• facebook
  • whatsapp
  • telegram

బిట్‌శాట్‌ దారి... ఎంసెట్‌పై గురి!

ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించదల్చిన విద్యార్థులు ఉత్తమ ప్రమాణాలను అందించే కళాశాలల్లో చేరాలని అభిలషిస్తుంటారు. సంబంధిత ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకు సాధించగలిగితేనే ఈ కోరిక నెరవేరుతుంది. సుప్రసిద్ధ విద్యాసంస్థ బిట్స్‌లో, ఎంసెట్‌ ద్వారా మెరుగైన కళాశాలల్లో సీటు సంపాదించటానికి ఎంత కృషి చేయాలో తెలిపే విశ్లేషణ ... మీకోసం!

ఎంపీసీ విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలు అంచనా వేసుకుని పోటీ పరీక్షల దిశలో ప్రణాళికాబద్ధంగా ప్రయాణించగలిగినపుడే తుది లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థుల సంఖ్య 3.50 లక్షలకు పైగా ఉంది. వీరిలో దాదాపు లక్షమందికి పైగా ఐఐటీలపై ఉత్సాహం చూపుతున్నారు. కానీ గత ఏడాది ఐఐటీల్లో సీట్లు సాధించినవారు 0.5 శాతం మాత్రమే. జేఈఈ మెయిన్‌ రాసిన విద్యార్థుల సంఖ్య 1.30 లక్షలకుపైగా ఉంది. వారిలో ఎన్‌ఐటీ లేదా ఐఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులు 4000 మంది వరకూ తీసుకున్నా విజయశాతం 3 శాతం లోపే!
అంటే ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీల్లోకి వెళ్ళే విద్యార్థులు మొత్తం ఎంపీసీ విద్యార్థుల్లో 2 శాతంలోపే ఉన్నారు. మిగిలిన 98 శాతం మంది విద్యార్థులు గమ్యం నిర్దేశించుకోలేకుండా ఏదో ఒక కళాశాలలో చేరాలనేవిధంగా ఉంటున్నారు.
ఇంజినీరింగ్‌ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరితే వచ్చే వేతనాల ఆధారంగా విద్యార్థుల ప్రాథమ్యాలు ఇలా ఉంటున్నాయి: 1) ఐఐటీ 2) ఎన్‌ఐటీ/ ఐఐఐటీ 3) బిట్స్‌ 4) విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలలు 5) డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు 6) అత్యుత్తమ 10 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు 7) నివాసానికి దగ్గర్లో ఉన్న ఏదో ఒక ఇంజినీరింగ్‌ కళాశాల 8) సైన్స్‌ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీ.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీ సీట్లు పొందే విద్యార్థుల నిష్పత్తి 1:20 ఉన్నప్పటికీ ఈ లక్షల మంది జేఈఈ మెయిన్లో అర్హత పొందినవారు. అంటే తొలి స్క్రీనింగ్‌ పరీక్షలో 1:6 నిష్పత్తిలో ముందుకువచ్చిన విద్యార్థులు. ఆ సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే పరీక్షకు తయారయ్యే ప్రతి 120 మందిలో ఒక విద్యార్థి ఐఐటీలో సీటు సాధిస్తున్నాడు.
తర్వాత అధిక సంఖ్యలో పోటీ పడుతున్నది బిట్‌శాట్‌. ఎన్‌ఐటీల్లో ప్రవేశం కల్పించే జేఈఈ మెయిన్‌ పరీక్షకూ, యూనివర్సిటీ కళాశాలల్లో ప్రవేశం కల్పించే ఎంసెట్‌కూ పోటీ దాదాపు సమానంగానే ఉంది. అంటే ప్రయత్నించే ప్రతి 30 మందిలో ఒకరికి మాత్రమే అవకాశం ఏర్పడుతోంది. ఈ విశ్లేషణ అర్థం చేసుకుని పోటీని గ్రహించి కృషి చేస్తే కోరుకున్న బ్రాంచిలో సీటు సాధించుకోవచ్చు.

 

సన్నద్ధత వేర్వేరు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్‌ పరీక్షలకూ, బిట్‌శాట్‌, ఎంసెట్‌లకూ సన్నద్ధత విధానం కొంత వేరుగా ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో 90 ప్రశ్నల జవాబులు గుర్తించడానికి 3 గంటల వ్యవధి ఉంటే బిట్‌శాట్‌లో అదే సమయంలో 150 ప్రశ్నలకు, ఎంసెట్‌లో 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సివుంటుంది.
బిట్‌శాట్‌, ఎంసెట్‌లలో దాదాపు ప్రశ్నల సంఖ్య సమంగానే ఉంది; వీటికి తోడు కొన్ని డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రవేశపరీక్ష ప్రశ్నల సంఖ్య 150 నుంచి 200 లోపు ఉంటోంది. కచ్చితంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్‌ల తరహాలో కాకుండా కొంత విభిన్నంగా తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నల జవాబులు గుర్తించేలా వీటి సన్నద్ధత ఉండాలి. సమయపు ఒత్తిడి పరీక్ష హాల్లో అధికంగా ఉంటుంది. అందుకని అభ్యాసం అధికంగా చేయాలి.
అధిక శాతం విద్యార్థులు ‘ఐఐటీ ప్రవేశపరీక్షకు తయారవుదాం; ఒకవేళ రాకుంటే ఎంసెట్‌ అయినా వస్తుంది కదా!’ అనే భావనతో ఉంటున్నారు. అది పూర్తిగా పొరపాటు. ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులు కూడా అధిక శాతం ఎంసెట్‌లో సాధించలేకపోయారు. అంటే పరీక్ష కష్టమయినదని కాదు, ఆ దిశలో అభ్యాసం జరగకపోవటమే సమస్య.
ఈ దశలో విద్యార్థి చేయాల్సింది... తన పరిస్థితిని అంచనా వేసుకుని దేన్ని ముఖ్య పరీక్షగా తీసుకుంటున్నారో నిర్ణయించుకుని పూర్తి సామర్థ్యాన్ని ఈ పరీక్షపై పెట్టడం. మార్చి 15 నుంచి మే వరకూ కనీసం 15 ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలు జరుగుతున్నాయి. అంటే సగటున పరీక్షకు 3 నుంచి 5 రోజులు వస్తాయి. ఈ వ్యవధి పరీక్షపై పట్టు సాధించడానికి సరిపోదు. అది పరీక్ష స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే సరిపోతుంది.
ఉదాహరణకు... ఎంసెట్‌ గణితంలో 80 ప్రశ్నలుంటే బిట్‌శాట్‌లో 45 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. బిట్‌శాట్‌లో 25 ప్రశ్నలు ఇంగ్లిష్‌, ఆప్టిట్యూడ్‌ రీజనింగ్‌లో ఉంటాయి. ఈ తేడాలపై అవగాహన ఏర్పరచుకుని ఒక పరీక్షపై పూర్తిగా దృష్టి పెట్టిన విద్యార్థి కచ్చితంగా ఆ పరీక్షలో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.

 

బిట్స్‌ పరీక్షకు ప్రణాళిక
బిట్‌శాట్‌ ద్వారా పిలానీ, గోవా, హైదరాబాద్‌లలోని క్యాంపసుల్లో ఇంజినీరింగ్‌, ఇంటిగ్రేటెడ్‌, పీజీ, బీ ఫార్మసీ సీట్లను భర్తీ చేస్తారు. ఈ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలుంటాయి. గణితం 45, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40, ఇంగ్లిష్‌, రీజనింగ్‌ 25 ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన జవాబుకూ 3 మార్కులు, తప్పు జవాబుకు ఒక మైనస్‌ మార్కు. ఎవరైనా విద్యార్థి మొత్తం 150 ప్రశ్నలకు జవాబులు నిర్దిష్ట 3 గంటల్లోపే పూర్తిచేసుకుంటే మిగిలిన సమయంలో వారు కోరితే అదనంగా 12 ప్రశ్నలు గ్రూపు సబ్జెక్టుల్లో 4 చొప్పున ఇస్తారు. వీటిద్వారా కూడా స్కోరు పెంచుకోవచ్చు. అయితే ఈ ప్రశ్నలు మొదటి 150 ప్రశ్నలకు జవాబులు గుర్తిస్తేనే ఇస్తారు. అదనపు ప్రశ్నల కోసం ఏదో ఒక జవాబును గుర్తిస్తే రుణాత్మక మార్కులున్నందున వచ్చిన మార్కులు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. 450 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 380 మార్కుల వరకూ వస్తే బిట్స్‌ పిలానీలో, 350 మార్కుల పైన వస్తే బిట్స్‌ గోవాలో, 340 పైన వస్తే బిట్స్‌ హైదరాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ లాంటి బ్రాంచిలు రావడానికి అవకాశం ఉంటుంది. 2011లో బిట్స్‌ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య తక్కువగా 75 వేల వరకూ ఉంది. 2016కి వచ్చేసరికి ఈ సంఖ్య దాదాపు 2 లక్షలయింది. బీ ఫార్మసీలో తప్పించి మిగిలిన కోర్సుల్లో సీటు సాధించాలంటే మార్కులు 300పైనే వచ్చేలా తయారుకావాలి. ఫార్మసీలో 240 మార్కులు వచ్చినా సీటు వస్తుంది. బిట్స్‌ దుబాయి ప్రాతిపదిక వేరు.
బిట్స్‌లో సీటు అంటే 300పైన తెచ్చుకోవాల్సిందే. ప్రణాళిక ఎలా ఉండాలంటే... ఇంగ్లిష్‌, రీజనింగ్‌లో జాగ్రత్తగా అభ్యాసం చేయాలి. 20 ప్రశ్నలకు జవాబులు బాగా గుర్తించవచ్చు. దానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. గణితం 45 ప్రశ్నల్లో ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలకు పరిమితమైన సాధారణ విద్యార్థి కూడా బహుళైచ్ఛిక ప్రశ్నల రూపంలో అభ్యాసం చేస్తే 40 ప్రశ్నల జవాబులు గుర్తించవచ్చు. ఇక ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లోని 80 ప్రశ్నల్లో 50 ప్రశ్నలకైనా సమాధానాలు గుర్తించేలా తయారవ్వాలి. ఈ రకంగా 330 మార్కుల వరకూ సాధించుకోవచ్చు.
తొలిగా నమూనా పరీక్షల్లో ఈ మార్కులు సాధించుకుని, తప్పులు సరిచేసుకుంటూపోతే 380-400 వరకూ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. బిట్‌శాట్‌ ఆన్‌లైన్‌ పరీక్ష కాబట్టి ఏ ఇద్దరికీ ఒకే ప్రశ్నలుండవు. అయితే ఏ విద్యార్థి కూడా పరీక్ష సులభంగా ఉందని కానీ, కష్టంగా ఉందని కానీ, సమయం చాలటం లేదని కానీ అనడం లేదు. అంటే వారి సాఫ్ట్‌వేర్‌ ఎంత పకడ్బందీగా ఉందో గ్రహించవచ్చు. అంటే అదే పరీక్షను లక్ష్యంగా తీసుకుని తయారైన విద్యార్థికి బిట్‌శాట్‌ కష్టతరమైన పరీక్ష కాదు.

 

90 శాతం మందికి ఎంసెట్‌

దాదాపు 90 శాతం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంసెట్‌ ద్వారానే ఇంజినీరింగ్‌ చేయడానికి అవకాశం ఏర్పడుతోంది. ప్రస్తుతం పోటీపరీక్షలన్నిటిలో ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఇంటర్‌ మార్కుల వెయిటేజి ఉన్న ఏకైక పరీక్ష ఇది.
ఎంసెట్‌ తుది ర్యాంకు నిర్థారణకు ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజి, మిగిలిన 75 శాతం ఎంసెట్‌ మార్కులకు వెయిటేజి ఇచ్చి ర్యాంకు ఇస్తారు. ఇంటర్‌ మార్కులు అంటే రెండేళ్ళ గ్రూపు సబ్జెక్టుల్లో మార్కులు, ప్రాక్టికల్‌ మార్కులతో కలిపి తీసుకుంటారు. ఇంటర్‌ రెండు సంవత్సరాల్లో లాంగ్వేజెస్‌ 400 మార్కులు తీసివేసి, మిగిలిన 600 మార్కులకు విద్యార్థి సాధించిన మార్కులు తీసుకుని దాన్ని 25కి గణిస్తారు. అంటే ఇంటర్‌ గ్రూపు సబ్జెక్టుల్లో విద్యార్థి పొందే ప్రతి 24 మార్కులకు ఎంసెట్‌లో పొందే వెయిటేజి ఒక మార్కు మాత్రమే.
ఇంటర్‌ మార్కులకు వెయిటేజి ఇచ్చినప్పటికీ ఈ మార్కులు తుది ర్యాంకును పెద్దగా ప్రభావితం చేయలేవు. ఎంసెట్‌ 160 ప్రశ్నలతో 160 మార్కులకు జరుగుతుంది. ఈ మార్కును 75కు కుదిస్తారు కాబట్టి సుమారుగా ప్రతి రెండు ఎంసెట్‌ మార్కులకు తుది ఎంసెట్‌ వెయిటేజిలో ఒక మార్కు మారుతుంది. ఎంసెట్‌ మార్కులకే అధిక ప్రాధాన్యం ఉంది కాబట్టి తుది ర్యాంకు నిర్థారణ ఈ మార్కే.
మిగిలిన పరీక్షలకూ, ఎంసెట్‌కూ మరో ముఖ్యమైన తేడా... ఎంసెట్‌లో తప్పు జవాబు గుర్తిస్తే రుణాత్మక మార్కులుండవు. ఎంసెట్‌లో ప్రతి విద్యార్థికీ సీటు రావటం నిజమైనప్పటికీ విశ్వవిద్యాలయ కళాశాలల్లో, కోరిన బ్రాంచిలో సీటు తెచ్చుకోవాలంటే...పోటీ జేఈఈ మెయిన్‌ కంటే అధికమే. 160 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 100 మార్కులపైన సాధించగలిగితేనే సీటు వస్తుంది. గణితంలో 80 మార్కులకు 65; ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు రెండూ కలిపి 80 మార్కులకు 40 నుంచి 50 మార్కులు తెచ్చుకున్నా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు సాధించవచ్చు. 2016లో మార్కు... ర్యాంకు విశ్లేషణ గమనిస్తే ఎన్ని మార్కులు సాధించాలో అవగాహన ఏర్పడుతుంది.
ఎంసెట్‌లో 105 మార్కులు సాధిస్తే 3000 వరకూ ర్యాంకు వస్తుంది. అంటే ఆ విద్యార్థికి కోరిన యూనివర్సిటీ కళాశాలలో సీటు వచ్చినట్టే. ఆ మార్కు సాధించడానికి 2016 ప్రశ్నపత్ర విశ్లేషణ కూడా గమనించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష సరళి దాదాపు ఒకేరకంగా ఉంది.
ఎంసెట్‌ ప్రశ్నపత్రంలో మూడు సబ్జెక్టుల ప్రశ్నల క్లిష్టత తీరు గమనిస్తే... కేవలం ఇంటర్‌ పుస్తకాల్లోని వాక్యాలకే పరిమితమైన సులువైన ప్రశ్నలు 89. వీటివరకూ జవాబులు గుర్తించినా 10వేల లోపే ర్యాంకు సాధించవచ్చు. మధ్యస్థంగా ఉన్న 57 ప్రశ్నల్లో సగం ప్రశ్నలకు జవాబులు గుర్తించి, కష్టంగా ఉన్నవి అసలు వదిలేసినా విద్యార్థికి 115పైన మార్కులు వచ్చే వీలు ఏర్పడుతోంది.


 

Posted Date : 22-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌