• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణం

ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షల సిలబస్‌లో కొత్తగా 'పర్యావరణ సమస్యలు' అనే అంశాన్ని చేర్చారు. గ్రూప్ - 1, 2, 3, 4; గెజిటెడ్, నాన్ గెజిటెడ్, టెక్నికల్ ఇతర పోటీ పరీక్షల్లో భాగంగా జనరల్ స్టడీస్ విభాగంలో ఈ అంశాన్ని చేర్చారు. ఈ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులంతా మానవ మనుగడలో అత్యంత కీలకమైన పర్యావరణం గురించి తెలుసుకోవాలి. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ సమస్యలపై మంచి అవగాహన సాధించాలి.
 

మానవ మనుగడకు మూలాధారం ప్రకృతి. ప్రతి అవసరానికీ మనిషి ప్రకృతిపై ఆధారపడాల్సిందే. ఈ క్రమంలో ప్రజలు తమ ఆర్థికావసరాల కోసం ప్రకృతిపై అన్నివైపుల నుంచీ దాడిచేస్తూ కొల్లగొడుతున్నారు. ఈ చర్యలన్నీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రారంభంలో పరిశ్రమలు.. తర్వాత శాస్త్ర, సాంకేతిక విప్లవం.. విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలు.. సింథటిక్ ఉత్పత్తుల వినియోగం, వాటి ఉత్పత్తి పద్ధతులు.. ఇవన్నీ ప్రకృతికి విఘాతం కలిగిస్తూ క్రమంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. 1945లో హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేసిన నాటి నుంచి ప్రపంచం ఈ 'భూగోళ సంక్షోభం'లోకి ప్రవేశించిందని చెప్పవచ్చు.
 

పర్యావరణం అంటే..
మనలో ప్రతి ఒక్కరికి మన చుట్టూ ఉన్న పరిసరాలతో పరిచయం ఉంటుంది. ఈ పరిసరాలే జీవుల మనుగడ మీద ప్రభావం చూపిస్తాయి. మనుగడకు అవసరమైన బాహ్య పరిస్థితుల (భూమి, గాలి, నీరు, ఆహారం, వెలుతురు, వేడి, చలి) లభ్యతనే పర్యావరణం అంటారు. ఒక జీవరాశిని ప్రభావితం చేసి, మార్పులకు గురిచేస్తూ ఉన్న సజీవ, భౌతిక మూలక పదార్థాల మిశ్రమాన్ని పర్యావరణంగా చెప్పవచ్చు. సూక్ష్మంగా చెప్పాలంటే మన చుట్టూ ఆవరించి ఉన్న అంశాలే (జీవ, భౌతిక, రసాయన) పర్యావరణం. పర్యావరణంలోని జీవుల మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తే.. నివారణకు మానవుడు చేపట్టే చర్యలే 'పర్యావరణ పరిరక్షణ'.

 

రకాలు, సమస్యలు
పర్యావరణాన్ని 2 రకాలుగా చెప్పవచ్చు.
1. భౌతిక / సహజ పర్యావరణం:
జీవరాశులను ప్రభావితం చేసే భూమి, నీరు, గాలి, వాతావరణం.. ఇవన్నీ నిర్జీవ భౌతిక అంశాలు. అలాగే వర్షపు నీరు, సూర్యకిరణాలు, తేమ, వాయు తరంగాల వేగం లాంటి వాతావరణ పరమైన కారకాలు కూడా ఇందులో అంశాలే.
భౌతిక / సహజ పర్యావరణం ప్రయోజనాలు, ప్రాధాన్యాలు..
* గృహ నిర్మాణం, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి లభ్యమవుతుంది.
* జీవరాశులకు అవసరమైన భూమి, నీరు, గాలి.. పోషక మూలకాలను అందిస్తుంది.
* వాతావరణ కారకాలను నియంత్రిస్తుంది.
* వాతావరణం జీవరాశులకు ఆమ్లజని, ఇతర వాయువులను అందజేస్తుంది.
* భూగోళంలోని జలసంపద ఈ భౌతిక వాతావరణంపైనే ఆధారపడి ఉంటుంది.

 

2. జీవ పర్యావరణం
దీన్ని జీవుల సజీవ పర్యావరణం అంటారు. జీవరాశుల మనుగడకు ఇది సహాయపడుతుంది. భూమిపై ఉన్న సూక్ష్మజీవులు, జలచరాలు, పక్షులు, జంతువులు, వృక్ష సంపద, మానవులు దీనిలోని అంతర్భాగాలు.
సమస్యల ప్రభావం
1. శీతోష్ణస్థితిలో మార్పుల వల్ల గ్లోబల్ వార్మింగ్ (భూతాపం), సముద్ర నీటిమట్టం పెరగడం, గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవడం, వరదలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లవచ్చు.
2. పర్యావరణం దెబ్బతినడం వల్ల గాలిలో స్వచ్ఛత లోపిస్తుంది. ఫలితంగా మానవులకు శ్వాస సంబంధ వ్యాధులు సంక్రమిస్తాయి. అంగవైకల్యంతో పాటు అంతర్గత, బాహ్య అవయవాల ఆరోగ్యం దెబ్బ తింటుంది. సహజ లోపాలు కూడా తలెత్తవచ్చు.
3. జన్యుపర సమస్యలు ఏర్పడవచ్చు.
4. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక జనాభా కారణంగా అనేక సమస్యలు..
5. కాలుష్యం: నేల (భూమి), గాలి (వాయు), నీరు (జల) కలుషితం అవుతున్నాయి. పర్యావరణం దెబ్బతినడంతో కాంతిపై ఆ ప్రభావం పడుతుంది. దృష్టి దోషాలు తలెత్తుతాయి. ధ్వని కాలుష్యం, ఓజోన్ పొర దెబ్బతినడం, అంతరిక్షంలో సమస్యలు తలెత్తవచ్చు.
6. జీవ వ్యర్థపదార్థాల నాశనం వల్ల తలెత్తే సమస్యలు.

 

పర్యావరణ ఉద్యమాలు
పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, పొగ, విషపూరిత రసాయనాలు వదలడం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాన్ని ప్రపంచ దేశాల ప్రజలు గుర్తించారు. సముద్రాలు, ఎడారుల్లో అణు పరీక్షలు చేయడం లాంటి వాటివల్ల పర్యావరణానికి ఎదురవుతున్న ముప్పును గుర్తించారు. సరస్సులు ఎండిపోవడం, ఆమ్ల వర్షాలు వంటి విపరిణామాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలన్నీ దాదాపు 20వ శతాబ్దంలోనే కొంత ఊపందుకున్నాయి. న్యూక్లియర్ వ్యర్థ పదార్థాలు పడేయడం, ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాయు కాలుష్యం లాంటి వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
* పర్యావరణ పరిరక్షణ కోసం మొదటగా 1962లో రేచల్ కార్సన్ రాసిన 'నిశబ్ద వసంతం' అమెరికా పర్యావరణ ఉద్యమంలో మైలురాయి లాంటిది.
* 1970లో మొదటిసారిగా ధరిత్రి దినోత్సవం నిర్వహించడంతోపాటు పర్యావరణాన్ని రక్షించేందుకు యూఎస్ఏ పార్లమెంటు చట్టాలు చేసింది.
* 1970లో అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగా 'గ్రీన్‌పీస్' ఉద్యమం మొదలై.. ఆ తర్వాత అన్ని దేశాలకు విస్తరించింది. అంటార్కిటికాలో ఏర్పాటైన 'గ్రీన్‌పీస్' స్థావరం వివిధ దేశాల్లోని ఉద్యమాలను సమన్వయ పరిచింది.
* 1980లో పర్యావరణ ప్రత్యేక సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష కార్యాచరణ మొదలైంది. ఇందులో గ్రీన్‌పీస్, ఎర్త్‌లాండ్, ఎర్త్ ఫస్ట్ లాంటి సంఘాలు ఏర్పడ్డాయి.
* 1972, జూన్ 5న 'స్టాక్‌హోం'లో అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ సదస్సు జరిగింది. అప్పటి నుంచి జూన్ 5 ను ప్రతి సంవత్సరం 'ప్రపంచ పర్యావరణ దినం'గా యావత్ ప్రపంచం పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది.
* 1982లో కెన్యాలోని 'నైరోబి'లో ప్రపంచ దేశాలు మళ్లీ సమావేశమయ్యాయి. ఇలా.. 1982 నాటికి వందకు పైగా దేశాల్లో పర్యావరణ సంస్థలు ఏర్పడ్డాయి.
* 1992లో 'ధరిత్రి సదస్సు'గా ప్రస్తావిస్తున్న రియోడి జనీరియో (బ్రెజిల్) సమావేశం నాటికి పర్యావరణ అంశాలు మొత్తం ప్రపంచాన్ని జాగృతం చేయడంలో సఫలమయ్యాయి. ఇందులో 150 దేశాలు భూగోళం వేడిమి, గ్రీన్‌హౌస్ వాయువుల గురించి చర్చించాయి. ఈ సమావేశంలో చర్చించిన రెండో అంశం జీవరాశుల సమతౌల్యానికి సంబంధించింది.
* నార్వే ప్రధానిగా విధులు నిర్వహించిన గ్రొహర్లెమ్ బ్రుంట్‌లాండ్ ఐక్యరాజ్య సమితి స్థాపించిన 'వరల్డ్ కమిషన్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్‌'కు ఛైర్మన్‌గా పనిచేశారు.

 

పర్యావరణంలో ఉత్పన్నమయ్యే సమస్యలు..
* మానవ జనాభా పెరుగుదల
* జల సంబంధమైన వరదలు, భూపాతాలు
* డ్రైనేజీ, వ్యవసాయ సమస్యలు
* జీవ నిర్మాణంలో సాంద్రత పెరగడం
* భూ వినియోగం.
* నానో టెక్నాలజీ, శాస్త్ర-సాంకేతిక మార్పులు
* న్యూక్లియర్, రేడియోధార్మిక శక్తిలో మార్పులు

' పర్యావరణానికి కలిగే ముప్పును నివారించడానికి జీవ వైవిధ్యం, జీవ భద్రత లాంటివి చేపట్టడం.. అటవీ సంపదను పెంచడం.. సహజ వనరులను కాపాడుకోవడం.. పలురకాల జంతు జాతులను పెంపొందించడం.. పర్యావరణ చట్టాలను పటిష్ఠంగా అమలు చేయడం లాంటి చర్యలు అవసరం. ఈ అంశాలపై అధ్యయనం చేయాలి.'

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌