• facebook
  • whatsapp
  • telegram

ఫార్మసీ కోర్సులు... ఎంత మెరుగు?

మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు కాకుండా భిన్నమైన కెరియర్‌ మార్గంలో వెళ్ళాలనేవారికి ఫార్మసీ ఓ ప్రత్యామ్నాయంగా ఉంది. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ... రెండు గ్రూపుల వారూ చేరగలిగే కోర్సు ఇది. దీని స్వరూపం, అందుబాటులో ఉన్న సీట్లు, భవిష్యత్‌ అవకాశాల గురించి తెలుసుకుందామా? 
నూతన వైద్యవిధానాలు, మారుతున్న రోగ నివారణ ప్రక్రియల కారణంగా తలసరి ఔషధ వినియోగంలో ప్రపంచమంతటా గణనీయమైన పెరుగుదల కన్పిస్తోంది. ఈ మందుల తయారీ, వాటి నాణ్యతను విశ్లేషించే నిపుణులైన ఫార్మసిస్టులుగా తయారవ్వటానికి ఫార్మసీ విద్య చదవాల్సివుంటుంది. దేశీయ ఫార్మా రంగం వచ్చే ఐదేళ్ళపాటు ఏటా దాదాపు 20 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మా పరిశ్రమలు స్తబ్ధత తొలగిపోయి, విస్తరణ దిశగా ముందుకుసాగుతున్నాయి. ఈ కారణంగా ఫార్మసీ పట్టభద్రులకు రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి.
ఫార్మసీలో మూడు రకాల కోర్సులున్నాయి. 1) డీ ఫార్మసీ 2) బీ ఫార్మసీ 3) ఫార్మా డీ
* డీ ఫార్మసీ: ఇది రెండేళ్ళ డిప్లొమా ఇన్‌ ఫార్మసీ కోర్సు. దేశంలోని మెడికల్‌ స్టోర్స్‌ అవసరాలు తీర్చటానికి నిర్దేశించినది. ఆంధ్రప్రదేశ్‌లో 35, తెలంగాణలో 26 డీ ఫార్మసీ కళాశాలలుండగా వాటిలో వరసగా 2100, 1560 సీట్లు (ఒక్కో కళాశాలలో 60 చొప్పున) ఉన్నాయి.
* బీ ఫార్మసీ: ఇది నాలుగేళ్ళ కోర్సు. ఇది ఫార్మా ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. దీంతో మన ఫార్మసీ గ్రాడ్యుయేట్లు కొంత అనుభవం సంపాదించాక ఇతర దేశాల్లోని ఫార్మా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు పొందగలుగుతున్నారు. బీ ఫార్మసీ విద్యార్థులు మెడికల్‌ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, ప్యూర్‌ సైన్సెస్‌లను తమ కోర్సులో నేర్చుకుంటారు. ఇంటర్లో ఎంపీసీ చదివినవారు రెమెడియల్‌ బయాలజీ, బైపీసీ వారు రెమెడియల్‌ మ్యాథ్స్‌ నేర్చుకోవాల్సివుంటుంది.
బీ ఫార్మసీ చదివిన ప్రతి విద్యార్థీ నెలరోజుల పాటు ఫార్మా పరిశ్రమలో ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఔషధ తయారీలో మెలకువలు, ఔషధాల నాణ్యత విశ్లేషణలో నైపుణ్యాలు రావాలంటే ఇది ముఖ్యం. అయితే కొన్ని ఫార్మసీ కళాశాలలు ఈ సదుపాయం ఏర్పాటు చేయటం లేదు. ప్రాక్టికల్‌ శిక్షణ లేకుండా కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే సంస్థలు విద్యార్థులకు నష్టం కల్గిస్తున్నట్లే.
* ఫార్మా డీ: ఇది ఆరేళ్ళ డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీ కోర్సు. పూర్తిగా క్లినికల్‌ ఓరియెంటెడ్‌. దీనిలో బీ ఫార్మసీలో నేర్పే అనేక సబ్జెక్టులతో పాటు క్లినికల్‌ ఫార్మసీ, క్లినికల్‌ టాక్సికాలజీ, ఫార్మకోథిరాప్యుటిక్స్‌, హాస్పిటల్‌ అండ్‌ కమ్యూనిటీ ఫార్మసీ మొదలైనవి నేర్చుకుంటారు.
ఫార్మా డీ విద్యార్థులు మొదటి మూడేళ్ళూ కళాశాలలోనే పాఠ్యాంశాలు నేర్చుకుంటూ ప్రతి నెలా ఆస్పత్రిని సందర్శిస్తారు. నాలుగో సంవత్సరంలో వారానికి రెండు సార్లు ఆస్పత్రి సందర్శనలు ఉంటాయి. ఐదో సంవత్సరంలో ప్రతిరోజూ ఒకపూట ఆస్పత్రి వార్డుల్లో రౌండ్స్‌, బెడ్‌సైడ్‌ శిక్షణ తప్పనిసరి. ఇక ఆరో సంవత్సరం పూర్తికాలం పాటు ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్‌ చెయ్యాలి. ఈ రెసిడెన్సీ ప్రోగ్రాంలో 6 నెలల పాటు జనరల్‌ మెడిసన్‌ విభాగంలోనూ, రెండేసి నెలల చొప్పున 3 స్పెషలైజేషన్ల విభాగాలలోనూ శిక్షణ పొందాల్సి ఉంటుంది.
ఫార్మా డీలో చేరబోయే విద్యార్థులు కళాశాలతో పాటు అనుబంధంగా ఉన్న ఆస్పత్రి కూడా సందర్శించటం మేలు. 300 పడకలున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఒప్పందం ఉన్న కళాశాలను ఎంపిక చేసుకోవటం మంచిది.
సీట్లలో సగం - సగం
బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సగం సీట్లు ఇంటర్‌ ఎంపీసీ వారికీ, మిగతా సగం బైపీసీ వారికీ కేటాయిస్తారు. డీ ఫార్మసీ చదివినవారూ ఫార్మాడీలో చేరటానికి అర్హులు.
దేశంలో తయారవుతున్న ఔషధాల్లో సుమారు 30 శాతం తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్నాయి. బీ ఫార్మసీ తర్వాత ఫార్మా పరిశ్రమలో ఉపాధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఔషధాలు తయారుచేసే మాన్యుఫాక్చరింగ్‌ కెమిస్ట్‌, ఔషధాలు నాణ్యత విశ్లేషించే ఎనలిటికల్‌ కెమిస్ట్‌, క్వాలిటీ ఎస్యూరెన్స్‌ ఆఫీసర్‌, రెగ్యులేటరీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఇంటర్నేషనల్‌ మార్కెటింగ్‌ ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో అవకాశాలుంటాయి.
ప్రభుత్వరంగంలో కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు ఫార్మసీ చదివినవారు మాత్రమే అర్హులు. ప్రభుత్వ లేబరెటరీస్‌లో గవర్నమెంట్‌ ఎనలిస్టు, కెమికల్‌ ఎగ్జామినర్‌, కేంద్ర మెడికల్‌ డిపోమేనేజర్‌ లాంటి అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఫార్మసీ చదివిన వారు పొందే అవకాశం ఉంది. క్లినికల్‌ రీసెర్చ్‌, ఫార్మకో విజిలెన్స్‌, హాస్పిటల్‌ ఫార్మసీ, కమ్యూనిటీ ఫార్మసీ, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లాంటి అనేక ఉద్యోగాలకు ఫార్మసీ చదివినవారు అర్హులు.
ప్రైవేట్‌ ఫార్మసీ కళాశాలలు
ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన 113 ప్రైవేట్‌ ఫార్మసీ కళాశాలలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటిలో 59 కాలేజీలలో 100 సీట్లు ఉండగా మిగతా 54 ఫార్మసీ కాలేజీలలో 60 బీ ఫార్మసీ సీట్లు ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రైవేట్‌ ఫార్మసీ కళాశాలల్లో 9125 బీ ఫార్మసీ సీట్లు ఉన్నాయి.
తెలంగాణ (ఉస్మానియా యూనివర్సిటీ) పరిధిలో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలలు 148. వీటిలో 61 కాలేజీలకు 100 బీ ఫార్మసీలకు అనుమతి ఉండగా మిగతా 87 కళాశాలలో ఒక్కో కాలేజీ 60 బీ ఫార్మసీ సీట్లు అందిస్తున్నాయి.
ఫార్మా డీ సీట్ల వివరాలు
దేశంలో 203 ఫార్మా డీ కళాశాలలుండగా వీటిలో 6090 ఫార్మా డీ సీట్లున్నాయి. 57 ఫార్మా డీ కళాశాలలతో తెలంగాణా దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 52 కళాశాలలతో ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్కో కళాశాల 30 ఫార్మా డీ సీట్లు అందిస్తోంది.
తెలంగాణా ఫార్మా డీ కళాశాలల్లో 1710 ఫార్మాడీ సీట్లు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 1560 ఫార్మా డీ సీట్లున్నాయి.
మంచి కళాశాల ఎంపిక ఎలా?
1) ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు ఉన్న కళాశాలలోనే చేరటం శ్రేయస్కరం. పి.సి.ఐ. అనుమతి ఎప్పటివరకూ ఉన్నది కూడా చూసి చేరటం మంచిది.
2) అనుభజ్ఞులయిన సీనియర్‌ అధ్యాపకులు, మంచి ప్రయోగశాలలు, గ్రంథాలయం, పనిచేసే యంత్ర పరికరాలున్న కళాశాలను ఎంచుకోవటం మేలు.
3) పారిశ్రామిక సందర్శనలు, ప్రత్యేక శిక్షణలు, ప్రాంగణ నియామకాలు ఎన్ని జరిగాయో తెలుసుకుంటే వాటి ఆధారంగా కళాశాల నాణ్యత అవగాహన చేసుకోవచ్చు.
4) జీ ప్యాట్‌, పీజీసెట్‌లలో గత రెండు మూడు సంవత్సరాలలో సాధించిన ర్యాంకు ఆధారంగా కళాశాల స్థాయిని అంచనా వేయవచ్చు.
5) 300 పడకలు కలిగి, పేరొందిన ఆస్పత్రితో ఒడంబడిక ఉన్న కళాశాలలో మాత్రమే ఫార్మా డీ చదవటం మంచిది.
కళాశాలలు ఎన్ని? ఎక్కడ?
భారత్‌లో సుమారు 1160 ఫార్మసీ కళాశాలలు ఉండగా వాటిలో సుమారు 78 వేల బీ ఫార్మసీ సీట్లున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 6 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఒక డీమ్డ్‌ యూనివర్సిటీ బీ ఫార్మసీని అందిస్తున్నాయి. తెలంగాణలో 3 ప్రభుత్వ యూనివర్సిటీలలో బీ ఫార్మసీ ఉంది.


 

Posted Date : 02-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌