• facebook
  • whatsapp
  • telegram

  ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి (2014 - 2019)

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు రాష్ట్ర జీడీపీ, రంగాల వారీగా వృద్ధి రేట్లు తదితర వివరాలను తెలుసుకోవాలి. అన్నదాతల ఆదాయాన్ని పెంచడానికి, పారిశ్రామిక ప్రగతికి, సేవారంగంలో ముందంజలో ఉండటానికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, మిషన్ల గురించి అవగాహన పెంచుకోవాలి. సంబంధిత గణాంకాలనూ గుర్తుంచుకోవాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 2014, జూన్‌ 2న విభజించడంతో నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. 2014 - 19 మధ్య అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రగతికి బాటలు వేస్తూ ఏడు మిషన్‌లతో అన్నిరంగాల్లో మార్పులు తీసుకొచ్చి రెండంకెల వృద్ధిరేటుకు ప్రయత్నించింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం అన్నిదశల్లో సమాచార, సాంకేతిక విజ్ఞాన అప్లికేషన్స్‌ - రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌, సీఎఫ్‌ఎంఎస్‌, ఐ - ఏఎంఎస్‌ లాంటి నూతన విధానాలను ప్రవేశపెట్టింది. వ్యవసాయంలో రైతుకు రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ప్రకృతి సేద్యం, నదుల అనుసంధానం, ఉద్యాన పంటల ప్రోత్సాహం లాంటి చర్యల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి కృషి చేసింది. పారిశ్రామిక సదస్సులు, విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రంలోని అనుకూల అంశాలను వివరిస్తూ సింగపూర్‌, జపాన్‌, దక్షిణకొరియా దేశాల నుంచి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధికితోడ్పడింది.

ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2018 - 19 ప్రకారం రాష్ట్రం 1,62,970 చ.కి.మీ. విస్తీర్ణంతో దేశంలో 8వ స్థానం, జనాభాలో 4.10%తో 10వ స్థానంలో ఉంది. 2001 - 11 మధ్య రాష్ట్ర జనాభా వృద్ధిరేటు అతి తక్కువగా (9.21%) నమోదైంది. రాష్ట్ర జనాభాలో 29.47% మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇది దేశ సగటు 31.16% కంటే తక్కువ. మనది గ్రామీణ ప్రధాన ఆర్థిక వ్యవస్థ.

రాష్ట్ర స్థూల ఆదాయం (GSDP)
సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తయిన వస్తు సేవల మార్కెట్‌ విలువలను రాష్ట్ర స్థూల ఆదాయం అంటారు. ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక గణాంక శాఖ ప్రస్తుత, స్థిర ధరల్లో రాష్ట్ర స్థూల ఆదాయాన్ని లెక్కిస్తుంది. స్థిర ధరల కోసం 2011 - 12 ఏడాదిని ఆధార సంవత్సరంగా గుర్తించింది. ఆదాయ మదింపు కోసం ఆర్థిక వ్యవస్థను 3 స్థూల రంగాలు (ప్రాథమిక, ద్వితీయ, తృతీయ), 9 ప్రధాన రంగాలుగా విభజించి తిరిగి వాటిని 17 ఉపరంగాలుగా గుర్తించారు. వివిధ రంగాల నుంచి సేకరించే అంచనాలను బిజుతి GVA (Gross Value Added) at basic price అంటారు.

GSDP = GVA at basic prices + Net of product taxes and product subsidies

రాష్ట్రంలో జీఎస్‌డీపీ 2014-15లో (2011-12 ధరల్లో) రూ.4,44,564 కోట్లు కాగా 2018-19 నాటికి రూ.6,80,332 కోట్లకు పెరిగింది. GVA రూ.6,14,665 కోట్లు, GSDP ప్రస్తుత ధరల్లో రూ.9,33,402 కోట్లుగా ఉంది.

స్థూల దేశీయ జిల్లాల ఆదాయం (GDDP)
నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 13 జిల్ల్లాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఆదాయాన్ని అందించడంలో కొన్ని జిల్లాలు ముందుండగా మరికొన్ని వెనుకబడి ఉన్నాయి. జిల్లాల మధ్య ఆదాయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాల నుంచి లభించే ఆదాయాన్ని స్థూల దేశీయ జిల్లాల ఆదాయం అంటారు. అన్ని జిల్లాల ఆదాయాలను కలిపితే స్థూల రాష్ట్ర దేశీయ ఆదాయం వస్తుంది.

ఆదాయంలో ముందున్న జిల్లాలు
1) విశాఖపట్నం 2) కృష్ణా 3) తూర్పు గోదావరి 4) గుంటూరు

అతి తక్కువ ఆదాయాన్నిచ్చే జిల్లాలు
1) విజయనగరం 2) శ్రీకాకుళం 3) కడప 4) ప్రకాశం

తలసరి ఆదాయం
రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర జనాభాకు పంచగా సగటున ఒక్కొక్కరికి వచ్చే ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. రాష్ట్రంలో జనాభా వృద్ధిరేటు తక్కువగా ఉండటం వల్ల ఈ అయిదేళ్ల కాలంలో తలసరి ఆదాయం స్థిర ధరల్లో రూ.79,174 నుంచి రూ.1,17,261 కు పెరిగింది. 2018 - 19 నాటికి ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం రూ.1,64,025 కు పెరిగింది.

తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాలు
1) విశాఖపట్నం 2) కృష్ణా 3) పశ్చిమ గోదావరి 4) నెల్లూరు

తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలు
1) శ్రీకాకుళం 2) విజయనగరం 3) అనంతపురం 4) కర్నూలు

వివిధ రంగాల వాటా
రాష్ట్రానికి ఆదాయం స్థూలంగా మూడు రంగాల నుంచి లభిస్తుంది.

2018-19లో ఆయా రంగాల వాటా
1) ప్రాథమిక రంగం - 33.64% 2) ద్వితీయ రంగం - 23.38% 3) తృతీయ రంగం - 42.98%

విభజన తర్వాత రాష్ట్ర ఆదాయంలో ప్రాథమిక రంగం వాటా పెరిగింది. ద్వితీయ, తృతీయ రంగాల వాటాలు తగ్గాయి.

శ్వేతపత్రం ప్రకారం....
2019 మే 30న ఏర్పాటైన కొత్త ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం జీఎస్‌డీపీ వృద్ధిరేటు 1999 - 2004 మధ్య 8.19%, 2004 - 2009 మధ్య అత్యధికంగా 15.08%, 2009 - 14 మధ్య 12.93% గా నమోదైంది. విభజన తర్వాత 2014 - 19 మధ్య కాలంలో 14.96% గా ఉంది. జాతీయ సగటు వృద్ధిరేటు (7%) కంటే రాష్ట్రం ఎక్కువ వృద్ధిరేటు (రెండంకెల వృద్ధిరేటు) సాధించింది.

ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు
వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన పంటలు, అడవులు, చేపలు పట్టడం లాంటివన్నీ ప్రాథమిక రంగంలోని ఉపరంగాలు. వీటిలో 2018 - 19లో చేపలు పట్టడం (19.0%), ఉద్యాన పంటల్లో (16%) అత్యధిక వృద్ధిరేటు నమోదవగా, వ్యవసాయంలో అతి తక్కువగా రుణాత్మక (-9.83%) వృద్ధిరేటు నమోదైంది. వర్షపాతం (-34.3%) లోటు వల్ల వృద్ధి తగ్గింది. నూతన ప్రభుత్వ శ్వేతపత్రం ప్రకారం 2014 - 19 మధ్య వ్యవసాయంలో రుణాత్మక వృద్ధిరేటు (-4.12%) నమోదైంది.

ద్వితీయ రంగంలోని ఉపరంగాలు
తయారీ రంగం; గనులు, క్వారీలు, నిర్మాణం; విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా ద్వితీయ రంగంలోని ఉపరంగాలు. వీటిలో విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా 10.72%; తయారీ రంగం 10.56%, గనుల తవ్వకం 10.34%, నిర్మాణ రంగంలో 9.55% వృద్ధి నమోదైంది.

తృతీయ (సేవా) రంగంలోని ఉపరంగాలు
వ్యాపారాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్‌ ఎస్టేట్‌ గృహాలు, రవాణా, రైల్వే, కమ్యూనికేషన్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పాలన, ఇతర సేవలన్నీ తృతీయ రంగంలోని ఉపరంగాలు. వీటిలో బ్యాంకింగ్‌, ఆర్థిక సేవల్లో అత్యధికంగా 12.90%, రైల్వేలో అత్యల్పంగా 8.4% వృద్ధిరేటు నమోదైంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో వృద్ధిరేటు పెరిగి ఆధునిక సాంకేతికత, మహిళా సాధికారత, నైపుణ్యం గల యువత లాంటి అంశాల్లో ముందంజలో ఉంది. కానీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీ పరిశ్రమలు తక్కువగా ఉండటం; ఐటీ కంపెనీలున్న నగరాలు లేకపోవడంతో ఆదాయానికి, ఉపాధికి ప్రాథమిక రంగంపై ఆధారపడాల్సి వచ్చింది. అర్థశాస్త్రం ప్రకారం వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల్లో మాత్రమే ఈ లక్షణం కనిపిస్తుంది.

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌