• facebook
  • whatsapp
  • telegram

అభిరుచికే ఇంజినీరింగ్‌ ప్రాధాన్యం

మారుతున్న పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌ చేయడమా? వద్దా? అనే సందేహం కొందరిలో ఉండొచ్చు కానీ, ఏ బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది? కళాశాలకు ప్రాముఖ్యం ఇవ్వాలా? బ్రాంచికా? అనేది చాలామంది విద్యార్థులను తొలిచే సమస్య. భవితకు ముఖ్యమైన ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఏ విషయాలు బేరీజు వేసుకోవాలి? 

ఇంజినీరింగ్‌ రంగంలో అవకాశాలు తగ్గుతున్నాయా? దాదాపుగా అన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి కదా! మారిన అమెరికా అధికార ప్రభావం ఇంజినీరింగ్‌ సంస్థలపై దేశంలో ఏ మేరకు ప్రభావం చూపనుంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందా? ఇంటర్మీడియట్‌ ముగించి, కెరియర్‌ అనే రహదారిలో సందిగ్ధంలో ఉన్న విద్యార్థి ప్రస్తుత మానసిక స్థితి ఇది. దీనికితోడు ఇంజినీరింగ్‌ కళాశాలల తనిఖీలు, జేఎన్‌టీయూహెచ్‌ నివేదికలు ఇంకొంచెం ఆందోళనకు అవకాశం ఇస్తున్నాయి.

వేరే వృత్తి విద్యా కోర్సుల విషయంలో ఇంత గందరగోళం ఉండకపోవచ్చు. ఇంజినీరింగ్‌లోనే ఈ సందిగ్ధదత ఎందుకు అంటే.. ఈ రంగంలోని అభివృద్ధి సమాజ జీవన స్థితిగతులపై, జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉండటమే. ఇంజినీరింగ్‌ చేయ్యాలనుకునేవారికి గల వైవిధ్యమైన అవకాశాలు, వచ్చే జీతభత్యాల విషయంలో కూడా వ్యత్యాసాలుండడం కొంతమేరకు ఈ సందిగ్ద స్థితికి కారణం కావచ్చు. చాలావరకు విద్యార్థులు ఆ రంగంలోని ఉద్యోగ అవకాశాలను, అందులోనూ ప్రస్తుత అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తాము చదవవలసిన శాఖలను ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఈ విధమైన నిర్ణయాలలో అతి ముఖ్యమైన విద్యార్థి ఆసక్తి, అభిరుచి వంటి కీలకాంశాలను మరచిపోయే ప్రమాదం ఉంది.

ఇవి పాటిస్తే ఉపయోగం

మౌలిక శాఖలైన సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ శాఖలే కాకుండా, ప్రాచుర్యంలో ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలే కాకుండా, అభిరుచికి తగినట్లు ఎంచుకోవడానికి ఎన్నో ఆకర్షణీయమైన బ్రాంచిలలో బి.ఇ./ బి.టెక్‌. చేసే అవకాశం ఉంది. మాంద్యం అనేది పరిశ్రమల్లో కొంతమేరకు ఆవర్తకంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలు తమకున్న వివిధ వనరులను ముందుముందు సమర్థంగా వినియోగించుకునేందుకు సంసిద్దమౌతుంటాయి. అందులో భాగంగా జీతాల స్థిరీకరణ, ఖర్చుల తగ్గింపు, ఉత్పత్తి పెంపు వంటి మార్గాలను ఎంచుకుంటాయి. అంతేకాకుండా రాజకీయంగా వచ్చే మార్పులకు అనుగుణంగా తమ వ్యాపార వ్యవహారాలను పునర్నిర్వచించుకోవడం ఒక నియమిత కార్యం. దీనిలోని అంతర్భాగంగా వివిధ స్థాయుల్లోని ఉద్యోగులను కొందరిని తీసివేస్తుంటారు. అంతమాత్రం చేత అందరికీ ఉద్యోగాలు పోతాయని కాదు, నిరుద్యోగం పెరుగుతుందనీ కాదు. సమీప భవిష్యత్తులో వేగంగా అభివృద్ధి చెందడానికి సమకాలీనంలో వేసే కొన్ని వెనకడుగులుగా ఈ చర్యను చూడాలి. భవిష్యత్తులో వ్యాపారం తప్పటడుగులు వెయ్యకుండా తీసుకునే నివారణ చర్యలు ఇవి. ఈ కత్తిరింపులు కూడా హేతుబద్దంగానే ఉంటూ, సామర్థ్యం లేని వారిని మాత్రమే తొలగించడం జరుగుతుంటుంది.

ఉదాహరణకు ఒక బహుళ జాతి సంస్థ 5000 మంది ఉద్యోగులను తొలగించిందనే వార్త విన్నామనుకుందాం. చూడడానికీ, వినడానికీ ఈ సంఖ్య పెద్దదిగా అనిపిస్తుంది. అయితే ఈ సంఖ్యలో కొన్ని సీనియర్‌ స్థాయిలో, కొన్ని మధ్య స్థాయిలో, మిగిలినవి చిన్న స్థాయిలోని ఉద్యోగులపై వేటు పడే సంభవాలు ఎక్కువ. పైగా ఈ సంస్థలో ఒక లక్ష మంది ఉద్యోగులు ఉంటే తీసివేసింది ఐదు శాతం మాత్రమే ఔతుంది. కానీ ఒక్కసారి వ్యాపారం పుంజుకున్న తరువాత ఇంతకు రెండింతల మందికి ఉద్యోగావకాశాలు ఉండవచ్చు. దీనికి నిదర్శనంగా గతంలోని మాంద్యాలను చూడవచ్చు.

దేనికివ్వాలి ప్రాముఖ్యం?

ఇంజినీరింగ్‌ ఆశావహులైన ప్రతి విద్యార్థీ ఎదుర్కునే మొదటి ప్రశ్న ఇదే. ఒక శాఖకు ఉన్న అవకాశాలు కాలక్రమంలో మారుతూ ఉంటాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలు, ధోరణుల్లో మార్పులు జరుగుతుంటాయి. నిజానికి శ్రద్ద, ఆసక్తులతో చదువుకున్న ఏ కోర్సు అయినా మంచి భవిష్యత్తుకు అవకాశాలు కల్పిస్తుంది. ప్రస్తుతం అవకాశాలున్నాయనే కారణంతో ఆసక్తి లేని బ్రాంచిలో చేరితే, ఆ తరువాత కెరియర్‌ వృద్ధికి ప్రణాళిక చేసుకునే సామర్థ్యం పెంచుకోవడం కష్టమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే అభిరుచీ, ఆసక్తీ ఉన్న బ్రాంచిలను ఎన్నుకోవడమే సముచితం. అంతే కాకుండా ఎంత గొప్ప కళాశాల అయినా, మనం చక్కగా చదువుకోవాలి. బ్రాంచి లేక కాలేజి గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం మంచిది.

1 బ్రాంచిలో చదవడానికి కావలసిన గణిత, భౌతిక, రసాయనిక శాస్త్రాల్లోని ఏయే అధ్యాయాల్లో మంచి ప్రవేశం అవసరం?

2 ఈ బ్రాంచిలో ఉద్యోగావకాశాలు ఏయే పారిశ్రామిక రంగాల్లో ఉంటాయి?

3 ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్‌ రంగంలోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయా?

4 నిర్దిష్ట కాలేజీలో ఈ బ్రాంచికి సంబంధించిన అధ్యాపక సిబ్బంది నాణ్యత ఎలా ఉంది? అధ్యాపకులు తమ రంగంలో విద్యార్థులతో ప్రాజెక్టులు చేయించగలుగుతున్నారా/ ఏదేని సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారా?

5 ప్రయోగశాలల్లో సిలబస్‌లో నిర్దేశించిన ప్రయోగాలకు అదనంగా ప్రయోగాలు చేయిస్తున్నారా?

6 ప్రాంగణ నియామకాల్లో సేవారంగ సంస్థలతో పాటు ఉత్పత్తుల సంస్థల నియామకాలు జరుగుతున్నాయా?

7 మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌ లాంటి మౌలిక బ్రాంచిలకు సంబంధించిన సంస్థలు నియామకాలకు వస్తున్నాయా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు సంతృప్తికరంగా రాబట్టుకుంటే ఎక్కడ, దేనిలో చేరాలనే నిర్ణయం తీసుకోవడం కొంత సులువు అవుతుంది.

ప్రస్తుతం అవకాశాలున్నాయనే కారణంతో ఆసక్తి లేని బ్రాంచిలో చేరితే, ఆ తరువాత కెరియర్‌ వృద్ధికి ప్రణాళిక కష్టమవుతుంది. అలా కాకుండా ఉండాలంటే అభిరుచీ, ఆసక్తీ ఉన్న బ్రాంచిలను ఎన్నుకోవడమే సముచితం.


 

Posted Date : 07-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌