• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ శీతోష్ణస్థితి

     ఏదైనా ఒక ప్రాంతంలో నిర్దిష్ట కాలానికి చెందిన ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం లాంటి అంశాల స్థితిని వాతావరణం అంటారు. ఇవి తరచుగా మార్పులకు లోనవుతూ ఉంటాయి. ఈ వాతావరణ పరిస్థితుల దీర్ఘకాల సగటును (కనీసం 30 ఏళ్లపాటు నమోదైన సగటు) శీతోష్ణస్థితి అంటారు.

    భారతదేశం సుమారు 80 నుంచి 370 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉండటం వల్ల ఉత్తర అక్షాంశం (కర్కటరేఖ) దేశం మధ్య నుంచి వెళుతుంది. భారతదేశం విశాలంగా విస్తరించడం, ఈ భూభాగంపై రుతుపవనాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఇక్కడి శీతోష్ణస్థితిని ‘ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి’ అంటారు.
 

శీతోష్ణస్థితిని ప్రభావితంచేసే కారకాలు
1) అక్షాంశం 
2) భూమి, నీటికి మధ్య సంబంధం 
3) భౌగోళిక స్వరూపం
4) వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ

 

అక్షాంశం: అక్షాంశాన్ని అనుసరించి ఉష్ణ తీవ్రత మారుతూ ఉంటుంది. సాధారణంగా భూమధ్యరేఖ నుంచి ఉత్తర, దక్షిణ దిశలుగా ఉన్నత అక్షాంశాలవైపు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. మనదేశాన్ని కర్కటరేఖ రెండు భాగాలుగా విభజిస్తుంది. ఈ రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ (ఉప ఆయనరేఖ) మండలంలో, దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో (ఆయనరేఖ ప్రాంతం) విస్తరించి ఉంది.
 

భూమి, నీటికి మధ్య సంబంధం: సాధారణంగా భూభాగాలు తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడతాయి. జలభాగాలు నెమ్మదిగా వేడెక్కి నెమ్మదిగా చల్లబడతాయి. భూమి, నీరు వేడెక్కడంలో ఈ తేడాల ఫలితంగా పీడన వ్యత్యాసాలు ఏర్పడతాయి. దీంతో సముద్ర, భూప్రవాహాలు ఏర్పడి ఆ ప్రాంత ఉష్ణోగ్రతలపై ప్రభావాన్ని చూపుతాయి. భారత ద్వీపకల్ప ప్రాంత శీతోష్ణస్థితిపై సముద్ర ప్రభావం గణనీయంగా ఉంటుంది.
 

భౌగోళిక స్వరూపం: సాధారణంగా మైదాన ప్రాంతాలతో పోలిస్తే పీఠభూమి, పర్వత ప్రాంతాల్లో శీతోష్ణస్థితి భిన్నంగా ఉంటుంది. దీనికి కారణం సముద్ర మట్టం నుంచి పైకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. పర్వతాల ఎత్తు కూడా ఆయా ప్రదేశాల శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తుంది.
 

వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ: ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా మన దేశ శీతోష్ణస్థితి ప్రభావితమవుతుంది. ఈ ప్రవాహాలను జెట్‌ ప్రవాహాలు అంటారు. ఇవి నేల నుంచి 12000 మీటర్ల ఎత్తులో బలంగా వీస్తాయి. భారతదేశంలో 250 ఉత్తర అక్షాంశం వద్ద ఏర్పడే తూర్పు జెట్‌ ప్రవాహం శీతోష్ణస్థితిపై ప్రభావం చూపుతుంది.
రుతుపవనాలు, సూర్యకిరణాల పతనం, ఉష్ణోగ్రతలను అనుసరించి భారత వాతావరణ శాఖ సంవత్సరాన్ని నాలుగు కాలాలుగా విభజించింది.

 

శీతాకాలం: డిసెంబరు ప్రారంభం నుంచి భారత భూభాగంపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. ఈ పరిస్థితి ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. జనవరిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. భారతదేశంలో శీతాకాలంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతం జమ్ముకశ్మీర్‌లోని ద్రాస్‌. ఇక్కడ -40º వరకు ఉష్ణోగ్రత పడిపోతుంది. ఇదే సమయంలో యూరప్‌లో మధ్యదరా శీతోష్ణస్థితి ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. ఫలితంగా ఈ మండలంపై ఉన్న చల్లని తేమతో కూడిన గాలులు పశ్చిమ జెట్‌ ప్రవాహాల రూపంలో ఆసియాఖండం మీదుగా ఉత్తర భారతదేశం చేరుకుని ఓ మోస్తరు వర్షపాతానికి కారణం అవుతున్నాయి.
 

వేసవి కాలం: సూర్యుడు మార్చి 21న భూమధ్య రేఖపై నిట్టనిలువుగా ప్రకాశించి జూన్‌ 21 వరకు కర్కటరేఖ వైపు ప్రయాణం చేస్తాడు. ఈ మధ్య కాలాన్ని వేసవి కాలం అంటారు. ఈ సమయంలో భారతదేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తరం వైపు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. మే నెల మధ్య నాటికి వాయవ్య, మధ్య భారతదేశంలో పగటి ఉష్ణోగ్రత    40º కంటే అధికంగా నమోదవుతుంది. వేసవికాలంలో ఉత్తర భారతదేశంలో వీచే పొడిగాలులను ‘లూ’ అని పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రతల ఫలితంగా దేశంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన సంవహన వర్షాలు కురుస్తాయి. వీటినే రుతుపవన ఆరంభ జల్లులు అంటారు. వీటిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
 

నైరుతి రుతుపవన కాలం: ఇది జూన్‌ మధ్య నుంచి సెప్టెంబరు వరకు కొనసాగుతుంది. భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య కాలానుగుణంగా వీచే పవనాలను రుతుపవనాలు అంటారు. వేసవి కాలంలో టిబెట్‌ పీఠభూమి, భారతదేశ వాయవ్య, తూర్పు గంగా మైదాన ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడి దక్షిణార్ధగోళంలో వీచే ఆగ్నేయ వ్యాపార పవనాలను ఇటువైపు ఆకర్షిస్తుంది. ఈ పవనాలు భూమధ్య రేఖను దాటే సమయంలో కొరియాలియస్‌ ప్రభావం ఫలితంగా నైరుతి రుతుపవనాలుగా మారి భారత భూభాగం వైపు ప్రయాణిస్తాయి. ఈ పవనాలు దేశంలో తొలిసారిగా జూన్‌ మొదటివారంలో కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి (ఇవి తొలిసారిగా ప్రవేశించే ప్రాంతం అండమాన్‌ నికోబార్‌ దీవులు). దాదాపు 90% వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తుంది. తమిళనాడు తీరం, ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తా తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ నైరుతి రుతుపవనాల వల్ల వర్షాన్ని పొందుతాయి.
 

ఈశాన్య రుతుపవన కాలం: ఇది అక్టోబరు నుంచి నవంబరు వరకు ఉంటుంది. అక్టోబరు నాటికి మన దేశం చుట్టూ ఉన్న జలభాగం వేడెక్కడం వల్ల అక్కడ అల్పపీడన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించడానికి నైరుతి రుతుపవనాలు భూభాగం నుంచి సముద్రం వైపు తిరోగమనం చెందుతాయి. వీటినే తిరోగమన నైరుతి లేదా ఈశాన్య రుతుపవనాలు అని పిలుస్తారు. ఈ పవనాలు బంగాళాఖాతం మీదుగా పయనించే సమయంలో తేమను గ్రహించి తీవ్ర వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్‌ దక్షిణతీరం, తమిళనాడులోని కోరమాండల్‌ తీరానికి వర్షపాతాన్ని అందిస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉష్ణమండల చక్రవాతాలను తుపానులు అంటారు. ఈశాన్య రుతపవనాల కాలంలో ఎక్కువగా తుపానులకు గురయ్యే ప్రాంతం ఒడిశా. ఈ కాలంలో ఇక్కడ ఏర్పడే చక్రవాతాలు తూర్పుతీర ప్రాంతంలో ప్రధానంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో అపార ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతాయి.
 


 

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌