• facebook
  • whatsapp
  • telegram

ఐసెట్‌ - 2022కి గురి పెట్టారా?

మెరుగైన ర్యాంకు సాధనకు నిపుణుల సూచనలు

ఎంబీఏ, ఎంసీఏలకు కొనసాగుతున్న ప్రాధాన్యం కారణంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. ఐసెట్‌కు పోటీ ఎక్కువే ఉంటుంది. ఉత్తమ కళాశాలలో ఎంబీఏ/ఎంసీఏ సీటు సంపాదించాలంటే మంచి ర్యాంకు సాధించటం అవసరం. అందుకోసం సిలబస్‌పై అవగాహనతో పాటు ప్రణాళికాబద్ధమైన సన్నద్ధత ముఖ్యం. ఇందుకు ఉపకరించే సూచనలు ఇవిగో!  

ఐ-సెట్‌ (ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) దరఖాస్తుల సమర్పణకు తెలంగాణలో ఆలస్య రుసుము లేకుండా చివరి తేది జూన్‌ 27. కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐ-సెట్‌కు ఆలస్య రుసుము లేకుండా జూన్‌ 10లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ పరీక్ష జులై 25న జరుగుతుంది. 

ఐ-సెట్‌ రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్ష కాబట్టి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలైన క్యాట్, మ్యాట్‌ల స్థాయి కంటే కొంత తక్కువగానే ఉంటుంది. సిలబస్‌ను అవగాహన చేసుకుని టైమ్‌టేబుల్‌ వేసుకోవటం ముఖ్యం. రోజుకు ఎంత సమయాన్ని కేటాయించగలరో ముందుగానే నిర్ణయించుకోవాలి. అదొక్కటే సరిపోదు. సమయం వృథా చేయకుండా సన్నద్ధత కొనసాగించాలి. సిలబస్‌లోని ప్రతి అంశంపైనా శ్రద్ధ చూపాలి. పరీక్షలో ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుందో తెలుసుకుని ప్రిపరేషన్, పునశ్చరణ కొనసాగించాలి. ఇప్పటివరకూ సన్నద్ధత సరిగా సాగకపోయినా ఇకపై రోజుకు 7 గంటల సమయం కేటాయించి చదివితే ఐసెట్‌లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది.


పరీక్ష విధానం: ఆన్‌లైన్‌

200 ప్రశ్నలు: 200మార్కులు 

పరీక్ష వ్యవధి: 150 నిమిషాలు 

ప్రశ్నపత్రం: బహుళైౖచ్ఛిక ప్రశ్నలు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. 

సిలబస్‌పై దృష్టి

ఐసెట్‌ సన్నద్ధత కోసం ముందుగా సిలబస్‌పై దృష్టి సారించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. ప్రశ్నపత్రం మూడు సెక్షన్లుగా (ఎనలిటికల్‌ ఎబిలిటీ, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ, కమ్యూనికేషన్‌ ఎబిలిటీ) ఉంటుంది. ఏ అంశాలు పరీక్షలో ఎక్కువగా వస్తున్నాయో గమనించి వాటిపై ఎక్కువ శ్రద్ధపెట్టాలి.  

స్టడీ మెటీరియల్‌: సిలబస్‌ను అవగాహన చేసుకున్న తర్వాత అవసరమైన స్టడీ మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలి. చదవడానికి ఎంచుకున్న పుస్తకాలు సిలబస్‌లోని అన్ని అంశాలనూ కవర్‌ చేసేలా ఉండాలి. స్టడీ మెటీరియల్‌ మాత్రమే కాకుండా సంబంధిత ఇతర పుస్తకాలు కూడా చదవాలి. అవసరానికి అనుగుణంగా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైతే మంచి ఫలితం ఉంటుంది.

ముఖ్యాంశాల పునశ్చరణ: సిలబస్‌ ప్రకారం ప్రతి అంశాన్నీ అర్థం చేసుకోవడం ముఖ్యం. ముఖ్యాంశాలను నోట్‌ పుస్తకంలో రాసి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ అంశాలు ఎక్కువ కాలంపాటు గుర్తుంటాయి. రాసుకున్న అంశాలను శ్రద్ధగా పునశ్చరణ చేసుకోవాలి. 

గత ప్రశ్నపత్రాల సాధన: పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌తోపాటుగా గత సంవత్సరాల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఈ పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షలో ఇచ్చే ప్రశ్నలపై పట్టు సాధించవచ్చు.

మాక్‌టెస్టులు: అభ్యర్థులు స్టడీ మెటీరియల్‌తో పాటుగా గత సంవత్సరాల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. మధ్యలో మాక్‌ టెస్టులకు హాజరవుతూ స్థాయిని పరీక్షించుకోవాలి. కొన్ని విద్యాసంస్థలు మాక్‌ టెస్టులను నిర్వహిస్తుంటాయి. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కూడా మాక్‌టెస్టులు అందుబాటులో ఉంటాయి. వీటి వల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉంది, దాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనే విషయాలపై  అవగాహన వస్తుంది. 

సమయపాలన: మనం ఏం సాధించాలన్నా సమయపాలన ఎంతో ముఖ్యం. తయారు చేసుకున్న టైమ్‌టేబుల్‌ను విధిగా పాటించాలి. దానిప్రకారం సన్నద్ధతను క్రమశిక్షణతో సకాలంలో పూర్తిచేసుకోవాలి. ఏ అంశాలకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. కఠినంగా ఉండే అంశాలకూ, గత ప్రశ్నపత్రాల్లో పునరావృతం అవుతున్న అంశాలకూ ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. 

విభాగాలవారీగా ఏ అంశాలు ముఖ్యం?

ఎనలిటికల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలోని ప్రశ్నలు అభ్యర్థి తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్, డేటా ఎనాలిసిస్, డేటా సఫిషి‡యన్సీ, కోడింగ్, డీకోడింగ్, టైమ్‌ అరేంజ్‌మెంట్‌ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. ఈ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నలను వేగంగా సాధించడానికి అవసరమైన షార్ట్‌కట్స్‌ను తెలుసుకోవాలి. అధిక సాధన ద్వారా మాత్రమే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. పాత ఐసెట్‌ ప్రశ్నపత్రాలను బాగా సాధన చేస్తే.. పునరావృతం అవుతున్న ప్రశ్నలపై పట్టు లభిస్తుంది. 

మ్యాథమెటికల్‌ ఎబిలిటీ: దీంట్లో స్టాటిస్టికల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటికల్‌ ఎబిలిటీ, జామెట్రీ, ఆల్జీబ్రా అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు దాదాపుగా పదో తరగతి గణితశాస్త్రం ఆధారంగా ఉంటాయి. అభ్యర్థులు బేసిక్‌ మ్యాథమెటిక్స్‌పై దృష్టిని కేంద్రీకరించాలి. ఎల్‌సీఎం, జీఎస్‌డీ, పర్సంటేజెస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, డిస్టెన్స్, వర్క్‌ ప్రాబ్లమ్స్, టైమ్, రిలేషన్స్, ఫంక్షన్స్, మీన్, మీడియన్, మోడ్‌ లాంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ముందుగా ప్రశ్నలను బాగా అర్థం చేసుకుంటే సరైన సమాధానాన్ని రాబట్టవచ్చు.

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో అభ్యర్థుల భాషా పరిజ్ఞానాన్ని మదింపు చేస్తారు. దీంట్లో ఫంక్షనల్‌ గ్రామర్, ఒకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కంప్యూటర్‌ అండ్‌ బిజినెస్‌ టెక్నాలజీస్‌పై ప్రశ్నలుంటాయి. వీటి కోసం ఇంగ్లిష్‌ గ్రామర్‌ అంశాలను అవగాహన చేసుకోవాలి. వ్యాకరణ నియమాలను గుర్తుంచుకోవాలి. కంప్యూటర్, బిజినెస్‌కు సంబంధించిన సాంకేతిక పదజాలాన్ని తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి.

చదవాల్సిన పుస్తకాలు..

అనలిటికల్‌ ఎబిలిటీ: ఆర్‌.ఎస్‌.అగర్వాల్, నిశిత్‌ సిన్హా, అరుణ్‌ శర్మ

మ్యాథమెటికల్‌ ఎబిలిటీ: ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ 

కమ్యూనికేషన్‌ ఎబిలిటీ: నార్మన్‌ లూయిస్‌ (వర్డ్‌ పవర్‌ కోసం), రెన్‌ అండ్‌ మార్టిన్‌ (గ్రామర్‌ కోసం).

ఐ-సెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు చూడాల్సిన వెబ్‌సైట్లు: https://icet.tsche.ac.in/, https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ఇంటర్వ్యూకి ఇవిగో మెలకువలు!

‣ పర్యాటకంలో బీబీఏ, ఎంబీఏ

‣ లెఫ్టినెంట్‌ అవుతారా?

‣ పట్టపగ్గాల్లేని రాజకీయ ఫిరాయింపులు

‣ సుదృఢ బంధమే ఉభయతారకం

‣ ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

Posted Date : 31-05-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌