• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌లో ఏం చేయాలి?

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు వృత్తివిద్యల్లోకి ప్రవేశించటానికి తోడ్పడే ఎంసెట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ పరీక్ష సమయం దగ్గరపడుతున్న ప్రస్తుత తరుణాన సన్నద్ధతను పటిష్ఠం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి. పట్టుదలతో లక్ష్యంవైపు దూసుకుపోవాలి!

మొదటిసారి ఎంసెట్‌ను ఆన్‌లైన్‌ పద్ధతిలో రాయబోతున్న విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం మీద పూర్తిస్థాయి అవగాహన ఉండనవసరం లేదు. ప్రాథమిక అవగాహన కోసం కొన్ని జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకుందాం.
* ఆన్‌లైన్‌ తుది పరీక్షకు ముందుగానే AP EAMCET MOCK TESTS 2017 ద్వారా ఆన్‌లైన్‌ సాధనకు అవకాశం కలిస్తున్నారు. అందుకని ఒకటి రెండు మాదిరి ప్రశ్నపత్రాలను కంప్యూటర్‌ మీద అభ్యాసం చేయడం ఉత్తమం.
* పరీక్ష హాలులో కేటాయించిన కంప్యూటర్‌, ఇంటర్‌నెట్‌ సదుపాయం తగినవిధంగా ఉందో లేదో చెక్‌ చేసుకోవాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌కి తెలియపరిచి సరైన సిస్టమ్‌ను పొందవచ్చు.
* ముందుగా సూచనలను పూర్తిగా చదివిన తరువాత ప్రశ్నలకు సమాధానాన్ని సేవ్‌ చేయటం మొదలుపెట్టాలి.
* డెస్క్‌టాప్‌లో అనుసంధానించి ఉన్న చివరిపేజీ వరకు చెక్‌ చేసుకుని 160 ప్రశ్నలు డిస్‌ప్లే అయ్యాయో లేదో చూసుకుని ఆరంభించాలి.
* సాధారణంగా సమాధానాన్ని సేవ్‌ చేసిన తరువాత సుమారు 7 సెకన్లు సమయం తీసుకుంటుంది. కాబట్టి ‘సేవ్‌ అయిందా లేదా’ అని సమయం వృథా చేసుకోనవసరం లేదు. తరువాతి ప్రశ్నకు బాణపు గుర్తు ద్వారా ముందుకెళ్తున్నపుడు ఆటో సేవ్‌ అవుతుంది.
చివరి నిమిషం వరకు సబ్మిట్‌ బటన్‌ను నొక్కకుండా కంగారు పడేకంటే ముందు నుంచి సమయపాలన పాటించటం మేలు. చివరి పది నిమిషాలూ పునశ్చరణ కోసం సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాధానాల్లో కచ్చితత్వాన్ని సాధించవచ్చు.

 

పాటించాల్సిన పది సూత్రాలు


1. ప్రాథమిక సూత్రాల పునశ్చరణ
గత చరిత్రను తిరగేస్తే తెలుగు రాష్ట్రాల ఎంసెట్‌లో ఎక్కడా లోతుగా, క్లిష్టంగా, తికమకగా ఇచ్చిన సందర్భాలు లేవు. పూర్తిగా ప్రాథమిక అంశాల మీద, సూత్రాల ఆధారంగా పరీక్షించే విధానమే కనపడుతుంది. కాబట్టి వాటిని ‘తెలిసినవే’, ‘నాకు వచ్చు కదా’ అని దాటవేయకుండా శ్రద్ధగా పునశ్చరణ చేయటం సముచితం.


2. కష్టపడటంతో పాటు, స్మార్ట్‌గా..
విజయానికి ఎపుడూ దగ్గరి దారి లేదు. సరైన రీతిలో సరైన ప్రణాళికతో సరైన సమయంలో నిర్దేశించుకోవటం అవసరం. ఇలా స్మార్ట్‌గా ఎంసెట్‌కు సన్నద్ధం కావచ్చు.


3. తక్కువ పరిధి ఉన్న అంశాలు
ఉదాహరణకు మ్యాథమేటిక్స్‌లో మ్యాథమేటికల్‌ ఇండక్షన్‌, పార్షియల్‌ ఫ్రాక్షన్స్‌, పోలోర్‌ కో ఆర్డినేట్స్‌, ర్యాండమ్‌ వేరబుల్స్‌ లాంటి తక్కువ పరిధి ఉన్న అంశాలను ముందుగా పూర్తి చేసుకోవాలి. ఇలా చేయటం ద్వారా సమయానుకూల సన్నద్ధత సరైన రీతిలో సొంతమవుతుంది.


4. స్వీయ తయారీ
అభ్యర్థులు ఎవరికి వారుగా అర్థం చేసుకుని రాసుకున్న షార్ట్‌ నోట్సు ఉపయోగకరం. సూత్రాలు, ప్రాథమిక విషయాలను తయారుచేసుకుంటే పునశ్చరణ వేగంగా పూర్తి చేయడం సులువవుతుంది.


5. ఆసక్తి ఉన్న సబ్జెక్టు
కటాఫ్‌ మార్కులు సబ్జెక్టుల వారీగా లేవు కాబట్టి ఎక్కువ పట్టు, ఆసక్తి ఉన్న సబ్జెక్టులోనే సహజంగానే ఎక్కువ స్కోర్‌ సాధ్యమవుతుంది. కాబట్టి ఆ సబ్జెక్టు అంశాలను సరిగా మననం చేసుకోవటం అవసరం.


6. సమయ పాలన
అభ్యర్థిని ప్రేరేపించే ప్రశ్నని ఇచ్చి దానిమీద ఎక్కువ సమయం వృథా అయ్యేటట్టు చేయటం ప్రశ్నపత్రం తయారీలో నిపుణత. అత్యున్నత ర్యాంకు సాధించటంలో ఇలాంటి అవరోధాలుంటాయి. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నని వీలైనంత త్వరగా వదిలివేసి, తదుపరి ప్రశ్నకు వెళ్ళగలగడమే సమయపాలనలో అత్యంత ముఖ్యం.


7. రసాయనశాస్త్రం మరో కీలక అంశం
రసాయనశాస్త్రంలో ప్రాథమిక అంశాలను పూర్తిగా పునశ్చరణ చేయగలిగితే 30 నిమిషాల్లో పూర్తిచేయవచ్చు. అక్కడ మిగుల్చుకునే సమయం ఎక్కువ వ్యవధి తీసుకునే గణితం, ఫిజిక్స్‌లలో న్యూమరికల్‌ పరిష్కారాలకు వాడుకోవచ్చు.


8. బలాలు, బలహీనతలు
ఒక ప్రశ్నకు 72 సెకన్లు మాత్రమే సమయం ఉండే ఎంసెట్‌లో తలాతోకా తెలియని ప్రశ్నలకు సమయం వృథా చేయటం సరికాదు. ఈ బలహీనతను అధిగమించటం సన్నద్ధత సమయంలోనే అలవాటు కావాలి. తక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు, సులువైన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు కనుక్కుంటూ వెళ్ళడం ద్వారా స్కోరును పెంచుకోవచ్చు. ఈ తరహా బలం పెంచుకోవాలి.


9. మాదిరి ప్రశ్నపత్రాలు
దాదాపు 30 రోజుల సమయమున్న ఏపీ ఎంసెట్‌ అయినా సుమారు 45 రోజుల సమయమున్న తెలంగాణ ఎంసెట్‌ అయినా మాదిరి ప్రశ్నపత్రాల సాధన ఎంతో ముఖ్యం. పరీక్ష పద్ధతి ఆన్‌లైన్‌ అయినా, ఆఫ్‌లైన్‌ అయినా ఈ అభ్యాసం విజయావకాశాలను గణనీయంగా పెంచుతుంది.


10. వెయిటేజి మంత్రం
ఇంటర్మీడియట్‌ ఆప్షనల్స్‌లో తెచ్చుకునే 24 మార్కులు ఎంసెట్‌ ఫైనల్‌ ర్యాంకులో 1 ర్యాంకుతో సమానం. కానీ ఎంసెట్‌లో తెచ్చుకునే ఒక మార్కు ఇంటర్మీడియట్‌లో తెచ్చుకునే 14 మార్కులతో సమానం. కాబట్టి ఎంసెట్‌లో సాధించే ప్రతి మార్కూ అభ్యర్థి ర్యాంకును మెరుగుపరుస్తుంది. మంచి కళాశాలలో చేరే అవకాశాన్ని దగ్గర చేస్తుంది.
సమయం తక్కువుందని ఆదుర్దా పడకుండా అన్ని సబ్జెక్టులకూ సమాన ప్రాధాన్యమివ్వాలి. సింపుల్‌ ఫార్ములాలను నిర్లక్ష్యం చేయకుండా సులువైన అంశాలనుంచి క్లిష్టమైన అంశాల పునశ్చరణకు మార్గాన్ని సుగమం చేసుకోవాలి.

 

కీలకాంశాలు ఇవే
 

గణితశాస్త్రం:
* వెక్టార్స్‌ (సదిశలు)
* ప్రాబబులిటీ (సంభావ్యత)
* 3.D. జామెట్రీ (త్రిమితీయ జామితి)
* లిమిట్స్‌ (అవధులు)
* ఇన్‌డెఫినెట్‌ ఇంటిగ్రల్స్‌ (అనిశ్చిత సమాకలనం)
* డెఫినెట్‌ ఇంటిగ్రల్స్‌ (నిశ్చిత సమాకలనం)
* సెట్స్‌, రిలేషన్స్‌, ఫంక్షన్స్‌ (సమితులు, సంబంధాలు, ప్రమేయాలు)
* పర్ముటేషన్స్‌, కాంబినేషన్స్‌ (ప్రస్తారాలు, సంయోగాలు)
* కాంప్లెక్స్‌ నంబర్స్‌ (సంకీర్ణ సంఖ్యలు)

 

భౌతిక శాస్త్రం:
* కరెంట్‌ ఎలక్ట్రిసిటీ (ప్రవాహిక విద్యుత్‌)
* హీట్‌, థర్మోడైనమిక్స్‌ (ఉష్ణం, ఉష్ణగతి శాస్త్రం)
* ఎలక్ట్రోస్టాటిక్స్‌ (స్థిర విద్యుత్‌)
* మాగ్నటిక్‌ ఎఫెక్ట్‌ ఆఫ్‌ కరెంట్‌ అండ్‌ మాగ్నటిజం (విద్యుత్‌ ప్రవాహ అయస్కాంత ప్రభావం, అయస్కాంతత్వం)
* వర్క్‌, పవర్‌ ఎనర్జీ (పని, శక్తి, సామర్థ్యం)
* వేవ్‌ మోషన్‌ (తరంగ చలనం)
* వేవ్‌ మోషన్‌ (తరంగ చలనం)
* సింపుల్‌ హార్మోనిక్‌ మోషన్‌ (సరళహరాత్మక చలనం)
* ఫిజిక్స్‌ ఆఫ్‌ నూక్లియస్‌ (కేంద్ర భౌతిక శాస్త్రం)
* సాలిడ్స్‌ అండ్‌ సెమీ కండక్టర్‌ డివైజెస్‌ (ఘన పదార్థం, అర్ధవాహక పరికరాలు)
* మోడరన్‌ ఫిజిక్స్‌ (ఆధునిక భౌతిక శాస్త్రం)
* సెంటర్‌ ఆఫ్‌ మాస్‌ (గురుత్వకేంద్రాలు)

 

రసాయన శాస్త్రం:
* కెమికల్‌ బాండింగ్‌ (రసాయన బంధం)
* ఎస్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్‌ (ఎస్‌ గ్రూపు మూలకాలు)
* పి బ్లాక్‌, డి బ్లాక్‌ (పి, డి గ్రూపు మూలకాలు)
* జనరల్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ (సాధారణ రసాయనశాస్త్రం)
* రెడాక్స్‌ రియాక్షన్స్‌ (ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు)
* అయానిక్‌ ఈక్విలిబ్రియం (అయాను సమతుల్యం)
* కెమికల్‌ కెనటిక్స్‌ (రసాయన గతిశాస్త్రం)

 

వృక్ష శాస్త్రం (బోటనీ):
* డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ వరల్డ్‌
* మార్ఫాలజీ ఆఫ్‌ ది ఫ్లవరింగ్‌ ప్లాంట్‌ (పుష్పించే మొక్క బాహ్య స్వరూప శాస్త్రం)
* టాక్సానమీ ఆఫ్‌ ఎంజియోస్పెర్మ్స్‌ (వర్గీకరణ శాస్త్రం)
* ఎనాటమీ ఆఫ్‌ ది ప్లాంట్స్‌ (మొక్కల అంతర్నిర్మాణ శాస్త్రం)
* ప్లాంట్‌ టిష్యూస్‌ (వృక్ష కణజాల శాస్త్రం)
* మాలిక్యులర్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటెంట్‌ (అనువంశిక జీవాణు శాస్త్రం)
* ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటెన్స్‌ అండ్‌ వేరియేషన్‌ (అనువంశిక సూత్రాలు, విధానాలు)
* బయోటెక్నాలజీ ప్రిన్సిపుల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ (జీవసాంకేతిక శాస్త్ర సూత్రాలు, విధానాలు)
* బయోటెక్నాలజీ అప్లికేషన్స్‌ (జీవసాంకేతిక శాస్త్ర అన్వయాలు)
* ఫొటో సింథసిస్‌ (కిరణజన్య సంయోగక్రియ)
* రెస్పిరేషన్‌ ఇన్‌ ప్లాంట్స్‌ (మొక్కల్లో శ్వాసక్రియ)
* ట్రాన్స్‌పోర్టింగ్‌ ప్లాంట్స్‌ (మొక్కల్లో నీటి ఖనిజ లవణాల రవాణా)

 

జంతుశాస్త్రం (జువాలజీ):
* హ్యూమన్‌ అనాటమీ (మానవ శరీర నిర్మాణ క్రియాశీలక శాస్త్రం)
* జెనెటిక్స్‌ (జన్యుశాస్త్రం)
* బయోడైవర్సిటీ (జీవవైవిధ్య శాస్త్రం)
* డైవర్సిటీ ఆఫ్‌ లివింగ్‌ వరల్డ్‌ (జీవ ప్రపంచ సమూహాలు)
* ఇకాలజీ (జీవావరణ శాస్త్రం)


 

Posted Date : 05-11-2020

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌