• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళికల కాలంలో రాష్ట్రాభివృద్ధి

పంచవర్ష ప్రణాళికలు, వాటి విజయాలు , వైఫల్యాలపై సమగ్ర అవగాహన పెంచుకుంటే అభివృద్ధికి సంబంధించిన అంశాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ప్రణాళిక లక్ష్యాలు ఏమిటి, ఏయే రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు, ఎంత వరకు సఫలీకృతమయ్యారు, ఆ సమయంలో ఎలాంటి పథకాలను అమలు చేశారు.. ఇలాంటి విషయాలపై అభ్యర్థులు దృష్టి పెట్టాలి. గణాంకాలను ఒకటికి రెండుసార్లు మననం చేసుకోవాలి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రయత్నించారు. కేంద్ర ప్రణాళికా సంఘం దేశం మొత్తానికి ఒకే విధమైన కేంద్రీకృత ప్రణాళికను రూపొందిస్తుంది. రాష్ట్రాల సభ్యత్వం కలిగిన జాతీయాభివృద్ధి మండలి ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమై చర్చించి నమూనా ప్రణాళికను ఆమోదిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రణాళికను అమలు చేస్తాయి.
                       1951-2017 మధ్య 12 పంచవర్ష ప్రణాళికలు; 1967-69, 1990-92 మధ్య రెండు వార్షిక ప్రణాళికలు, 1978-80 మధ్య ఒక నిరంతర ప్రణాళికను అమలుచేశారు. రాష్ట్రస్థాయిలో స్థానిక అవసరాలు, వనరులకు సరిపడే వార్షిక ప్రణాళికలను బడ్జెట్‌లో భాగంగా రాష్ట్రాలు తయారు చేసుకుంటాయి. వీటిని ప్రణాళికా సంఘం ఆమోదించాలి. రాష్ట్రస్థాయి ప్రణాళికలు జాతీయ ప్రణాళికల లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. రాష్ట్రాలకు కావాల్సిన ప్రణాళిక నిధులను ప్రణాళికా సంఘం అందిస్తుంది. రాష్ట్ర ప్రణాళికలను ఆయా రాష్ట్రాల ప్రణాళికా బోర్డులు రచిస్తాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక మంత్రి, ప్రణాళిక మంత్రి, సాంకేతిక నిపుణులు ప్రణాళిక బోర్డులో సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో పాలనాధికారి అధ్యక్షతన జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ; మండల స్థాయిలో మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన 25 మంది సభ్యులతో మండల ప్రణాళిక, అభివృద్ధి కమిటీ ప్రణాళిక అమలును పర్యవేక్షిస్తాయి.
2015, జనవరి 1 నుంచి ప్రణాళికా సంఘం స్థానంలో ప్రధానమంత్రి అధ్యక్షతన నీతిఆయోగ్‌ను న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు. పంచవర్ష ప్రణాళికలు రద్దు చేసి మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక, ఏడేళ్ల విజన్, 15 ఏళ్ల దీర్ఘదర్శి ప్రణాళికను అమలు చేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్రాలు నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి గతానికి భిన్నంగా ప్రణాళిక రచనలో పాలుపంచుకుంటున్నాయి. ఇది సహకార సమాఖ్యకు ముందడుగు. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేసిన ప్రణాళికలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కింది ప్రాధాన్యాలను కలిగి ఉన్నాయి.

ప్రాధాన్యాలు
రాష్ట్రంలో ముఖ్యంగా అభివృద్ధి అంశాలను ఎనిమిది ప్రాధాన్యత రంగాలుగా విభజించారు.
1. విద్యుత్తు
2. నీటిపారుదల
3. సామాజిక సేవలు
4. గ్రామీణాభివృద్ధి
5. రవాణా కమ్యూనికేషన్‌
6. వ్యవసాయం
7. పరిశ్రమలు, గనులు
8. ఇతర అంశాలు

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడే నాటికి (1956, నవంబరు )
1. దేశవ్యాప్తంగా రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61) అమల్లో ఉంది. రాష్ట్రానికి రూ.179.8 కోట్లు కేటాయించారు.
* మొదటి మూడు ప్రాధాన్య అంశాలు స్థానాలు మార్చుకుంటూ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నీటిపారుదలకు రెండు, మూడో ప్రణాళికల్లో మొదటి ప్రాధాన్యం ఇచ్చి సగటున 35% నిధులు కేటాయించారు. వ్యవసాయాభివృద్ధికి ఆవశ్యకమైన నీటిపారుదల పెంపు కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను ప్రారంభించారు.
* పరిశ్రమల విస్తరణకు ఆధారమైన విద్యుత్‌ సౌకర్యాల వృద్ధి కోసం విద్యుత్‌ రంగానికి నాలుగు, ఐదు, ఎనిమిది, తొమ్మిదో పంచవర్ష ప్రణాళికల్లో మొదటి ప్రాధాన్యం కల్పించి దాదాపు 37% పైగా నిధులు కేటాయించారు. థర్మల్, జలవిద్యుత్‌ ప్లాంట్ల అభివృద్ధికి పునాదులు వేశారు.
* ఆరు, ఏడు, పది, పదకొండో పంచవర్ష ప్రణాళికల్లో సామాజిక సేవలకు దాదాపు 30% నిధులు కేటాయించి మొదటి ప్రాధాన్యం కల్పించారు. వివిధ సామాజిక సంక్షేమ పథకాలను అమలుచేశారు.
ఉదా: సబ్సిడీ బియ్యం, జనతావస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ.
* వ్యవసాయ అనుబంధ రంగాలకు సగటున అన్ని ప్రణాళికల్లోనూ 5%, గ్రామీణాభివృద్ధికి 6% నిధులు కేటాయించారు.
* పరిశ్రమల కోసం సగటున 4% నిధులు, రవాణా కమ్యూనికేషన్‌ లాంటి సేవల రంగాలకు 9% నిధులు మాత్రమే వెచ్చించారు. దీని ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రం సేవలరంగం అభివృద్ధిలో ముందంజలో ఉన్నప్పటికీ పారిశ్రామికంగా వెనుకబడింది. 90వ దశకం నుంచి ఈ ధోరణి ప్రస్పుటంగా కనిపిస్తుంది. ఫలితంగా వ్యవసాయ ఆర్థికవ్యవస్థ నుంచి సేవలే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించింది.
* 201217 మధ్యకాలంలో 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి 2014, జూన్‌ 2న నవ్యాంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. ఆ సమయంలో పర్యవేక్షించ గల 50 అభివృద్ధి సూచికలను లక్ష్యంగా కలిగి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఈ ప్రణాళికలో మొత్తం రూ.3,42,842 కోట్ల కేటాయింపులతో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది.
జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు అమలుచేశారు. స్థానిక పరిస్థితులకు ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి సాధించారు.

 

గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు
 

1. ఆంధ్రప్రదేశ్‌ పదో పంచవర్ష ప్రణాళికలో అత్యధిక నిధుల వాటా ఏ రంగానిది? (గ్రూప్‌2, 2008)
1. శక్తి 2. నీటిపారుదల
3. సామాజిక రంగం 4. గ్రామీణ రంగం

2. కేంద్ర ప్రణాళికా సంఘం అనుమతి కోసం రాష్ట్ర పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను ఎవరు సమర్పిస్తారు? (గ్రూప్‌2, 2011)
1. ఆర్థిక మంత్రి
2. ముఖ్యమంత్రి
3. రెవెన్యూశాఖ మంత్రి
4. రాష్ట్ర ప్రణాళికా సంఘం కార్యదర్శి

3. ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళిక విజయం ఎక్కువగా వేటి పనితీరుపై ఆధారపడి ఉంటుంది? (గ్రూప్‌2, 2011)
1. సేవల రంగం 2. పారిశ్రామిక రంగం
3. ఎగుమతుల రంగం 4. వ్యవసాయ రంగం

4. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పన్నెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్య లక్ష్యం వేగవంతమైన, నిలకడగల, అధిక ...... (గ్రూప్‌2, 2012)
1. ఎగుమతుల వృద్ధి 2. మూలధన వృద్ధి
3. సమ్మిళిత వృద్ధి 4. అన్నీ

సమాధానాలు
1-3; 2--2; 3--4; 4--3.

Posted Date : 28-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌