• facebook
  • whatsapp
  • telegram

మెరుగైన ర్యాంకుకు మెలకువలు ఇవిగో!

ఎంసెట్‌ - 2022 ప్రిపరేషన్‌ విధానం

ఇంటర్‌ తర్వాత సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్ష ఎంసెట్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో జులైలో జరుగనున్న ఈ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలంటే ఏయే అంశాలు గమనించాలి? ఏ జాగ్రత్తలు పాటించాలి? 

సహజంగా ఎంపీసీ అంటే ఇంజినీర్‌ అని, బైపీసీ అనగానే డాక్టర్‌ అని మాత్రమే విద్యార్థులు భావిస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా చాలా రకాల ప్రొఫెషన్లు ఉన్నాయని గుర్తించాలి. ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులు రాసే ఎంసెట్‌ ద్వారా బీఈ/బీటెక్, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, బీఫార్మసీ, ఫార్మా-డిల్లో చేరవచ్చు. బైపీసీ విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టీకల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ (వెటరినరీ సైన్స్‌), బీఎఫ్‌ఎస్‌సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌), ఫుడ్‌ టెక్నాలజీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మా-డిల్లో చేరవచ్చు. బీఎస్సీ నర్సింగ్‌లో చేరడానికీ ఎంసెట్‌ స్కోరు పనికొస్తుంది. 

ఇంటర్‌ పరీక్షల తర్వాత లభించే వ్యవధిలో ప్రణాళికాబద్ధంగా చదువుతూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాసే సమయంలో చేసుకునే పునశ్చరణ ఎంసెట్‌కీ ఉపయోగపడాలి. 

ఎంసెట్‌లో మెరుగైన ర్యాంక్‌ రావాలంటే మంచి మార్కులు సాధించాలి. దీన్ని పెంచుకునే విధంగా సన్నద్ధత ఉండాలి. ఈ సంవత్సరం ఇంటర్‌ మార్కుల వెయిటేజి లేని కారణంగా పూర్తిగా ఎంట్రన్స్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను నిర్ణయిస్తారు. అందువల్ల పరీక్ష సమయంలో తమకు అనుకూలమైన సబ్జెక్టులో పరీక్ష ప్రారంభించాలి. కష్టతరమైన ప్రశ్నల దగ్గర ఎక్కువ సమయం వృథా చేయకుండా తర్వాత ఉన్న ప్రశ్నలు, సబ్జెక్టులను ఎంచుకోవడం ఉత్తమం. రుణాత్మక మార్కులు లేని కారణంగా అన్నిటికీ సమాధానాలు గుర్తించడం తప్పనిసరి. 

ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష విధానంలో ప్రశ్నలు స్క్రీన్‌ దాటి ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ప్రశ్నని గుర్తుంచుకుని సమాధానం రాసేలా ఉండాలి. పరీక్షలో కష్టమైన సబ్జెక్టు ప్రభావం మరొక సబ్జెక్టుపై పడకుండా చూసుకోవాలి. ఫార్ములాలు, కాన్సెప్టులను పునశ్చరణ చేసుకోవాలి. మాక్‌ టెస్ట్‌లు, గత ఆన్‌లైన్‌ పేపర్లు సాధన చేయాలి. సందేహాలను అధ్యాపకుల సాయంతో నివృత్తి చేసుకోవాలి. వేగం, కచ్చితత్వం పెరిగేందుకుగాను మాక్‌ టెస్ట్‌ల సమయంలోనూ సమయపాలన అవసరం.  

ఈ సంవత్సరం ద్వితీయ సంవత్సరంలో ఉన్న విద్యార్థులు మొదటి సంవత్సరం పూర్తిగా, రెండో సంవత్సరం పాక్షికంగా ఆన్‌లైన్‌ ద్వారా విద్యనభ్యసించారు. అందువల్ల పాఠ్యాంశాలపై పూర్తి పట్టు కష్టమైనా భయపడకుండా సానుకూల దృక్పథంతో ప్రయత్నించడం చాలా అవసరం. 

ఇంజినీరింగ్‌ విభాగంలో.. గణితంలో 80 మార్కులు, భౌతిక, రసాయన శాస్త్రాల్లో 40, 40 మార్కులతో మొత్తం 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెడికల్‌ విభాగంలో వృక్షశాస్త్రంలో 40 మార్కులు, జంతుశాస్త్రంలో 40 మార్కులు,  భౌతిక, రసాయన శాస్త్రాల్లో 40, 40 మార్కులతో మొత్తం 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 

విద్యార్థి కనీసం 80కి పైగా ఎంపీసీ విభాగంలో, 110కి పైగా బైపీసీ విభాగంలో మార్కులు సాధిస్తే మంచి విద్యాసంస్థలో సీటు సాధించవచ్చు. ప్రస్తుత విద్యార్థులు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో తగ్గించిన సిలబస్‌ను వదిలేసి సన్నద్ధం కావాలి.

విద్యార్థులు తమ రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌తోపాటుగా మొదటి నుంచి సమాంతరంగా ఆబ్జెక్టివ్‌ పరీక్షకు కూడా సిద్ధమవుతూ ఉన్నట్లయితే ఎంసెట్‌ అంత కష్టం కాదు. 

మౌలికాంశాలు, సిద్ధాంతాల పట్ల అవగాహన పెంచుకుని కొంత విషయ పరిజ్ఞానాన్ని అన్వయించగలిగినట్లయితే ఈ పరీక్ష సులభమే! 

రసాయనశాస్త్రం

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు ఇచ్చిన సిలబస్‌ మాత్రమే ఎంసెట్‌కు ఉంటుంది. అకాడమీ పుస్తకాల నుంచి సన్నద్ధమవుతూ కీలకమైన అంశాలకు సొంత నోట్స్‌ తయారుచేసుకోవాలి.

ఆర్గానిక్‌ కెమిస్ట్రీ నేమ్డ్‌ రియాక్షన్స్, రీ ఏజెంట్స్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇన్‌ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పటాలు, పట్టికలు, గ్రాఫ్‌లు, మూలక ధర్మాలు, నేమ్డ్‌ ప్రాసెస్‌లు సాధన చేయాలి. భౌతిక రసాయనశాస్త్రంలో ఫార్ములాలను బాగా నేర్చుకుని, ఫార్ములా ఆధారిత ప్రశ్నల సాధనపై దృష్టి పెట్టాలి. ప్రతి చాప్టర్‌లో కనీసం ఒక ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఏ పాఠ్యాంశాన్నీ విడిచిపెట్టడానికి లేదు. కష్టతరమైన చాప్టర్‌లలో కూడా సులభ తరహా ప్రశ్నలు రావచ్చు. 

భౌతికశాస్త్రం

సుమారు 30 శాతం ప్రశ్నలు నేరుగా వస్తాయి. ఫిజిక్స్‌ ఫార్ములాలను నేర్చుకుని వాటిని ఉపయోగించడంపై పట్టు సాధించాలి. షార్ట్‌కట్‌ ఫార్ములాలు, కాన్సెప్ట్‌ ఆధారిత షార్ట్‌నోట్స్‌ను రెండు మూడుసార్లు పునశ్చరణ చేయాలి. అకాడమీ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి, గత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా సాధన చేయాలి. మొదటి పది రోజులు ప్రథమ సంవత్సర అంశాలపై, తర్వాత పది రోజులు ద్వితీయ సంవత్సర అంశాలపై సిద్ధం కావాలి. చివరి పది రోజులు నమూనా పరీక్షలు రాసి వాటిలో తప్పులను గుర్తించాలి. అధ్యాపకుల సహాయంతో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. 

వీటిపై శ్రద్ధ అవసరం

ఎంపీసీ విద్యార్థులు

మొదటి సంవత్సరం: హీట్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, వర్క్, ఎనర్జీ, పవర్, లాస్‌ ఆఫ్‌ మోషన్‌.

రెండో సంవత్సరం: వేవ్‌ మోషన్, ఎలక్ట్రిసిటీ, అటామిక్‌ ఫిజిక్స్, న్యూక్లియర్‌ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్‌.

బైపీసీ విద్యార్థులు

మొదటి సంవత్సరం: యూనిట్స్, కైనమేటిక్స్, లాస్‌ ఆఫ్‌ మోషన్, వర్క్, ఎనర్జీ, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, హీట్‌.

రెండో సంవత్సరం: ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రో మాగ్నటిజం, మోడర్న్‌ ఫిజిక్స్, వేవ్‌ మోషన్, వేవ్‌ ఆప్టిక్స్‌. 

చివరగా... 

1. ఇంటర్మీడియట్‌ పరీక్షల సన్నద్ధతలో కొంతవరకూ కాన్సెప్టులు, ఫార్ములాలు, సమస్యా సాధనలు ఎంసెట్‌కు కూడా ఉపయోగపడతాయని గుర్తుంచుకోవాలి. 

2. ఇంటర్‌ పరీక్షల అనంతరం 10-12 రోజులు మొదటి సంవత్సరం, 10-12 రోజులు రెండో సంవత్సరం పాఠ్యాంశాలు రివిజన్‌ చేయాలి. ముఖ్యంగా ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, సినాప్సిస్‌లపై ధ్యాస పెట్టాలి. 

3. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులకు సమయాన్ని కేటాయించి పునశ్చరణ చేయాలి. 

4. సులభంగా ఉన్నవీ, తెలిసినవీ, చేయగలిగినవీ అయిన చాప్టర్‌లను ఎంచుకుని క్షుణ్ణంగా చదవడం ఉత్తమం. వీలైనంతవరకూ కొత్తవి నేర్చుకోకపోవడమే మంచిది. 

5. చాప్టర్ల వారీ పరీక్షలు కొన్ని రాయాలి. 

6. అభ్యర్థులు కొన్ని గ్రాండ్‌ టెస్టులైనా రాసి తాము సిద్ధమైన చాప్టర్‌లలో తమ లోపాలను సరిదిద్దుకోవాలి. 

7. గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను సేకరించి విశ్లేషించి సన్నద్ధతకు మెరుగులు దిద్దుకోవాలి. 

8. పరీక్షలో ప్రశ్నలన్నీ క్షుణ్ణంగా చదవటం చాలా ముఖ్యం. సరైన/ సరికాని వాక్యాలను గుర్తించి సమాధానాన్ని ఎంచుకోవాలి. 

9. కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే ప్రశ్న చదివేటప్పుడు సంబంధంలేని సమాధానాలను వదిలేసి (ఎలిమినేషన్‌) సరైన జవాబును ఎంచుకోవచ్చు. 

10. నెగెటివ్‌ మార్కింగ్‌ లేని కారణంగా అన్ని ప్రశ్నలకూ తప్పక సమాధానాన్ని గుర్తించాలి. ఏ ప్రశ్ననూ వదలకూడదు. వస్తే మార్కు వస్తుంది. లేకపోతే పోయేదేమీ లేదు. ఆల్‌ ది బెస్ట్‌!
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మార్కులు తెచ్చే విపత్తు నిర్వహణ

‣ విద్యార్థులకు విప్రో ఉద్యోగాలు సిద్ధం!

‣ ఇంటర్‌ విద్యార్థులకు ఐఐఎస్‌సీ ఆహ్వానం

‣ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ

‣ ఉద్యోగం సాధించాలనే త‌ప‌న మీలో ఉందా?

‣ ఎస్‌ఐ ప్రిలిమ్స్‌కు సన్నద్ధత ఇలా!

‣ కళ్లకు కట్టినట్టు.. కళతో కనికట్టు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 11-05-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌