• facebook
  • whatsapp
  • telegram

ఏ దశకైనా ఎంపికలే కీలకం

* ఎంసెట్‌ - 2019 వెబ్‌ కౌన్సెలింగ్‌

తెలంగాణలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లోకి తుది రౌండు అడ్మిషన్ల ప్రక్రియలు కొనసాగుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌ ముగిసింది. తుది రౌండుకి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎన్ని దశల్లో కౌన్సెలింగ్‌ జరిగినా ఆప్షన్ల నమోదే కీలకం అని నిపుణులు చెబుతున్నారు. చాలామంది చిన్న చిన్న పొరపాట్లతో తాము కోరుకున్న కాలేజీ లేదా సీటు పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ర్యాంకుకు తగిన సీటును సంపాదించుకోవచ్చు. మొదటి విడత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో సుమారు 3,500 మందికి సీట్లు దక్కలేదు. సీట్లు దక్కినా 10 వేల మంది కళాశాలల్లో చేరడానికి ఇష్టపడలేదు. విద్యార్థులు ఆప్షన్ల నమోదులో చేసిన చిన్న చిన్న పొరపాట్లే వీటికి కారణం. ఇక బుధవారం నుంచి ప్రారంభమయ్యే చివరి విడత కౌన్సెలింగ్‌లో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటే కోరుకున్న సీటు సాధించుకోవచ్చు. సీట్ల కోసం పోటీపడే వారి సంఖ్య కంటే కన్వీనర్‌ కోటాలో ఇంజినీరింగ్‌ సీట్ల సంఖ్య ఎక్కువే ఉంది. బీటెక్‌లో పదుల సంఖ్యలో కోర్సులుంటాయి. దాదాపు 190 వరకు కళాశాలలు ఉన్నాయి. నాణ్యమైన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనీ, ప్రాంగణ నియామకాల్లో కొలువులు దక్కుతాయనీ విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సందేహాలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.

* ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి?
మొదటి విడత కౌన్సెలింగ్‌ తర్వాత 16 వేలకుపైగా సీట్లను ఎవరికీ కేటాయించలేదు. 49 వేల మందికి సీట్లు దక్కినా వారిలో 10 వేల మంది వరకు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయలేదు. అంటే వారికి సీటు వచ్చిన కళాశాలలో లేదా బ్రాంచీలో చేరటం ఇష్టం లేదని అర్థం. మొత్తం 26 వేలకుపైగా సీట్లు చివరి విడత కౌన్సెలింగ్‌కి అందుబాటులో ఉంటాయి.

* ఏ కళాశాలలో, ఏ బ్రాంచీల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో విద్యార్థులకు తెలుస్తుందా?
తెలియదు. మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయో మాత్రమే ఎంసెట్‌ వెబ్‌సైట్లో ఉంచుతారు.

* సీట్లు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా ఎలా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి?
అన్ని కళాశాలల్లో...అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని భావించి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మీకు ఇంతకుముందు వచ్చిన కళాశాల కంటే మంచి కళాశాల లేదా కోర్సులను మాత్రమే ఆప్షన్‌ ఇచ్చుకోవాలి. లేకపోతే ఇంకా తక్కువస్థాయి కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మొదటి విడతలోని సీటు మరొకరికి వెళ్లిపోతుంది.

* ఎక్కువ రుసుం ఉన్న కళాశాలలో సీటు వస్తే..?
మొదటి విడత కౌన్సెలింగ్‌లో రూ.70 వేల రుసుం ఉన్న కళాశాలలో వచ్చిందనుకున్నాం. చివరి విడతలో రూ.లక్ష రుసుం ఉన్న దాంట్లో సీటు వస్తే అప్పుడు మిగిలిన రూ.30 వేలు మళ్లీ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థి చెల్లించాలి. చెల్లించిన రుసుం అంతా ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ ఖాతాలోనే ఉంటుంది. అడ్మిషన తీసుకున్న తర్వాత కళాశాల ఖాతాలోకి వెళుతుంది.

* చివరి విడత కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటులో చేరడం ఇష్టం లేకపోతే రద్దు చేసుకోవచ్చా?
రద్దు చేసుకోవచ్చు. ఈనెల 29న చివరి విడత సీట్లు కేటాయిస్తారు. వారు ఈ నెల 30లోపు వెబ్‌సైట్‌ ద్వారా రద్దు చేసుకోవచ్చు. అప్పుడు వారికి చెల్లించిన రుసుంలో 50 శాతమే వెనక్కి ఇస్తారు. ఏ ఖాతా నుంచి రుసుం చెల్లించారో ఆ ఖాతాలోకి పంపిస్తారు. ఆ మొత్తం ఆగస్టు నెలాఖరులోపు వస్తుంది.

* కళాశాలలో చేరిన తర్వాత బ్రాంచి మార్చుకోవచ్చా?
చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ స్లైడింగ్‌కు అవకాశం ఇస్తుంది. అప్పుడు ఆ కళాశాలలో సీట్లు ఖాళీగా ఉంటే బ్రాంచీలు మారవచ్చు. ఈ ప్రక్రియను కళాశాలల యాజమాన్యాలే చేపడతాయి.

* స్పాట్‌ అడ్మిషన్లు ఎప్పుడు ఉంటాయి? అవి తీసుకుంటే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఉంటుందా?
చివరి విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత స్పాట్‌ అడ్మిషన్లకు అధికారులు అవకాశం ఇస్తారు. కాలపట్టికను ప్రకటిస్తారు. ఆ తేదీల్లో కళాశాలలకు దరఖాస్తు చేసుకొని ప్రవేశాలు పొందవచ్చు. వారికి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వర్తించదు. 
     - పెమ్మసాని బాపనయ్య, ఈనాడు, హైదరాబాద్‌

సీట్లన్నీ ఖాళీ అనుకుని ఆప్షన్లు ఇచ్చుకోవాలి
చివరి విడతలో ఏ కళాశాలలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేటప్పుడు విద్యార్థులకు కనిపించదు. ఉదాహరణకు ఒక కళాశాలలో అన్ని సీట్లు భర్తీ అయ్యాయని అనుకుందాం. వారిలో కొందరు చివరి విడత కౌన్సెలింగ్‌లో మరో కళాశాలకు మారాలనుకున్నారు. ప్రముఖ కళాశాలలో సీటు వచ్చినా ఆశించిన బ్రాంచీ రాలేదని మరో కళాశాలలో ఇష్టమైన బ్రాంచీ కోసం వారు మళ్లీ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఎక్కడ ఏ కళాశాలలో సీట్లు ఖాళీ అవుతాయో తెలియదు కాబట్టి ఖాళీ సీట్లను ప్రదర్శించడం సాధ్యం కాదు. అందుకే ప్రతి కళాశాలలో, ప్రతి బ్రాంచిలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నట్లు భావించి...వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇచ్చుకోవడం అత్యంత ముఖ్యం. లేకపోతే ఈ కౌన్సెలింగ్‌లోనూ సీటు రాకపోయే ప్రమాదం ఉంది. ఎంసెట్‌ వెబ్‌సైట్లో ఉన్న ఆప్షన్ల ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని ముందుగా దాంట్లో రాసుకొని ఐచ్ఛికాలు ఇచ్చుకోవడం ముఖ్యం. ఏమైనా సందేహాలు వస్తే సహాయ కేంద్రాల్లో సంప్రదించవచ్చు. వెబ్‌సైట్‌లో ఎంసెట్‌ బ్రోషర్‌లో అన్ని సూచనలూ, జాగ్రత్తలను పొందుపరిచాం. వాటిని అధికశాతం మంది చదవడం లేదు. వాటిని చదివితే నష్టపోకుండా ఉంటారు. 
   - బి. శ్రీనివాస్‌, తెలంగాణ ఎంసెట్‌ ప్రవేశాల క్యాంపు అధికారి

Posted Date : 04-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

 
 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌