• facebook
  • whatsapp
  • telegram

ర్యాంకుకు రహదారి!


రెండు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే ఎంసెట్‌లో బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల వారికీ ఉండే సబ్జెక్టులు భౌతిక, రసాయన శాస్త్రాలు (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ). పరీక్షలకు వ్యవధి తక్కువ ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ సబ్జెక్టుల్లో గరిష్ఠంగా మార్కులు తెచ్చుకోవటానికీ, తద్వారా మెరుగైన ర్యాంకును సాధించటానికీ ఉపకరించే మెలకువలు... ఇవిగో!

పూర్తి మార్కులు సాధ్యమే! (ఫిజిక్స్‌)
పోటీపరీక్షల్లో అధిక శాతం విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే సబ్జెక్టు భౌతికశాస్త్రం. అయితే... అవగాహన, నిర్దిష్ట ప్రణాళికతో తయారయ్యే విద్యార్థికి ఇదేమంత కష్టం కాదు. భౌతిక రసాయనశాస్త్రాల్లో ఎక్కువ శాతం క్లిష్టత భౌతికశాస్త్రానికే ఉంటుందని విద్యార్థులు భావిస్తుంటారు. కానీ అది అపోహే. గత ఏడాది కూడా భౌతికశాస్త్రంలో 40కి 40 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య రసాయన శాస్త్రంలో పూర్తి మార్కులు సాధించినవారికంటే ఎక్కువే.

ఎంసెట్‌కూ జాతీయస్థాయి పోటీపరీక్షలకూ ముఖ్య వ్యత్యాసం గమనించాలి. ఎంసెట్‌లో రెండేళ్ల సిలబస్‌లకూ సమంగా ప్రతి చాప్టర్‌కూ ప్రాధాన్యం ఉంటుంది. కానీ జాతీయస్థాయి పోటీపరీక్షల్లో ప్రథమ సంవత్సర సిలబస్‌ కంటే ద్వితీయ సంవత్సర సిలబస్‌... వాటిలోనూ కొన్ని చాప్టర్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ప్రశ్నపత్రాలు రూపొందిస్తున్నారు.

ఈ నెల 8న జరిగిన జేఈఈ మెయిన్స్‌లో భౌతికశాస్త్రంలో జూనియర్‌ ఇంటర్‌ నుంచి 45%, సీనియర్‌ ఇంటర్‌ నుంచి 55% ప్రశ్నలుండటాన్ని గమనించొచ్చు. ఒక్క ప్రశ్న కూడా రానివి 3 చాప్టర్లు (గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత ప్రేరణ, కాంతి) ఉన్నాయి. కానీ ఎంసెట్‌ విషయానికొస్తే కచ్చితంగా ప్రతి చాప్టర్‌ నుంచీ ప్రశ్న ఉండి తీరుతుంది.

 

ప్రశ్నల విభజన ఇలా..
ప్రథమ సంవత్సర చాప్టర్ల నుంచి.. యూనిట్స్‌, డైమెన్షన్స్‌ అండ్‌ ఎర్రర్స్‌-1, మోషన్‌ ఇన్‌ ఎ స్ట్రెయిట్‌ లైన్‌-1, మోషన్‌ ఇన్‌ ఎ ప్లేన్‌-1, లాస్‌ ఆఫ్‌ మోషన్‌-1, వర్క్‌, ఎనర్జీ, పవర్‌- 1 లేదా 2, ఫ్రిక్షన్‌-1, కొలిజియన్స్‌-1, రేషనల్‌ మోషన్‌-2 లేదా 3, గ్రావిటేషన్‌-1, ఆసిలేషన్స్‌ (ఎస్‌హెచ్‌ఎం)-1, మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సాలిడ్స్‌ (ఎలాస్టిసిటీ)-1, మెకానికల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌-2, థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మేటర్‌-2, థర్మోడైనమిక్స్‌-1 లేదా 2, కైనటిక్‌ థియరీ ఆఫ్‌ గ్యాసెస్‌-1 చొప్పున ప్రశ్నలు వచ్చే అవకాశముంది.

ద్వితీయ సంవత్సర సిలబస్‌ నుంచి కూడా 20 ప్రశ్నలు సమంగా విభజించే వస్తున్నాయి. వేవ్స్‌-1 లేదా 2, రే ఆప్టిక్స్‌ అండ్‌ ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌-1 లేదా 2, వేవ్‌ ఆప్టిక్స్‌-1, ఎలక్ట్రిక్‌ చాప్టర్‌ అండ్‌ ఫీల్డ్స్‌- 1 లేదా 2, ఎలక్ట్రో స్టాటిక్‌ పొటెన్షియల్‌ అండ్‌ కెపాసిటెన్స్‌-2, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ-2, మూవింగ్‌ చార్జెస్‌ అండ్‌ మ్యాగ్నటిజమ్‌-1, మ్యాగ్నటిజమ్‌ అండ్‌ మేటర్‌-1, ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ ఇండక్షన్‌-1, ఆల్టర్నేటింగ్‌ కరెంట్‌-1, ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ వేవ్స్‌-1, డ్యూయల్‌ నేచర్‌ ఆఫ్‌ రేడియేషన్‌ అండ్‌ మేటర్‌-1, ఆటమ్స్‌-1, న్యూక్లై-1, సెమీ కండక్టర్‌ ఎలక్ట్రానిక్స్‌-1, కమ్యూనికేషన్‌ సిస్టమ్‌-1 చొప్పున ప్రశ్నలుంటాయి.

ఎంసెట్‌ భౌతికశాస్త్రంలో కచ్చితంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌ నుంచి 20 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. వాటిలో కూడా అన్ని చాప్టర్ల నుంచి సమవిభజనలో ప్రశ్నలు ఉంటున్నాయి.

 

అనుసరించాల్సిన విధానమిది!
తక్కువ సమయం ఉంది. కాబట్టి, విద్యార్థి ఈ సమయంలో తెలియని అంశాలను కాకుండా తెలిసినవాటికే ప్రాధాన్యమివ్వాలి. వాటినే పునశ్చరణ చేసుకోవాలి. ఎంసెట్‌లో గంట వ్యవధిలో 40 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలంటే వేగం, కచ్చితత్వం మెరుగుపడాలి. అందుకు వీలైనన్ని ఎక్కువసార్లు పట్టున్న అంశాలను తిరిగి సాధన చేసుకుంటూ నమూనా పరీక్షలను రాయాలి.

నిడివి ఎక్కువ ఉన్న చాప్టర్లను కాకుండా తక్కువ సమయంలో పూర్తిచేయగల అభ్యాసాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించుకునే అవకాశముంటుంది. అంటే ప్రమాణాలు, మితులు (యూనిట్స్‌, డైమెన్షన్స్‌ అండ్‌ ఎర్రర్స్‌) నుంచి ఒక ప్రశ్న, సరళహరాత్మక చలనం (ఆసిలేషన్స్‌) నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. అయితే ప్రమాణాలు, మితులు ఒక సాధారణ విద్యార్థి కూడా చేయగల రీతిలో ఉంటాయి. సరళహరాత్మక చలనాన్ని విద్యార్థి తయారవ్వడానికి కనీసం 4-5 గంటలు పడుతుంది. సాధారణ విద్యార్థి దీనిలోని ప్రశ్నలకు జవాబులను గుర్తించడానికి బాగా ఇబ్బంది పడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మొదట ప్రాధాన్యమివ్వాల్సిన చాప్టర్లను గుర్తించి వాటికి ఎక్కువ సమయం కేటాయించడం మేలు.

ఎంసెట్‌ భౌతికశాస్త్రంలో కనీసం 4-5 ప్రశ్నలు అకాడమీ పుస్తకంలోని వాక్యాల ఆధారంగానే ఇస్తున్నారు. వాటికి కొన్ని చాప్టర్లను చదివితే సరిపోతుంది. వాటిలో కూడా ఉపయోగాలు లేదా అనువర్తనాల మీద ప్రశ్న ఇస్తున్నారు. సిద్ధాంతపరమైన ప్రశ్నలు ప్రథమ సంవత్సర సిలబస్‌లో ఉష్ణం (థర్మల్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ మేటర్‌) నుంచి మాత్రమే వస్తున్నాయి. ద్వితీయ సంవత్సర సిలబస్‌లో కాంతి (ఫిజికల్‌ ఆప్టిక్స్‌), తరంగాలు (వేవ్స్‌), అయస్కాంతత్వం ఈ మూడు అంశాల నుంచే వస్తున్నాయి. వాటిలోని వాక్యాలను విద్యార్థి ప్రశ్నల రూపంలోకి మార్చుకుని అభ్యాసం చేయాలి. తుది పరీక్షలో ఇలాంటి ప్రశ్నలకు కచ్చితంగా జవాబు గుర్తించేలా తయారుకావాలి.

 

రెండుసార్లు అభ్యాసం!
తుది పరీక్షలో 40 ప్రశ్నలకు కచ్చితంగా జవాబులు గుర్తించాలనే దృక్పథంతో కాకుండా తెలిసిన ప్రతి ప్రశ్నకూ తప్పు లేకుండా జవాబును గుర్తించేలా తయారు కావాలి. ఎంసెట్‌లో తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులు లేవు. కాబట్టి తెలియని ప్రశ్నలకూ జవాబులు గుర్తించడం మేలు.

భౌతికశాస్త్రంలో 40% చాలా సులువుగానూ, 50% మధ్యస్థంగానూ, 10% క్లిష్టంగానూ ప్రశ్నలుంటున్నాయి. క్లిష్టమైనవాటి దగ్గర సమయం చాలదని అనుకోకుండా ఉండటానికి పేపర్‌ను రెండుసార్లు చేసేలా అభ్యాసం చేయాలి. ముందుగా తెలిసినవాటికి జవాబులు గుర్తిస్తూ ప్రశ్నపత్రం చదువుకుంటూ వెళ్లాలి. పరీక్ష ఆన్‌లైన్‌ విధానమైనప్పటికీ ప్రివ్యూ ఆప్షన్‌ ఉంది కాబట్టి ఒకసారి పూర్తి పేపర్‌ చదువుతూ.. అప్పటికే తెలిసినవాటికి ముందుగా జవాబులు గుర్తించుకుంటూపోవాలి. మిగిలినవాటిని రెండోసారి చదివేప్పుడు గుర్తించడం చేయాలి. దీనివల్ల పేపర్‌ పూర్తిగా చదివి, సులభంగా ఉన్న అంశాల వద్ద ఎక్కువ సమయం కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షపై అవగాహన చాలామందికి తక్కువే. దీన్ని అధిగమించాలంటే కంప్యూటర్‌పై మాదిరి పరీక్షలను అభ్యాసం చేయడం తప్పనిసరి. పరీక్షహాలులో రాసే వరుసక్రమాన్ని మార్చొద్దు. నమూనా పరీక్షలు ఏవిధంగా రాశారో అసలు పరీక్షనూ అదే నమూనాలో పూర్తిచేయడం మంచిది.

 

సులువే కానీ నిర్లక్ష్యం వద్దు! (కెమిస్ట్రీ)

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, మెడికల్‌ - అగ్రికల్చర్‌ విభాగాల్లో రసాయన శాస్త్రానికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. మొత్తంలో నాలుగో వంతు అంటే... 160 ప్రశ్నలకుగానూ రసాయనశాస్త్రంలో 40 ప్రశ్నలు వస్తాయి. ఇది సులభమైన సబ్జెక్టు అనే కారణంతో పరీక్షలో కనీస సమయం కూడా దీనికి కేటాయించకపోతే మార్కులు నష్టపోవాల్సివుంటుంది.
* ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గణిత, భౌతిక శాస్త్రాలతో పోలిస్తే ఈ కెమిస్ట్రీలో మార్కులు తెచ్చుకోవడం సులభం. కఠినత్వం కూడా తక్కువ. కానీ మిగతా విభాగాలకు సమయం ఎక్కువగా మిగుల్చుకోవటానికి రసాయన శాస్త్రంలో ప్రశ్నలకు సాధారణంగా తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. దానివల్ల ఎక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కచ్చితత్వం కోసం రసాయనశాస్త్రంలో 40 ప్రశ్నలకు 35 నుంచి 40 నిమిషాలు తప్పనిసరిగా అవసరం అవుతుంది.
‌* సాధారణ, భౌతిక, కర్బన, అకర్బన రసాయన శాస్త్రాల్లో ఒక్కొక్క విభాగం నుంచి దాదాపుగా 10 ప్రశ్నలు వస్తాయి. మెడికల్‌-అగ్రికల్చర్‌ విభాగంలో కూడా రసాయనశాస్త్రం 40 ప్రశ్నల విభజన ఇదేవిధంగా ఉంటుంది. ఈ విభాగంలో వృక్ష, జంతు శాస్త్రాల తరువాత విద్యార్థులకు సులభంగా అనిపించేది రసాయనశాస్త్రమే. వారికి కూడా రసాయనశాస్త్రంలో 40 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టటానికి 40- 45 నిమిషాలు అవసరమే.

 

30 ప్రశ్నలు సులువే!
40 ప్రశ్నల్లో దాదాపు 30 ప్రశ్నలు సులువుగానే ఉంటాయి. 5 ప్రశ్నల వరకు కొంచెం ఆలోచించేవిధంగా, మిగిలిన 5 ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉండి ఎక్కువ సమయం తీసుకునేలా ఉంటాయి. చాలామంది 30 ప్రశ్నల వరకు సమాధానాలు చేయగలరు. ప్రశ్నలన్నింటికీ తెలుగు అకాడమీ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకోవడం మంచిది.

భౌతిక రసాయనశాస్త్రంలో దాదాపు 10 ప్రశ్నలకుగానూ 6 లేదా 7 ప్రశ్నల వరకూ లెక్కలపై వచ్చే అవకాశం ఉంది. కర్బన రసాయనశాస్త్రంలో నేమ్‌ చర్యలను పునశ్చరణ చేసుకోవలసి ఉంటుంది. అలాగే వివిధ పదార్థాలను తయారుచేసే విధానం, రసాయన ధర్మాలను ఎక్కువసార్లు మననం చేసుకుంటూ సిద్ధం కావాలి. సాధారణ రసాయనశాస్త్రంలో కూడా 1 లేదా 2 ప్రశ్నలు లెక్కలపై ఆధారపడి ఉండవచ్చు. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు ఏమైనా ఉంటే వాటిని చివరన చేయడం వల్ల సమయం వృథా అయ్యే అవకాశం తక్కువ.

ఇంజినీరింగ్‌ వారికి జేఈఈలో మాదిరిగా, మెడికల్‌-అగ్రికల్చర్‌ విభాగం వారికి నీట్‌లో మాదిరిగా రుణాత్మక మార్కులు ఎంసెట్‌లో ఉండవు. అందుకే అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించాలి. సరైన సమాధానం తెలియనపుడు సరైనవి కాని మూడిటిని వదిలివేస్తే (ఎలిమినేషన్‌)... మిగిలినది సరైన సమాధానం అవుతుంది కదా? దాన్ని గుర్తించాలి.

 

ఇన్నర్‌ వెయిటేజి ఎంత?
* సాధారణ (General) రసాయనశాస్త్రం: పరమాణు నిర్మాణం, రసాయన బంధం, రెడాక్స్‌ చర్యలు, స్టాయికోమెట్రి, పర్యావరణ రసాయనశాస్త్రం, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం (వెయిటేజి: 23-25% )
‌* భౌతిక (Physical)రసాయనశాస్త్రం: శక్తి శాస్త్రం, సమతాస్థితి, ద్రావణాలు, గతిక శాస్త్రం, విద్యుత్‌ రసాయన శాస్త్రం, ఉపరితల రసాయనశాస్త్రం (ఘన, ద్రవ, వాయు స్థితులు) (వెయిటేజి: 24-26%)
‌* అకర్బన (Inorganic) రసాయనశాస్త్రం: ఆవర్తన పట్టిక, హైడ్రోజన్‌, క్షార, క్షారమృత్తిక లోహాలు, IIIA, IVA, VA, VIA, VIIA, సున్న గ్రూపులు, లోహశాస్త్రం, d, f మూలకాలు (వెయిటేజి: 23-27%)
‌* కర్బన (Organic) రసాయన శాస్త్రం: వర్గీకరణ, నామకరణం, అణు సాదృశ్యం, హైడ్రో కార్బన్‌లు, అల్కైల్‌ హలైడ్‌లు, ఆల్కహాల్‌లు, కార్బొనైల్‌ సమ్మేళనాలు, కార్బాక్సిలిక్‌ ఆమ్లాలు, అమైన్‌లు, అజో సమ్మేళనాలు, జీవాణువులు, బృహదణువులు (వెయిటేజి: 25-27%)

 

ఈ కొద్ది సమయంలో...
1. ఇప్పుడు సమయం తక్కువ కాబట్టి కొత్త విషయాలను చదవకుండా, చదివినవాటినే మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం మంచిది.
2. కర్బన రసాయనశాస్త్రంలో వివిధ చర్యల్లో చర్యా కారకాలను, అంతిమ పదార్థాలను ఒక క్రమపద్ధతిలో చార్టులుగా తయారుచేసుకుంటే పునశ్చరణ సులభం అవుతుంది.
3. చదివేటప్పుడు సరిగా గుర్తురానివాటిని పేపర్‌పై ఒకచోట రాసుకోవాలి. తెలుగు అకాడమీ పాఠ్యాంశాలపరంగా చూసుకోవడం ముఖ్యం.
4. కర్బన రసాయనశాస్త్రంలోని నేమ్‌ చర్యలను ఒకేచోట పొందుపరచుకొని సరిచూసుకోగలగాలి.
5. కఠినమైన ఫార్ములాలనూ, సులభమైన ఫార్ములాలనూ విడివిడిగా నోట్సు రాసుకొని పెట్టుకోవాలి. పునశ్చరణలో సమయం వృథా కాకుండా ఈ విభజన ఉపయోగపడుతుంది.
6. కర్బన రసాయనశాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను పదేపదే మననం చేసుకోవాలి. వీలైతే ప్రతిరోజూ గంటపాటు చదువుకోవాలి.
7. చదువులో మన స్థాయినిబట్టి, చేసిన పనిని బట్టి మన మార్కులు నిర్ణయమవుతాయి. అతిగా ఆశ, అనవసరమైన పోలికలు చెడు చేస్తాయి. అయితే ఆత్మవిశ్వాసం ముఖ్యమే.
8. రెండు మూడు రోజులకు ఒకసారి మొత్తం సిలబస్‌పై అన్ని సబ్జెక్టులూ కలిపి మూడు గంటల మాక్‌టెస్ట్‌లను ఆన్‌లైన్‌లో రాయాలి. దీనివల్ల ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ పెరుగుతుంది. టెస్ట్‌ రాశాక కీ-షీట్‌ చూసుకుని, చేసిన తప్పులను గుర్తించి వాటిపై అవగాహన పెంచుకోవాలి.
9. ఈ దశలో సబ్జెక్టు పరంగా వచ్చే సందేహాలను వీలయితే అధ్యాపకుల సమక్షంలో పరిష్కరించుకోవాలి. తోటి విద్యార్థులతో ఎడతెగని సంభాషణలు మంచిది కాదు.

 

Posted Date : 05-11-2020

Previous Papers

 
 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌