• facebook
  • whatsapp
  • telegram

తగిన బ్రాంచి.. తెలుసుకునేదెలా?

ఇంజినీరింగ్‌లో చేరాలి.. అని అనుకోగానే వెంటనే ఎదురయ్యే ప్రశ్న.. ఏ బ్రాంచి? అన్నీ మంచి బ్రాంచీలే. అయితే మనకు తగినది ఏది? బంధువులు బోధించిన బాటలో నడుద్దామా.. స్నేహితులతో సాగిపోదామా.. తోచింది తీసుకుందామా? సరైన నిర్ణయం అవుతుందా.. తర్వాత జీవితాంతం చింతించాల్సి ఉంటుందా? ఎవరి మాట వినాలి.. ఏ దారిలో వెళ్లాలి? తగిన బ్రాంచిని తెలుసుకోడానికి కొలమానాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని చెక్‌పాయింట్లు చూసుకుంటే కొంత వరకు తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే అదే వందశాతం కాదు. నైపుణ్యాలు పెంచుకోవడంపై శ్రద్ధ పెడితే ఏ బ్రాంచి తీసుకున్నా రాణించవచ్చని చెబుతున్నారు.

ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి ఇంజినీరింగ్‌ చదవాలనుకున్న విద్యార్థుల్లో మొదట ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏ బ్రాంచి ఎంచుకోవాలన్నదే. వారూ వీరూ...ఇరుగూ పొరుగూ చెప్పేదాన్ని బట్టి బి.ఇ./ బీటెక్‌ బ్రాంచీలను ఎంచుకుంటున్నవారే అధికమని నిపుణులు చెబుతున్నారు. కోర్సులో చేరే వరకు ఆ బ్రాంచిలో ఏ సబ్జెక్టులుంటాయి?...ఏ పాఠ్యాంశాలను బోధిస్తారన్నది తెలియనివారు అధికమని చెబుతున్నారు. కౌన్సెలింగ్‌లో ఎంసెట్‌ ర్యాంకును బట్టి కళాశాల, బ్రాంచి కేటాయిస్తారు. దాంతో కనీసం 20-30 శాతం మందికి తాము ఎంచుకున్న తొలి ఐచ్ఛికం ప్రకారం కళాశాలలే కాదు....బ్రాంచి కూడా దక్కదు. అయినా ఇంజినీరింగ్‌ చేయాలనుకున్నారు కాబట్టి కళాశాలలో చేరతారు. ఆసక్తి ఉన్న సబ్జెక్టు ఒకటైతే...చేరిన బ్రాంచిలో చదవాల్సింది....పట్టు సాధించాల్సింది మరొక సబ్జెక్టు. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఒక బ్రాంచిలో చేరాలంటే ఏ సబ్జెక్టులో...ఏ పాఠ్యాంశాలపై ఆసక్తి, పట్టు ఉండాలో గ్రహిస్తే చాలా వరకు మంచి నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

పట్టున్న అధ్యాయాలేమిటి?

ఇంటర్‌మీడియట్‌లోని గణిత, భౌతిక, రసాయన శాస్త్రాల్లోని కొన్ని అధ్యాయాలు మన అభిరుచిని గుర్తించడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. వాటిలో ఆసక్తి, పట్టును బట్టి ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో రాణించగలమో ఒక అంచనాకు రావచ్చు. అందుకు ఇంజినీరింగ్‌లో వివిధ బ్రాంచీల నిపుణులు ఆచార్య విజయ్‌కుమార్‌రెడ్డి, ఆచార్య జీకే విశ్వనాథ్‌, ఆచార్య కామాక్షి ప్రసాద్‌, డాక్టర్‌ జయశంకర్‌, ఆచార్య అచ్చయ్య, డాక్టర్‌ బాలకృష్ణారెడ్డి, డాక్టర్‌ వరప్రసాద్‌ బ్రాంచీల వారీగా ఆయా సబ్జెక్టుల్లో పట్టు ఉండాల్సిన అధ్యాయాలను సూచిస్తున్నారు. అభ్యర్థులు తమ స్పష్టత కోసం ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు.

సీఎస్‌ఈ

గణితం: లీనియర్‌ ఆల్జీబ్రా

* బూలియన్‌ ఆల్జీబ్రా

* పర్మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌.

ఇప్పుడు బిగ్‌డేటాకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌పై ఆసక్తి, పట్టు అవసరం.

భౌతికశాస్త్రం: ఎలక్ట్రిసిటీ అండ్‌ మాగ్నటిజమ్‌

* సెమీ కండక్టర్స్‌ ఎలక్ట్రానిక్స్‌

రసాయనశాస్త్రం: కెమిస్ట్రీ ఇన్‌ ఎవ్రీడే లైఫ్‌

* అటామిక్‌ స్ట్రక్చర్‌

* సాలిడ్‌ స్టేట్‌

ఈసీఈ

గణితం: వెక్టర్‌ ఆల్జీబ్రా

* కాల్‌క్యులస్‌

* ట్రిగనామెట్రీ

* ప్రాబబిలిటీ

* ర్యాండమ్‌ వేరియబుల్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌

* కాంప్లెక్స్‌ నంబర్స్‌

* లీనియర్‌ పోగ్రామింగ్‌

భౌతికశాస్త్రం: ఎలక్ట్రిక్‌ ఛార్జెస్‌ అండ్‌ ఫీల్డ్స్‌
* ఎలక్ట్రో స్టాటిక్‌ పొటెన్షియల్‌ అండ్‌ కెపాసిటెన్స్‌
* ఎలక్ట్రో మాగ్నటిక్‌ మూవింగ్‌ ఛార్జెస్‌ అండ్‌ మాగ్నటిజమ్‌
* మాగ్నటిజమ్‌ అండ్‌ మ్యాటర్‌
* ఇండక్షన్‌
* ఎలక్ట్రో మాగ్నటిక్‌ వేవ్స్‌
* సెమీ కండక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌
* కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌
* మోడ్రన్‌ ఫిజిక్స్‌
* రే ఆప్టిక్స్‌ అండ్‌ ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌
* వేవ్‌ ఆప్టిక్స్‌

రసాయనశాస్త్రం: కెమిస్ట్రీ ఇన్‌ ఎవ్రీ డే లైఫ్‌
* అటామిక్‌ స్ట్రక్చర్‌
* సాలిడ్‌ స్టేట్‌

ఈఈఈ

గణితం: వెక్టర్‌ ఆల్జీబ్రా
* కాల్‌క్యులస్‌
* ర్యాండమ్‌ వేరియబుల్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌
* కాంప్లెక్స్‌ నంబర్స్‌
* కోఆర్డినేట్‌ జామెట్రీ
* లోకస్‌

భౌతికశాస్త్రం: ఎలక్ట్రిక్‌ ఛార్జెస్‌ అండ్‌ ఫీల్డ్స్‌
* ఎలక్ట్రో స్టాటిక్‌ పొటెన్షియల్‌ అండ్‌ కెపాసిటెన్స్‌
* కరెంట్‌ ఎలక్ట్రిసిటీ
* మూవింగ్‌ ఛార్జెస్‌ అండ్‌ మాగ్నటిజమ్‌
* మాగ్నటిజమ్‌ అండ్‌ మ్యాటర్‌
* ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఇండక్షన్‌
* ఆల్టర్నేటివ్‌ కరెంట్‌
* ఎలక్ట్రో మాగ్నటిక్‌ వేవ్స్‌

రసాయనశాస్త్రం: ఎలక్ట్రో కెమిస్ట్రీ

మెకానికల్‌

గణితం: వెక్టర్‌ ఆల్జీబ్రా
* కాల్‌క్యులస్‌
* ట్రిగనామెట్రీ
* ప్రాబబిలిటీ
* ర్యాండమ్‌ వేరియబుల్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌
* కాంప్లెక్స్‌ నంబర్స్‌
* లీనియర్‌ ప్రోగ్రామింగ్‌

భౌతికశాస్త్రం: కైనెటిక్‌ థియరీ
* థర్మోడైనమిక్స్‌
* మెకానిక్స్‌
* థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మ్యాటర్స్‌
* మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సాలిడ్స్‌
* మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌

రసాయనశాస్త్రం: స్టాయికియోమెట్రీ
* థర్మో డైనమిక్స్‌
* జనరల్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ మెటలర్జీ

సివిల్‌

గణితం: వెక్టర్‌ ఆల్జీబ్రా
* కాలుక్యులస్‌
* కోఆర్డినేట్‌ జామెట్రీ
* ర్యాండమ్‌ వేరియబుల్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్‌

భౌతికశాస్త్రం: థర్మో డైనమిక్స్‌
* స్టాటిక్స్‌
* మెకానిక్స్‌
రసాయనశాస్త్రం: థర్మో డైనమిక్స్‌
* కెమికల్‌ కైనెటిక్స్‌
* ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ

ఫార్మసీ

గణితం: లీనియర్‌ ఆల్జీబ్రా
* డిఫరెన్షియల్‌ కాల్‌క్యులస్‌
* ఇంటిగ్రల్‌ కాల్‌క్యులస్‌
* ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్‌

భౌతికశాస్త్రం: ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌
* ప్రాపర్టీస్‌ ఆఫ్‌ లిక్విడ్స్‌
* హీట్‌ ట్రాన్స్‌ఫర్‌

రసాయన శాస్త్రం: కెమిస్ట్రీ ఇన్‌ ఎవ్రీడే లైఫ్‌
* అటామిక్‌ స్ట్రక్చర్‌
* సాలిడ్‌ స్టేట్‌
* సొల్యూషన్స్‌
* ఆర్గానిక్‌ కెమిస్ట్రీ

బయాలజీ: బాడీ ఫ్లూయిడ్స్‌ అండ్‌ సర్క్యులేషన్‌
* సెల్‌ స్ట్రక్చర్‌ అండ్‌ ఫంక్షన్‌
* మైక్రో బయాలజీ
* రెస్పిరేటరీ సిస్టమ్‌

ఎక్కడైనా కొనసాగింపే..

ఏ కోర్సులోనైనా సిలబస్‌ రూపకల్పన చేసేటప్పుడు కింది తరగతిలో ఏయే పాఠ్యాంశాలు ఉన్నాయో నిపుణులు పరిశీలిస్తారు. ఇంటర్‌ పాఠాలు పదో తరగతికీ¨, బీటెక్‌ పాఠ్యాంశాలు ఇంటర్‌కూ కొనసాగింపుగానే ఉంటాయి. కింది తరగతుల్లో ఏమీ చెప్పకుండా పైతరగతిలో కొత్త పాఠ్యాంశాలను చేర్చరు. దీన్ని బట్టి బీటెక్‌లో చేరేవారికి ఇంటర్‌లో ఏ పాఠ్యాంశాలపై పట్టు ఉందో మననం చేసుకోవడం అవసరం. అదే సమయంలో బీటెక్‌లో ఏ బ్రాంచిలో ఏయే సబ్జెక్టులు, పాఠ్యాంశాలు చదవాల్సి ఉంటుందో తెలుసుకుంటే ఏ బ్రాంచి తీసుకోవాలనే విషయంపై చాలావరకు స్పష్టత వస్తుంది.
ఎంపీసీలో గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలకు సంబంధించిన సబ్జెక్టులే ఉన్నా.. అవి బీటెక్‌లో ఇంజినీరింగ్‌కు సంబంధించినవే అవుతాయి. కాకపోతే ఇంటర్‌లో నేర్చుకున్న దాన్ని బీటెక్‌లో వినియోగించి సమస్య పరిష్కరిస్తారు అంతే తేడా. అంటే ఇంజినీరింగ్‌లో అప్లికేషన్‌ ఓరియంటేషన్‌, ఎక్కువగా ప్రయోగాలు, ఆచరణకు ప్రాధాన్యం ఉంటాయి. ఇంటర్‌లో బట్టీ కొట్టినా మార్కులు వస్తాయి. ఇంజినీరింగ్‌లో బట్టీ కొడితే కొంతవరకు మార్కులు తెచ్చుకోవచ్చుగానీ....జీవితంలో స్థిరపడేందుకు ఉద్యోగం దొరకడం కష్టం. అంటే సమస్యలకు పరిష్కారం చూపే నైపుణ్యాలు ఇక్కడ అత్యంత ముఖ్యం. ఇంటర్‌ తరహాలో స్పూన్‌ ఫీడింగ్‌ ఉండదు. సొంతంగా చదువుకోవడం...అర్థం చేసుకోగల సామర్థ్యం అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంటర్‌లోని మూడు ప్రధాన సబ్జెక్టులపై పునాదులు గట్టిగా ఉంటే ఇంజినీరింగ్‌లో బాగా రాణింవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

‌* ఊహాశక్తి ఎక్కువున్నవారికి సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ బ్రాంచీలు బాగుంటాయి.

* ఈఈఈకి గణితంపై ఆసక్తి, పట్టు చాలా ముఖ్యం.

* గణితంపై పట్టు ఉంటే సీఎస్‌ఈ సులభమవుతుంది.

* సీఎస్‌ఈ, ఈసీఈల మధ్య 25 శాతం సిలబస్‌ తేడా ఉంటుంది. ఈసీఈ, ఈఈఈల మధ్య 30-40 శాతం వ్యత్యాసం ఉంటుంది.

ఒకసారి చేరితే అంతే..!

ఏ బ్రాంచిని ఎంచుకోవాలన్నదానిపై ముందుగానే ఓ నిర్ణయానికి రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఒక ఏడాది గడవగానే ఆసక్తి లేకుంటే మరో బ్రాంచిలోకి మారవచ్చు. కానీ ఇక్కడ అసాధ్యం. బీటెక్‌ మొదటి ఏడాది పూర్తయిన తర్వాత రెండో ఏడాదిలో కళాశాల మారవచ్చుగానీ....బ్రాంచి మార్చుకోవడానికి వీలులేదు. ఒకసారి చేరితే నాలుగేళ్లు ఇష్టం ఉన్నా లేకున్నా అదే బ్రాంచి చదవాల్సిందే. కళాశాలతో నాలుగేళ్ల బంధమే ఉంటుంది. అదే బ్రాంచి విషయానికి వస్తే చదువు పూర్తయిన తర్వాత జీవితాంతం దాని చుట్టూనే కెరియర్‌ను వృద్ధి చేసుకోవాల్సివుంటుంది. అందుకే బ్రాంచిపై స్పష్టత అత్యంత ప్రధానం. 

- పెమ్మసాని బాపనయ్య, ఈనాడు, హైదరాబాద్‌

Posted Date : 17-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌