• facebook
  • whatsapp
  • telegram

స్కోరుకు జీవం!

వైద్యవిద్య చదవాలనుకునే విద్యార్థులు జాతీయస్థాయిలో రాసే పరీక్ష... ‘నీట్‌’. సరైన ప్ర‌ణాళిక‌తో చ‌ద‌వాలి. ఈ పరీక్ష స్కోరులో, మొత్తం ర్యాంకులో కీలకపాత్ర వహించేవి జీవశాస్త్రం (బయాలజీ) మార్కులు. నీట్‌ పూర్వ ప్రశ్నపత్రాల తీరు ద్వారా ఈ సబ్జెక్టును ఎలా సాధన చేయాలో గ్రహించవచ్చు. అందుకు ఉపకరించే విశ్లేషణ..!


నీట్‌లో మంచి ర్యాంకుతోపాటు ప్రభుత్వ/ ప్రైవేటు ‘ఎ’ కేటగిరీలో సీటు సాధించాలంటే 720 మార్కులకు 510కుపైగా, ప్రైవేటు ‘బి’ కేటగిరీలో సీటు సాధించాలంటే 330కిపైగా మార్కులు సాధించాలి. కేవలం క్వాలిఫై అవ్వాలన్నా, ఇతర కేటగిరీల్లోనైనా స్కోరు ఆశించిన స్థాయిలో ఉండాలన్నా బయాలజీదే సింహభాగం అవుతుంది. అంటే.. ఈ సబ్జెక్టులో పట్టు లేకపోతే ‘నీట్‌’లో ఏ స్థాయిలో రాణించాలన్నా కష్టమే.అందుకే బయాలజీపై ఎక్కువ శ్రద్ధపెట్టాల్సిన అవసరముంది. ఇదివరకు సరిగా చదవకపోయినా, చదివినవి మర్చిపోయినా ఇప్పుడు దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఇంటర్‌ మార్కులతో సంబంధం లేదు. అందువల్ల జనవరి, ఫిబ్రవరిల్లో కొంత సమయం దాకా కూడా నీట్‌ ప్రవేశానికి అధ్యయనం చేసుకోవచ్చు. ఇంటర్‌లో రెండో సంవత్సరంలో ఉండే అంశాలపై ఫిబ్రవరిలో ఎక్కువ శ్రద్ధపెడితే రెండింటికీ ఉపయోగం. 720 మార్కుల్లో బయాలజీకి 360 ఉన్నాయి కాబట్టి ప్రత్యేక శ్రద్ధ, ప్రణాళిక అవసరం.


మెరుగైన మార్కులకు...
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో అంశాలు క్షుణ్ణంగా, సూక్ష్మంగా చదవాలి. కొన్ని ప్రశ్నల్లో ప్రత్యేకించి పుస్తకాల్లో ఇచ్చిన పదాల, అంశాల ఆధారంగా మాత్రమే చేయగలిగినవి ఉంటాయి.
పుస్తకాల్లో ఇచ్చిన పటాలను జాగ్రత్తగా గమనించాలి. పాఠ్యాంశాల్లో లేకపోయినా పటంలో ఉంటే వాటి గురించి తెలుసుకోవాలి. 2017 పరీక్షలో పటం ఆధారంగా ఎక్కువ ప్రశ్నలు లేవు. అలాగని అశ్రద్ధ చేయడం తగదు.
నీట్‌ ప్రణాళికలో లేకపోయినా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక అంశాలను తప్పకుండా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా కప్ప, వానపాము అంశాలకు సంబంధించినవి గుర్తుంచుకోవాలి. 2017లో కప్ప నుంచి 2 ప్రశ్నలు వచ్చాయి.
పాఠ్యపుస్తకం వెనుక ఇచ్చిన అంశాలను (సప్లిమెంట్‌) మర్చిపోకుండా అధ్యయనం చేయాలి. చాలా అంశాలు ముందు ఇవ్వనివి కూడా ఇక్కడ ఇచ్చారు.
ఏఐపీఎంటీ, నీట్‌ 2008-17 వరకు జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఏ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పర్యావరణశాస్త్రం యూనిట్‌కు సంబంధించి కొంత పరిమితి దాటి వచ్చిన ప్రశ్నలు ఏయే అంశాలపై దృష్టిపెట్టాలనే విషయంపై అవగాహన కలిగిస్తాయి.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకం ప్రతి అధ్యాయం చివర ప్రశ్నలుంటాయి. అలాంటివాటికి సమాధానాలను సిద్ధం చేసుకోవాలి.
11, 12 తరగతుల పుస్తకాల స్థాయికి మించిన ప్రశ్నలకు సిద్ధం కావాలంటే ముందుగా అందులోని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. ఆ తర్వాత మాత్రమే అదనపువాటిని ప్రయత్నించాలి. పుస్తకంలోని అంశాల ఆధారంగా దానికి అనుసంధాన అంశాలను చూసుకోవాలి.
ఎన్‌సీఈఆర్‌టీ వారి ఎక్సెంప్లర్‌ బయాలజీ అనే ప్రశ్నల పుస్తకం ఉంది. ఆ ప్రశ్నలూ వాటికి సమాధానాలూ చూసుకోవడం అవసరం. అక్కడక్కడ తప్పులు ఉంటే సరిచేసుకుని చదువుకోవాలి.
పాత పుస్తకాల్లోని అంశాలకు 2015 తరువాత అంటే 2016/ 2017 ముద్రణలో వచ్చిన పుస్తకాలను చూసుకోవాలి. అందులో చిన్నచిన్న మార్పులున్నాయి. వాటికి అనుగుణంగా చదువుకోవాలి.
జంతుశాస్త్రంలోని కీళ్లు (జాయింట్స్‌)కు సంబంధించి అలాగే వృక్షశాస్త్రానికి సంబంధించి ప్రయోగాలు కొన్ని ప్రాక్టికల్‌ మాన్యువల్‌లో ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకుంటే మంచి స్కోరును ఆశించవచ్చు.
ప్లాంట్‌ కింగ్‌డమ్‌, ఆనిమల్‌ కింగ్‌డమ్‌లకు సంబంధించి, పుస్తకంలో ఇచ్చిన వాటితోపాటు కొన్ని ముఖ్యమైన అదనపు ఉదాహరణలను కూడా చూసుకోవడం మంచిది.
ప్రతి అంశాన్నీ చదివాక దానికి సంబంధించిన ప్రశ్నలను చేయాలి. దానివల్ల చదివిన అంశానికి భిన్నంగా కూడా ఆలోచించడం అలవాటు అవుతుంది. నమూనా పరీక్షలు రాయడం వల్ల సమయపాలనను పాటించవచ్చు.

తేలికేనని చిన్న తప్పులు
బయాలజీ అంటే తేలిక అని కొంతమంది అశ్రద్ధ వహిస్తారు. దీంతో చిన్న చిన్న తప్పులు చేస్తారు. 2015, 2016, 2017 ప్రశ్నపత్రాలను గమనిస్తే ఎక్కువ శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల అంశాల ఆధారంగానే ఉన్నాయి. అయితే 2017 ప్రశ్నపత్రం కొంతవరకు విశ్లేషణాత్మకంగా ఉందని విద్యార్థులు భావించారు. తెలిసినట్లే ఉండి, తొందరలో తప్పులు చేయించేవిగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 90 ప్రశ్నల్లో కనీసం 84-85 ప్రశ్నలవరకు కష్టపడి జాగ్రత్తగా చదువుతూ వెళితే చేయవచ్చు. కొద్దిగా అదనంగా అవగాహన, అధ్యయనం చేస్తే మిగిలిన ప్రశ్నలు చేయవచ్చు. అంటే.. కనీసం 330-340 వరకు మార్కులు సాధించడం అంత కష్టం కాదు.
గత పరీక్షల్లో 5-7 ప్రశ్నలు కొంత పరిధి దాటి ఉంటున్నాయి. 2017 ప్రశ్నపత్రంలోనూ కొద్దిగా ఆలోచింపజేసేవిగా లేదా రెండు సమాధానాల మధ్య తేల్చుకోలేనివిగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అయితే రెండు సంవత్సరాల సిలబస్‌లో..11వ తరగతి నుంచి 44 , 12వ తరగతి నుంచి 46 ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నల్లో క్లిష్టతనుబట్టి చూస్తే... సాధారణ ప్రశ్నలు- 60, మధ్యరకం- 16, విశ్లేషణాత్మకమైనవి- 14 ఉన్నాయి.
కొన్ని అంశాల్లో ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు. జంతుశాస్త్రంలో మానవ శరీరధర్మ శాస్త్రం, వృక్షశాస్త్రంలో వైవిధ్యం (ప్లాంట్‌ డైవర్సిటీ)లో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. అలాగే పర్యావరణ శాస్త్రం (ఎకాలజీ), జన్యుశాస్త్రం (జెనెటిక్స్‌ అండ్‌ మాలిక్యులార్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటెన్స్‌) వంటి పాఠ్యాంశాల్లో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి.


- ద‌త్తాత్రేయ ఎక్కిరాల

Posted Date : 22-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌