• facebook
  • whatsapp
  • telegram

మౌలికం ... మెకానికల్‌

యంత్ర పరికరాల, యాంత్రిక వ్యవస్థల రూపకల్పన, నిర్మాణ, సమర్థ నిర్వహణల కోసం శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అనువర్తనం చేసే బ్రాంచి మెకానికల్‌. ఇంజినీరింగ్‌ మౌలికమైన శాఖల్లో ఇదొకటి.

గృహోపకరణ యంత్రాలు మొదలుకొని రేసింగ్‌ కార్లు, రైలు, విమానాలు, ట్రాక్టర్లు, రవాణా వాహనాలు, భారీ పరిశ్రమల్లో ఉపయోగించే సంక్లిష్ట యంత్రవ్యవస్థల అభివృద్ధిలో మెకానికల్‌ ఇంజినీర్లు నిష్ణాతులు. యాంత్రికంగా చేయగలిగిన పనులకు సంబంధించిన ఆలోచనలు, భావాలకు భౌతిక రూపాన్నిచ్చి ఒక వినిమయ ఉత్పత్తిగా మలచడం వీరి ప్రథమ వృత్తి, ప్రవృత్తి. సూక్ష్మంగా చెప్పాలంటే అత్యంత సంక్లిష్టమైన మానవ శరీర వ్యవస్థతోసహా చలనం ఉన్న అవసరమైన ప్రతి వ్యవస్థ గురించీ తెలిపేది మెకానికల్‌ ఇంజినీరింగ్‌.

వివిధ రకాల పదార్థాలు, ద్రవ్యాల లక్షణాలు, వాయు, ద్రవ, ఘన స్థితుల్లో లభించే పదార్థాల గురించి దీనిలో తెలుసుకుంటారు. యాంత్రిక శాస్త్ర అనుబంధాలైన ద్రవయంత్ర శాస్త్రం, ఉష్ణ యంత్రశాస్త్రం, ఉష్ణ వాహకత్వం వంటి భౌతికశాస్త్ర విషయాలనూ గ్రహిస్తారు. పరికరాల నిర్మాణం, పనితీరుకు సంబంధించిన అనుకూల ప్రతికూల పరిస్థితుల గురించీ, ఆ పరికరాలూ, అందులోని ఉప వ్యవస్థలు పనిచేయవలసిన పరిస్థితులూ, పరికరాల పనితీరుపై ఈ పరిస్థితుల ప్రభావం గురించీ నేర్చుకుంటారు. ఈ విషయ పరిజ్ఞానం ఇంచుమించు అన్ని రంగాల్లో అవసరం ఉన్నందున మెకానికల్‌ ఇంజినీర్లు ఎంతో వైవిధ్యమున్న పరిస్థితుల్లో పనిచేసే అవసరం, అవకాశాలుంటాయి. వైవిధ్యమున్న రంగంగా కూడా మెకానికల్‌ రంగం ప్రసిద్ధి.

ఈ రంగంలో రాణించాలంటే యంత్రాలు, వాటి పనితీరు తెలుసుకోవడంపై ఉత్సాహం అవసరం. గణిత, భౌతికశాస్త్రాలపై మంచి పట్టు సాధించాలి. ప్రపంచం పట్ల, దానిపై ఇంజినీరింగ్‌ రంగాల ప్రభావం పట్ల ఒక విశాల దృక్పథం ఏర్పరచుకుని తగినరీతిన సేవలందించే అభిరుచి ఉంటే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి అర్హత సంపాదించుకున్నట్లే.

ఉద్యోగావకాశాలు

ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలాగానే వీరికి కూడా ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో సమాన అవకాశాలున్నాయి. ఏ రంగానికి చెందిన పరిశ్రమలోనైనా వీరికి కొలువులుంటాయి. రైల్వేలో రోడ్డు, జల, వాయు రవాణ సంస్థలో అవకాశాలు పుష్కలం. రక్షణ విభాగంలో దాదాపు అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోనూ వీరి అవసరం చాలా ఉంటుంది. యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో నాలుగో బ్రాంచి ఇదే.

ఉన్నత విద్య విషయానికొస్తే అత్యంత ప్రాచీన ఇంజినీరింగ్‌ రంగమైనా కొత్త ఆవిష్కరణలకు నిలయంగా, నిత్య నూతన ఇంజినీరింగ్‌ రంగంగా ఇది భాసిల్లుతోంది. ఈ రంగంలో పీజీ స్థాయిలో దాదాపు 30కిపైగా స్పెషలైజేషన్లు ఉన్నాయంటే ఈ రంగం ప్రాముఖ్యాన్నీ, విశిష్టతనూ గ్రహించవచ్చు.

ఎందుకు చదవాలి?

మెకానికల్‌ శాఖ అత్యంత సర్వసాధారణ ఇంజినీరింగ్‌ రంగంగా పేరొందింది. చదివినవారికి ఇంచుమించు అన్ని రంగాలపై అవగాహన ఉంటుంది. ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచిల మాతృ శాఖగా పరిగణిస్తారు. ఎడ్ల బండి చక్రం నుంచి రోబోల రంగం వరకు కూడా ఈ శాఖ తంత్రులు వ్యాప్తి చెందుంటాయి.

1. ఆకర్షణీయ ఉద్యోగావకాశాలు: నిత్యజీవితంలో అవసరమయ్యే యంత్రాలు, యంత్ర పరికరాలు, పనిముట్ల తయారీ అనుదినం వృద్ధి పొందేదే కానీ ఏమాత్రం తరగనిది. అందుకే మెకానికల్‌ ఇంజినీర్లకు ఉదోగావకాశాలు చాలా ఎక్కువ. డిగ్రీ పొందిన కొద్దికాలంలోనే వీరికి ఉపాధి దొరుకుతుంది. కెరియర్‌ ప్రారంభంలో లభించే జీతం కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది.

2. బహుముఖ ప్రజ్ఞ: తమ బ్రాంచికే పరిమితం కాకుండా ఇతర బ్రాంచిల గురించి వీరికి ఎక్కువగానే తెలుస్తుంది. కంప్యూటర్ల పనితీరు, విద్యుత్‌ రంగం, సివిల్‌ రంగం, గణితం, భౌతికశాస్త్రం గురించే కాకుండా సామాజిక, ఆర్థిక రంగాల మౌలిక సూత్రాలపై కూడా అవగాహన ఉంటుంది.

3. ప్రతిభావంతుల కొరత: ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక పురోగతి సాధించాలంటే కర్మాగారాలు తమ ఉన్నత సామర్థ్యం మేరకు పని చేయాలి. దీనికి ప్రతిభావంతులైన ఇంజినీర్ల కొరత తీవ్రంగా ఉంది. మెకానికల్‌ ఇంజినీర్ల కొరత వల్ల కూడా వీరికి గిరాకీ ఎక్కువ.

4. భవిష్య సాంకేతిక అభివృద్ధి చాలకులు: రవాణా, ఆరోగ్యవ్యవస్థ, నిర్మాణ, రోబోటిక్స్‌ వంటి సమాజ అవసరాలైన రంగాల్లో అభివృద్ధి సాధించడానికి జరుగుతున్న పరిశోధనల్లో మెకానికల్‌ ఇంజినీర్లే చోదకులు. ఈ రంగంలోని అభివృద్ధి ఎన్నో రంగాలపై ప్రభావం చూపుతుంది.


 

Posted Date : 06-09-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌