• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ ఎంసెట్‌..అభ్యాసం చేస్తే సులువే!

బైపీసీ, ఎంపీసీ గ్రూపులతో ఇంటర్‌ పరీక్షలు రాసినవారు వృత్తివిద్యాకోర్సుల్లో చేరటానికి రాసే పరీక్ష..ఎంసెట్‌. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది నుంచీ దీన్ని తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుపై పట్టు సాధించటానికి కృషి చేయటంతోపాటు ఆన్‌లైన్‌ పద్ధతికి అలవాటుపడేలా సాధన చేయటం కూడా విద్యార్థులకు ఇప్పుడు చాలా అవసరం. అప్పుడే ఆశించిన ర్యాంకును సులువుగా సాధించగలుగుతారు!

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాతం ఇంటర్‌ విద్యార్థుల్లో ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపుల్లోనే ఉంటున్నారు. ఈసారి సీనియర్‌ ఇంటర్‌ పూర్తి చేస్తున్న విద్యార్థులు 12 లక్షల వరకూ ఉంటే వారిలో దాదాపు ఆరు లక్షలమంది ఇంజినీరింగ్‌ లేదా మెడికల్‌ కోర్సుల్లో చేరడానికి ఇష్టం చూపుతున్నారు. వీరిలో దాదాపు 3.5 లక్షల మంది ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చరల్‌, ఫార్మసీ, వెటర్నరీ గ్రాడ్యుయేషన్‌లలో చేరడానికి ఉపయోగపడే పరీక్ష ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌).
రెండేళ్ల నుంచి వైద్య విద్య ఈ పరిధిలో లేదు. నీట్‌ ప్రత్యామ్నాయ పరీక్ష అయ్యింది. ఇంజినీరింగ్‌ విభాగపు విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మెయిన్స్‌, బిట్‌శాట్‌ లాంటివి ఉన్నప్పటికీ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరడానికి ఎక్కువమందికి ఉపయోగపడుతున్నది ఎంసెట్‌ మాత్రమే.
గత ఏడాది (2017) ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షకు హాజరైన విద్యార్థులు తెలంగాణ- 1,31,899, ఆంధ్రప్రదేశ్‌- 1,87,484. వీరిలో క్వాలిఫై అయిన విద్యార్థులు తెలంగాణ నుంచి 98,596, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,23,974. ఉన్న సీట్ల సంఖ్య క్వాలిఫై అయినవారి కంటే ఎక్కువగానే ఉంది. అయితే విద్యార్థికి గ్రాడ్యుయేషన్‌ ద్వారా సంపూర్ణ ఫలితం పొందాలంటే సరైన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీటు సాధించాలంటే మంచి ర్యాంకు సాధించి యూనివర్సిటీ కళాశాలల్లో తాను ఆశించిన బ్రాంచిలో సీటు పొందే విధంగా ప్రణాళిక, తయారీ ఉండాలి.
ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షల్లో 90%పైగా మార్కులు సాధించే విద్యార్థులు లక్షకు పైగా ఉంటున్నారు కానీ ఎంసెట్‌లో 160 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 80 మార్కులకుపైగా సాధించే విద్యార్థులు రెండు రాష్ట్రాల్లో కలిపి 10వేల నుంచి 15 వేలలోపే ఉంటున్నారు. దీనికి కారణం విద్యార్థులకు పరీక్షపై అవగాహన లోపం లేదా ప్రణాళిక పటిష్ఠంగా ఏర్పరచుకోలేకపోవడం! అగ్రికల్చరల్‌, ఫార్మసీ విభాగపు ఎంసెట్‌కు కూడా గత ఏడాది హాజరైన విద్యార్థులు తెలంగాణ నుంచి 73,000, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 75,489. ఈ సంఖ్య నీట్‌కు హాజరైన విద్యార్థుల కంటే ఎక్కువ.వారిలో అర్హత పొందినవారు వరుసగా 63,570, 55,288.

 

వంద మార్కులు కష్టం కాదు
ఇంటర్‌ పూర్తిచేసిన ఎంపీసీ లేదా బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువశాతం వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఉపయోగపడే పరీక్ష ఎంసెట్‌. ఇది కష్టమైన పరీక్ష కాదు. ఎందుకంటే అన్ని ప్రశ్నలూ కచ్చితంగా తెలుగు అకాడమీ పుస్తకాల్లోని వాక్యాల నుంచే వస్తున్నాయి. అందుకే గత ఏడాది తొలి పది ర్యాంకుల విశ్లేషణ చూస్తే 3-5 మార్కులలోపే పూర్తవుతున్నాయి. అంటే పోటీ ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. కొందరు విద్యార్థులు 95 శాతంపైగా తెచ్చుకోగలిగితే సాధారణ విద్యార్థి 160 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 100 మార్కులు సాధించడం కష్టతరమేమీ కాదు.కావాల్సింది సరైన ప్రణాళిక మాత్రమే.

 

దరఖాస్తుకు ఇంకా గడువుంది
రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు పూర్తి చేయడానికి చివరితేదీ ఆంధ్రప్రదేశ్‌ - ఏప్రిల్‌ 6, 2018; తెలంగాణలో ఏప్రిల్‌ 11, 2018. రూ.1000, రూ.5000, రూ.10,000 అపరాధ రుసుముతో ఆంధ్రప్రదేశ్‌లో చివరితేదీలు వరుసగా.. ఏప్రిల్‌ 11, 16, 21. తెలంగాణలో ఏప్రిల్‌ 18, 24, 28.
పరీక్ష తేదీలు:
* ఇంజినీరింగ్‌: ఆంధ్రప్రదేశ్‌- ఏప్రిల్‌- 22, 23, 24, 25; తెలంగాణ- మే 4, 5, 7.
* అగ్రికల్చరల్‌, వెటర్నరీ, ఫార్మసీ: ఆంధ్రప్రదేశ్‌- ఏప్రిల్‌ 25, 26 (రెండు విభాగాలు రాసేవారికి 24, 25) తెలంగాణ- మే 2, 3
* ఎంసెట్‌ 160 ప్రశ్నలతో 3 గంటల వ్యవధితో జరుగుతుంది. ఇంజినీరింగ్‌ విభాగపు అభ్యర్థులైతే మేథమేటిక్స్‌-80, ఫిజిక్స్‌-40, కెమిస్ట్రీ-40 ప్రశ్నలతోనూ, అగ్రికల్చరల్‌ విభాగంలో బయాలజీ- 80 (బోటనీ 40, జువాలజీ 40), ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 40 ప్రశ్నలతో ఉంటున్నాయి.
ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల్లో పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతోంది. నూతన విధానంలో పరీక్ష 3 లేదా 4 రోజులు జరుగుతుంది. వివిధ రోజుల్లో లేదా ఒకే రోజులో రెండు షిఫ్టుల్లో వేర్వేరుగా పరీక్ష రాసే విద్యార్థులకు వేరువేరు ప్రశ్నపత్రాలు ఉంటున్నాయి. పరీక్షల్లో ప్రశ్నలస్థాయి కచ్చితంగా ఒకేవిధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ వేరుగా ఉన్నప్పటికీ వారి మార్కులను నార్మలైజేషన్‌ చేసి తుది మార్కు ఇస్తారు.
ఇవి గమనించండి

 

ఎంపీసీ
మేథమేటిక్స్‌ 80 మార్కులకు జరుగుతుంది. దీనిలో ఇంటర్మీడియట్‌, పోటీపరీక్షల ప్రశ్నల్లో వ్యత్యాసం తక్కువ. కాబట్టి దీనిలో 80 మార్కులకు 70 వరకూ సాధించాలి.ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు సమప్రాధాన్యమిచ్చి ఈ సమయంలో అభ్యాసం చేయాలి. అయితే వీటిలో పట్టు సాధించిన అంశాలకు ఎక్కువ సమయం కేటాయించడం మేలు. ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో మొత్తం 80 మార్కులకు 40 సాధించినా విద్యార్థి 110 మార్కులకుపైగా సాధించే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రాసేటపుడు ‘క్వశ్చన్‌ ఫర్‌ రివ్యూ’ అనేది తక్కువ ప్రశ్నలకే ఇవ్వడం మేలు. కనీసం 3 ఆన్‌లైన్‌ పరీక్షలైనా తుది పరీక్ష రూపంలో రాయాలి. అలాగే పరీక్ష రెండు షిఫ్టుల్లో అంటే ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు, మధ్యాహ్నం 3 గం. నుంచి సాయంత్రం 6 గం. వరకు జరుగుతాయి. కాబట్టి అదే సమయంలో పరీక్షలకు అభ్యాసం చేయాలి.

 

బైపీసీ
బైపీసీ విద్యార్థులు బయాలజీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. బయాలజీలో 80 మార్కులకు 75కుపైగా సాధించేలా ఉండాలి. కెమిస్ట్రీ కూడా గుర్తుంచుకోవాల్సిన జవాబులే ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి పునశ్చరణకు ఎక్కువ సమయం కెమిస్ట్రీకి కేటాయిస్తే 40కు 30 మార్కులకుపైగా సాధించే అవకాశముంటుంది. ‌ఫిజిక్స్‌ ప్రాథమికాంశాలకు, తక్కువ సమయంలో పునశ్చరణకు అవకాశమున్న చాప్టర్లకు ప్రాధాన్యమిచ్చి పూర్తి చేసుకోవడం మేలు. కనీసం 5 నమూనా తుది పరీక్షలను పరీక్ష నిర్వహణ సమయంలోనే రాయాలి. రుణాత్మక మార్కులు లేవు. కాబట్టి జవాబులు గుర్తించకుండా వదిలేయొద్దు. పరీక్షలో సబ్జెక్టులు రాసే వరుసక్రమం ఇప్పుడు మార్చుకోవద్దు. అలవాటైన పద్ధతిలోనే రాయడం మేలు. కొత్త విభాగాలు చదవొద్దు. వచ్చినవాటి పునశ్చరణ ద్వారా ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు.

 

మౌస్‌ వాడటం మేలు
పరీక్ష ప్రారంభించడానికి ముందు విద్యార్థి తన వివరాలను పొందుపరచడానికి మాత్రమే కీబోర్డును ఉపయోగించుకోవాలి. పరీక్ష ప్రారంభమైన తరువాత మౌస్‌తోనే జవాబులు గుర్తించడం అలవాటు చేసుకోవాలి.
పరీక్ష రాసేటపుడు కీబోర్డును నొక్కితే సిస్టమ్‌ హ్యాంగ్‌ అయ్యి కొద్దిసేపు ఆగిపోతుంది. దీనివల్ల విద్యార్థి ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అయితే ఒకవేళ పొరపాటున కీబోర్డ్‌ను నొక్కితే సిస్టమ్‌ హ్యాంగ్‌ అయినపుడు క్లాక్‌ కూడా ఆగిపోతుంది. మళ్లీ ప్రారంభించినపుడు క్లాక్‌ కూడా పాత స్థానం నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి విద్యార్థికి సమయం కోల్పోయే ప్రమాదం లేదు. పరీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు మౌస్‌ వాడటం మేలు.
ప్రివ్యూ: పరీక్ష ప్రారంభించగానే స్క్రీన్‌ పైభాగంలో ప్రివ్యూ అనే ఆప్షన్‌ ఉంటుంది. దానిని వాడుకోవడం ద్వారా ప్రశ్నపత్రం రూపంలో అంటే ప్రింటెడ్‌ పేపర్‌లా వరుసగా ప్రశ్నలన్నీ కనిపిస్తాయి. ఈ ప్రివ్యూ ద్వారా ఓపెన్‌ చేసి 160 ప్రశ్నలు ఒకసారి చూసుకుంటే విద్యార్థికి సులభమైన ప్రశ్నలు ఎక్కడున్నాయో అర్థమవుతుంది. అక్కడ సమయం కేటాయించుకోవచ్చు. పరీక్ష రాసేటపుడు ఏకకాలంలో ఒక ప్రశ్న, దానికి సంబంధించిన 4 సమాధానాలు మాత్రమే తెరపై కనపడతాయి. కాబట్టి ఈ ప్రివ్యూను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే మేలు.
రివ్యూ: ఒక ప్రశ్నకు సమాధానం రాబట్టవచ్చు.. దానిని తరువాత గుర్తిద్దాం అనుకుంటే రివ్యూలో ఫ్లాగ్‌ చేస్తే వేరే రంగులోకి మారుతుంది. దీనివల్ల విద్యార్థి సమయం దొరికినపుడు వెంటనే ఆ ప్రశ్నలకు వెళ్లి జవాబులు గుర్తించే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ యుగంలో దానిని అనుగుణంగా వాడటం నేర్చుకుంటే విద్యార్థి లాభం పొందినట్లే!

 

సాధన చాలా ముఖ్యం
పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది కాబట్టి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయే ప్రమాదముంది. వివిధ పరిశోధన కేంద్రాలు చేసిన సర్వేలో ఒక విద్యార్థిని పరీక్షకు కాగితం, పెన్నుతో అభ్యాసం చేయించి తుదిపరీక్ష కంప్యూటర్‌పై రాయిస్తే వారి సామర్థ్యం 21% తగ్గినట్లు తేలింది. అంటే ఆన్‌లైన్‌ విధానంలోనే పరీక్ష రాసే విధానాన్ని అభ్యాసం చేయనివారు 20% వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఉన్న ఈ తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో అభ్యాసం చేయాలి.
ఆన్‌లైన్‌లో సాధన చేయడం వేరు, పరీక్ష రాయడం వేరు. సాధన చేయడమంటే 20, 30 ప్రశ్నలకు నిర్దిష్ట కాలవ్యవధిలో అభ్యాసం చేయడం. కానీ తుదిపరీక్ష రూపంలో రాయడమంటే సహ విద్యార్థులతో కలిసి 3 గంటలు కంప్యూటర్‌పై అన్ని సబ్జెక్టులకూ సమప్రాధాన్యమిచ్చి రాయడం చేయాలి.
ఎంపీసీ విద్యార్థులకు మిగిలిన అన్ని పరీక్షలూ ఆన్‌లైన్‌ విధానంలోనే కాబట్టి వారికి కొంత నేర్పు ఉంటుంది. కానీ బయాలజీ విద్యార్థులకు ఇది తొలిసారిగా రాయబోయే ఆన్‌లైన్‌ పరీక్ష అవుతుంది. వారు విధిగా ఎక్కువ పరీక్షలు అభ్యాసం చేయాలి. బీటెక్‌ (బయోటెక్నాలజీ)లో చేరాలనుకునేవారు ఇంటర్‌ బైపీసీతోపాటు మేథమేటిక్స్‌ బ్రిడ్జ్‌ కోర్సు పరీక్ష పూర్తిచేసి ఉంటేనే దీనిలో చేరడానికి అర్హులు. అలాగే ఫార్మా-డి కోర్సులోనూ 50% సీట్లు బైపీసీ విద్యార్థులకు 50% సీట్లు ఎంపీసీ విద్యార్థులకు ఉంటాయి.

Posted Date : 05-11-2020

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌