• facebook
  • whatsapp
  • telegram

పవర్‌ఫుల్‌ ఉద్యోగాలకు ఈఈఈ!

విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, వినియోగం, నిల్వ చేయడం వంటి వాటితోపాటు ఎలక్ట్రికల్‌ పరికరాల డిజైనింగ్‌, తయారీ, టెస్టింగ్‌లు ప్రధాన విధులుగా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్లు పనిచేస్తారు. పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించే రంగాల్లో పవర్‌ ఒకటి. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంసెట్‌ తర్వాత బీటెక్‌లో ఈ బ్రాంచిని ఎంచుకోవచ్చు. 

ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌, టెలీ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, సంబంధిత పరిశ్రమల్లో ఎదురయ్యే సమస్యలు, అవసరాలకు సంబంధించిన ఇంజినీరింగ్‌ బ్రాంచి ఇది. కోర్‌ విభాగాల్లోని కమ్యూనికేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, రేడియో ఫ్రీక్వెన్సీ డిజైన్‌, మైక్రో ప్రాసెసర్స్‌, మైక్రో ఎలక్ట్రానిక్స్‌, పవర్‌ జనరేషన్‌, విద్యుత్తు యంత్రాలకు సంబంధించిన విధులను కూడా ఇందులో నిర్వర్తిస్తారు. ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కంప్యూటర్‌, దాని సంబంధిత భాగాల తయారీ, రూపకల్పన కూడా ఉంటుంది. ఆటోమేషన్‌, ఎలక్ట్రానిక్‌ మెమరీ స్టోరేజ్‌ డివైజెస్‌, ఇండస్ట్రియల్‌ రోబోట్స్‌, సీఎన్‌సీ మెషిన్లకు సర్క్యూట్లను వీళ్లే డిజైన్‌ చేస్తారు. ఈ బ్రాంచి ఎంచుకోవాలంటే సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో పట్టు ఉండాలి.
 

ఉద్యోగావకాశాలు

ఈఈఈ చేసినవారికి పవర్‌ జనరేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్స్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌, టెలీకమ్యూనికేషన్‌, బయో మెడికల్‌ రంగాల్లో విస్తృత అవకాశాలుంటాయి. పవర్‌ ప్లాంట్‌లు, ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్లలో పవర్‌ జనరేషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ విభాగాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయి. డిజైన్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ఇంజినీరింగ్‌ స్పెషలిస్ట్‌, చీఫ్‌ ఇంజినీర్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌, రిలయబిలిటీ ఇంజినీర్‌, రిసెర్చ్‌ ఇంజినీర్‌, సిస్టమ్స్‌ డిజైన్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ ఇంజినీర్‌, టెస్ట్‌ ఇంజినీర్‌, సేల్స్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో వీరిని నియమించుకుంటారు.       

బోధన, పరిశోధన రంగాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఈఆర్‌పీ సొల్యూషన్స్‌ కోసం వీరిని తీసుకుంటున్నారు. పవర్‌ కంట్రోల్‌కి సంబంధించిన ఏసీ, డీసీ ఇండస్ట్రియల్‌ డ్రైవ్‌ కంపెనీలు, గృహోపకరణాలకు సంబంధించిన ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, ట్రాన్స్‌మిషన్‌ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ వ్యయంతో, ఆకర్షణీయమైన అధునాతన ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను రూపొందించగలిగిన వారికి గిరాకీ పెరిగింది. సర్క్యూట్‌ సిస్టమ్స్‌కి సంబంధించి వీరు ఈసీఈ అభ్యర్థుల పోటీకి తట్టుకోవాల్సి ఉంటుంది. కోర్‌ ఎలక్ట్రికల్‌ రంగంలో కాకుండా ఇతర విభాగాల్లో ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా లిమిటెడ్‌, బాష్‌ మొదలైనవి ఈఈఈ ఇంజినీర్లను తీసుకుంటున్న వాటిలో ప్రముఖ సంస్థలు.

ఉన్నత విద్య

వీరికి మనదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్నతవిద్యకు పలు అవకాశాలున్నాయి. మనదేశంలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, అప్లయిడ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌లో ఎంఈ/ ఎంటెక్‌ చేయవచ్చు. విదేశాల్లో అయితే.. ఎలక్ట్రికల్‌ పవర్‌ సిస్టమ్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌ (ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌)ల్లో ఎంఎస్‌ చేయడానికి వీలుంది.

Posted Date : 03-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌