• facebook
  • whatsapp
  • telegram

వెయిటేజి చూసి.. పట్టు పట్టాలి!

ఇంజినీరింగ్ వృత్తివిద్యలో ప్రవేశం కోరే ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ మెయిన్ కీలకం. జేఈఈ మెయిన్లో స్కోరు చేసేలా ప్రణాళిక వేసుకోవాలి. 200కు పైగా మార్కుల లక్ష్యాన్ని పెట్టుకుని సమయం వృథా చేయకుండా పట్టుదలగా ప్రిపరేషన్ సాగించాలి. అందుకు తోడ్పడే మెలకువలివిగో! 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణలో జేఈఈ మెయిన్ పరీక్ష జ‌రుగుతుంది. ప్రతిష్ఠాత్మకమైన ఎన్ఐటీలూ, ఐఐటీలూ, డీమ్డ్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశం పొందగోరే విద్యార్థులకు ఈ పరీక్ష ర్యాంకు ముఖ్యం. ఇంటర్మీడియట్ పరీక్షల ప్రిపరేషన్తోపాటు జేఈఈ మెయిన్లో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించాలనుకున్న విద్యార్థులు ఆచరణాత్మక ప్రణాళికను అమలు చేయాలి. ఇందుకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యాంశాలతో సొంత నోట్సు రాసుకోవాలి. వెయిటేజి అధికంగా ఉన్న అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. పాత ప్రశ్నపత్రాలను శ్రద్ధగా సాధన చేయాలి.

పరీక్షా విధానం
360 మార్కులకు 3 గంటల సమయంలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించే పరీక్ష - జేఈఈ మెయిన్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ప్రతి సబ్జెక్టులో 30 ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇస్తే ఒక రుణాత్మక మార్కు. జేఈఈ మెయిన్కు  సన్నద్ధమయ్యే ప్రతి విద్యార్థీ గతంలో నిర్వహించిన ప‌రీక్ష‌ పేపర్లనూ ఎన్టీఏ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా సాధన చేయటం ఎంతో ప్రయోజనకరం.

సంక్షిప్త సమాచారం
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ప్రతి అంశంపై సంక్షిప్త వివరాలతో కూడిన సొంతశైలి సమాచారం తయారు చేసుకోవాలి. తర్వాత ప్రతి అంశానికీ సంబంధించిన పరీక్షలకు ఎక్కువ సిద్ధం కావాలి. కాలాన్ని వృథా చేయకుండా కనీసం ప్రతి సబ్జెక్టుకు 2 నుంచి 3 గంటల సమయం కేటాయించాలి. గంటలో 20 నుంచి 25 ప్రశ్నలు ప్రతి సబ్జెక్టులో తప్పులు చేయకుండా, వివరణతో కూడిన సమాధానాలను పేపర్పై రాస్తూ, సాధన చేస్తూ ప్రిపరేషన్ సాగించాలి.

కెమిస్ట్రీ
కెమిస్ట్రీలో 30 నుంచి 35 శాతం ప్రశ్నలు ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి, 25 నుంచి 30 శాతం ప్రశ్నలు ఇనార్గానిక్ నుంచి, మిగిలిన శాతం ప్రశ్నలు ఆర్గానిక్ నుంచి వస్తున్నాయి.

 

సొంత వివరణతో...
ఈ సబ్జెక్టులో జేఈఈ పరంగా పట్టు రావాలంటే పూర్తిగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలకు పరిమితం అవ్వాలి. వేరే వాటి జోలికి వెళ్లొద్ధు ప్రతి చాఫ్టర్లోని ప్రతి అంశాన్నీ చదివి దానికి స్వీయ వివరణతో కూడిన నోట్స్ తయారుచేసుకోండి. అదే అంశానికి సంబంధించిన పాత జేఈఈ మెయిన్ ప్రశ్నలన్నింటినీ సాధన చేయాలి.
పూర్తి పట్టు సాధించాల్సిన అంశాలు-
* కెమికల్ బాండింగ్
* పీ బ్లాక్ ఎలిమెంట్స్
* ఈక్విలిబ్రియమ్
* జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ (జీఓసీ)
* థెర్మో డైనమిక్స్
* కోఆర్డినేషన్ కాంపౌండ్స్

ఫిజిక్స్
చాలామంది కష్టంగా భావించే ఫిజిక్స్లో కిందటిసారి జరిగిన పరీక్షలో ప్రాథమిక సమాచారం, మౌలిక అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కువ సమయం హరించని ప్రశ్నలను మాత్రమే అడిగారు. ఎప్పటిలాగే మెకానిక్స్ నుంచి 35% ప్రశ్నలు, హీట్ నుంచి 10%, ఎలక్ట్రో స్టాటిక్స్ అండ్ మాగ్నటిజం నుంచి 18%, కరెంట్ ఎలక్ట్రిసిటీ- ఈఎంఐల నుంచి 20%, 17% ప్రశ్నలు ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఇచ్చారు.

 

గత పరీక్షల నుంచి...
గతంలో జేఈఈ మెయిన్లో కీలకపాత్ర పోషించిన అంశాలపై ఎక్కువ దృష్టి సారించండి. పాత జేఈఈ పేపర్ల సాధన మరవవద్ధు ముఖ్య అధ్యాయాల్లో ప్రాథమిక అంశాలతోపాటు, మిశ్రమ అంశాలపై సాధన ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్స్లో పై అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడిగారో గమనించాలి. వాటికి సంబంధించిన సూత్రాలు, సమీకరణాలపై అవగాహన పెంచుకోవాలి.
పూర్తి పట్టు సాధించాల్సిన అంశాలు-
* గ్రావిటేషన్
* ఎస్హెచ్ఎం
* వేవ్స్
* కరెంట్ ఎలక్ట్రిసిటీ
* ఈఎంఐ
* మోడర్న్ ఫిజిక్స్
* థెర్మో డైనమిక్స్

మ్యాథ్స్
ఎక్కువమంది విద్యార్థులు భౌతిక, రసాయన శాస్త్రాలతో పోలిస్తే మ్యాథ్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే మ్యాథ్స్లో ఎప్పటిలాగే 35% ప్రశ్నలు వెక్టార్స్, 3డీ, కోఆర్డినేట్ జామెట్రీల నుంచి, 32% శాతం కాల్క్యులస్ నుంచి, 25% ఆల్జీబ్రా నుంచి, మిగిలిన శాతం ట్రిగొనామెట్రీ నుంచి మాత్రమే ఇస్తున్నారు.
పూర్తి పట్టు సాధించాల్సిన అంశాలు-
* సీక్వెన్సెస్ అండ్ సిరీస్
* స్ట్రెయిట్ లైన్స్-సర్కిల్స్
* మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్
* డఫెనిట్ ఇంటెగ్రల్స్
* అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్
* వెక్టార్స్ అండ్ 3డీ

రాబోయే రోజుల్లో పైన పేర్కొన్న అధ్యాయాల నుంచి నెలకు కనీసం రెండు అధ్యాయాలను క్షుణ్ణంగా సాధన చేయాలి. చివర్లో ప్రతి అంశంపై పాత జేఈఈ మెయిన్ పేపర్లలో అడిగిన ప్రశ్నలను సాధన చేయాలి. ఇలా క్రమపద్ధతిలో చేస్తే, అత్యధిక మార్కులు పొందొచ్ఛు

Posted Date : 19-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌