• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ ర్యాంకు... ఎక్కడ సీటు?

వృత్తివిద్యల్లోకి ప్రవేశపెట్టే పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఫలితాలూ వెలువడుతున్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంత ముఖ్యమో.. ఎక్కడ చేరాలో నిర్ణయించుకోవడం అంతకంటే ప్రాధాన్యమున్న అంశం. ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఏ ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరటానికి అవకాశమున్నదీ ముందస్తుగానే అంచనా వేసుకోవడం చాలా అవసరం. వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు ముందే దీనిపై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఈ కసరత్తు భవితను నిర్దేశిస్తుంది! 
   చూస్తుండగానే ఇంటర్మీడియట్‌, ఎంసెట్‌-2017 ఫలితాల ప్రకటనలు వరసగా జరిగిపోయాయి. ర్యాంకులు తెచ్చుకున్న అభ్యర్థులు గత ఏడాది కౌన్సెలింగ్‌ను నమూనాగా తీసుకుని కోరుకున్న కళాశాలల్లో, బ్రాంచిల్లో తమకు సీట్లు వచ్చే అవకాశాలను బేరీజు వేసుకుంటుంటారు. ఇందుకు ఉపకరించేలా గత ఏడాది రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ సరళిని అందిస్తున్నాం.
ఈ పట్టికల్లో ఏ ర్యాంకుకు గత సంవత్సరం ప్రభుత్వ కళాశాలల్లో సీటు వచ్చిందో ఉంది. స్వల్ప తేడాతో ఈ సంవత్సరం కూడా ఇలాగే ప్రవేశాలు ఉండే అవకాశం ఉంది. కేటగిరీల వారీగా విద్యార్థులు తమ ర్యాంకుకు ఎక్కడ సీటు సాధించే అవకాశం ఉందో గ్రహించవచ్చు.
ఇంజినీరింగ్‌ విభాగం వారు ఆలోచించే అంశాలు రెండు.
1) విద్యాసంస్థకు ప్రాధాన్యం ఇవ్వాలా లేదా ఆసక్తి ఉన్న బ్రాంచికా?
2) ఏ బ్రాంచి తీసుకుంటే ఇంజినీరింగ్‌ పూర్తి చేసేటప్పటికి మంచి సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు?
       తొలి ప్రాధాన్యం విద్యాసంస్థకే ఇచ్చి, తర్వాత ఆ సంస్థలో తను పొందగల బ్రాంచీల్లో ఉత్తమమైనదాన్ని ఎంపిక చేసుకోవడం మేలు. ఎందుకంటే ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థి ఎన్‌ఐటీలో చేరడానికి మొగ్గు చూపడు. అలాగే ఎన్‌ఐటీలో సీటు పొందిన విద్యార్థి రాష్ట్ర యూనివర్సిటీ కళాశాలల్లో చేరడానికీ, వీటిలో సీటు పొందిన విద్యార్థి ప్రైవేటు కళాశాలల్లో చేరడానికీ ఇష్టపడకపోవచ్చు. దీని అర్థం- మొదట విద్యాసంస్థకు ప్రాధాన్యం ఇచ్చి, తర్వాత బ్రాంచి గురించి ఆలోచించటం సాధారణంగా జరుగుతుందని.
అయితే కొన్ని సందర్భాల్లో ఇది మారవచ్చు. ‘కొత్త ఐఐటీలలో ఏదో బ్రాంచీనా? పాత ఎన్‌ఐటీల్లో కోరుకున్న బ్రాంచీనా’ అన్న మీమాంస వస్తే.. కచ్చితంగా పాత ఎన్‌ఐటీల్లో కోరిన బ్రాంచీలో చేరడమే మేలనేది అనుభవజ్ఞుల మాట.
కళాశాలను ఎంచుకొనేటప్పుడు విద్యార్థి తప్పకుండా కొన్ని అంశాలను గమనించాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాలు, బోధన తీరు, విద్యాసంస్థ ప్రతిష్ఠ గురించి విచారణ జరుపుకోవాలి. గత మూడు సంవత్సరాల్లో ఆ విద్యాసంస్థ ప్రాంగణం నుంచి ఎంత శాతం విద్యార్థులు బహుళజాతి సంస్థలకు ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారో తెలుసుకోవాలి. వారికి సగటు వార్షికాదాయం ఎంత ఇవ్వచూపారనేదీ పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ బేరీజు వేసుకుని కళాశాలలో చేరే విషయం నిర్ణయించుకోవాలి.
            ఇక బ్రాంచి విషయం విద్యార్థుల ఆసక్తీ, సామర్థ్యాలూ, బలహీనతలను అంచనా వేసుకుని దీన్ని ఎంపిక చేసుకోవటం శాస్త్రీయం, ప్రయోజనకరం. అలా కాకుండా ఏ బ్రాంచి తీసుకుంటే మంచి ఉద్యోగం వస్తుందనేది మాత్రమే లెక్కలోకి తీసుకోవటం చాలామంది చేస్తున్నారు. ఇది సరైన ధోరణి కాదు. ఏ బ్రాంచి తీసుకున్నా విద్యార్థి తొలి 10 శాతం మందిలో ఉండగలిగితే సబ్జెక్టుపై గట్టి పట్టు పెంచుకున్నట్టే. మంచి ఉద్యోగం సాధించుకునే అవకాశం ఎటూ ఉండనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈసీఈకి (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌) గిరాకీ ఎక్కువగా ఉందని దానివైపే మొగ్గు చూపుతున్నారు. ఈ మాట వాస్తవమే కానీ, తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం నిరుద్యోగ పట్టభద్రులు కూడా ఈ బ్రాంచిలోనే ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. విద్యార్థి తన బలాలూ, బలహీనతలను తెలుసుకోకుండా ఆసక్తి పెద్దగా లేని ఏ బ్రాంచిని తీసుకున్నా సగటు స్థాయికంటే కింది స్థాయిలోనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రసిద్ధ నియామక సంస్థల్లో ఉద్యోగాలను సాధించలేకపోతున్నారు. ఇంటర్మీడియట్‌ ఫిజిక్స్‌లో పూర్తిగా పట్టులేని విద్యార్థి ఇంజనీరింగ్‌లో ఈసీఈ లేదా ఈఈఈ (ఎలక్ట్రికల్‌) తీసుకుంటే? ప్రాథమిక అవగాహన లేక నష్టపోవాల్సివస్తుంది.
ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఫిజిక్స్‌ బాగా చేయగల విద్యార్థులు ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ లాంటి బ్రాంచీలనూ, మేథమేటిక్స్‌లో పట్టున్న వారు కంప్యూటర్‌ సైన్సు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ లాంటి బ్రాంచీలనూ ఎంచుకోవడం సమంజసం. కెమిస్ట్రీలో ఆసక్తి ఉన్నవారు కెమికల్‌ టెక్నాలజీ లాంటి కోర్సులనూ; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలను సమంగా అర్థం చేసుకోగలిగేవారు మెకానికల్‌, సివిల్‌ లాంటి కోర్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ఇలా చేస్తే సబ్జెక్టుల్లో ప్రతిభ చూపి, ఆపై తమ రంగాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది.
విద్యార్థి ఇప్పుడు ఎంచుకున్న కళాశాల, బ్రాంచిలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని, జీవితంలో స్థిరపడే దిశలో వెళ్ళాలి. వెబ్‌ కౌన్సెలింగ్‌కు ముందే తన ర్యాంకుకి ఏయే కళాశాలల్లో, ఏ బ్రాంచీలు రావడానికి అవకాశముందో చూసుకోవాలి.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌, ట్విన్నింగ్‌...
కళాశాలలకు వ్యక్తిగతంగా వెళ్లి చూసుకుని, వాటిలో బోధన, ప్రయోగశాల సదుపాయాలు ఎలా ఉన్నాయో గమనించుకోవాలి. కళాశాల, బ్రాంచి ప్రాధాన్యంలో తనకు కావాల్సిన వరసక్రమాన్ని ఏర్పరచుకుని వెబ్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తును భర్తీ చేయాలి.
ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యమైన విషయం- మిత్రులు చేరుతున్న కళాశాల, బ్రాంచిల్లోనే తాము కూడా చేరాలనే తాపత్రయం కూడదు. ఎందుకంటే.. ఏ ఇద్దరు విద్యార్థుల బలాలు, బలహీనతలూ ఒకేలా ఉండకపోవచ్చు. భవిష్యత్‌ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం కాబట్టి ఏ విద్యార్థి అయినా జాగ్రత్తగా ఆలోచించి, తనకు కావాల్సిన కళాశాలలు, బ్రాంచీలను అవరోహణ క్రమంలో రాసుకుని, కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 
    యూనివర్సిటీ కళాశాలల్లోనే సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ కోర్సులు కూడా ఉన్నాయి. ఉస్మానియా, ఆంధ్రా, కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఈ కోర్సుల్లో కొద్దిగా ఎక్కువ ర్యాంకు వచ్చినా కూడా సీటు సాధించుకునే అవకాశం ఉంది. వీటిలో ఫీజు మాత్రమే వేరుగా ఉంటుంది, మిగతా అంశాల్లో ప్రాధాన్యం సమానమే. అలాగే ట్విన్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ అంటే- రెండు సంవత్సరాలు ఇక్కడ ఇంజినీరింగ్‌ చేసి, మిగిలిన రెండేళ్లు ఇతర దేశాల్లో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం! వీటికి విద్యార్థి ప్రాధాన్యాన్ని ఇచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు (పీజీతో కూడిన డిగ్రీ) కూడా ఉన్నాయి. ఆసక్తిని బట్టి వాటికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కెమిస్ట్రీలో ఆసక్తి ఉన్నవారు కెమికల్‌ టెక్నాలజీ లాంటి కోర్సులనూ; మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలను సమంగా అర్థం చేసుకోగలిగేవారు మెకానికల్‌, సివిల్‌ లాంటి కోర్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ఇలా చేస్తే సబ్జెక్టుల్లో ప్రతిభ చూపి, ఆపై తమ రంగాల్లో బాగా రాణించే అవకాశం ఉంటుంది.

Posted Date : 02-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌