• facebook
  • whatsapp
  • telegram

గ్రూప్‌-4 పరీక్షలో విజయం వరించాలంటే..?

స్కోరింగ్‌ అంశాలపై దృష్టి పెడితే మేలు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌- 4 ఉద్యోగాలయిన జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం ప్రకటన విడుదల చేసింది. పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

స్క్రీనింగ్‌ (ప్రిలిమ్స్‌) పరీక్షలో సెక్షన్‌ ఏగా జనరల్‌ స్టడీస్, సెక్షన్‌ బీ గా తెలుగు, ఇంగ్లిష్‌ భాషలను నిర్ణయించారు. జనరల్‌ స్టడీస్‌ నుంచి 100 ప్రశ్నలు వంద మార్కులకు ఇస్తారు. తెలుగు, ఇంగ్లిష్‌ .. ఒక్కొక్క భాష నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తంగా 50 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థికి ప్రశ్నపత్రంతో పాటు ఓఎంఆర్‌ షీట్‌ ఇస్తారు. అభ్యర్థి ఓఎంఆర్‌ షీట్‌లో సంబంధిత సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది.

మెయిన్స్‌ పరీక్ష

ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో కూడా ఆబ్జెక్టివ్‌ విధానాన్నే పాటిస్తారు. మెయిన్స్‌ పరీక్షలో పేపర్‌-1 కింద జనరల్‌ స్టడీస్‌ 150 మార్కులకు 150 ప్రశ్నల రూపంలో ఇస్తారు. పేపర్‌-2లో తెలుగు, ఇంగ్లిష్‌ భాషలపై 150 ప్రశ్నలు 150 మార్కులకు అడుగుతారు. ఇందులో తెలుగు భాషకు 75 ప్రశ్నలు, ఆంగ్లానికి 75 ప్రశ్నలు కేటాయించారు. దీన్ని కంప్యూటర్‌ ఆధారిత ఆబ్జెక్టివ్‌ పరీక్షగా  నిర్వహిస్తారు..అంటే.. అభ్యర్థులు ప్రశ్నలను కంప్యూటర్‌లోనే చదవాలి, అక్కడే సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకు తగిన సూచనలను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్లో వీడియో రూపంలో నిక్షిప్తం చేసింది. అనేక ప్రైవేటు సంస్థలు కూడా అదే నమూనాలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను సిద్ధం చేశాయి వాటి సాధన ద్వారా కూడా  తగిన అనుభవాన్ని పొందొచ్చు.

జిల్లాల వారీగా... 

అనంతరం మెరిట్, రోస్టర్‌ ప్రాతిపదికన అర్హత ఉన్నవారికి డిస్ట్రిక్‌ సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లాల వారీగా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది క్వాలిఫైయింగ్‌ మార్క్‌ను కలిగి ఉంటుంది. మొత్తం పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తారు అందులో సాధారణ కేటగిరీ అభ్యర్థులు కనీసం 20 మార్కులు, బీసీ అభ్యర్థులు 17.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీ‡హెచ్‌ అభ్యర్థులు 15 మార్కులు పొందాల్సి ఉంటుంది. ఈ అర్హత పొందినవారిని మాత్రమే మెయిన్స్‌ పరీక్షలోని మార్కుల ఆధారంగా ఉద్యోగాల్లో నియమిస్తారు.

భాషల అంశాలు

పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయని సిలబస్‌లో పేర్కొన్నారు. రెండు భాషల సిలబస్‌ల్లోనూ దాదాపుగా ఒకే రకమైన అంశాలు కనిపిస్తున్నాయి. గ్రామర్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, వాక్యాల పునర్నిర్మాణం, పదసామర్థ్యం మొదలైన అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. ప్రధానంగా గ్రామర్‌పై ఉన్న పట్టు మార్కులు తెచ్చే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల రెండు భాషల్లోనూ సులభంగా గ్రామర్‌పై పట్టు సాధించే మెలకువలు నేర్చుకోవాలి.

వినటం, రాయటం, పెద్దగా చదవడం అనే భాషా మెలకువలను అనుసరించడం ద్వారా త్వరగా భాషలపై పట్టు సాధించవచ్చు. ఆంగ్ల భాష విషయంలో చిన్నపిల్లల కోసం రాసిన స్టోరీలను చదవడం ప్రయోజనకరం. సాంకేతిక విద్య బలపడిన తరువాత తెలుగు భాషపై చాలామంది కొత్త అభ్యర్థులకు తగినంత అవగాహన ఉండటం లేదు. ఈ లోపాన్ని గ్రహించుకుని బీటెక్‌ అభ్యర్థులు తెలుగుభాషపైన కూడా పట్టు సాధించేందుకు శ్రమపడాలి.

ఏపీపీఎస్సీ: 730 పోస్టులు

ఏపీ రెవెన్యూ, ఎండోమెంట్స్‌ (దేవాదాయ శాఖ) విభాగాల్లో 730 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయబోతోంది. 

1) జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ (రెవెన్యూ విభాగం): 670

2) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-3 (ఎండోమెంట్స్‌ సబ్‌ సర్వీస్‌): 60

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.  

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌), కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 19.

వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in/

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌

ఉన్న ఖాళీలను బట్టి 1:2 నిష్పత్తిలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ‘స్క్రీనింగ్‌లో అర్హత సాధించి, మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించినప్పుడే కదా.. కంప్యూటర్‌ టెస్ట్‌కు హాజరయ్యేది!’ అనే భావన చాలామంది అభ్యర్థుల్లో ఉంది. సిలబస్‌లో ఇచ్చిన అంశాలను పరిశీలిస్తే ప్రధానంగా ఎమ్మెస్‌ ఆఫీస్‌పై గట్టి పట్టు ఉండాలి. ఎమ్మెస్‌ వర్డ్, ఎక్సెల్‌ పవర్‌ పాయింట్‌లతోపాటు ఎంఎస్‌ యాక్సెస్‌ అవగాహన కూడా అవసరం. ఎంఎస్‌ యాక్సెస్‌ అని స్పష్టంగా చెప్పకపోయినా డేటాబేస్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా ప్రశ్నలు వస్తాయని చెప్పారు కాబట్టి యాక్సెస్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎమ్మెస్‌ ఆఫీస్‌పై ప్రశ్నలు మౌలిక స్థాయిలో ఉండవచ్చు. ప్రధానంగా ప్రాక్టీస్‌ ఆధారిత ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున సాధన ఇప్పటినుంచే ప్రయత్నిస్తే మంచిది.

వర్డ్, ఎక్సెల్, ఇతరత్రా అంశాల్లో కూడా ఏ ఉప అంశాలను పరీక్ష పరిధిలోకి తీసుకున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. వాటిని ప్రాక్టీసుతో నేర్చుకుంటే ప్రయోజనకరం. కంప్యూటర్‌ పరీక్షకు ఎంపికైన తర్వాత ఎమ్మెస్‌ ఆఫీస్‌ సంగతి చూడొచ్చులే అనే నిర్లిప్త ధోరణి మంచిది కాదు. వివిధ బ్రౌజర్‌లను ఉపయోగించి సమాచారాన్ని వెతకటం, కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేయడం, ఈ-మెయిల్‌ రూపకల్పన, వినియోగం, ఈ కామర్స్‌ వ్యవహారాలు.. ఇలాంటివి కూడా సిలబస్‌లో ఉన్నాయి. వాటి గురించి ప్రాథమిక పరిజ్ఞానం పెంచుకుంటే మంచిది.

గతంలో మాదిరి నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అనుసరిస్తున్నారు. అందువల్ల  ప్రతి మూడు తప్పులకూ ఒక మార్కును కోల్పోయే అవకాశం ఉంది.

పరీక్షను ఇంగ్లిష్‌ లేదా తెలుగు మీడియంలో రాయవచ్చు

ఏ జిల్లాకు స్థానికులు అవుతారో ఆ జిల్లాలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది.

జనరల్‌ స్టడీస్‌లో ఏది ఎలా?

పరీక్ష తేదీని బట్టి జనరల్‌ స్టడీస్‌లో ఏయే విషయాలపై దృష్టి పెడితే స్కోరింగ్‌ ఎక్కువ సాధ్యమో ఆలోచించాలి. అందుకు తగిన ప్రణాళికను అభ్యర్థులు అనుసరించాలి. 

జనరల్‌ స్టడీస్‌లో ఉన్న సిలబస్‌పై పూర్తి స్థాయిలో పట్టు అవసరం. అంటే కనీసం ఆరు నెలలపాటు రోజుకు 6 నుంచి 8 గంటలు చదివినప్పుడే ఇది సాధ్యమవుతుంది. స్క్రీనింగ్‌ పరీక్షను నాలుగు నెలల కాలంలో నిర్వహిస్తారని భావించినట్లయితే ఫ్రెష్‌ అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌లో పేర్కొన్న అన్ని విభాగాలపై దృష్టి పెట్టకుండా స్కోరింగ్‌కు అవకాశమున్న  విభాగాలపైనే దృష్టి పెట్టటం మేలైన నిర్ణయం. 

గతంలో గ్రూప్‌-1, 2, ఇతర పరీక్షలకు సిద్ధమైనవారు అన్ని విభాగాలపై దృష్టి పెట్టి రివిజన్‌ మాదిరిగా ఒక్కో విషయాన్ని అప్డేట్‌ చేసుకుంటూ అధ్యయనం చేయాలి.

జనరల్‌ స్టడీస్‌లో మొత్తం 12 విభాగాలను స్క్రీనింగ్‌లో, మెయిన్స్‌లో పేర్కొన్నారు. ఈ పన్నెండు విభాగాలకూ సమ ప్రాధాన్యం ఉంటుందని భావించకండి. గతంలో కొన్ని విభాగాల నుంచి అత్యధిక ప్రశ్నలు అడిగారు కాబట్టి అవే విభాగాల నుంచి కూడా అదే స్థాయిలో ప్రశ్నలు వస్తాయని కూడా భావించవద్దు.

సాధారణంగా చరిత్ర, పాలిటీ, కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ సైన్స్, భారత భౌగోళిక శాస్త్రం, రీజనింగ్‌ విభాగాల్లో మిగతా విభాగాల కంటే కొంచెం ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల మొదట అభ్యర్థులు ఈ విషయాలపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి.

ఇటీవలికాలంలో విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు, డేటా విశ్లేషణ, విభజన సమస్యలు మొదలైన విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో కాకపోయినా గుర్తించదగిన స్థాయిలో ప్రశ్నలు వస్తున్నాయి. వాటి సిలబస్‌ కూడా పరిమితమే కాబట్టి ప్రాధాన్యం ఇచ్చి అధ్యయనం చేయవచ్చు.

భౌగోళిక అంశాల్లో భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీని సిలబస్‌లో ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో ఈ రెండు అంశాలనూ కలిపి చదవాల్సి ఉంటుంది. భారతదేశ చరిత్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌ చరిత్రను కూడా కలిపారు. ఈ విభాగాలనూ అనుసంధానం చేసుకొని చదివితే మంచిది.

జనరల్‌ సైన్స్‌లో మౌలిక అంశాలు, అనువర్తన అంశాలు అని రెండుగా విభజించుకుని ముందుగా రెండు విభాగాలపైనా పట్టు సాధించాలి. ఎక్కువ సందర్భాల్లో ప్రశ్నలు ఈ రెండు కోణాల్లోనే కనిపిస్తున్నాయి.

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలతోపాటు కరెంట్‌ అఫైర్స్‌ సంబంధిత అంశాలూ అనుసంధానించి చదవాలి. ఎక్కువ సందర్భాల్లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాజాగా సాధించిన ప్రగతి గురించి ప్రశ్నలు ఎక్కువ ఉంటున్నాయి. ఆ దిశగా దృష్టి సారించి అధ్యయనం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది.

ఆర్థిక ప్రగతి సిలబస్‌ స్వాతంత్య్రానంతర పరిణామక్రమంలో ఇచ్చారు. జనరల్‌ స్టడీస్‌లో ఒక విభాగం మాత్రమే కాబట్టి గ్రూప్‌-2, 1 స్థాయిలో లోతుగా వెళ్లి చదివే సమయం కూడా దొరకదు. అందువల్ల ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణల అనంతర పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మౌలిక అంశాలు, ప్రస్తుతం ఉన్న ఆర్థిక సర్వే, బడ్జెట్, రాబోయే ఆర్థిక సర్వే బడ్జెట్లను బాగా అర్థం చేసుకున్నట్లయితే జనరల్‌ స్టడీస్‌ కోణంలో కావలసిన పట్టు సాధించవచ్చు.

*********************************************************************************

 

సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకొని తీసుకున్న సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు

6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి

7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

11. డేటా అనాలిసిస్: ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా బి) విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సి) బేసిక్ డేటా అనాలిసిస్ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)

12. ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు(విభజన సమస్యలు)


సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు

a) Comprehension

b) Usage and Idioms

c) Vocabulary and Punctuation

d) Logical re-arrangement of sentences

e) Grammar

ఎ) పర్యాయపదాలు, పదజాలం

బి) వ్యాకరణం

సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు

డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు

ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు


ఈ-బుక్స్


పాత ప్రశ్నప‌త్రాలు


నమూనా ప్రశ్నపత్రాలు

Posted Date : 29-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌