• facebook
  • whatsapp
  • telegram

తాజా అంశాలు జోడిస్తున్నారా?

ప్రస్తుతం గ్రూప్‌-1 నియామకాల కోసం పోటీ పడుతున్న వారిలో సివిల్స్‌ సైతం రాస్తున్నవారూ, గత ఆరు సంవత్సరాలుగా గ్రూప్‌-1 కోసం కృషి చేస్తున్న సీనియర్‌ అభ్యర్థులూ భారీగానే ఉన్నారు. అలాగే ప్రిలిమినరీ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రిపరేషన్‌ ప్రారంభించిన తాజా అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అభ్యర్థులు ఎన్ని రకాలుగా ఉన్నా అందరూ అనుసరించాల్సిన సోపానాలు ఏమిటో పరిశీలిద్దాం.

కంటెంట్‌ నిర్వహణ
ఈ నాలుగు నెలల్లో కనీసం మొదటి మూడు నెలల్లో కంటెంట్‌ అప్‌డేషన్‌కి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. సివిల్స్, సీనియర్‌ అభ్యర్థులైతే కంటెంట్‌ని అప్‌డేట్‌ చేసుకోవడం అవసరం. ముఖ్యంగా కొవిడ్‌ పరిణామాల అనంతరం గవర్నెన్స్‌కు ఎదురైన సవాళ్లు, ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న అవరోధాలు, పరిష్కారాలు, శాస్త్ర సాంకేతిక రంగంలో కొత్త ప్రమాణాలు, వ్యాధుల విషయంలో విపత్తు నిర్వహణ, ప్రపంచీకరణ వల్ల వస్తున్న లాభాలతోపాటు ముప్పులు (కొత్తగా గమనించిన విషయాలు), విదేశాంగ విధానం, దేశీయ రాజకీయ ఆర్థిక సంక్షోభాలు, నిర్భర భారత్‌ యోజన వంటి వ్యూహాలు, వలసలు, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వివిధ రకాలైన కుంగుబాట్లు, అంతర్జాతీయ పరిణామాలు, రాజ్యాంగ సవరణలు, సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు, దేశీయ విద్యా విధానంలో సంస్కరణలు... ఇలాంటి అనేక అంశాలను గుర్తించి పాత సబ్జెక్టును అప్‌డేట్‌ చేసుకోవాలి. అలా చేస్తేనే కాలానుగుణంగా ప్రొఫెసర్ల స్థాయిలో జవాబులు రాయగలుగుతారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యర్థులందరూ చాయిస్‌ పద్ధతిలో కంటెంట్‌లోని కొంత భాగాన్ని వదిలేయాలి. అందువల్ల సమయ కొరత లేకుండా కంటెంట్‌పై మరింతగా పట్టు బిగించవచ్చు. పాత ప్రశ్నపత్రాల అధ్యయనం ద్వారా, వర్తమాన పరిస్థితుల అనుసంధానం ద్వారా కంటెంట్‌ ప్రాధాన్యం లేనివి నిర్ణయించుకుని వదిలి వేయవచ్చు.

ప్రతిసారీ గమనిస్తున్న విషయం ఏమిటంటే- దాదాపు 30 శాతం ప్రశ్నలు మౌలిక అంశాలు, సమాచారంపై ఆధారపడి వస్తున్నాయి. చాలామంది అభ్యర్థులు కోచింగ్‌ సంస్థల మెటీరియల్‌పై ఆధారపడి ఈ మౌలిక అంశాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. తీరా పరీక్ష రాసిన తర్వాత ‘8, 9 తరగతుల స్థాయి ప్రశ్నలు ఇచ్చారేమిటి?’ అనుకోవటం సర్వసాధారణం. అలాంటి లోపాన్ని పరిష్కరించుకునేందుకు కూడా కంటెంట్‌ ప్రిపరేషన్లో వ్యూహం ఉండాలి.

పునశ్చరణ ఏ తీరు?
తప్పనిసరిగా రెండు మూడు సార్లు కంటెంట్‌ను చదవటం వల్ల విషయ అవగాహన పెరుగుతుంది. దానితోపాటు బలంగా జ్ఞాపకముంటుంది. అయితే పునశ్చరణ (రివిజన్‌) దశలో చదువుతున్న ప్రతి పాఠంలోని అంశాల ఆధారంగా ప్రస్తుతం ఎటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశముందో సరైన అంచనా వేసుకోవాలి. ఆ ప్రశ్నలకి కేటాయించే మార్కులను బట్టి ఎంత నిడివిలో సమాధానం రాయాలి అనేది ప్రాక్టికల్‌గా నిర్ణయించుకోవాలి. అందుకోసం కంటెంట్లో వదిలేయాల్సిన, ఉంచాల్సిన అంశాలను నిర్ధారించుకోవాలి.

మొదటి రివిజన్‌ పూర్తి అయిన తర్వాత రెండో రివిజన్‌లో మళ్లీ అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అవసరమైన అంశాలపైనే దృష్టి పెట్టాలి. మూడో రివిజన్‌ పూర్తయ్యేసరికి పూర్తిగా చదవాల్సిన అంశమేదీ మిగలకుండా పూర్తి చేస్తేనే సరైన రీతిలో పునశ్చరణ ముగిసినట్లు. రివిజన్‌ జరుగుతున్నప్పుడు కంటెంట్‌ని అవసరమైన రీతిలో అప్డేట్‌ చేసుకోవడం తెలివైన వ్యూహమవుతుంది. రివిజన్‌ పేరుతో పాతదే చదవాల్సిన అవసరం లేదు.

నమూనా పరీక్షలు
ఇది చాలా ముఖ్యమైన అంశం. మెయిన్స్‌ డిస్క్రిప్టివ్‌ పరీక్ష. కాబట్టి తప్పనిసరిగా నమూనా పరీక్షలకు సమాధానాలు రాసి అనేక లాభాలు పొందవచ్చు. నిర్దేశించిన సమయంలో ఎంత రాయగలిగాం, అనుకున్న కంటెంట్‌ ప్రెజెంట్‌ చేయగలిగామా? ప్రశ్నకు తగ్గ ఆన్సర్‌ ఇచ్చామా? రాస్తున్నప్పుడు కలిగిన ఇబ్బందులు ఏమిటి, సమయ నిర్వహణ ఎలా ఉంది? లాంటి అనేక ప్రశ్నలకి నమూనా పరీక్షలు సమాధానం ఇవ్వగలవు. దానివల్ల లోప పరిష్కారాన్ని అభ్యర్థులు పొందవచ్చు. ఈ నమూనా పరీక్ష రాసేటప్పుడు నిజమైన పరీక్ష హాల్‌ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానితోపాటు సమయ నియంత్రణ కచ్చితంగా పాటించాలి. వేగంగా రాస్తున్నప్పుడు రాత అర్థం అవుతుందా లేదా? తప్పులు రాస్తున్నామా లాంటి అనేక అంశాలను ధ్రువీకరించుకోవచ్చు. అయితే రాసిన సమాధానాలు అంచనా వేసుకోవడం మరో ముఖ్య అంశం. సీనియర్లకు గానీ, కళాశాల ప్రొఫెసర్లకు గానీ, ఇతర అనుభవజ్ఞులకు గానీ చూపించి లోపాలు తెలుసుకోవటమనేది మంచి ఫలితాలు ఇస్తుంది. సాధారణంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ వంటివి ప్రశ్నపత్రాల్లో తప్ప గ్రూప్‌-1 స్థాయిలో 60 నుంచి 65 శాతం మించి మార్కులు రావని చెప్పవచ్చు. ఒకవేళ మీకు అలా మార్కులు ఎవరైనా ఇస్తుంటే అది అహేతుకం. మీరు రాసిన కంటెంట్‌ను బట్టి కచ్చితమైన మార్కులు కేటాయించే నిపుణత మాత్రమే మిమ్మల్ని వాస్తవ చిత్రానికి దగ్గరగా తీసుకెళుతుంది. నమూనా పరీక్షల ద్వారా భాష మీద పట్టును పెంచుకోవచ్చు. రెండు రకాలైన భాషల్లో సమాధానాలు రాయకూడదు. ఏదో ఒక భాష ద్వారానే మీ భావాలను వ్యక్తీకరించాలి. పైన చెప్పిన ప్రక్రియలన్నీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పూర్తి చేసుకోవాలి. అక్టోబర్‌ నెలను పూర్తిగా తుది మెరుగుల కోసం కేటాయించుకోవాలి. ఇలా చేస్తే నవంబర్‌లో పరీక్షలు బాగా రాయడానికి అవకాశం ఉంటుంది.

సివిల్స్‌ + గ్రూప్స్‌ రాసేవారి సంగతి?
సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు తయారవుతూ ఇటువైపు గ్రూప్‌-1 మెయిన్స్‌ రాయాలనుకుంటే మరింత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. కింది అంశాలపై పట్టు సాధించాలి. అప్పుడే విజయావకాశాలు మెరుగవుతాయి.

ఆంధ్రప్రదేశ్‌ స్థానికత వ్యాసరచనలో ప్రతిబింబించేలా ఉండాలి. సందర్భోచితంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలను ఉదాహరించాలి. వ్యాస రచనల మొదటి విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ సంబంధిత వర్తమాన అంశం వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా తయారవ్వాలి. సెక్షన్‌-3 లోని రిఫ్లెక్టివ్‌ వ్యాసంలోనూ నేటివిటీ అంశాలు చాలా అవసరం.
పేపర్‌-2లో ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర విభాగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సంస్కృతి సంబంధిత అంశాలపై పట్టు పెంచుకోవాలి. చరిత్రలోని రాజకీయ పరిణామాల కంటే పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఆ దిశగా ప్రిపరేషన్‌లో జాగ్రత్తలు ఉండాలి.
ఏపీ జాగ్రఫీ అంశాలను చదివేటప్పుడు ఏపీ ఎకానమీతో అనుసంధానం చేసుకోవాలి. ఇలా అనువర్తనాన్ని పెంచితే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకనుగుణంగా కంటెంట్‌ ప్రిపరేషన్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
పేపర్‌-4 లోని ఏపీ ఎకానమీపై పట్టు బిగించేందుకు తాజా ఆర్థిక సర్వే బడ్జెట్లను పరిగణనలోకి తీసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వ పథకాలపై దృష్టి పెట్టాలి. వివిధ సందర్భాల్లో భారత ఆర్థిక గణాంకాలనూ, సరిహద్దు రాష్ట్రాల ఆర్థిక గణాంకాలనూ మేళవించాలి.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌