

 

అంతేకాకుండా స్వయం ఉపాధికి కూడా ఎక్కువ అవకాశాలున్నది ఈ రంగం. మాంద్యం వలన కొంతకాలం మందగించినా తిరిగి పుంజుకుని నిలదొక్కుకుంటూ సి.ఎస్‌.ఇ.కి ప్రత్యామ్నాయంగా పూర్వ వైభవాన్ని పొందే ప్రయత్నం చేస్తోందీ శాఖ. నాలుగేళ్ల బీటెక్‌ వ్యవధిలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లోని సబ్టెక్టులతో పాటు ఎలక్ట్రానిక్స్‌ రంగానికి ఎందిన కొన్ని ముఖ్యమైన సబ్టెక్టులను, ఇంకా అంతర్జాల వ్యవస్థ, ఇ-వాణిజ్య వ్యవస్థకు సంబంధించిన సబ్టెక్టులను విద్యార్థులు చదువుతారు.

 

సమాచార సేకరణ, నిర్వహణ, నియంత్రణ, భద్రత, వినిమయం వంటి సున్నితమైన, ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే, సమాచార నిర్వహణ నిపుణులుగా విద్యార్థులను మలచడంలో ఈ శాఖ సేవలు అపారం. బి.టెక్‌లో విద్యార్థులు ప్రత్యేకించి జాల విజ్ఞానం (వెబ్‌ టెక్నాలజీ) ఇ-కామర్స్‌, డాటా మైనింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ వంటి సబ్జెక్టులు చదువుతారు.

 

అర్హతలు

ఇంటర్‌ స్థాయిలో గణితం, భౌతికశాస్త్రం, రసాయనిక శాస్త్రం చదివి ఉండాలి. ఈ సబ్బెక్టును సులుభంగా ఆకళింపు చేసుకోవాలంటే కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ వారికి అవసరమైనట్టే గణితంపై మంచి పట్టు ఉండాలి. దీనికి తోడు తార్కికమైన ఆలోచనా విధానం చాలా అవసరం.

 

ఉద్యోగావకాశాలు

జటిలమైన సమస్యలకు సరళమైన సమాధానాలు కనుక్కుని వాటిని సామాన్య జనం ఉపయోగించేలా కంప్యూటర్‌ ఆధారిత సేవలను పెంపొందించడం వీరి ప్రధాన వృత్తి. అందువల్ల వీరికి వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ.జీతాలు కూడా ఒకప్పటిలాగా కాకపోయినా బాగానే ఉంటున్నాయి. ప్రతిభతో స్వల్పకాలంలోనే ఆర్థికంగా, వృత్తి పరంగా, నైపుణ్యాల పరంగా అభివృద్ధికి ఆస్కారం ఉన్న శాఖ ఇది. వెబ్‌ డెవలపర్‌, సమాచార భద్రత అధికారి, సమాచార నిర్వహణ అధికారి, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంజినీర్‌గా వీరికి ఉద్యోగావకాశాలుంటాయి.

 

ఉన్నత విద్య అవకాశాలు

మనదేశంలోనూ, విదేశాలలోనూ కూడా ఎం.టెక్‌, ఎంఎస్‌కి చాలా అవకాశాలున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌; ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, వెబ్‌ టెక్నాలజీస్‌, ఇంటర్నెట్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ వంటి ఎన్నో సరికొత్త కోర్సుల్లో ఎంటెక్‌/ఎంఎస్‌ చేసే అవకాశాలున్నాయి. ప్రత్యామ్నాయంగా ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ కూడా చెయ్యవచ్చు. డేటాబేస్‌ రంగంలో నైపుణ్యం పెంచుకుని సమాచార నిర్వాహకులుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.

Posted Date : 30-09-2021

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌