• facebook
  • whatsapp
  • telegram

మేనేజ్‌మెంట్‌ విద్యకు మేలైన మార్గం!

ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల

ఎంబీఏ, ఎంసీఏలో చేరేందుకు అవకాశం

దేశంలో ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఇంజినీరింగ్, మెడిసిన్ తర్వాత ప్రత్యేక స్థానం ఉంది.  ప్రతి రంగంలోనూ , సంస్థలోనూ ఎంబీఏ, ఎంసీఏ పట్టభద్రుల పాత్ర ఉంటుంది. ఈ రెండింట్లో ఏ కోర్సు చేసినా సమర్థంగా విధులు నిర్వహించగలిగే నైపుణ్యాలను సొంతం చేసుకుంటారు. మేనేజ్‌మెంట్‌ విద్యలో కామర్స్ నేపథ్యం ఉన్నవారితోపాటు సైన్స్, ఆర్ట్స్ విద్యార్థులూ చేరవచ్చు. తాజాగా ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) ద్వారా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు కల్పించనుంది. ఈ పరీక్ష ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతుంది. 

ఇదీ అర్హత

ఎంబీఏ కోర్సులో చేరడానికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంసీఏ కోర్సులో చేరేందుకు ఇంటర్ లేదా డిగ్రీలో గణితం ఒక సబ్జెక్టుగా ఉండాలి. కనీసం 50శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 45శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం 

ఎంబీఏ, ఎంసీఏ రెండు కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అందులో సాధించిన స్కోరు ఆధారంగా రాష్ట్రంలోని మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో సీటు కల్పిస్తారు. 

దరఖాస్తు ఇలా..

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము  ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీలు రూ.600, ఎస్సీ/ ఎస్టీలు రూ,550 చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు ఆగస్టు 14, 2021 తుది గడువు. 

రాత పరీక్ష 

రాత పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో మూడు విభాగాలు సెక్షన్-ఎ, బి, సి ఉంటాయి. సెక్షన్ ఎ, సి ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. సెక్షన్-బి ప్రశ్నపత్రం కేవలం ఆంగ్లంలోనే ఇస్తారు. ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. సమయం 150 నిమిషాలు ఇస్తారు. పరీక్షలో రుణాత్మక మార్కులు లేవు.

సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ; ఈ విభాగంలో 75 ప్రశ్నలకు 75 మార్కులు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. డేటా సఫిషియన్సీ నుంచి 20 ప్రశ్నలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ (సీక్వెన్స్ అండ్ సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్) నుంచి 55 ప్రశ్నలు అడుగుతారు.

సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇందులో 70 ప్రశ్నలు ఉంటాయి. 70 మార్కులు. ఒకాబులరీ నుంచి 15 ప్రశ్నలు, బిజినెస్, కంప్యూటర్ టర్మినాలజీ 15, ఫంక్షనల్ గ్రామర్ 20, రీడింగ్ కాంప్రహెన్షన్కు సంబంధించి 20 ప్రశ్నలుంటాయి.

సెక్షన్-సి: మ్యాథమేటికల్ ఎబిలిటీ; ఈ విభాగంలో 55 ప్రశ్నలకు 55 మార్కులు. అరిథ్మెటికల్ ఎబిలిటీకి చెందిన 35 ప్రశ్నలు, ఆల్జీబ్రికల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ నుంచి 10 ప్రశ్నలు, స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి10 ప్రశ్నలు వస్తాయి.

పరీక్షా కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

పరీక్ష తేదీ.. వేళలు

రాత పరీక్షను రెండు రోజులు సెప్టెంబర్ 17, 18, 2021న నిర్వహిస్తారు. ఇది రెండు షిఫ్టుల్లో ఉంటుంది. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. 

వెబ్‌సైట్‌ : https://sche.ap.gov.in/

Posted Date : 16-07-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌