• facebook
  • whatsapp
  • telegram

చేజార్చుకోవద్దు.. సదవకాశం!

ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో కీలక ఘట్టం... వెబ్‌ ఆప్షన్ల నమోదు

కష్టపడి చదివి ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించినంత మాత్రాన మంచి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీటు వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఇది అందరికీ వర్తించకున్నా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవడంలో మెలకువలు తెలుసుకోకుంటే జరిగేది మాత్రం అదే. దీన్ని బట్టి మంచి ర్యాంకు సాధించడం ఎంత ముఖ్యమో.... వెబ్‌ ఆప్షన్లు సరిగా ఇచ్చుకోవడం అంతకంటే ముఖ్యం. తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ...అంటే అయిదు రోజులపాటు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఏపీ కౌన్సెలింగ్‌ తేదీలను ఇంకా ప్రకటించాల్సివుంది. వెబ్‌ ఆప్షన్ల కీలక ఘట్టంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందామా?
 

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం ర్యాంకర్లు 88,728 మంది. వీరిలో అబ్బాయిలు  48,781 మంది, అమ్మాయిలు 31,947 మంది. ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో మొత్తం ర్యాంకర్లు 1,33,066 మంది. వీరిలో అబ్బాయిలు 79030 మంది, అమ్మాయిలు 54,036 మంది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఉన్న బీటెక్‌ సీట్లలో 70 శాతం సీట్లనే కన్వీనర్‌ కోటా కింద కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. తెలంగాణలో 1.05 లక్షలు, ఏపీలో 1.20 లక్షలకుపైగా సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వెబ్‌ ఆప్షన్ల నాటికి కచ్చితమైన లెక్క తేలుతుంది. రెండు రాష్ట్రాల్లో కన్వీనర్‌ కోటా సీట్ల కంటే ప్రవేశాలు పొందే వారి సంఖ్య తక్కువ. ఏదో ఒక కళాశాలలో...ఏదో ఒక బ్రాంచి కావాలనుకుంటే సమస్య లేదు. అయితే ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు వచ్చేసరికి నాణ్యమైన కళాశాలలో...కోరుకున్న బ్రాంచి దక్కించుకోవాలన్నదే అధిక శాతం మంది లక్ష్యం. అందుకే వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు.
 

ఒక్క విడత కౌన్సెలింగే అనుకోండి
చాలామంది ‘కౌన్సెలింగ్‌ మొదటి విడత కాకుంటే రెండో విడత ఉంది కదా’ అనుకుంటారు. మొదటి విడతలో నాణ్యమైన కళాశాలల్లో డిమాండ్‌ ఉన్న బ్రాంచీల్లో సీట్లు నిండిపోతాయి. అంటే రెండో విడతలో మిగిలిన సీట్లకే పోటీపడాలి. మొదటి విడతలో సీట్లు దక్కించుకున్న వారు మరో కళాశాల/బ్రాంచీకి పోటీపడి సీటు పొందితే తప్ప అతను మొదటి విడతలో పొందిన సీటు ఖాళీ కాదు. అందుకే ఒక విడత కౌన్సెలింగ్‌ మాత్రమే ఉందని వెబ్‌ ఆప్షన్లను తెలివిగా ఇచ్చుకోవడం అత్యంత ముఖ్యం.
 

ఓపెన్‌ కేటగిరీలో ఎవరైనా చేరొచ్చు
ఓసీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. అంటే దాని అర్ధం కేవలం అగ్ర కులాల విద్యార్థులకు ఆ మొత్తం సీట్లను కేటాయిస్తారనుకుంటే పొరపాటు. ఓపెన్‌ కేటగిరీకి ఇతరులు ఎవరైనా పోటీపడవచ్చు. ఉదాహరణకు ఓబీసీ విద్యార్థికి 9 వేల ర్యాంకు వచ్చిందనుకుందాం. ఆ విద్యార్థి ఓపెన్‌ కేటగిరీ కింద సీట్లు తీసుకోవచ్చు. ఆ విద్యార్థి ఇచ్చిన మొదటి ఆప్షన్‌కు ఓపెన్‌ కేటగిరీ కింద సీట్లు వస్తే ఆ విభాగం కిందే సీటు కేటాయిస్తారు. దీన్ని బట్టి కన్వీనర్‌ కోటా కింద 70 వేల ఇంజినీరింగ్‌ సీట్లున్నా...అందులో 35 వేల సీట్లు అగ్రవర్ణాలవారికి మాత్రమే కాదన్నది గుర్తుంచుకోవాలి.
 

ముందుగా సీట్ల కేటాయింపు ఎవరికి? 
నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఐసీ) నిపుణులు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సీట్లను కేటాయిస్తారు. సీట్లు కేటాయించేందుకు ప్రోగ్రామింగ్‌ నడుపుతారు. మొదట అన్‌ రిజర్వ్‌డ్‌ కోటా కింద 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. అంటే వాటికి ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చు. ఆ సీట్లకు కూడా తెలంగాణ విద్యార్థులు పోటీపడొచ్చు. ఎవరికి మెరిట్‌ ఉంటే వారికి సీట్లొస్తాయి.
 

కళాశాలల పేర్లు.. పారాహుషార్‌! 
రాష్ట్రంలో కొన్ని గ్రూపు విద్యాసంస్థల పేర్లు ఒకేలా ఉంటాయి. వాటి కింద ఒకటికి మించి కళాశాలలున్నాయి. వాటికి ఒకే పేరు ఉంటుంది. కాకపోతే ఒక దానికి పేరు చివరలో ఇంజినీరింగ్‌ కళాశాల ఉంటే...మరో దానికి ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ/ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అని ఉంటాయి. వాటన్నిటికీ ఒకే స్థాయి విద్యా ప్రమాణాలుండవు. వాటిల్లో కొన్ని పాత కళాశాలలున్నాయి. యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా (అటామనస్‌) ఉన్నవి ఉంటాయి. మరికొన్ని కొత్త కళాశాలలుంటాయి. యాజమాన్యం ఒకటీ రెండు కళాశాలలపైనే పూర్తిగా దృష్టి పెడుతుంది. అందుకే ఆ గ్రూపు విద్యాసంస్థల్లోని కళాశాలలను ఎంచుకునేటప్పుడు ఆ కళాశాలల పేర్లను ఒకచోట రాసుకొని... అవి ఎప్పుడు స్థాపించారు? అటామనస్‌ హోదా దేనికి ఉంది? తదితర వివరాలను వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవాలి.
 గత ఏడాది ముగింపు ర్యాంకు ఎలా ఉందో కళాశాలలు, బ్రాంచీల వారీగా జాబితాను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వెబ్‌సైట్లో ఉంచింది. (tseamcet.nic.in) దాన్ని అధ్యయనం చేసి కళాశాల స్థాయిని అంచనా వేయవచ్చు.
నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌), నేషనల్‌ బోర్డు  ఆఫ్‌ అక్రిడిటేేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపుల మధ్య వ్యత్యాసం తెలుసుకోండి. న్యాక్‌ గుర్తింపు అనేది కళాశాల మొత్తానికీ ఇస్తారు. కళాశాలలో ఉన్న సౌకర్యాలు, అధ్యాపకుల సంఖ్య, అర్హతలు లాంటి వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రేడ్‌ ఇస్తారు. అర్హతను బట్టి ఏ, బీ, సీ గ్రేడ్లు ఇస్తారు. ఏ లేదా ఏ ప్ల్లస్‌ ఉంటే సౌకర్యాలు ఎక్కువున్నాయని అర్థం. ఎన్‌బీఏను మాత్రం కళాశాలలోని బ్రాంచీల వారీగా మాత్రమే ఇస్తారు. అన్ని బ్రాంచీలకూ ఎన్‌బీఏ ఉన్న కళాశాలలు చాలా తక్కువ. ఈ గుర్తింపు ఇచ్చేటప్పుడు ఆ బ్రాంచీలో పనిచేస్తున్న అధ్యాపకుల సంఖ్య, విద్యార్హత, ప్రయోగశాలలు, పరిశోధన, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, సగటు మార్కులు, విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, ఆ బ్రాంచీలో చదివినవారికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకోవడానికి (ఎంటెక్‌ లేదా ఎంఎస్‌) సీట్లు దక్కాయా? మొదలైనవి పూర్తిగా పరీక్షించి ఎన్‌బీఏ గుర్తింపు ఇస్తారు. ఈ గుర్తింపు ఉన్న బ్రాంచీల్లో విద్యార్థులు చేరితే ట్యూషన్‌ ఫీజుకు అదనంగా రూ.5 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ కళాశాలల్లో ఫీజు ఏడాదికి రూ.18 వేలు మాత్రమే. కాకపోతే వాటిల్లో కూడా కొన్ని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుంటాయి. వాటికి రూ.35 వేల వార్షిక రుసుం ఉంటుంది. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేముందు వాటిని గమనించాలి. తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 3,200 వరకు సీట్లున్నాయి.
10 వేల ర్యాంకు లోపు తెచ్చుకున్న వారికి మొత్తం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఉంటుందనుకోవడం పొరపాటు. నిబంధనల ప్రకారం ఆదాయ ధ్రువపత్రం ఉన్నవారికే అది వర్తిస్తుంది. అంటే ఆ ప్రకారం నెలకు రూ.18 వేల వేతనంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం చేసే కాంట్రాక్టు/ పొరుగుసేవల సిబ్బంది పిల్లలకు బోధనా రుసుం వర్తించదు.

కళాశాల ఏ ప్రాంతంలో ఉందో సరిగా కనుక్కోవడం ముఖ్యం. ఎందుకంటే చాలా కళాశాలలు ఆ కళాశాలలు ఉన్న ప్రాంతాన్ని కాకుండా సమీపంలోని ప్రముఖ ప్రాంతంలో ఉన్నట్లు చిరునామాలు ఇస్తుంటారు. ఉదాహరణకు ఎక్కడో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉంటే నియర్‌ ఎల్‌బీ నగర్‌ అనీ, మేడ్చల్‌ సమీపంలో ఉంటే కొంపల్లి/దుండిగల్‌ అనీ చూపుతున్నాయి. ఇది గమనించాలి.
 

వీలుంటే కళాశాలలను సందర్శించి రావడం మేలు. అక్కడ చదివే విద్యార్థులను లేదా  కళాశాల సమీపంలో నివసించే బంధువులు/స్నేహితులను అడిగి తెలుసుకుంటే మంచిది.
 

సరైన విధానం ఇదే!
వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునే ముందు మూడు అంశాలపై విద్యార్థికి స్పష్టత ఉండాలి. 1. ఇష్టమైన బ్రాంచీ వస్తే చాలు ఏ కళాశాలలో అయినా చేరతాను 2. ఇష్టమైన బ్రాంచీతోపాటు కోరుకున్న కళాశాలల్లోనే చదువుతాను 3. కోరుకున్న కళాశాలల్లో ఏ కోర్సు అయినా ప్రవేశం పొందుతాను. వీటిలో ఏదో ఒక ఓ నిర్ణయానికి రావాలి. అప్పుడే తన ఆలోచనకు తగ్గట్లు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అందుకు ఆప్షన్లను వరస క్రమంలో రాసుకోవడానికి రూపొందించిన ఫారాన్ని వెబ్‌సైట్లో ఉంచారు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకొని రాసుకోవాలి. తర్వాత ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచి పద్ధతి.
 ఇష్టమైన బ్రాంచీ వస్తే చాలు: ఇదే విద్యార్థి నిర్ణయమైతే కళాశాలల ప్రాధాన్యం ప్రకారం 1...2...3... అని జాబితా రూపొందించుకొని ఇష్టమైన బ్రాంచీకి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మీది ఉత్తమ ర్యాంకు అయితే మంచి కళాశాలల్లో సీటు వస్తుంది. పెద్ద ర్యాంకు అయితే చివరి కళాశాలలో సీటు దక్కుతుంది. అది మీ ర్యాంకును బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు సీటు కూడా రాకపోవచ్చు. ఉదాహరణకు మీది 80 వేల ర్యాంకు. కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలన్నది మీ ఆసక్తి అనుకుందాం. వాస్తవానికి తెలంగాణలో కన్వీనర్‌ కోటాలో సీఎస్‌ఈ సీట్లు 20 వేలకు మించవు. మీ కంటే ముందున్నవారు సీఎస్‌ఈ బ్రాంచీనే కోరుకుంటే మీకు సీటు దక్కకపోవచ్చు. మీకన్నా మంచి ర్యాంకు విద్యార్థులు సీఎస్‌ఈ బ్రాంచీ కంటే ఇతర బ్రాంచీలకు ప్రాధాన్యం ఇస్తే అప్పుడు మీకు సీటు లభిస్తుంది. అంటే మీకన్నా ముందున్న వారు ఎందరన్నది ఇక్కడ ముఖ్యం.
ఇష్టమైన బ్రాంచీ...ప్రముఖ కళాశాల: ఇదే నిర్ణయమైతే మీ ర్యాంకు కూడా ఉత్తమమైనది కావాలి. రాష్ట్రంలో మొత్తం 190 కళాశాలలు ఉంటే...అందులో మీరు 20 కళాశాలల్లో ఏదో ఒక దాంట్లో చదవాలనుకున్నారు. ఇష్టమైన బ్రాంచి ఈసీఈ అనుకుందాం. అప్పుడు ఆ 20 కళాశాలల్లో ప్రాధాన్యం వారీగా ఎంచుకొని కేవలం ఈసీఈ బ్రాంచీనే ఎంచుకోవాలి. ‘ఒకవేళ ఈసీఈ కాకుంటే సీఎస్‌ఈ చదువుతాను’ అనుకుంటే అప్పుడు 20 కళాశాలల్లో ఈసీఈ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత 21వ ఆప్షన్‌ నుంచి సీఎస్‌ఈ ఇచ్చుకుంటే వెళ్లాలి. అలా కాకుండా ఒక కళాశాలలలో ఈసీఈ, ఆ తర్వాత రెండో ఆప్షన్‌గా సీఎస్‌ఈ ఇచ్చుకుంటూ...వెళితే మీకు రెండో ప్రాధాన్యమైన సీఎస్‌ఈ సీటు కూడా దక్కే అవకాశం ఉంది.
ఏ కళాశాలైనా...ఏ బ్రాంచీ అయినా: ఇదే మీ లక్ష్యమైతే ఆప్షన్లు ఎలా ఇచ్చుకున్నా సమస్య లేదు. ఉదాహరణకు జేఎన్‌టీయూహెచ్‌లో అన్ని బ్రాంచీలూ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఓయూలో అన్ని బ్రాంచీలూ ఇవ్వొచ్చు. లేదా జేఎన్‌టీయూహెచ్‌లో సీఎస్‌ఈ, తర్వాత ఓయూలో సీఎస్‌ఈ ఇచ్చి...అనంతరం జేఎన్‌టీయూహెచ్‌లో ఈసీఈ, ఓయూలో ఈసీఈ- ఇలా ఇచ్చుకుంటూపోవచ్చు.

- పెమ్మ‌సాని బాప‌న‌య్య‌ (ఈనాడు, హైదరాబాద్‌)

Posted Date : 05-11-2020

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌