• facebook
  • whatsapp
  • telegram

అనువర్తన కోణంలో!

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల కోసం జనరల్‌ సైన్స్‌ను అధ్యయనం చేసేటప్పుడు మౌలికాంశాలను నిత్య జీవితానికి అనువర్తన చేస్తూ అర్థం చేసుకోవాలి. తాజా పరిణామాల ఆధారంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి ప్రిపేరవ్వాలి. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో సైన్స్‌లో ఏయే విభాగాలపై దృష్టి పెట్టాలి. టెక్నాలజీని వర్తమాన వ్యవహారాలకు ముడిపెట్టి ఏవిధంగా చదువుకోవాలో నిపుణులు తెలియజేస్తున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌లో భాగంగా సిలబస్‌లో జనరల్‌ సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన తాజా అంశాలను ఇచ్చారు. జనరల్‌ సైన్స్‌లో రోజువారీ అనువర్తనాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో సమాచార సాంకేతికతకు సంబంధించి ఇటీవల జరిగిన అభివృద్ధి అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రిపరేషన్‌లో భాగంగా సిలబస్‌ను జనరల్‌ సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాలుగా విభజించుకోవాలి. జనరల్‌ సైన్స్‌ను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రంగా విభజించుకొని చదవాలి. దీనికి సంబంధించి పాఠశాల స్థాయిలో 10వ తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి.

* రెండు భాగాల్లో ముఖ్యమైనవి కొన్ని
భౌతిక శాస్త్రంలో కాంతి, ధ్వని, అయస్కాంతత్వం, విద్యుత్‌, ఉష్ణం, గతిశాస్త్రం, శక్తి - మార్పులు లాంటి వాటిపై దృష్టి సారించాలి. రసాయన శాస్త్రంలో ఆమ్లాలు - క్షారాలు, లోహ సంగ్రహణ శాస్త్రం, రూపాంతరత; వివిధ పదార్థాల రసాయన, సాధారణ నామాలు, కేంద్రక రసాయన శాస్త్రం, ఆల్కహాల్స్‌ అంశాలను చదవాలి. జీవశాస్త్రంలో వృక్ష శాస్త్రం, జంతుశాస్త్ర సంబంధిత సమాచారం ఉంటుంది. వీటిలో విటమిన్‌లు, కణశాస్త్రం, వ్యాధులు, కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్‌లు, లిపిడ్‌లు, శ్వాసక్రియ, బాష్పోత్సేకంతోపాటు మానవ శరీర ధర్మశాస్త్రంలో ముఖ్య అంశాలైన అస్థిపంజర వ్యవస్థ, నాడీ వ్యవస్థ, జీర్ణక్రియ, హార్మోన్‌లు, ప్రత్యుత్పత్తి, శ్వాసక్రియ లాంటి వాటిపై పట్టు సాధించాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ క్లోనింగ్‌, స్టెమ్‌సెల్‌ టెక్నాలజీ, డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌; అంతరిక్ష, రక్షణ, అణురంగాలు, బయోటెక్నాలజీ లాంటి అంశాలను చదవాలి. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో భాగంగా సూపర్‌ కంప్యూటర్‌, డిజిటల్‌ ఇండియా, వివిధ రంగాల్లోని ఐటీ అనువర్తనాల గురించి తెలుసుకోవాలి.

* అన్ని అంశాలు ఒక వరుసలో
అభ్యర్థులు జనరల్‌ సైన్స్‌లో భాగంగా ఒక పాఠానికి సంబంధించి అన్ని తరగతుల్లోని అంశాలను ఒకేసారి చదవాలి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో భారతదేశ అభివృద్ధికి తోడ్పడిన వాటికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ ఇతర అంశాలను కూడా చదివితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. జనరల్‌ సైన్స్‌ అంశాలను పూర్తి స్థాయిలో కాకుండా సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని చదవాలి. సైన్స్‌ పాఠ్యాంశాలను ఒకసారి చదివి వదిలేయకుండా ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. జీవశాస్త్ర అంశాలను బట్టీ పట్టకుండా అర్థం చేసుకొని చదవాలి.

* టెక్నాలజీ విజయాలపై దృష్టి
భౌతిక, రసాయన శాస్త్ర విభాగాల్లో సమీకరణాలు, గణిత సంబంధ సూత్రాల కంటే మిగతా అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. టెక్నాలజీలో దేశ విజయాలపై దృష్టి సారించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో గత 6 నెలల్లో సాధించిన అభివృద్ధిని తెలుసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేసి ఏయే పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నారో విశ్లేషించుకుని వాటిని ఎక్కువగా చదవాలి. అభ్యర్థులు ఒకటి లేదా రెండు ప్రామాణిక పుస్తకాలనే ఎంచుకోవాలి.

* పుస్తకాలు.. వెబ్‌సైట్‌లు
జనరల్‌ సైన్స్‌ అంశాల కోసం ప్రధానంగా పాఠశాల స్థాయిలో 7 నుంచి 10వ తరగతి పుస్తకాలు చదవాలి. తెలుగు అకాడమీ పోటీ పరీక్షల కోసం విడుదల చేసిన జనరల్‌ స్టడీస్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. అకాడమీ బిట్‌ బ్యాంక్‌లను కూడా విడుదల చేసింది. వాటినీ ప్రాక్టీస్‌ చేయాలి. శాస్త్ర సాంకేతిక సంబంధిత తాజా విశేషాల కోసం ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లు, ప్రముఖ దినపత్రికల్లో వచ్చే వార్తలు, వ్యాసాలను చదివి పరీక్షల కోణంలో నోట్‌ చేసుకోవాలి. తరచూ మననం చేయాలి.

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌