• facebook
  • whatsapp
  • telegram

సాధిద్దాం.. 100+


* ఎంసెట్‌ - 2019
ఇంజినీరింగ్‌ కలను సాకారం చేసుకోడానికి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల ముందు ప్రధానంగా మూడు అవకాశాలు ఉన్నాయి. జేఈఈ మెయిన్‌-2తోపాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు నిర్వహించే ఎంసెట్‌లు. రాష్ట్రస్థాయిలో కోరుకున్న కోర్సును మంచి కళాశాలలో చేయాలంటే కనీసం వందకు పైగా మార్కులను సాధించుకోవాలి. మూడు పరీక్షలున్నాయని తడబడి తికమక పడినా.. మూడింటిలో ఒక్కటైనా రాకపోతుందా అనే ధీమాకు వెళ్లి నిర్లక్ష్యం చేసినా.. ఫలితం తారుమారవుతుంది. అందుకే మెరుగైన ర్యాంకు సాధనకు ఆచరణ యోగ్యమైన ప్రణాళికను నిపుణులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాన్ని ఆశించే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల తరువాత అత్యంత కీలకమైన, ఎక్కువ శాతం విద్యార్థులు సీటు సాధించేది ఎంసెట్‌ ద్వారానే! దీని ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షలమంది ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రవేశం పొందుతున్నారు. ఇంటర్‌ పరీక్షల తరువాత ఇంజినీరింగ్‌ విభాగంలో విద్యార్థి ప్రణాళికతో తయారైనపుడే కోరిన ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటు సాధించే అవకాశం ఉంటుంది.
ఇంజినీరింగ్‌ విభాగంలో తయారయ్యే విద్యార్థులకు పరీక్షలు వరుసగా ఉన్నాయి. అంటే జేఈఈ మెయిన్‌-2, ఏపీ, తెలంగాణ ఎంసెట్‌లు, ఎంఏహెచ్‌ఈ, విట్‌, ఎస్‌ఆర్‌ఎం, గీతం, కేఎల్‌సీఈ, విజ్ఞాన్‌, కళింగ.. ఇలా చాలా పరీక్షలున్నాయి. తమకు తగిన పరీక్షలు ఎంచుకుని ప్రణాళికబద్ధంగా తయారైనవారు మాత్రమే ఆశించిన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది.

 

ఇలా చదవండి… సబ్జెక్టులు!
ఎంసెట్‌లో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సిలబస్‌కు సమాన ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల ద్వితీయ సంవత్సరం సిలబస్‌పైనే కాదు, ప్రథమ సంవత్సరం సిలబస్‌కు కూడా ప్రిపరేషన్లో ప్రాముఖ్యమిచ్చి చదవాలి.
గణితం: ఎక్కువసార్లు సాధన
ఈ సబ్జెక్టులో కొన్ని నిర్ణీత అధ్యాయాల్లో మాత్రమే కొన్ని ప్రశ్నలు క్లిష్టంగా ఉంటున్నాయి. ప్రశ్నల నిడివి ఎక్కువే కానీ సాధారణ విద్యార్థి చేసే రీతిలోనే ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో లెక్కలనే ఒకటికి రెండుసార్లు సాధన చేయాలి. ఇలా చేస్తే సులభంగా 65 మార్కులపైనే తెచ్చుకోవచ్చు.
భౌతిక శాస్త్రం: నిడివి కీలకం
దీనిలో అన్ని చాప్టర్ల నుంచీ ప్రశ్నలు సమంగానే ఉంటున్నాయి. అయితే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు రావాలంటే నిడివి తక్కువగా ఉన్న అభ్యాసాలను ఎంచుకోవాలి. ఉదాహరణకు... ప్రమాణాలు-మితుల నుంచి ఒక ప్రశ్న వస్తుంది. కైనమేటిక్స్‌ నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. అయితే రెండోదాని కంటే మొదటిది చాలా పెద్ద చాప్టర్‌. పైగా ఎన్ని ప్రశ్నలకు తయారైనా ఊహించని ప్రశ్నతో విద్యార్థికి ఇబ్బంది కలగజేసే అవకాశముంది. కాబట్టి ప్రమాణాలు-మితులు లాంటి చాప్టర్లు బాగా చదివిన విద్యార్థులు మార్కులు అదనంగా సాధించగలరని చెప్పవచ్చు. అకాడమీ పుస్తకంలోని వాక్యాలపైనే ప్రశ్నలు ఎక్కువ ఉంటున్నాయి. అందుకే వాక్యాలను ప్రశ్నలరూపంలో మార్చుకుని అభ్యాసం చేయాలి.
రసాయనశాస్త్రం: ఆ రెండూ ముఖ్యం
ఈ సబ్జెక్టులో సులువుగా మార్కులు సాధించుకోవచ్చు. అకాడమీ పుస్తకంలోని వాక్యాలను మాత్రమే పునశ్చరణ చేసుకున్నా గానీ కనీసం 40 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవచ్చు. అకర్బన, భౌతిక రసాయన శాస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా తయారైతే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ మార్కులు తెచ్చుకునే లక్ష్యసాధనలో ముందడుగు వేసినట్టే!

 

సమయ ప్రణాళిక...
జేఈఈ మెయిన్‌ రెండోసారి, ఏపీ ఎంసెట్‌, టీఎస్‌ ఎంసెట్‌ల తేదీలు ఖరారయ్యాయి కాబట్టి ఈ మూడు పరీక్షలూ దృష్టిలో ఉంచుకుని సరైన ప్రణాళిక వేసుకోవాలి.
ఇంటర్‌ తుది పరీక్ష మార్చి 13న జరుగుతుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 8 వరకూ జేఈఈ మెయిన్‌- 2కు కేటాయించుకోవాలి. మార్చి 15 నుంచి మార్చి 30 వరకూ సన్నద్ధతకూ; ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకూ కనీసం 5 నమూనా పరీక్షలకూ వినియోగించటం మేలు.
సీనియర్‌ ఇంటర్‌ పరీక్షలు తాజాగా రాస్తారు కాబట్టి ప్రాధాన్యం జూనియర్‌ ఇంటర్‌ సిలబస్‌కు ఇస్తూ 15 రోజుల తయారీ ఉండాలి. ఈ సమయంలో బోధన కంటే సాధనకు అధిక ప్రాముఖ్యం ఇవ్వాలి. జూనియర్‌ ఇంటర్‌ సిలబస్‌ అభ్యాసంపై శ్రద్ధ పెట్టినప్పటికీ సీనియర్‌ ఇంటర్‌ సిలబస్‌ను భాగాలుగా చేసుకుని కనీసం పరీక్షల రూపంలో పునశ్చరణ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
ఏప్రిల్‌ 8 నుంచి 12వ తేదీలోపు జేఈఈ మెయిన్‌ రెండో పరీక్ష పూర్తి కావొచ్చు. ఏపీ ఎంసెట్‌కు మధ్యలో కేవలం 8 రోజులుంటాయి. ఈ వ్యవధిలో అదనపు తయారీకి అవకాశం లేదు.

 

వీలైనన్ని నమూనా పరీక్షలు
జేఈఈ మెయిన్‌ పరీక్షలో మొత్తం 90 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్‌-30, ఫిజిక్స్‌-30, కెమిస్ట్రీ-30. ప్రతి సరైన సమాధానానికీ 4 మార్కులు; ప్రతి తప్పు సమాధానానికీ¨ -1 మార్కు. ఎంసెట్‌లో మొత్తం 160 ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్‌-80, ఫిజిక్స్‌-40, కెమిస్ట్రీ-40. మైనస్‌ మార్కుల్లేవు. ఈ తేడాలకు అలవాటు పడటానికి వీలైనన్ని ఎక్కువ నమూనా పరీక్షలు రాయాలి. జేఈఈ మెయిన్స్‌లో పెద్దగా సమయపు ఒత్తిడి ఉండదు. ఎంసెట్‌లో ప్రశ్నల సంఖ్య ఎక్కువైనందున ఈ ఒత్తిడి అధికం. కానీ రుణాత్మక మార్కుల్లేవు కదా, జవాబు తెలియనివాటిని వదిలివేయాల్సిన అవసరం లేదు.
నమూనా పరీక్షలు రాసేటపుడు సబ్జెక్టు వారీగా కేటాయించాల్సిన సమయం సరిగా నిర్ణయించుకోవాలి. కెమిస్ట్రీ పరీక్ష 45 నిమిషాల్లో, ఫిజిక్స్‌ 60 నిమిషాల్లో, మ్యాథ్స్‌ 75 నిమిషాల్లో పూర్తిచేసేలా అభ్యాసం చేయాలి.

 

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ల తేదీలు
ఏపీ ఎంసెట్‌ ఏప్రిల్‌లో జరగనుంది. తెలంగాణ ఎంసెట్‌ ప్రకటన ఇంకా విడుదల కాలేదు కానీ పరీక్ష మేలో నిర్వహిస్తారు.
ఏపీ ఎంసెట్‌ దరఖాస్తు చివరితేదీ: మార్చి 27, 2019
ఆలస్య రుసుము రూ.500తో చేయడానికి చివరితేదీ: ఏప్రిల్‌ 4, 2019
దరఖాస్తులో తప్పుల సవరణ: ఏప్రిల్‌ 6 నుంచి 10 వరకు
ఆలస్య రుసుము రూ.1000తో ఆఖరితేదీ: ఏప్రిల్‌ 9, 2019.
ఆలస్య రుసుము రూ.5000తో ఆఖరితేదీ: ఏప్రిల్‌ 14, 2019
హాల్‌టికెట్ల జారీ: ఏప్రిల్‌ 16 నుంచి
ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీలు: ఏప్రిల్‌ 20, 21, 22, 23
టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష తేదీలు: మే 3, 4, 6.(మే 5న నీట్‌ ఉంది కాబట్టి ఆ తేదీ వదిలివేసి చివరి రోజు మే 6గా నిర్ణయించారు.)
పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది. ఉదయం 10గం. నుంచి మధ్యాహ్నం 1గం.వరకు (రెండు రాష్ట్రాలకు); రెండో షిఫ్టు ఏపీలో మధ్యాహ్నం 2.30గం. నుంచి సాయంత్రం 5.30 వరకు; తెలంగాణలో మధ్యాహ్నం 3.00గం.నుంచి సాయంత్రం 6.00 వరకు.

 

160కి 100కు పైగా...
ఏ పోటీ పరీక్షల్లో అయినా తెలియని లేదా క్లిష్టమైన ప్రశ్నలకు అధిక సమయం కేటాయించకుండా ముందుకుపోగలిగితే నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించే అవకాశముంటుంది. ఎంసెట్‌లో 160 మార్కులకు 100 మార్కులపైన సాధించేలా తయారు కాగలిగితే కోరిన కళాశాలలో సీటు పొందవచ్చు. ఉదాహరణకు.. మ్యాథ్స్‌లో 60, ఫిజిక్స్‌లో 20, కెమిస్ట్రీలో 20 మార్కులు తెచ్చుకున్నా కూడా సులువుగా సీటు పొందవచ్చు.
ఏపీ ఎంసెట్‌ పూర్తిచేసుకున్న తర్వాత టీఎస్‌ ఎంసెట్‌ మే 3, 4, 6 తేదీల్లో ఉంది కాబట్టి ఈ మధ్య వ్యవధిలో కూడా ఆన్‌లైన్‌ గ్రాండ్‌ టెస్టులు తయారవుతూవుంటే సరిపోతుంది. మొత్తం మీద సన్నద్ధతకు తక్కువ సమయం ఉంది. కాబట్టి అన్నీ గ్రాండ్‌ టెస్టుల రూపంలో అభ్యాసం చేస్తూవెళ్లాలి. మధ్యలో ఏదైనా పోటీపరీక్షలుంటే టెస్ట్‌ల సంఖ్యను పరిమితం చేసుకుని మే నుంచి మళ్లీ వాటిని రాసే విధంగా ప్రణాళిక వేసుకోవటం సమంజసం.
బిట్‌శాట్‌ రెండు ఎంసెట్‌లు పూర్తయిన తర్వాత ఉంటుంది. దానికి హాజరయ్యే విద్యార్థులు నమూనా పరీక్షలు ప్రాక్టీస్‌ చేయాలి. దాంతో పాటు ఏప్రిల్‌ 15 నుంచి ప్రతిరోజూ కనీసం గంటసేపు ఇంగ్లిష్‌ ఆప్టిట్యూడ్‌ సాధన చేస్తే మంచి స్కోరు వస్తుంది.

- పి.వి.ఆర్‌.కె. మూర్తి, శ్రీ గాయత్రి విద్యాసంస్థలు

Posted Date : 05-11-2020

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌