• facebook
  • whatsapp
  • telegram

ర్యాంకు ఏదైనా ఆప్షన్లే కీలకం!

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలుగు రాష్ట్రాల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలైంది. ఎంసెట్‌ ర్యాంకులు పొందినవారు సీటు పొందాలంటే దీనిలో పాల్గొనాల్సి ఉంటుంది. మంచి ర్యాంకు తెచ్చుకోవటం ఒక్కటే కాదు; తగిన ఆప్షన్లు ఇవ్వటమూ చాలా ముఖ్యం. అలా చేస్తేనే నచ్చిన కళాశాలలో కోరుకున్న బ్రాంచి దక్కుతుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చూపించినా సీటు కేటాయింపు జరక్కపోవచ్చు. లేకుంటే దొరికినదానితో సంతృప్తి పడాల్సివుంటుంది. అందుకే కౌన్సెలింగ్‌ సందర్భంగా ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తమ ర్యాంకు సంపాదించినా వెబ్‌ ఆప్షన్ల విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఉజ్వల భవిష్యత్తును సమస్యల్లోకి నెడతాయి. ప్రతి సంవత్సరం ఇలా నష్టపోయేవారు వందల సంఖ్యలో ఉంటున్నారు. చివరకు మంచి ర్యాంకు వచ్చినా తనకు రాకుండా పెద్ద ర్యాంకు వారికి సీట్లు ఎలా వచ్చాయని ఆవేదన వ్యక్తంచేస్తుంటారు. అందుకు కారణం వెబ్‌ ఆప్షన్ల నమోదులో చూపే నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యమేనని చెప్పొచ్చు. అందుకే ప్రవేశాల ప్రక్రియలో మంచి కళాశాలలో...కోరుకున్న బ్రాంచి పొందడానికి ఉత్తమ ర్యాంకు ఎంత ముఖ్యమో...వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడంపై అవగాహనతో వ్యవహరించడమూ అంతే ముఖ్యం.

సీటుకు ఎసరు రావొద్దంటే?

వెబ్‌ కౌన్సెలింగ్‌లో మెరుగైన/ఆశించిన సీటు రావాలంటే ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాలని నిపుణులు చెపుతుంటారు. కానీ చాలామంది విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకునే ఓపిక ఉండటం లేదు. అతివిశ్వాసంతో వ్యవహరిస్తూ 30, 40 ఆప్షన్లు పెట్టుకుని ఇవి ఎక్కువే కదా అని భావించి, ‘ఇక చాల్లే’ అని వదిలేస్తుంటారు. చాలా మంచి ర్యాంకు వచ్చినవారికి ఇది సరిపోతుంది కానీ వేలల్లో ర్యాంకులు వచ్చినవారికి అసలు సీటే రాకపోవచ్చు! ర్యాంకుకు తగిన, అత్యధిక ఆప్షన్లు పెట్టుకోకపోవటం వల్లనే ఈ సమస్య ఏర్పడుతుంది.

గత ఏడాది కౌన్సెలింగ్‌ తీరును బట్టి ఏ కాలేజీలో, ఏ బ్రాంచిలో సీటుకు అవకాశం ఉందో దాదాపు అంచనా వేసుకోవచ్చు. అలా తప్పనిసరిగా వస్తాయనుకున్న కళాశాలలు, బ్రాంచిల ఆప్షన్లను అత్యధికంగా తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. వాటితోపాటు అంతకంటే మెరుగ్గా ఉన్నవాటిని కూడా ఆప్షన్లుగా పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఎందుకంటే... మీరు పెట్టిన ఆప్షన్‌ మీ ర్యాంకుకు ఎక్కువే అయివుండొచ్చు కానీ.. అప్పటికి అది ఖాళీగా ఉంటే ఆ రాదనుకున్న కళాశాల, బ్రాంచి మీకే రావటానికి ఆస్కారం ఉంటుంది.

పెద్ద ర్యాంకులు వచ్చినవారు ఓపికగా కనీసం 200 ఆప్షన్లు... మరీ పెద్ద ర్యాంకు అయితే 400, అంతకంటే ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవడం శ్రేయస్కరం. గరిష్ఠంగా ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చు! దానికి ఎలాంటి పరిమితీ లేదు.

ఒక ప్రముఖ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈకి 3 వేలతో చివరి ర్యాంకు ముగిసింది. దాంతో 2,600 ర్యాంకు వచ్చిన విద్యార్థి ఒకరు 3 వేల ర్యాంకుతో ముగిసిన కళాశాలల్లో సీఎస్‌ఈకే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చాడు. ఫలితం ఆ విద్యార్థికి మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు చేజారింది.

2,800 ర్యాంకు దక్కించుకున్న ఓ అమ్మాయి కేవలం విశ్వవిద్యాలయాల కళాశాలలు, రెండుమూడు ప్రముఖ కళాశాలల్లోనే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకుంది. కచ్చితంగా సీటు వస్తుందన్న అతి విశ్వాసానికి పోయింది. చివరకు సీటే దక్కలేదు. గత ఏడాది తెలంగాణ మొదటి విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు చేసిన పొరపాట్లు ఇవీ.

పారాహుషార్‌... పొరపడద్దు

మొదటి విడత కౌన్సెలింగ్‌ చాలా కీలకం. రెండో విడతలోకి వచ్చేసరికి నాణ్యమైన కళాశాలల్లో సీట్లు నిండుతాయి. అందువల్ల రెండో కౌన్సెలింగ్‌ లేదని భావించి మొదటి విడతలో ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలి.

మీ ర్యాంకుకు గత ఏడాది కోరుకున్న బ్రాంచిలో టాప్‌ 25 కళాశాలల్లో సీటు వస్తే మీరు ఈసారి కనీసం 40 కళాశాలల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు మీ ర్యాంకు 4 వేలు అయితే గత ఏడాది 10 వేల ర్యాంకు వరకు సీటు వచ్చిన కళాశాలల వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఇంకా ఎక్కువ ఇచ్చుకున్నా నష్టం లేదు.

మీ ప్రాధాన్యం కోర్సుకా? కళాశాలకా? అన్నది మొదట సృష్టత తెచ్చుకోవాలి. ఉదాహరణకు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచిలో మాత్రమే చేరతారనుకుంటే టాప్‌ కళాశాలల నుంచి ఆ బ్రాంచికి మాత్రమే ఆప్షన్‌ ఇచ్చుకుంటూ రావాలి. అదే ప్రముఖ కళాశాలల్లో ఏ బ్రాంచి అయినా ఫర్వాలేదు అనుకుంటే ప్రముఖ కళాశాలలను మొదట గుర్తించాలి. ఉదాహరణకు జేఎన్‌టీయూహెచ్‌లో అన్ని బ్రాంచీలకు ఆప్షన్లు ఇవ్వాలి. తర్వాత ఓయూలోని అన్నిటికీ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ప్రముఖ కళాశాలల్లో అన్ని బ్రాంచీలకూ ఇచ్చుకుంటూ వెళ్లాలి.

ప్రభుత్వ కళాశాలల్లో ఏ కోర్సు అయినా ఓకే. ప్రైవేట్‌ కళాశాలల్లో సీఎస్‌ఈ అయితేనే చదువుతా అని ఒక విద్యార్థి భావిస్తే. మొదట ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అలా కాకుండా ప్రైవేట్‌ కళాశాలలను మొదట...తర్వాత ప్రభుత్వ కళాశాలలు అంటే నిరాశ తప్పదు.

- బాపనయ్య, శ్రీనివాసరావు ఈనాడు-హైదరాబాద్‌, అమరావతి

 

ప్రాధాన్యక్రమంలో రాసుకున్నాకే...

విద్యార్థులు తాము ఏ బ్రాంచిలో చేరాలనుకుంటున్నారు.. ఏ కళాశాలలో చేరాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోవాలి. బ్రాంచి ముఖ్యమా? కళాశాల ముఖ్యమా? అనేది ముందుగా విద్యార్థి, వారి తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ఆ తర్వాత ఆ కళాశాల పూర్వాపరాలను తెలుసుకోవాలి. కళాశాల ఎప్పుడు స్థాపించారు. మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, బోధన, క్యాంపస్‌ ఉద్యోగాలు, ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలించుకోవాలి. ఆప్షన్లు ఇవ్వడానికంటే ముందే ఇవన్నీ విచారణ చేసుకోవాలి.

ఆప్షన్లు ఇచ్చే ముందుకు ఓ పేపర్‌ తీసుకొని బ్రాంచి, కళాశాలలు, వాటి కోడ్‌ నంబర్ల్లను ప్రాధాన్య క్రమంలో రాసుకోవాలి.

ఒక జిల్లాలోనే చేరాలనుకునే వారు ఆ జిల్లాలోని కళాశాలలకే ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిది.

కళాశాల ప్రధాన రహదారి నుంచి ఎంతదూరంలో ఉంటుంది..? విద్యార్థి నివాస ప్రాంతం నుంచి ఎంత దూరంలో ఉంటుందనేది చూసుకోవాలి.

కళాశాల రుసుములను పరిశీలించుకోవాలి. ఆర్థిక స్థోమతకు అనుగుణంగా కళాశాల రుసుములను ఎంత వసూలు చేస్తున్నాయో తెలుసుకోవాలి.

10 వేల లోపు ర్యాంకు వచ్చినవారికే ప్రభుత్వం పూర్తిస్థాయిలో బోధన రుసుములు చెల్లిస్తుంది. మిగతావారికి రూ.35 వేల చొప్పున ఇస్తుంది.

ఆప్షన్ల నమోదుకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను ఇతరులు ఎవ్వరితోనూ పంచుకోకూడదు. కొన్నిసార్లు పాస్‌వర్డ్‌తో ఆప్షన్లను మార్చివేసే ప్రమాదం ఉంది.

ఇంటర్నెట్‌ సెంటర్‌ల నుంచి ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఆప్షన్లు ఇచ్చి సబ్‌మిట్‌ చేసిన తర్వాత లాగవుట్‌ అవ్వాలి. ఆ తర్వాత బ్రౌజర్‌ క్లోజ్‌ చేయాలి.

ఒకేసారి రెండు బ్రౌజర్‌లను వినియోగిస్తూ ఆప్షన్లు ఇవ్వకపోవడం మంచిది.

ఆప్షన్లు ఇచ్చిన ప్రతిసారీ సేవ్‌ చేసుకుంటూ వెళ్లాలి.

- రఘునాథ్‌, ఏపీ ఎంసెట్‌ ప్రవేశాల క్యాంపు అధికారి

 

ఈసారి పోటీ ఎక్కువే!

గత ఏడాది వరకు ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్‌ నాలుగైదు విడతల తర్వాత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ఉండేది. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు రాకముందే ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ జరుపుతున్నందున అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వచ్చేవారు సైతం పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సంశయంతో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొంటారు. అంటే వారికి ఇక్కడ మంచి ర్యాంకులు వస్తాయి కాబట్టి ఈసారి పోటీ పెరగనుంది. తర్వాత వారు జాతీయ విద్యాసంస్థల్లో చేరినా మొదటి విడతలో మాత్రం సీట్లు వారితో నిండుతాయి. అందుకే ఈసారి మరిన్ని వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడం ముఖ్యం.

వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేముందు ఆప్షన్ల ఫారమ్‌ను వెబ్‌సైట్లో ఉంచాం. దాన్ని ప్రింట్‌ తీసుకొని కళాశాలలు...బ్రాంచీలు...జిల్లా కోడ్‌లను ప్రాధాన్యాల వారీగా రాసుకోవాలి. వాటిని అప్‌లోడ్‌ చేసిన తర్వాత ప్రింట్‌ తీసుకొని ఒకటి రెండు సార్లు పరిశీలించుకోవాలి.

ధ్రువపత్రాల సమయంలో ఇచ్చే మొబైల్‌ నంబరును కళాశాలల్లో చేరేవరకు అదే నంబరు ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి సందేశం అదే నంబరుకు వస్తుంది.

- బి. శ్రీనివాస్‌, తెలంగాణ ఎంసెట్‌ ప్రవేశాల క్యాంపు అధికారి

 

మూడు దశల్లో.. ఈసారి మూడు దశల్లో కౌన్సెలింగ్‌ జరుగుతుంది. మూడో దశ తర్వాత ఆగస్టులో ఇంటర్నల్‌ స్లైడింగ్‌ ఈసారి కన్వీనర్‌ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దీంతో దీనిలో పాల్గొని సీట్లు పొందినవారికి అర్హతను బట్టి ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ అవకాశం ఉంటుంది. ఒకే సంస్థకు చెందిన గ్రూప్‌ ఆఫ్‌ కాలేజీల్లోంచి ఎంచుకున్నపుడు ఆసక్తి ఉన్న నిర్దిష్ట కాలేజీ కోడ్‌ను సరిగా నమోదు చేయటం అవసరం.

సీటు కేటాయింపు జరిగాక ఆన్‌లైన్లో ఫీజు కట్టి సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సివుంటుంది. కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినా నచ్చక రెండో దశలో, మూడో దశలో ప్రయత్నించాలనుకునేవారు మొదట కేటాయించిన సీటుకంటే మెరుగైన ఆప్షన్లను ఎంచుకోవాలి. సీటు కేటాయించగానే తొలి/మలి దశలో కేటాయించిన సీటును కోల్పోతారు. ఈ సీటు కంటే అప్పటి సీటే బాగుందని అనుకున్నా అప్పుడు ప్రయోజనం ఉండదు.

Posted Date : 22-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌