• facebook
  • whatsapp
  • telegram

ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు

భూస్వరూప శాస్త్రాన్ని ఆంగ్లంలో Geomorphology అంటారు. Geo అంటే భూమి, morphus అంటే స్వరూపం అని అర్థం. డబ్ల్యూ. ఎం. డేవిస్‌ను 'భూ స్వరూపశాస్త్ర పితామహుడు' అని పిలుస్తారు. భూ ఉపరితలంపై మూడు రకాల భూస్వరూపాలు ఉన్నాయి.

మొదటి తరగతి భూస్వరూపాలు: ఖండాలు, మహా సముద్రాలు
 

రెండో తరగతి భూస్వరూపాలు: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, సరస్సులు, శిలలు
 

మూడో తరగతి భూస్వరూపాలు: క్రమక్షయ, నిక్షేపణ, అవశిష్ట భూస్వరూపాలు
 

భూస్వరూపాలు ఏర్పాటు

అంతర్జనిత బలాలు (Endogenic forces) లేదా విరూపాకారక బలాలు (Tectonic forces): భూకంపాలు, అగ్నిపర్వతాలు లాంటి అంతర్జనిత బలాల కారణంగా వివిధ భౌమ కాలాల్లో ప్రస్తుతం ఉన్న భూస్వరూపాలు ఏర్పడ్డాయి.
 

బాహ్యజనిత బలాలు (Exogenic forces): గాలి, నీరు, ఉష్ణోగ్రత లాంటి బాహ్య ప్రకృతి కారకాలు వివిధ భూస్వరూపాలను శైథిల్య, క్రమక్షయ, నిక్షేపణ ప్రక్రియలకు లోనుచేస్తూ వాటి ఆకార, పరిమాణాల్లో నిరంతరం మార్పులను కలగజేస్తాయి.
 

ప్రధాన భూ ఉపరితల స్వరూపాలు మూడు రకాలు. అవి: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. వీటినే ద్వితీయ శ్రేణి/ రెండో తరగతి భూస్వరూపాలు అని కూడా అంటారు.
 

పర్వతాలు
సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉండేదాన్ని కొండ అని, 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండేదాన్ని పర్వతం అని పిలుస్తారు. పర్వతానికి రెండు వైపులా పార్శ్వాల వాలు,   పీఠం వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. శిఖర వైశాల్యం తక్కువగా మొనదేలి ఉంటుంది

* పర్వతాల అధ్యయనాన్ని 'ఓరాలజీ అంటారు. గ్రీకు భాషలో 'ఓరోస్ అంటే పర్వతం అని అర్థం.
 

* పర్వతాల ఆకారం, పరిమాణాలను బట్టి 5 రకాలుగా విభజించవచ్చు. అవి:
పర్వత శ్రేణి (Mountain Range): పర్వతాలు ఒకదాని తర్వాత మరొకటి గుంపులు గుంపులుగా చాలా దూరం విస్తరించి ఉండే అమరికను పర్వత శ్రేణి అంటారు.

పర్వత వ్యవస్థ (Mountain System): వయసులోనూ, ఉద్భవరీత్యా సమానంగా ఉన్న పర్వత శ్రేణులు ఒకే చోట ఉంటే దాన్ని పర్వత వ్యవస్థ అంటారు. ఉదా: హిమాలయాలు.
 

పర్వత గొలుసు (Mountain Chain): కొన్ని పర్వతాలు వయసు, ఉద్భవరీత్యా ఒకదానితో ఒకటి సంబంధం లేకపోయినా ఒక మేఖల (Belt) గా ఏర్పడితే వాటిని పర్వత గొలుసు అంటారు.
ఉదా: ఆండీస్ పర్వతాలు.

సముదాయం (Complex): ఒక నిర్దిష్ట అమరిక లేని పర్వతాల గుంపును సముదాయం అంటారు.
 

కార్డిలెరా (Cardilera): అనేక పర్వత గొలుసులు కలిస్తే దాన్ని కార్డిలెరా అంటారు.
 

పర్వతాల ఆవిర్భావం
 అగ్నిపర్వతాల క్రియాశీలత (Volcanic Activism), భేదక క్రమక్షయం (Differential erosion), భూపటల చలనాలు (Movements of the earth’s crust) విడివిడిగా లేదా ఏకకాలంలో పనిచేయడం వల్ల పర్వతాలు ఏర్పడతాయి.

ఇవి మూడు రకాలు
విరూపాకారక పర్వతాలు (Deformation mountains)

 ఇవి భూ అంతర్గత బలాల సర్దుబాట్లు, మార్పుల వల్ల ఏర్పడతాయి. భూమిపై ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఖండ పర్వతాలు, ముడుత పర్వతాలు వీటిలోని రకాలు.
 

ఖండ పర్వతాలు (Block mountains)
భూ అంతర్భాగంలోని తన్యత బలాలు లేదా భూకంపాల వల్ల భూమిపై భ్రంశాలు/ పగుళ్లు ఏర్పడతాయి. వీటికి రెండు వైపులా లేదా మధ్యలో భూపటలం పైకి, కిందికి కదులుతూ ఉంటుంది. ఇలాంటి రెండు సమాంతర భ్రంశ తలాల మధ్య భాగం కుంగిపోవడం వల్ల లేదా దానికి ఇరువైపులా ఉన్న భూఖండం పైకి రావడం వల్ల ఎత్తైన ప్రాంతం ఏర్పడుతుంది. ఇలా ఎత్తుగా ఏర్పడిన ప్రాంతాన్నే భ్రంశోత్థిత శిలా విన్యాసం (Horst) లేదా ఖండ పర్వతం అంటారు.   ఖండ పర్వతాలు కఠిన శిలలతో ఉంటాయి.
ఉదా: భారత్‌లోని వింధ్య సాత్పూరా పర్వతాలు, జర్మనీ లోని బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు, ఫ్రాన్స్‌లోని వాస్‌జెస్ పర్వతాలు, దక్షిణాఫ్రికాలోని డ్రాకెన్స్ బర్గ్ పర్వతాలు.

 

పగులు లోయ: రెండు ఖండ పర్వతాలకు లేదా ఎత్తైన ప్రాంతాలకు మధ్య ప్రాంతం కిందికి దిగడం వల్ల ఏర్పడిన లోయను పగులు లోయ (Rift valley) అంటారు.  ఆఫ్రికాలో నైలు నది ప్రవహిస్తున్న పగులు లోయ ప్రపంచంలో అతిపెద్దది. దీన్ని 'గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ' అంటారు.
 

ఉదాహరణలు
» భారత్‌లోని వింధ్య సాత్పూరా పర్వతాల మధ్య ఉన్న నర్మదా పగులు లోయ
» ఐరోపాలోని వాస్‌జెస్, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాల మధ్య ఉన్న రైన్ నదీ పగులు లోయ
» ఎర్ర సముద్రం ఉన్న ప్రాంతం
» యూఎస్ఏ కాలిఫోర్నియాలో ఉన్న మృతలోయ

 

ముడుత పర్వతాలు (Fold mountains):
» సముద్ర భూ అభినతిలోని రాతి పొరలపై కలిగే పార్శ్వ (Lateral), ఊర్థ్వ (Vertical) బలాలు, ఖండ పలకల అభిముఖ చలనం వల్ల సముద్ర భూతలం ముడుతలు పడి పైకి నెట్టుకురావడం వల్ల ఈ పర్వతాలు ఏర్పడతాయి. వీటిని పురాతన, నవీన ముడుత పర్వతాలుగా వర్గీకరించవచ్చు. ఆరావళి, అపలేచియన్, యూరప్, గ్రేట్ డివైడింగ్ రేంజ్‌లను పురాతన ముడుత పర్వతాలుగా; ఉత్తర అమెరికాలోని రాఖీ, దక్షిణ అమెరికాలోని ఆండీస్, ఐరోపాలోని ఆల్ఫ్స్, భారత్‌లోని హిమాలయాలను నవీన ముడుత పర్వతాలుగా పేర్కొంటారు.

» ప్రపంచంలో అతి తరుణ లేదా అతి తక్కువ వయసు ఉన్న, ఎత్తైన ముడుత పర్వతాలు హిమాలయాలు.
» ప్రపంచంలో పొడవైన ముడుత పర్వతాలు ఆండీస్ పర్వతాలు.

 

పరిశిష్ట లేదా అవశిష్ట పర్వతాలు (Recidual mountains)

» ఒకప్పుడు ఎత్తుగా ఉండి గాలి, నీరు, వాతావరణం లాంటి బాహ్య ప్రకృతి కారకాల వల్ల నిర్విరామంగా క్రమక్షయానికి గురై, ఎత్తు తగ్గి ఇంకా నిలిచి ఉన్న పర్వతాలను అవశిష్ట పర్వతాలు అంటారు. 

ఉదా: భారతదేశంలోని ఆరావళి పర్వతాలు, రాజ్‌మహల్ కొండలు, ఉత్తర అమెరికాలోని అపలేచియన్ పర్వతాలు.
 

సంచిత లేదా అగ్ని పర్వతాలు (Accumulative/ Volcanic mountains)

» భూ అంతర్భాగంలోని శిలాద్రవం (మాగ్మా) భూ ఉపరితలానికి ప్రవహించి (లావా) సంచితంగా లేదా కుప్పగా ఏర్పడుతుంది. ఇలా శంకువు ఆకారంలో ఘనీభవించే లావా పటలాలతో కూడిన ఎత్తైన ప్రాంతాలను అగ్నిపర్వతాలు అంటారు. ఆండీస్ పర్వత శ్రేణుల్లో అనేక అగ్ని పర్వతాలు ఉన్నాయి. చిలీలోని అకాన్‌గ్వా, జపాన్‌లోని ఫ్యూజియామా, ఇటలీలోని వెసూవియస్ ప్రధానమైన అగ్నిపర్వతాలు.
 

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌