• facebook
  • whatsapp
  • telegram

స్కోరు.. జోరు!

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ముఖ్యమైన పరీక్ష... ఎంసెట్‌! గతంలో ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరిగేది. ఏపీలో గత సంవత్సరం నుంచీ, తెలంగాణాలో ఈ సంవత్సరం నుంచీ దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఎంపీసీ వారికి గణితం, బైపీసీ వారికి జీవశాస్త్రం కీలకం. పరీక్షలు దగ్గరపడ్డ ఈ ముఖ్యమైన తరుణంలో వాటిలో స్కోరు పెంచుకునే సూచనలు ఇవిగో!

గణితంలో ఘనంగా!
జాతీయ ప్రవేశపరీక్షల్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. కానీ ఎంసెట్‌లో మ్యాథ్స్‌కు 50 శాతం ప్రాధాన్యం! అందుకే దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
మొత్తం 160 ప్రశ్నలలో గణితం నుంచి 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంటర్మీడియట్‌ మొదటి, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు సమాన ప్రాధాన్యం ఉంటుంది. అధిక మార్కులు తెచ్చుకోవాలంటే వేగం, కచ్చితత్వాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే! మొత్తం 3 గంటల పరీక్షలో గణితానికి గంటా 15 నిమిషాల నుంచి గంటా 30 నిమిషాల వరకు కేటాయించటం మంచిది.
మొదటి సంవత్సరం సిలబస్‌కు 7 రోజులు, రెండో సంవత్సరం సిలబస్‌కు 7 రోజులు కేటాయించాలి. తక్కువ వ్యవధిలో మొత్తం సిలబస్‌ పునశ్చరణ (రివిజన్‌) సాధ్యం కాదు. కాబట్టి ప్రతి అధ్యాయంలోని కాన్సెప్టులూ, ఫార్ములాలూ స్టాండర్డ్‌ రిజల్ట్స్‌ను బాగా నేర్చుకోవాలి. వాటిని ఉపయోగించి కొన్ని ముఖ్య సమస్యలను సాధించాలి. మొత్తం సిలబస్‌ రివిజన్‌ చేసిన తరువాత కనీసం 6 మోడల్‌ గ్రాండ్‌ టెస్టులను సాధన చేయాలి. వీలైతే గ్రాండ్‌ టెస్టులను ఆన్‌లైన్లో అభ్యాసం చేస్తే తుది పరీక్షకు ఉపయోగం!
 

ప్రశ్నల స్థాయి
గణితంలో వచ్చే 80 ప్రశ్నలు అన్నీ తెలుగు అకాడమీ సిలబస్‌ నుంచి మాత్రమే ఇస్తారు. ఈ 80 ప్రశ్నల్లో 30- 35 ప్రశ్నలు చాలా సులభంగా, సింపుల్‌ కాల్‌క్యులేషన్స్‌తో సాధించగలిగేవే. ఇంకొక 30 ప్రశ్నలు మధ్యస్థంగా ఉంటాయి. 15- 20 ప్రశ్నలు మాత్రమే కొంచెం కఠినంగా, ఎక్కువ సమయం తీసుకొనేలా ఉంటాయి. ప్రతి విద్యార్థీ ముందుగా సులభమైన ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. కఠినంగా ఉండే ప్రశ్నలు చివరలో మాత్రమే ప్రయత్నించాలి. ఎంసెట్‌లో నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు కాబట్టి చివరలో మిగిలిన అన్ని ప్రశ్నలకూ ఏదో ఒక జవాబును గుర్తించాలి. వాటిలో కొన్ని అయినా సరైనవై, మార్కులు పెరుగుతాయి.
సమస్యలను వేగంగా సాధించాలంటే ఫార్ములాలు చాలా కీలకం. ప్రతి అధ్యాయంలో ఉన్న ఫార్ములాలను, విలువలను, స్టాండర్డ్‌ రిజల్ట్స్‌ను ఎక్కువగా సాధన చేయాలి.
త్రికోణమితిలో ఫార్ములాలే ముఖ్యం
త్రికోణమితి (ట్రిగొనామెట్రీ) అధ్యాయంలో ఎక్కువ సూత్రాలు, విలువలు ఉంటాయి. వాటిమీద ఆధారపడే ప్రాబ్లమ్స్‌ ఎన్నో. అందుకే దీనిలో అభ్యాసం అవసరం ఎక్కువ. వివిధ అధ్యాయాల నుంచి కనీసం 10- 12 ప్రశ్నలు వస్తాయి. ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ట్రయాంగిల్‌ (త్రిభుజ ధర్మాలు), పరివర్తనల వరకు అధ్యాయాలలో ఉన్న సూత్రాలన్నింటినీ బాగా నేర్చుకోవాలి. వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్‌కు జవాబులను ప్రతిక్షేపణ పద్ధతిలో కూడా గుర్తించవచ్చు.
 

బీజగణితంలో కాన్సెప్టుల ప్రాధాన్యం
ఆల్జీబ్రా (బీజగణితం)లో ఫంక్షన్స్‌ (ప్రమేయాలు), క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ (వర్గ సమీకరణాలు), మ్యాట్రిసెస్‌ (మాత్రికలు), పర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌ (ప్రస్తారాలు, సంయోగాలు), ప్రాబబిలిటీ (సంభావ్యత), కాంప్లెక్స్‌ నంబర్స్‌ (సంకీర్ణ సంఖ్యలు) ముఖ్యమైన అధ్యాయాలు. వీటిలో ఫార్ములాలు చాలా తక్కువ. కాన్సెప్టులను క్షుణ్ణంగా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్‌ను సులభంగా సాధించవచ్చు. మొదటి, రెండు సంవత్సరాల ఆల్జీబ్రా నుంచి సుమారుగా 20 ప్రశ్నలు వస్తాయి.
డయాగ్రమ్స్‌తో జామెట్రీని జయించవచ్చు
కాన్సెప్టులూ, ఫార్ములాలూ బాగా నేర్చుకుంటే జామెట్రీ ప్రాబ్లమ్స్‌ను తేలిగ్గా సాధించవచ్చు. 2డీ, జామెట్రీలో స్ట్రెయిట్‌ లైన్స్‌ (సరళ రేఖలు), పెయిర్‌ ఆఫ్‌ లైన్స్‌ (సరళ రేఖాయుగ్మాలు), సర్కిల్స్‌, సిస్టమ్‌ ఆఫ్‌ సర్కిల్స్‌ (వృత్తాలు, వృత్త సరణి), కోనిక్‌ సెక్షన్స్‌ ప్రధానమైనవి. ఈ అధ్యాయాలలో కూడా ఫార్ములాలు, స్టాండర్డ్‌ రిజల్ట్స్‌ ఎక్కువగా ఉంటాయి.
జామెట్రీ ప్రాబ్లమ్స్‌లో ముఖ్యంగా సమస్యను అర్థం చేసుకుని డయాగ్రమ్‌ గీసి, సులభంగా సాధించవచ్చు. వివిధ రకాల డయాగ్రమ్స్‌ బాగా సాధన చేయాలి. 3డీ జామెట్రీలో డీసీస్‌, డీఆర్‌స్‌ (దిక్‌ కోసైన్‌లు, దిక్‌ నిష్పత్తులు), ప్లేన్స్‌ (తలాలు) ముఖ్యమైన అధ్యాయాలు. 3డీ జామెట్రీలో కొంత సులభమైన ప్రాబ్లమ్స్‌ ఎక్కువ. జామెట్రీ నుంచి సుమారుగా 20 ప్రశ్నలు వస్తాయి.
 

కాల్‌క్యులస్‌లో అప్లికేషన్స్‌
ఒకటో, రెండో సంవత్సరాల నుంచి 20- 25 ప్రశ్నలు వస్తాయి. లిమిట్స్‌ (అవధులు), డెరివేటివ్స్‌ (అవకలనం), ఎరర్స్‌ (దోషాలు), టాంజెంట్‌ నార్మల్స్‌ (స్పర్శరేఖలు, అభిలంబ రేఖలు), డిఫరెన్షియల్‌ ఈక్వేషన్‌ (అవకలన సమీకరణాలు) మొదలైన అధ్యాయాల నుంచి కొంత సులభమైన ప్రశ్నలు వస్తాయి.
మ్యాగ్జిమా మినిమా (గరిష్ఠ కనిష్ఠ విలువలు), ఇంటిగ్రేషన్‌ డెఫినిట్‌ ఇంటిగ్రేషన్‌ (సమీకలనం, నిశ్చిత సమీకలనం), ఏరియాస్‌ ( (వైశాల్యాలు) మొదలైన అధ్యాయాల నుంచి కొంతమేర కఠిన ప్రశ్నలు వస్తాయి. ఈ అధ్యాయాలలో కూడా ఫార్ములాలు, స్టాండర్డ్‌ రిజల్ట్స్‌ ఎక్కువ. అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌ ప్రాబ్లమ్స్‌ అధికం.
చివరగా వెక్టార్‌ ఆల్జీబ్రా (సదిశా బీజగణితం) అధ్యాయం నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ఇవి కొంతమేర సులభంగానే ఉంటాయి.


 

బయాలజీలో భళా!
ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులు థియరీ, ప్రాక్టికల్‌ పరీక్షలను ముగించుకుని ప్రవేశపరీక్షలకు సిద్ధమవుతున్నారు. మెడికల్‌ కోర్సుల్లో చేరటానికి మూడు ప్రధానమైన జాతీయ స్థాయి పరీక్షలు రాస్తుంటారు. అవి నీట్‌-2018, ఎయిమ్స్‌, జిప్‌మర్‌. ఈ మెడికల్‌ ప్రవేశపరీక్షలు కాకుండా తెలుగు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో బీఎస్‌సీ అగ్రికల్చర్‌, బి.ఎస్‌.సి. హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌ కోర్సుల్లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌, బి.ఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ ఎంసెట్‌, టీఎస్‌ ఎంసెట్‌లను రాస్తున్నారు.
ఈ ప్రవేశపరీక్షలు రెండిటినీ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షల్లో విద్యార్థులకు ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ అవన్నీ ఒకే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ విద్యార్థీ నష్టపోకుండా ఉండేలా నార్మలైజేషన్‌ విధానాన్ని అవలంబిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది కాబట్టి విద్యార్థులు కనీసం 3, 4 పరీక్షలు ఆన్‌లైన్‌లో రాసి ఆ పద్ధతిని అలవాటు చేసుకుంటే మంచిది.
ఈ మాక్‌ టెస్టులు sche.ap.gov.in/EAMCET,eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి.
కాగితం, కలం ఆధారంగా పార్ట్‌ టెస్ట్‌లు, కొన్ని గ్రాండ్‌ టెస్ట్‌లను రాసి, వాటిలో సమయాన్ని, కచ్చితత్వాన్ని అలవాటు చేసుకుని, చివర్లో మాక్‌ టెస్టులు రాస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌ పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల సూచనలను పర్యవేక్షకులు ఇస్తారు. దాని గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు.
 

వివాదాస్పద ప్రశ్నలు వస్తే?
ఎంసెట్‌ మెడికల్‌ విభాగంలో 160 మార్కులకుగానూ వృక్ష, జంతు శాస్త్రాల నుంచీ, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచీ 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షలో రుణాత్మక మార్కుల పద్ధతి లేదని గుర్తుపెట్టుకోవాలి. కష్టతరమైన ప్రశ్నలకు కూడా ఎలిమినేషన్‌ పద్ధతి ఉపయోగించి సమాధానాలు గుర్తించాలి.
ఆన్‌లైన్‌ పద్ధతిలో ఎన్ని ప్రశ్నలను ఆన్సర్‌ చేశాను, సమయం, ఎన్ని ప్రశ్నలు మిగిలున్నాయి అనేది చాలా తేలిగ్గా తెలుసుకొని ఆ ప్రశ్నల వద్దకు వెళ్ళే అవకాశం ఉంది.
వివాదాస్పదమైన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. బయాలజీలో కొన్ని ప్రశ్నలు వివాదాస్పదంగా అనిపిస్తే తెలుగు అకాడమీ పుస్తకాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. బయాలజీలో 80 మార్కులకుగానూ 75, రసాయనశాస్త్రంలో 40 మార్కులకుగానూ 30, భౌతికశాస్త్రంలో 40 మార్కులకుగానూ 25 మార్కులు సాధిస్తే అగ్రికల్చర్‌ విభాగంలో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది.
 

సగ కాలం జీవశాస్త్రానికే!
* ప్రతిరోజూ చదివే సమయంలో సగం కాలాన్ని బయాలజీకి కేటాయించాలి. మిగిలిన సగం కాలాన్ని భౌతిక, రసాయనశాస్త్రాల పునశ్చరణకు వినియోగించాలి.
* ప్రతి అధ్యాయం పునశ్చరణ చేస్తున్నపుడు దానిలోని కీలక అంశాలను ఒక కాగితంపై రాసుకుంటూ వాటిని చివరి సమయంలో ఒకసారి చూసుకోవాలి.
* ఆహారం, నిద్ర విషయాల్లో కావలసిన జాగ్రత్తలు పాటించాలి.
* పరీక్ష తేదీకి 10 రోజుల ముందు వరకు అన్ని సబ్జెక్టుల్లో పునశ్చరణ పూర్తిచేసి గ్రాండ్‌ టెస్ట్‌లను వీలైనన్ని ఎక్కువగా రాయడానికి ప్రయత్నించాలి.
* ప్రతి నమూనా పరీక్ష రాసిన తర్వాత, తెలిసిన ప్రశ్నలు ఎన్నింటికి తప్పు సమాధానాలు గుర్తించారో గమనించాలి. వీటిని పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.
* తెలియని ప్రశ్నలు కూడా నేర్చుకొని, దానికి సంబంధించిన కాన్సెప్టులను రివైజ్‌ చేసుకోవాలి.
* భౌతిక, రసాయనశాస్త్రాల్లో కూడా ఎక్కువ సమయాన్ని థియరీ బేస్డ్‌ కంటెంట్‌ చదవడానికి కేటాయించండి.
* వివిధ రకాల ప్రశ్నలను అభ్యాసం చేయాలి.
 

పార్ట్‌ టెస్టులూ.. గ్రాండ్‌ టెస్టులూ
* తెలుగు అకాడమీ పుస్తకాల్లోని కంటెంట్‌ను ఒక క్రమపద్ధతిలో చదివి, దానిలోని ముఖ్యాంశాలను ఒక పేపర్‌పై రాసుకొని, పునశ్చరణ చేయాలి.
* సంఖ్యాపరమైన ప్రశ్నలు వచ్చే అధ్యాయాల్లో వాటి కాన్సెప్టులను ఒక ఫ్లో చార్టుగా వేసుకొని గుర్తుపెట్టుకోవాలి.
* తెలుగు అకాడమీ ప్రశ్నల నిధిలోని కంపారిటివ్‌ చార్టులను చదవండి.
* జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశాలను పరీక్షకు రెండు రోజుల ముందు చూసుకోండి.
* పది రోజుల వరకు పార్ట్‌టెస్ట్‌లు పూర్తిగా చూసుకొని కనీసం 9 గ్రాండ్‌ టెస్ట్‌లు రాయండి. వీటిలో 3-4 గ్రాండ్‌టెస్ట్‌లు ఆన్‌లైన్‌ పద్ధతిలో రాయండి.
* ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపుకొని క్రమపద్ధతిలో చదివి, పునశ్చరణ చేసుకోండి.
* ఆన్‌లైన్‌ పద్ధతిలోని సూచనలను ముందే చదివిపెట్టుకోండి.
* బయాలజీలోని ప్రశ్నలను ముందుగా ఆన్సర్‌ చేసి, రసాయన శాస్త్రంలోని ప్రశ్నల తర్వాత భౌతికశాస్త్రంలోని ప్రశ్నలను చేయండి.
 

130పైన వస్తే మేలు
ఎంసెట్‌ బైపీసీ విభాగంలో 80 వేల నుంచి 90 వేలమంది విద్యార్థులు పోటీపడవచ్చు. ప్రభుత్వ అగ్రికల్చర్‌ కళాశాలల్లో సీటు సంపాదించడానికి 130 పైన మార్కులు వస్తే మంచిది. తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్‌ కోర్సుతోపాటు ఫారెస్ట్రీ, ఫిషరీస్‌, పుడ్‌టెక్నాలజీ అనేవి అధిక గిరాకీ ఉన్న కోర్సులు.
గత 4 సంవత్సరాల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బయాలజీలో ముఖ్యంగా వృక్షశాస్త్రంలోని 40 ప్రశ్నల్లో దాదాపు 20 ప్రశ్నలు ఎక్కువ నిడివి తీసుకొనే ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమయం కేటాయించి జాగ్రత్తగా పరిశీలించి వాటిలోని నిగూఢమైన క్లూ ఆధారంగా జవాబు పెట్టాలి.
మెడికల్‌, అగ్రికల్చర్‌లకు సంబంధించి నీట్‌లో గానీ, ఎంసెట్‌లో కానీ అత్యధిక స్కోరు రావడానికి బయాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. బయాలజీలో 75, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలంటే తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలతోపాటు, తెలుగు అకాడమీ ముద్రించిన ఎంసెట్‌ క్వశ్చన్‌ బ్యాంకు (ప్రశ్నల నిధిని) తప్పకుండా చదవండి. వీటిలో ఎక్కువ ప్రశ్నలు, అన్ని రకాల ప్రశ్నలు చేర్చారు.
 

వృక్ష శాస్త్రం
మొదటి సంవత్సరంలోని యూనిట్‌-1 జీవ ప్రపంచంలో వైవిధ్యంలో 4 అధ్యాయాలున్నాయి. ఇవన్నీ ప్రధానంగా జ్ఞాపకశక్తి ఆధారిత అంశాలు. వీటినుంచి 5 ప్రశ్నలు రావచ్చు. వృక్షరాజ్యం, జీవ వర్గీకరణ చాప్టర్‌లను ఎక్కువసార్లు పునశ్చరణ చేసుకొని, ఉదాహరణలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.
యూనిట్‌-2 మొక్కల నిర్మాణాత్మక సంవిధానం- దీనిలో మొక్కల స్వరూపశాస్త్రం నుంచి 3 ప్రశ్నలు రావచ్చు. దీనిలో వచ్చే ఉదాహరణలు, మొక్కలకు సంబంధించిన లక్షణాలను మిగతా చాప్టర్‌లలోని విషయాలతో జోడించి గుర్తుంచుకోవాలి.
యూనిట్‌-3 ప్రత్యుత్పత్తిలో రెండు అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయం నుంచి జ్ఞానపశక్తికి సంబంధించి ఒక ప్రశ్న, రెండో అధ్యాయం నుంచి సంఖ్యా సంబంధ, విశ్లేషణాత్మక ప్రశ్నలు రెండు రావచ్చు.
యూనిట్‌-4 మొక్కల వర్గీకరణ శాస్త్రం నుంచి 2 ప్రశ్నలు వచ్చే వీలుంది. ఇవి కూడా కంపారిటివ్‌ స్టడీగా చదివితే గుర్తుంచుకోవడం సులువు.
యూనిట్‌-5లో 3 అధ్యాయాలున్నాయి. వీటిలో జీవఅణువులు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ మొత్తం యూనిట్‌ నుంచి 5 ప్రశ్నలు రావచ్చు. కణ విభజన నుంచి ప్రతి దశలో జరిగే మార్పులను బాగా గుర్తుంచుకోవాలి.
యూనిట్‌-6లో మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం నుంచి 2 ప్రశ్నలు వచ్చే వీలుంది. ఈ యూనిట్‌లో వివిధ రకాల కణజాలాలు, వాటి లక్షణాలు, విధులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంతర్నిర్మాణాలు పోలుస్తూ చదవండి. ప్రధాన అంశాలను గుర్తుంచుకోండి.
యూనిట్‌-7 వృక్ష ఆవరణశాస్త్రం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. జతపరచడం లేదా జ్ఞాపకశక్తికి సంబంధించినవిగా ఉంటాయి.
రెండో సంవత్సరం సిలబస్‌లో మొత్తం ఆరు యూనిట్లు, 14 అధ్యాయాలున్నాయి. వీటిలో ప్రధానమైనది వృక్ష శరీరధర్మశాస్త్రం. రెండో సంవత్సరంలో సంఖ్యాపరమైన ప్రశ్నలు వచ్చే వీలున్న అధ్యాయాలు 4, 5, 9, 10, 11.
యూనిట్‌-1 నుంచి 8 ప్రశ్నలు, యూనిట్‌-2 నుంచి 2 ప్రశ్నలు, యూనిట్‌-3 నుంచి 2 ప్రశ్నలు, యూనిట్‌-4 నుంచి 2 ప్రశ్నలు, యూనిట్‌-5 నుంచి 3 ప్రశ్నలు, యూనిట్‌-6 నుంచి 3 లేదా 4 ప్రశ్నలు వచ్చే వీలుంది.
 

జంతుశాస్త్రం
గత సంవత్సరాల ఎంసెట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జంతుశాస్త్రం నుంచి సులువైన ప్రశ్నలు వస్తున్నాయి. యూనిట్ల ఆధారంగా ఏవిధంగా ప్రశ్నలు వచ్చే వీలుందో పట్టిక చూడండి.
ప్రాబ్లమ్‌ సంబంధ ప్రశ్నలు వచ్చే అధ్యాయాలు:
1.జీవ పరిమాణం - హర్డీలీన్‌బర్గ్‌, సమతుల్యత నుంచి, 2.జన్యుశాస్త్రం - సెక్స్‌ లింకేజ్‌ నుంచి, బ్లడ్‌ గ్రూపులు, 3.ఆవరణశాస్త్రం - బర్త్‌ రేట్‌, డెత్‌ రేట్‌కు సంబంధించినవి.
ఎక్కువ శ్రద్ద చూపాల్సిన అధ్యాయాలు:
మొదటి సంవత్సరం నుంచి- అకశేరుక వర్గాలు, సకశేరుకాలు, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం, ఆవరణ శాస్త్రం. రెండో సంవత్సరం నుంచి- మానవశరీరధర్మశాస్త్రం, జన్యుశాస్త్రం
* జన్యుపరమైన వ్యాధులను పట్టిక రూపంలో తయారుచేసుకొని చదవాలి.
* గ్రోత్‌ ప్యాట్రన్‌ను జాగ్రత్తగా చూడాలి.
* మానవశరీరధర్మ శాస్త్రంలోని అయిదో అధ్యాయంపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.

Posted Date : 05-11-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 
 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌