• facebook
  • whatsapp
  • telegram

స్కోరుకు సోపానాలు

* ఎంసెట్‌ - సైన్స్‌ విభాగం
* తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రతి చాప్టర్‌నూ లైన్లవారీగా చదవాలి.
* ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఊహిస్తూ సన్నద్ధమవడం మంచిది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగింపు దశకు వచ్చాయి. ద్వితీయ సంవత్సరం పూర్తవుతూనే విద్యార్థుల చూపు ప్రవేశపరీక్షలవైపు మళ్లుతుంది. మన విద్యార్థులు గురిపెట్టే వాటిల్లో ఎంసెట్‌ ఒకటి. బైపీసీలో దీని ద్వారానే ఎక్కువశాతం విద్యార్థులు అగ్రికల్చర్‌, ఫార్మసీ లాంటి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ రాయబోయే బైపీసీ విద్యార్థులు తమ సన్నద్ధతను ఫలవంతం చేసుకోవడానికి నిపుణుల సూచనలు ఇవిగో...

సెట్‌ అయినా నీట్‌ అయినా రెండింటికీ సిలబస్‌ మన విద్యార్థులు చదివిన రెండేళ్ల ఇంటర్మీడియట్‌ సిలబసే. అయితే నీట్‌ను ఈ విద్యా సంవత్సరం నుంచి ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) వారు నిర్వహిస్తుండగా ఎంసెట్‌ను మాత్రం గతంలో నిర్వహించిన రెండు రాష్ట్రాల్లోని జేఎన్‌టీయూ వారే నిర్వహిస్తున్నారు.

* నీట్‌లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 45 చొప్పున ప్రశ్నలు అంటే మొత్తంగా 180 ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక రుణాత్మక మార్కు. మొత్తంగా 720 మార్కులకు మూడు గంటల సమయంలో పరీక్షను నిర్వహిస్తారు.

* ఎంసెట్‌ విషయానికొస్తే.. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల నుంచి 40 చొప్పున మొత్తం 160 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులుండవు. మూడు గంటల కాలవ్యవధిలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

నీట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థి మూడు గంటల వ్యవధిలో 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉండగా, ఎంసెట్‌లో అదే సమయంలో 160 ప్రశ్నలకు రాయాల్సి వస్తుంది. పైగా ఎంసెట్‌లో రుణాత్మక మార్కులుండవు. కాబట్టి, నీట్‌తో పోలిస్తే.. ఎంసెట్‌ను ‘నల్లేరు మీద బండి నడక’గా చెప్పొచ్చు.

రోజు విడిచి రోజు పరీక్ష..

సన్నద్ధతలో భాగంగా రోజు విడిచి రోజు ఎంసెట్‌ కాలవ్యవధిలోనే కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను రాయడం అలవాటు చేసుకోవాలి.

* మార్కుల పరంగా బయాలజీకి ప్రాధాన్యం ఎక్కువ. అందుకే ప్రతిరోజూ సగం సమయాన్ని బయాలజీపై మాత్రమే వినియోగించాలి. మిగిలిన సమయాన్ని భౌతిక, రసాయన శాస్త్రాలపై దృష్టి సారించాలి.

* తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రతి చాప్టర్‌నూ లైన్లవారీగా చదవాలి. ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ విధానంలో ఊహిస్తూ సన్నద్ధమవడం మంచిది.

* తెలియని అంశాలను వదిలేసి తెలిసినవాటి పునశ్చరణకు ప్రాముఖ్యం ఇవ్వాలి.

* ‘ఎంత చదివాం’ అనే దానికన్నా చదివినదాన్ని గుర్తుంచుకునేలా దైనందిన నోట్స్‌ తయారీకి ప్రాముఖ్యం ఇవ్వాలి.

* ఎక్కువ నమూనా పరీక్షలు రాయడం ఎంతో మేలు.

* నమూనా పరీక్షల్లో తప్పుగా రాసిన ప్రశ్నలను ఆబ్జెక్టివ్‌ సమాధానాల సాయంతో సాధన చేయటం వల్ల ఉపయోగం తక్కువ. అవే ప్రశ్నలను ఖాళీలను పూరించే విధానంలోకి మార్చుకుని సమాధానాలను గుర్తుంచుకుంటే మంచిది.

* తెలియని ప్రశ్నల్లోనూ సులువుగా నేర్చుకోగల ప్రశ్నలు ఏమున్నాయో తెలుసుకోవాలి. వాటిని అభ్యాసం చేయడానికి ప్రయత్నించాలి.

* బయాలజీలో 75, రసాయన శాస్త్రంలో 30, భౌతిక శాస్త్రంలో 25 మార్కులు సాధించగలిగితే అగ్రికల్చర్‌ విభాగంలో అద్భుతమైన ర్యాంకు సాధించవచ్చు.

ప్రశ్నల నిధి సాధన

మెడికల్‌, అగ్రికల్చర్‌ విభాగాల్లో జాతీయస్థాయి పోటీపరీక్షలు ఎంసెట్‌కు ముందు లేవు. విద్యార్థికి సీటు రావడానికి తోడ్పడే సబ్జెక్టు బయాలజీ. అగ్రికల్చర్‌ విభాగంలో జీవశాస్త్రంలోని బోటనీ, జువాలజీల్లో 40 చొప్పున ప్రశ్నలు ఉంటున్నాయి. అందుకని విద్యార్థి తన పాఠ్యపుస్తకాలను మాత్రమే చదివినా సరిపోతుంది. అభ్యాసం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ సమయాన్ని అకాడమీ ప్రశ్నల నిధిలోని ప్రశ్నల తర్ఫీదుకు కేటాయించుకోవాలి. ప్రశ్నలను బహుళైచ్ఛిక రూపంలో ఇస్తారు. కానీ ఖాళీలను పూరించేలా తయారు కాగలిగితే జవాబుల్లో కచ్చితత్వం పెరుగుతుంది.
బయాలజీలోని 80 ప్రశ్నలకు 45 నిమిషాల్లో జవాబు గుర్తించవచ్చు. కానీ ప్రశ్నలు సరిగా చదివే అలవాటు ఏర్పరచుకుంటూ గంట కాలవ్యవధి వరకూ తీసుకోవడం మేలు. మార్కులు సులభంగా పొందవచ్చు. కాబట్టి, దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. 80 ప్రశ్నల్లో కనీసం 75కి సరైన సమాధానాలను గుర్తించేలా తయారుకావాలి.

ఇలా చదవాలి సబ్జెక్టులు

వృక్షశాస్త్రం: ఒక అంశాన్ని మరోదానిలో అనుసంధానం చేయగలిగే ఇంటర్‌ రిలేటివ్‌ అప్రోచ్‌తో ముందుకుసాగాలి. మొదటి సంవత్సరంలోని అంశాల్లో ఎక్కువశాతం రెండో ఏడాదిలో ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలను ఒకే సమయంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. సూక్ష్మ జీవశాస్త్రం, కేంద్రకపూర్వ జీవులు, బాక్టీరియా, వైరస్‌, మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల పాత్ర వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఖనిజ మూలకాల ఆవశ్యకత, మొక్కల హార్మోన్లపై అవగాహన కూడా బోటనీపరంగా కలిసొచ్చే అంశం.

జంతుశాస్త్రం: ప్రాథమికాంశాలపై పట్టు సాధించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ సిలబస్‌లోని కాలేయం, వానపాము, బొద్దింకల జీవవ్యవస్థ, ప్రోటీన్లు, ఎంజైమ్‌లు, క్షీరగ్రంథులు మొదలైనవి ముఖ్యమైనవి.

రసాయనశాస్త్రం: ప్రథమ, ద్వితీయ సంవత్సరాల శాస్త్రాల నుంచి ప్రశ్నలు సమంగానే ఇస్తున్నారు. కర్బన, అకర్బన, రసాయనశాస్త్రాల్లోని ప్రశ్నలు కూడా సమంగానే వస్తున్నాయి. అకర్బన రసాయనశాస్త్రం తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు నేర్చుకోవడానికీ, పరీక్షలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికీ ఉపయోగపడుతుంది. గ్రూపులు, పట్టికలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ, రోజూ పునశ్చరణ చేయటం వల్ల పరీక్షలో 12 నుంచి 14 ప్రశ్నలను సులువుగా రాయొచ్చు. కొన్ని అధ్యాయాలు భౌతిక, రసాయనశాస్త్రాలు రెండింటిలో ఉన్నాయి వాటికి అధిక ప్రాధాన్యమిస్తే ఎక్కువ ఉపయోగం. అంటే ఆటమ్‌, న్యూక్లియై, థర్మోడైనమిక్స్‌ లాంటివన్నమాట.

భౌతికశాస్త్రం: ఈ సబ్జెకుపై ఉన్న భయం కారణంగా చిన్నచిన్న విషయాలను కూడా తప్పుగా అర్థం చేసుకొని మార్కులు పోగొట్టుకుంటున్నారు. ఎంసెట్‌లో రుణాత్మక మార్కులుండవు కాబట్టి ఇబ్బంది లేదు. పాత ఎంసెట్‌ ప్రశ్నపత్రాలు, నీట్‌ పేపర్లు పరిశీలిస్తే అందులో 40 నుంచి 60 శాతం ప్రశ్నలు చాలా సులభమైనవీ, సిద్ధాంతపరమైనవీ ఉంటున్నాయి. ఎక్కువ సమస్యలు డైరెక్ట్‌ ఫార్ములా ఆధారంగానే ఉండటాన్ని గమనించొచ్చు. కేవలం ద్వితీయ సంవత్సరం సిలబస్‌లోని అంశాలపై పట్టు సాధించినా కనీస మార్కులు వస్తాయి. భౌతికశాస్త్రం కోసం తుది పరీక్షలో కనీసం ఒక గంటపైగానే సమయం కేటాయిస్తే మంచి ఫలితం ఉంటుంది.

చివరగా..

* పాత ప్రశ్నపత్రాలపై దృష్టి సారించండి. ప్రాముఖ్యమున్న అంశాలు అర్థమవుతాయి. వాటిపై శ్రద్ధ పెట్టి సాధన చేయాలి.

* ఇంటర్‌ మొదటి సంవత్సరపు సిలబస్‌ ముఖ్యమే. ద్వితీయ సంవత్సర సిలబస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

* అకాడమీ పుస్తకాలను బాగా చదవాలి. పాతపేపర్ల ప్రశ్నల్లోని అంశాలను పునశ్చరణ చేస్తే అధిక మార్కులు వస్తాయి. - డా. మంచెళ్ల శ్రీవాణీ చందన, శ్రీచైతన్య విద్యాసంస్థలు

Posted Date : 05-11-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 
 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌