• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ ఎంపికలో ఏం చూడాలి?

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ సందర్భంగా విద్యార్థులనూ, తల్లిదండ్రులనూ వేధించే ప్రశ్న... ఏ ఇంజినీరింగ్‌ శాఖలు (బ్రాంచిలు) మెరుగైనవనేది. ఒక నిర్ణయానికి రావడానికి వివిధ బ్రాంచిల గురించి ప్రాథమికంగానైనా తెలుసుకోవాలి. బేరీజు వేసుకోవడంలో విద్యార్థి స్వీయ ఆసక్తి, అభిరుచి వంటివి చాలా ముఖ్యం! 

ఏ ఇంజినీరింగ్‌ శాఖలో చేరితే భవిష్యత్తు బాగుంటుంది? ఏది సులభం? ఏ విద్యాసంస్థలో మెరుగు?... ఇలాంటి సందేహాలకు కారణం- ఇంజినీరింగ్‌లో వైవిధ్యమైన అవకాశాలూ, వచ్చే జీతభత్యాల విషయంలో కూడా వ్యత్యాసాలుండటం ఓ కారణమైవుండొచ్చు. ఇతర వృత్తివిద్యాకోర్సుల విషయంలో ఈ సందిగ్ధత తక్కువ.

వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు, అందులో ప్రస్తుం ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువమంది బ్రాంచిలను ఎంచుకుంటుంటారు. ఈవిధమైన నిర్ణయాల్లో అతి ముఖ్యమైన స్వీయ ఆసక్తి, అభిరుచి వంటివి పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుంటుంది. అందుకే ఇంజినీరింగ్‌ విద్య లక్ష్యంగా ఉన్నవారు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి.

ఒక బ్రాంచికి ఉన్న అవకాశాలు కాలక్రమంలో మారుతుంటాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలు, ధోరణుల్లో మార్పులు జరుగుతుంటాయి. శ్రద్ధ, ఆసక్తులతో చదువుకున్న ఏ కోర్సు అయినా మంచి భవిష్యత్తుకు అవకాశాలు కల్పిస్తుంది. ప్రస్తుతం అవకాశాలున్నాయనే కారణంతో ఆసక్తిలేని బ్రాంచిలో చేరితే ఆ తర్వాత దీర్ఘకాలంలో కెరియర్‌ అభివృద్ధి కష్టమవుతుంది. అందుకే విద్యార్థి తనకు అభిరుచీ, ఆసక్తీ ఉన్న శాఖలను ఎంచుకోవడం సబబు.

కళాశాల.. బ్రాంచి

ఈ నిర్ణయం కొంత కష్టమైనదే అయినా జాగరూకతతో సరైన నిర్ణయం తీసుకోవచ్చు. ఒక పేరున్న కళాశాలలో అన్ని శాఖలూ ఒకే స్థాయి ప్రమాణాలూ, సామర్థ్యంతో ఉండకపోవచ్చు. ఐఐటీలకైనా ఇది వర్తిస్తుంది. అందుకే ‘ఫలానా ఐఐటీలో ఫలానా బ్రాంచి బాగుంటుంది’ అనే అభిప్రాయం వినిపిస్తుంటుంది. ఈ రోజుల్లో అన్ని కళాశాలలూ ఏఐసీటీఈ నియమావళిని అనుసరించి వెబ్‌సైట్లో కోర్సులు, శాఖల్లో ఐచ్ఛిక సబ్జెక్టులు, పాఠ్యబోధనా ప్రణాళిక వివరాలు పొందుపరుస్తున్నాయి. వీటి సాయంతో ఒకమేరకు అవగాహనకు రావొచ్చు. కళాశాలకు వెళ్ళి అక్కడి అధ్యాపక బృందం, యాజమాన్యం, విద్యార్థులను కలిసి నేరుగా విషయసేకరణ చేయవచ్చు.
కళాశాలకు వెళ్ళినపుడు ప్రాంగణ నియామకాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి వూరుకోకూడదు. మౌలిక సదుపాయాలను గమనించాలి. ప్రాక్టికల్స్‌ ఎలా జరుపుతారు? వారానికి ఎన్ని గంటలు ఉంటాయి? ఎన్ని గంటలు కేటాయిస్తారు? పాఠ్యాంశాలకు అదనంగా ఎలాంటి ప్రయోగాలకు అవకాశం ఉంటుంది? అన్నవి ఆరా తీస్తే మంచిది. ఈ సమాచారం ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చు

ఉన్నతవిద్య, స్పెషలైజేషన్‌...

ఇంజినీరింగ్‌ విద్య నైపుణ్యాల అభివృద్ధి అవకాశాలకు పుట్టిల్లు లాంటిది. ఉన్నత విద్య అవకాశాల గురించి మదింపు చేసుకోవడం ఎంతో లాభదాయకమే కాకుండా కెరియర్‌కు సంబంధించిన సముచితమైన నిర్ణయాలు తీసుకోవడానికీ దోహదం చేస్తుంది. ఉదాహరణకు... ఒక విద్యార్థికి మందుల తయారీ రంగంలో ఆసక్తి ఉన్నదనుకుందాం. తను బీ ఫార్మసీ అయినా తీసుకోవచ్చు. లేదా బయో టెక్నాలజీ అయినా తీసుకోవచ్చు. ఏది మంచిది అనే సందిగ్ధం కలిగినపుడు ఉద్యోగావకాశాలతో పాటు ఉన్నత విద్యావకాశాలు ఈ దేశంలోనా, విదేశాల్లోనా అన్న నిర్ణయం మీద ఆధారపడి తీసుకుంటే మంచిది. ఏం చేయాలి అనే విషయంలో స్పష్టత చాలా ముఖ్యం.
బీటెక్‌/బీఈ తర్వాత ఉద్యోగం, అందులో బాధ్యతలు మొదలైనవి చాలా ప్రాముఖ్యమైనవి. ఉదాహరణకు... కంప్యూటర్‌ సైన్స్‌ రంగం అంటే తీవ్రమైన పని ఒత్తిడి. కాలానికి ఎదురీదే ప్రాజెక్టు ఒత్తిడులు. సమయ నియమాలు లేకపోవడం, శారీరక వ్యాయామానికి తక్కువ అవకాశం ఉండటం వంటివి ఈ రంగంలో స్వాభావికమైన సమస్యలు. వీటికి తట్టుకునే ఉద్దేశం ఉంటేనే దీన్ని ఎంచుకోవడం సరైనది. ఏ రంగం అయినా అందులో వెసులుబాట్లతో పాటు కష్టాలూ బాధ్యతలకు కూడా సిద్ధమైవుండాలి. ఒక విద్యార్థికి మందుల తయారీ రంగంలో ఆసక్తి ఉన్నదనుకుందాం. తను బీ ఫార్మసీ అయినా తీసుకోవచ్చు. లేదా బయో టెక్నాలజీ అయినా తీసుకోవచ్చు.

సివిల్‌: కొత్త ఉత్సాహం

గత ఐదారు సంవత్సరాలుగా ఉద్యోగావకాశాల దృష్ట్యా బాగా పుంజుకుంటున్న రంగమిది. రోడ్లు, రవాణా సదుపాయాలు, జలవసతి లాంటి మౌలిక రంగాల్లో పెట్టుబడులు సన్నగిల్లి ఐటీ, ఐటీ ఆధారిత సేవలు వంటివాటిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల సివిల్‌ ఇంజినీర్లకు అవకాశాలు తగ్గినమాట కొంతవరకూ నిజమే.
ఈ పరిస్థితి ఇప్పుడు మారింది. ఇటీవలికాలంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాలూ, కేంద్రప్రభుత్వం కూడా మౌలిక వసతుల కల్పనకు అగ్రపీఠం వేసి సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాయి. దీంతో ఈ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువయ్యాయి. 2030 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు దీనిలో పుష్కలమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదట్లో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ శాఖలకే పరిమితమైన కళాశాలలు పెరుగుతున్న అవకాశాల వల్ల ఇప్పుడు సివిల్‌ ఇంజినీరింగ్‌లో కూడా బీటెక్‌ను ప్రారంభించడానికి ఉత్సాహం చూపుతున్నాయి.

కోర్సు పరిచయం...

నాలుగేళ్ల బీటెక్‌ కాలంలో సివిల్‌ ఇంజినీరింగ్‌కు సంబంధించిన మౌలిక సబ్జెక్టులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చే కొత్త సబ్జెక్టులను పాఠ్యాంశాలుగా చేర్చారు. భూ సర్వేక్షణ, రచన, మెకానిక్స్‌ లాంటి సబ్జెక్టులతో పాటు పునరావాస, పురాతన నిర్మాణాల పునర్నిర్మాణానికి సంబంధించిన పాఠ్యాంశాలుంటాయి. ఆర్‌.సి.సి., హరిత నిర్మాణం, వాతావరణ సమతుల్యం, విపత్తుల నిర్వహణ వంటి వినూత్నమైన సబ్జెక్టులు చదవాల్సివుంటుంది.

మనదేశంలో కట్టిన వివిధ బహుళార్థ సాధక ప్రాజెక్టులు, చిన్న మధ్యతరహా నీటిప్రాజెక్టుల పునరావాసం/ పునర్మిర్మాణం ఒక సవాలు. ఇలాంటివి సమర్థంగా ఎదుర్కొని ప్రత్యామ్నాయ పద్ధతులను చేపట్టేలా మెలకువలు నేర్పేందుకు ఇలాంటి సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. అందులో జాతీయ విపత్తుల నివారణ నిర్వహణ, తీర, రేవుల ఇంజినీరింగ్‌, స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌, రవాణా, సుదూర గ్రాహక (రిమోట్‌ సెన్సింగ్‌) ఇంజినీరింగ్‌ వంటి ఉపయోగకరమైన సబ్జెక్టులు చదవాలి.

ఎంచుకోవాలంటే...

సివిల్‌ బ్రాంచి చదవటం పెద్ద కష్టమేమీ కాదు. ఇంటర్మీడియట్‌ స్థాయి గణితశాస్త్రంలో సంకలన వ్యవకలన అధ్యాయాలు, త్రికోణమితి, త్రిజ్యామితి సబ్జెక్టులు ఒకస్థాయి వరకూ చేయగలిగితే ఎంతో ఉపయోగం. ఈ బ్రాంచి వారు ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, స్టాటిక్స్‌, హైడ్రాలిక్స్‌ లాంటి సబ్జెక్టుల్లో మంచి ప్రవేశం పొందాలి. విద్యార్థి దశలో ఉండగానే కళాశాల సహకారంతో గానీ, విడిగా కానీ కొన్ని చిన్నచిన్న ప్రాజెక్టులు చేస్తే చాలా మంచిది. దీనికి తోడు వృత్తికి సంబంధించిన సంస్థల్లో సభ్యత్వం నమోదు చేసుకోవటం, వారు నిర్వహించే సమావేశాలూ, కోర్సులూ, పోటీల్లో పాల్గొనడం చేయాలి. ఈ రకంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. దీనివల్ల తమ రంగంలో వస్తున్న మార్పులు, జరుగుతున్న అభివృద్ధి గురించి ఆకళింపు చేసుకునే అవకాశం ఉంటుంది.

మెకానికల్‌: నిత్యనూతనం

అన్ని ఇంజినీరింగ్‌ శాఖలకూ మాతృశాఖగా మెకానికల్‌కు పేరుంది. మౌలిక శాఖల్లో ఒకటైన దీనికి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సమాన ఉద్యోగ అవకాశాలున్నాయి. నేడు ప్రత్యేక బ్రాంచిలుగా వివిధ స్థాయుల్లో కోర్సులను అందిస్తున్న మైనింగ్‌, మెటలర్జీ, మెకాట్రానిక్స్‌, ప్రొడక్షన్‌ లాంటి ఎన్నో ఉపశాఖలు మెకానికల్‌ రంగం నుంచి పుట్టినవే. ఇది ‘సతత హరిత (ఎవర్‌ గ్రీన్‌) శాఖ’ అని చెపుతుంటారు. గణితం, భౌతికశాస్త్రాల మీద ఈ బ్రాంచి విద్యార్థులకు ఉండే పట్టు కారణంగా వీరు ఏ రంగంలోనైనా ఇమిడిపోగలరు. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు విద్యార్థినులు కూడా పెద్దసంఖ్యలో ఈ శాఖలో ప్రవేశించడానికి మొగ్గు చూపుతున్నారు.

బీటెక్‌లో ఏం చదువుతారు?

మౌలిక సబ్జెక్టులైన ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, ధర్మో డైనమిక్స్‌, మెటీరియల్‌ సైన్స్‌, థియరీ ఆఫ్‌ మెషిన్స్‌ లాంటివాటితో పాటు ఐసీ ఇంజిన్స్‌, మెషిన్‌ డిజైన్‌, ప్రాడక్ట్‌ డిజైన్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, క్వాలిటీ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ మెషినెస్‌ వంటి సబ్జెక్టులూ చదవాల్సివుంటుంది. కాడ్‌, కామ్‌- ఇంకా వివిధ ఐచ్ఛిక సబ్జెక్టులూ ఉంటాయి. వర్క్‌షాప్‌ ఇంజినీరింగ్‌ చాలా ముఖ్యమైనది. బీటెక్‌ తర్వాత ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, నానో టెక్నాలజీ, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ లాంటి ఎన్నో మంచి కోర్సుల్లో పీజీ చేసే అవకాశం ఉంది. ఇంకా ఆసక్తి ఉన్నవారు మర్చంట్‌ నేవీ, ఎంబీఏ లాంటివి చదవొచ్చు.

ఉద్యోగావకాశాలు

ఇనుము, ఉక్కు కర్మాగారాల నుంచి గనులు, ఆటోమొబైల్‌, సిమెంట్‌, కాగితం పరిశ్రమ, సాఫ్ట్‌వేర్‌ వరకూ ఇంచుమించు అన్ని రంగాల్లో ఉపాధి పుష్కలంగా ఉంటుంది. మెకానికల్‌ ఇంజినీర్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, మెషిన్‌ డిజైన్‌ స్పెషలిస్ట్‌, చాడ్‌ ఇంజినీర్‌, మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌ వంటి వివిధ స్థాయుల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భారతీయ రైల్వే, బీహెచ్‌ఈఎల్‌, ఇస్రో, రక్షణశాఖ, నౌకా, వైమానిక, పద దళాల్లోనే కాకుండా ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ద్వారా కేంద్రీయ ఉద్యోగాలకు అర్హత వస్తుంది. రాష్ట్రప్రభుత్వ ఇంజినీరింగ్‌ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగాలుంటాయి.


 

Posted Date : 07-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌