• facebook
  • whatsapp
  • telegram

చేరేలోపు సంసిద్ధం కండి!

ఇంజినీరింగ్‌ ప్రవేశాల తరుణమిది. ర్యాంకు ఆధారంగా కళాశాలలో చేరి, తరగతులు మొదలయ్యేలోపు ఏమేం చేయాలి? ఇంటర్మీడియట్‌ పుస్తకాలను ఓ మూల పడేయాల్సిందేనా? లేదు. వాటిలోని కొన్ని పాఠ్యాంశాలు విద్యార్థులు చదవబోయే కోర్సుకు అనుసంధానంగా ఉంటాయి. వాటిని గుర్తించటం, పునశ్చరణ చేయటం చాలా ముఖ్యం. అలా చేస్తే చక్కని పునాది ఏర్పడుతుంది! 

 ఇంజినీరింగ్‌ అనేది ప్రణాళికను పాటిస్తే పూలబాట. బంగారు భవితకు పునాది వేస్తుంది. లేకపోతే ముళ్లబాటలో ప్రయాణించడానికి సిద్ధమవ్వాలి.

విద్యార్థి జీవితంలో మొదటి మలుపు ఇంటర్మీడియట్‌ అనుకుంటే, రెండో మలుపునకు శ్రీకారం ఎంసెట్‌ అని చెప్పవచ్చు. దేశంలో ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశాలకు జరిగే మఖ్యమైన ప్రవేశ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆఖరిది ఎంసెట్‌ అని చెప్పవచ్చు. ఒక్కసారి ఎంసెట్‌ ప్రవేశ పరీక్ష ముగిసిన తరువాత చదువు రీత్యా ఏ వ్యాపకం ఉండదు. ఇంటర్మీడియట్‌ చదువు ముగింపు, డిగ్రీ చదువు ఆరంభానికీ మధ్య ఉన్న ఈ సంధికాలాన్ని తొలి ‘నిరుద్యోగ స్థితి’గా చెప్పుకోవచ్చునేమో. ఈకాలంలోనే విద్యార్థులు తమ మీద ఉన్న ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయి మానసికంగా, భౌతికంగా విశ్రాంతిని ఆస్వాదిస్తూ గడిపేస్తుంటారు. రాసిన ఒక్కొక్క ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలువడుతుంటే మళ్ళీ స్తబ్ధ్దత నుంచి తేరుకుని చైతన్యం వైపు అడుగులు వేయడం మొదలుపెడతారు.
నచ్చిన కాలేజీలో, ఇష్టమైన ఇంజినీరింగ్‌ బ్రాంచిలో ప్రవేశం పొందే దిశగా ప్రయాణం మొదలుపెడతారు. పత్రాల తనిఖీ, అంతర్జాలంలో ఆప్షన్లు వంటి ముఖ్యమైన పనుల్లో నిమగ్నమైపోతారు. ఇవన్నీ పూర్తయి ఇంజినీరింగ్‌ కాలేజీలో అడుగుపెట్టే సమయానికి ఒకటి రెండు నెలల వ్యవధి ఉంటుంది. ఈ విరామ సమయంలో ఇంటర్మీడియట్‌లో చదివిన పాఠ్యాంశాల పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వకపోగా అది అప్రస్తుతమని, అసలు అవసరమేలేదనే అపోహలో ఉండిపోతారు. తల్లిదండ్రులు కూడా ఈ అంశంపై దృష్టి సారించరు. దీనివల్ల వృత్తి విద్యాకోర్సుల్లో ప్రత్యేకించి ఇంజినీరింగ్‌లో కొంత మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడవచ్చు..

పునశ్చరణ లేకుంటే అంతే

మనం చదివిన ఒక విషయాన్ని మూడురోజుల్లోగా ఒకసారి పునశ్చరణ చెయ్యకపోతే దాన్ని దాదాపు మరచిపోతామని పరిశోధనల్లో రుజువైంది. మే నెల నుంచి దాదాపు ఆగస్టు వరకు పాఠ్యాంశాలను ఒక్కసారి కూడా తిరిగి చదవకపోతే నష్టం ఏమేరకు ఉంటుందో వూహించండి.
దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం నుంచే సెమిస్టర్‌ పద్ధతిలో ఉండటం సమస్యను జటిలం చేసే అవకాశం ఉంది. ఒక సెమిస్ట్టర్‌ పదహారు వారాలుంటుంది. అంటే ప్రతి సబ్జెక్టులోనూ అధ్యాపకులకు 40 నుంచి 50 తరగతులు కేటాయిస్తారు. ఇంత తక్కువ క్లాసులలో అనువర్తనానికి ఉపయోగపడేలా సబ్జెక్టులను బోధించాల్సివుంటుంది. దీనివల్ల అధ్యాపకులు చెప్పాలనుకున్నా సమయాభావం వల్ల విడమర్చి చెప్పలేకపోవచ్చు.

పరీక్షల పరంపర

పైగా బీటెేక్‌లో చేరామన్న ఆనందంలో నుంచి బయట పడేలోపునే మొదటి విడత అంతర్గత పరీక్షలు వచ్చి నెత్తిన పడతాయి. ఈ పరీక్షలు తెలిసిన సబ్జెక్టులోని జ్ఞానం కన్నా ఆత్మవిశ్వాసానికి పరీక్షలు. ఈ పరీక్షలు మొదటి నెల లేదా నెలన్నరలోపునే విశ్వవిద్యాలయం నిర్దేశించిన కాలంలో జరుగుతాయి. అంటే కళాశాలలకు ఎటువంటి వెసులుబాటూ ఉండదన్నమాట. మళ్ళీ కాస్త వూపిరి పీల్చుకునేలోపే రెండో విడత అంతర్గత పరీక్షలుంటాయి. దీనికన్నా ముందు లేదా వెంటనే ప్రాక్టికల్స్‌లో అంతర్గత పరీక్షలు, దాని వెనువెంటనే సెమిస్టర్‌ పరీక్షలు. ఇలా బీటెక్‌ మొత్తం పరీక్షల మయంగానే ఉంటుంది. దురదృష్టంతోనో తెలియనితనంతోనో వాటిలో తప్పితే ఇంక పరీక్షల వూబిలో కూరుకుపోవలసిందే. 

ఇటువంటి పరిస్థితులను తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. కళాశాల మొదలవ్వకముందే ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే గణిత, భౌతిక, రసాయన శాస్త్రాల అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. బయోటెక్‌ బ్రాంచి కోరుకునేవారు అదనంగా జీవశాస్త్రాల్లోని కొన్ని మౌలిక అధ్యాయాలను పునశ్చరణ చేసుకోవాలి.
ఇంజినీరింగ్‌ అనేది ప్రణాళిక ప్రకారం చేస్తే పూలబాట. బంగారు భవితకు పునాది వేస్తుంది. లేకపోతే ముళ్లబాటలో ప్రయాణించడానికి సిద్ధమవ్వాలి. పక్కన కొన్ని ముఖ్యమైన బ్రాంచిలకు అవసరమయ్యే అధ్యాయాల పట్టిక ఇస్తున్నాం. ఆయా బ్రాంచీలకు ఎంతో అవసరమైన మౌలిక అధ్యాయాలు అవి. పరీక్షలనే ఒత్తిడి లేదు కాబట్టి పరిపాటి చర్యగా మిగిలిన ఈ ఒకటి రెండు నెలల్లో చదివి కాలేజికి వెళితే అన్ని సబ్జెకులూ సులభమౌతాయి. అదనపు సబ్జెక్టులు కూడా చదివితే మరీ లాభం. ఏ బ్రాంచి వారైనా సీ ప్రోగ్రామింగ్‌లో శిక్షణకు వెళ్లడం చాలా మంచిది.
ఇప్పుడు కొంచెం సుఖపడి ముందుముందు ఎక్కువ కష్టాలకు పునాది వేసుకుంటారా లేక ఇప్పుడు కొంత కష్టపెట్టుకుని భవిష్యత్తు సరళం చేసుకుంటారా అనేది విద్యార్థుల మీదే ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించి తమ పిల్లలు రోజూ కొంతసేపు ఇంటర్మీడియట్‌ పాఠాలు మననం చేసుకునేలా ప్రోత్సహిస్తే మేలు.

Posted Date : 08-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌