• facebook
  • whatsapp
  • telegram

గణితంలో గరిష్ఠ మార్కులు

ఎంసెట్‌ - 2022 ప్రిపరేషన్‌ మెలకువలు

పోటీ పరీక్షలన్నీ సబ్జెక్టుకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్నే కాకుండా.. వేగం, కచ్చితత్వం, సమయపాలనలను పరీక్షించే విధంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మార్కులపరంగా, ప్రశ్నల సంఖ్యపరంగా గణితశాస్త్రానిదే ప్రథమ స్థానం. మొత్తం 160 ప్రశ్నలకుగాను 80 ప్రశ్నలు గణితశాస్త్రానికి సంబంధించినవే ఉంటాయి. దీనిలో గరిష్ఠ మార్కులు సాధించే మెలకువలు ఇవిగో!  

విద్యార్థులు రసాయనశాస్త్రానికి 45 నిమిషాలు, భౌతికశాస్త్రానికి 60 నిమిషాలు, గణితశాస్త్రానికి 75 నిమిషాల సమయాన్ని కేటాయించడం వల్ల ఎంసెట్‌లో అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించగలుగుతారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకూ పరిశీలిస్తే... 20 శాతం ప్రశ్నలు కొంచెం కష్టంగా, 30 శాతం ప్రశ్నలు సాధారణంగా, 50 శాతం ప్రశ్నలు ఎక్కువ మంది సాధించగలిగేవిగా ఉంటాయి. గణితశాస్త్రాన్ని ప్రధానంగా 4 భాగాలుగా విభజించవచ్చు. మొదటి సంవత్సరానికి సంబంధించి 1ఏ, 1బీ; రెండో సంవత్సరానికి సంబంధించి 2ఏ, 2బీ. 

ప్రశ్నల సరళి

మొదటి సంవత్సరంలో 1ఏకు సంబంధించి ప్రమేయాలు (Functions) నుంచి 3 ప్రశ్నల్లో రెండు సులువుగా, ఒకటి కొంచెం కష్టంగా రావచ్చు. గణితానుగమన న్యాయం (Mathematical Induction) నుంచి ఒక సులువైన ప్రశ్న, మాత్రికలు (Matrices) నుంచి 5 సులువైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. 

సదిశలు (Vectors) నుంచి 6 సులువైన ప్రశ్నలు, త్రికోణమితిలోని (Trigonometry) త్రికోణమితీయ నిష్పత్తులు (Trigonometric Ratios), సంయుక్త కోణాలు (Compound Angles), గుణిజ ఉపగుణిజ కోణాలు (Multiple and Sub Multiple Angles), పరివర్తనాల (Transformations) నుంచి 5 ప్రశ్నలు అడగొచ్చు. త్రిభుజధర్మాలు (Properties of Triangles) నుంచి 3 ప్రశ్నలు, అతిపరావలయ ప్రమేయాలు (Hyperbolic Functions) నుంచి ఒక ప్రశ్న రావొచ్చు.

1బి నుంచి జ్యామితిలోని (Geometry)  సరళరేఖలు, సరళరేఖాయుగ్మాలు, 3-డి నుంచి 4 ప్రశ్నల చొప్పున, కలనగణితంలోని (Calculus) అవధులు, అవిచ్ఛిన్నత (Limits & Continuity) నుంచి 3 ప్రశ్నలు, అవకలనం (Differentiation) నుంచి 4 ప్రశ్నలు, గరిష్ఠ, కనిష్ఠ, (Maxima and Minima) విలువలు, ఆరోహణ, అవరోహణల నుంచి మొత్తం 4 ప్రశ్నలు అడగవచ్చు. కలనగణితంలో పైన ఉదాహరించినవి కాకుండా 3 లేదా 4 ప్రశ్నలు చిన్నచిన్న అధ్యాయాల నుంచి అడగవచ్చు.

రెండో సంవత్సరం నుంచి 2ఏలోని సంకీర్ణ సంఖ్యలు (Complex Numbers), సిద్ధాంతం (de-Moivres Theorem) నుంచి 3 ప్రశ్నలు, వర్గ సమీకరణాలు (Quadratic Equations), సమీకరణాల సిద్ధాంతం (Theory of Equations) నుంచి 2 సులువైన ప్రశ్నలు వస్తాయి. ప్రస్తారాలు, సంయోగాలు (Permutations and Combinations)నుంచి 3 ప్రశ్నలు, సాంఖ్యకశాస్త్రం (Statistics) నుంచి 2 సులువైన ప్రశ్నలు, సంభావ్యత (Probability) నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

2బిలోని వృత్తాలు (Circles) నుంచి 4 ప్రశ్నలు, వృత్తసరణి (System of Circles) నుంచి 2 ప్రశ్నలు, కోనిక్‌ సెక్షన్‌ నుంచి 3 ప్రశ్నలు రావచ్చు. నిశ్చిత, అనిశ్చిత సమాకలనాలు (Definite and Indefinite Integrals) నుంచి 4 ప్రశ్నలు, అవకలన సమీకరణాల నుంచి 1 లేదా 2 సులువైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.  

ఇవి పాటించండి 

ప్రతి సబ్జెక్టులోని ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు ప్రశ్నలను రెండు భాగాలుగా విభజించుకోవాలి. ముందుగా సులువుగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. తర్వాత మిగతా ప్రశ్నలకు సమాధానం రాయాలి. 

ముఖ్యంగా త్రికోణమితి, అవకలన సమాకలనాల్లోని సూత్రాలను ఎక్కువగా పునశ్చరణ చేయాలి. 

కాన్సెప్ట్‌పరంగా విశ్లేషణాత్మక ప్రశ్నలు సాధించేలా, ఎలాంటి కాలిక్యులేషన్‌ తప్పులురాని విధంగా బాగా సాధన చేయాలి. 

ప్రతి సబ్జెక్ట్‌లోని కాన్సెప్ట్‌నూ అర్థవంతంగా సంసిద్ధమైతే ఎంసెట్‌లో అద్భుతంగా రాణించవచ్చు.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టెన్త్‌తో పోస్టల్‌ ఉద్యోగాలు

‣ ఇఫ్లూ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన

‣ సౌకర్యంగా చదువుకోడానికి ఈ-బుక్‌రీడర్‌

‣ బహు భాషలు నేర్చుకుంటే..!

‣ సరిహద్దు దళంలో ఉద్యోగాలు

‣ సులువుగా పర్యావరణాన్ని చదివేద్దాం!

‣ ఎకానమీలో ఏవీ ముఖ్యం?

‣ అవుతారా డ్రోన్‌ పైలట్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-05-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌