• facebook
  • whatsapp
  • telegram

తరగని అవకాశాల.. సివిల్‌

వైవిధ్యమున్న ఇంజినీరింగ్‌ శాఖల్లో సివిల్‌ మొదటిది. కట్టడాలు, నిర్మాణాల గురించే కాకుండా పర్యావరణంపై వివిధ నిర్మాణాల ప్రభావం గురించి కూడా ఇందులో చదువుకుంటారు. గృహాల నుంచి అపార్ట్‌మెంట్ల వరకూ; వంతెనలూ కాలువల నుంచి భారీ నీటి ప్రాజెక్టులూ; రైల్వే రహదారులు, సొరంగ మార్గాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ ఈ శాఖ ప్రధాన బాధ్యత.

దేశానికి కావాల్సిన జీవన, రవాణా, మౌలిక వసతుల అమరిక సివిల్‌ ఇంజినీర్ల కర్తవ్యం. ఈ రంగంలో పని చేసేవారు నిత్యం సవాళ్లను ఎదుర్కుంటూనే ఉంటారు. ఈ వృత్తిలో ఎక్కువ భాగం జనం మధ్య కాకుండా వారికి దూరంగా, కొన్నిసార్లు నిర్జన ప్రదేశాల్లో, గనుల్లో, కీకారణ్యాల్లో కూడా పనిచేయవలసి రావచ్చు.

జనావాస యోగ్యమైన కట్టడాల అభివృద్ధి, సమర్థ జలవనరుల వినియోగ రూపకల్పన, రవాణా వ్యవస్థ రూపకల్పన వంటి రంగాల్లో తమ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటూ సమాజానికి కూడా తమ వంతు సేవలందించాలనుకునేవారికి ఈ రంగం స్వాగతం పలుకుతుంది.
ఇంటర్‌ స్థాయి చదువు కనీస విద్యార్హత. భౌతికశాస్త్రంలోని స్థితి, గతి, యాంత్రిక శాస్త్రాలపై మంచి అవగాహన చాలా అవసరం. గణిత శాస్త్రంలోని సంకలనం, వ్యవకలనం, పాక్షిక వ్యవకలనం వంటి ఇంజినీరింగ్‌ రంగంలో అవసరమయ్యే పాఠ్యాంశాల్లో మంచి పట్టు ఉండాలి. విద్యాపరమైన ఈ కనీస అర్హతలతోపాటు ఈ కింది లక్షణాలు కూడా పెంచుకోవాలి.

1. సివిల్‌ ఇంజినీర్ల ప్రధాన బాధ్యతలేమిటో తెలుసుకోవాలి. ప్రజా ఉపయోగకరమైన ప్రాజెక్టులపై పనిచేయవలసి ఉంటుంది. కొన్నిసార్లు కార్యాలయంలో, మరికొన్నిసార్లు ప్రాజెక్టుల ప్రదేశాల్లో పనిచేయవలసి ఉంటుంది. ఇంకొన్నిసార్లు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో జనసమూహానికి దూరంగా కూడా పనిచేయవలసిన పరిస్థితులు ఎదురవవచ్చు. వీటన్నింటినీ తట్టుకోగలిగిన ఆత్మబలం కావాలి.

2. గణిత, భౌతికశాస్త్రాలపై పట్టు సివిల్‌ ఇంజినీర్ల వజ్రాయుధం. దీనికి తోడు తార్కికంగా ఆలోచించగలగడం, సమయానుకూలంగా స్పందించడం వంటి మెలకువలు అవసరం. మానసిక దృఢత్వం, సృజనాత్మకత అవసరమవుతాయి. చాలా సందర్భాల్లో నిరక్షరాస్యుల నుంచి నిపుణుల వరకూ చర్చలు, సంప్రదింపులు ఉంటాయి. కాబట్టి స్పష్టమైన భావవ్యక్తీకరణ ముఖ్యం.

3. భూగర్భ, భూగోళశాస్త్రాల్లో ప్రవేశం ఉండాలి. ఒక ప్రదేశంలోని నేల ఎటువంటి కట్టడాలకు అనుకూలమనే విషయ నిర్ణయం ఈ సబ్జెక్టుల పరిజ్ఞానం మీద ఆధారపడుతుంది.

4. ఈ రంగంలోని వృత్తిపరమైన సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాలి. ఈ సంఘాలు తరచూ నిర్వహించే సెమినార్లు, వర్క్‌షాపుల్లో పాల్గొనాలి. దీని వల్ల సబ్జెక్టుపరంగా మంచి పట్టు సాధించడమే కాకుండా అంతర మానవ సంబంధాలు మెరుగుపరచుకునే అవకాశం లభిస్తుంది.

5. సాధారణంగా సివిల్‌ రంగంలో ప్రాజెక్టులు భారీ వ్యయంతో కూడుకున్నవిగా ఉంటాయి. అందువల్ల సివిల్‌ ఇంజినీర్లకు ఆర్థికపరమైన విషయాల పట్లా, ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించిన విషయాల పట్లా సమగ్ర అవగాహన అవసరం.

ఉద్యోగావకాశాలు

సివిల్‌ ఇంజినీరింగ్‌ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి అవకాశాలున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యం, దానిపై సివిల్‌ కట్టడాల కాంక్రీట్‌ వంటి వ్యర్థ పదార్థాల ప్రభావంపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ రంగం విప్లవాత్మక మార్పులకూ, అభివృద్ధికీ నిలయం కానున్నది. హరిత గృహ నిర్మాణం, సమర్థంగా నీటివనరుల వినియోగం, ప్రాకృతిక విపత్తు నివారణ, నిర్వహణ వంటి సవాళ్లకు సమాధానాలు కనుక్కునే బాధ్యత వీరిపై ఉంది.

యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, సీపీడబ్ల్యూడీ ద్వారా వీరికి ఉద్యోగావకాశాలు ఎక్కువే. ప్రైవేటురంగంలో పెద్ద పెద్ద సంస్థలు నిర్మాణ రంగంలో ఉన్నందున ప్రతిభ ఉన్న సివిల్‌ ఇంజినీర్లకు డీఎల్‌ఎఫ్‌, ఐవీఆర్‌సీఎల్‌, బజాజ్‌, ఎల్‌ అండ్‌ టీ, నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు సాదరాహ్వానం పలుకుతున్నాయి. దీనికి తోడు మంచి అనుభవం, నైపుణ్యం సంపాదిస్తే అధీకృత ఇంజినీర్లుగా వీరు తమ సేవలను అందించవచ్చు

ఉన్నత విద్యావకాశాలకు వస్తే- పర్యావరణ నిర్వహణ, నీటి వనరుల నిర్వహణ, రవాణా వ్యవస్థ నిర్వహణ వంటి కోర్సులే కాకుండా ఇంకా కొన్ని కొత్తవి కూడా ప్రవేశపెట్టారు. ఎన్నడూ తరగని అవకాశాలున్న రంగమిది

Posted Date : 22-10-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌