• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు

నదీ జలాల్లో 'విష' ప్రవాహం

మానవ మనుగడ దేనిపై ఆధారపడి ఉందో ఆ పర్యావరణం కాలుష్యం దెబ్బకు విషతుల్యంగా మారుతోంది. పారిశ్రామికీకరణ ప్రభావంతో వెదజల్లుతున్న కాలుష్యం పౌర సమాజాన్ని ఊపిరి సలపనీయడం లేదు. నదీ జలాలు, పరిసర ప్రాంతాల్లో చిమ్ముతున్న విష ప్రభావానికి మూగజీవాలు చనిపోతున్నాయి. మనుషులు కూడా బలై పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితిని రూపుమాపాలంటూ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలుగా సాగిన ప్రధాన ఉద్యమాలేమిటో చూద్దాం..

పౌరహక్కుల ఉద్యమాలు తమ అజెండాలో పర్యావరణ సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇచ్చాయి. కాలుష్యం లేని పర్యావరణంలో జీవించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని ఈ ఉద్యమాలు భావించాయి. ఈమేరకు పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అణుశక్తి వినియోగం, అణు విద్యుత్ కర్మాగారాల ఏర్పాటు, అణు యుద్ధాలు లాంటివాటిని వ్యతిరేకిస్తూ పౌర హక్కుల ఉద్యమాలు కొనసాగుతున్నాయి. అలాగే భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, భారీ పరిశ్రమల ఏర్పాటు, మైనింగ్ తదితర కార్యకలాపాలకు భూసేకరణ జరిపే క్రమంలో.. కొన్ని కుటుంబాలు తమ భూములను కోల్పోతున్నాయి. ఇలాంటి నిరాశ్రయుల హక్కుల సాధన కోసం పోరాటాలు జరుగుతున్నాయి.

కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు: మన దేశంలో శతాబ్దాలుగా నదులు, వాగులు, ఏరులు.. ప్రజలకు తాగునీటిని అందిస్తున్నాయి. పరిశ్రమల వాణిజ్య అవసరాలు తీరుస్తున్నాయి. మత్స్య సంపదలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే పారిశ్రామికీకరణ వల్ల ఇవి చాలామేర కలుషితం అయ్యాయి. ప్రత్యేకంగా ఉత్తరాన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్‌బంగ రాష్ట్రాలకు చెందిన నగరాల్లో గంగానది పొడవునా ఉన్న పంచదార, కాగితం, ఎరువులు, రసాయనాలు, రబ్బరు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల నుంచి వచ్చే కలుషితాలన్నీ నదిలో కలుస్తున్నాయి. దక్షిణాన కూడా పలు పరిశ్రమలు గోదావరి, కావేరి, తుంగభద్ర నదులను కలుషితం చేస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో కాలుష్య వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వాలు కొన్ని చర్యలతోపాటు పలు చట్టాలను కూడా రూపొందించాయి.

'సోన్'లో గరళం: మధ్యప్రదేశ్‌లోని షోడోల్ జిల్లాలో సోన్ నది పక్కనున్న అమ్లాయ్ నగరంలో 1965లో ఓరియంటల్ పేపర్ మిల్స్ అనే కాగితం పరిశ్రమ ఏర్పాటైంది. ఇది పెట్టిన రెండేళ్లకే కలుషిత పదార్థాల వల్ల నదిలోని చేపలు, పరిసర ప్రాంతాల్లో పశువులు మరణించాయి. 1970 నుంచి నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని 20 గ్రామాల ప్రజలు పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం వల్లే నదీ జలాలు విషపూరితం అయ్యాయంటూ అధికారులకు, కలెక్టరుకు, మంత్రులకు విన్నవించుకున్నారు. అయినా యాజమాన్యం దీనిపై స్పందించలేదు. 1973లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ, దిల్లీ) బృందం ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పశువుల్లో పాల దిగుబడి తగ్గిందని; నదిలోని చేపలు, గ్రామాల్లోని పశువులు క్రమంగా చనిపోతున్నాయని తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టారు. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 1974లో నీటి కాలుష్య నియంత్రణ చట్టాన్ని రూపొందించింది.

'చాలియార్' కలుషితం: కేరళలోని చాలియార్ నది పక్కన 1958లో బిర్లా సంస్థ గ్వాలియర్ రేయాన్స్ పరిశ్రమను స్థాపించింది. దీని నుంచి విడుదలయ్యే కాలుష్యం వల్ల ఆ నదిలోని చేపలన్నీ చనిపోయాయి. నది నుంచి నీరు వెళ్లే పంట పొలాలు నాశనమయ్యాయి. పరిసర గ్రామాల ప్రజలకు చర్మ రోగాలు సోకాయి. దీంతో వీరంతా 1963లో కాలుష్యాన్ని అదుపు చేయాలని కోరుతూ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపారు. 1975లో ఇది భారీ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఫలితంగా 1981లో కాలుష్య నియంత్రణ మండలి కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టింది.

గోవాలో ఉద్యమం: 1973లో గోవాలో జువారి ఆగ్రో కెమికల్స్ లిమిటెడ్ అనే ఎరువుల పరిశ్రమను ప్రారంభించారు. పని ప్రారంభించిన 3 నెలలకే కాలుష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు కూడా మాడిపోయాయి. దీంతో 1974 మార్చి 31న సలదాన్హా అనే ఉపాధ్యాయుడు స్థానిక ప్రజలతో కలిసి కాలుష్య వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

కాలుష్య కర్మాగారం: ముంబయికి గాలి వచ్చే నైరుతి దిశలోని అలీబాగ్ ప్రాంతంలో ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్థాపించాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పర్యావరణం దెబ్బతిని, ప్రజలు కాలుష్యానికి గురవుతున్నారని అక్కడి ప్రజలు గుర్తించారు. వీరంతా దీన్ని వేరే ప్రాంతానికి తరలించాలని ఉద్యమం చేపట్టారు. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం దీన్ని మరోచోటుకు తరలించింది.

భోపాల్ దుర్ఘటన

1984, డిసెంబరు 2 అర్ధరాత్రి భోపాల్‌లోని 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్' (అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ) అనే ఎరువుల తయారీ పరిశ్రమ నుంచి 'మిథైల్ ఐసోసైనేట్' అనే ప్రమాదకర విషవాయువు వెలువడింది. ఇది 3 వేల మంది మరణానికి కారణమైంది. భారతదేశంలో సంభవించిన పారిశ్రామిక దుర్ఘటనల్లో అతి భయానక విపత్తుగా ఇది చరిత్ర పుటల్లో నిలిచింది. అనంతర కాలంలో ఈ వాయువు దుష్ప్రభావం ఫలితంగా దాదాపు 15 వేల మంది మరణించారు. 5 లక్షల మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురయ్యారు. లక్షలాది మంది ప్రజలు వికలాంగులు, అంధులుగా మారారు. జీవచ్చవాలుగా మిగిలిన వారు చాలామంది ఉన్నారు.

ఈ సంఘటనలో ప్రధాన నిందితుడైన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సీఈవో వారెన్ ఆండర్సన్‌ను 1985 ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. అయితే అతడు బెయిల్‌పై అమెరికా వెళ్లాడు. 1986లో రషీదాబీ, చంపాదేవి శుక్లా భోపాల్ బాధితులకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఉద్యమం నడిపారు. దేశప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

1989లో రషీదాబీ, చంపాదేవి ఆధ్వర్యంలో 'భోపాల్ హతశేషుల ఉద్యమం' నడిచింది. దిల్లీలో వేలాది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తమకు న్యాయం చేయమని కోరుతూ నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి వినతి పత్రం సమర్పించారు.

1999లో చంపాదేవి ఇతర ఉద్యమకారులతో కలిసి న్యూయార్క్ కోర్టులో 'యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్'పై ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. 2002లో రషీదాబీ, చంపా కలిసి న్యూఢిల్లీలో 19 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. భోపాల్ బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. రషీదాబీ, చంపా చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో వారికి 'గోల్డ్‌మన్ పర్యావరణ బహుమతి' లభించింది. ఈ పురస్కారాన్ని పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. వీరి పోరాటానికి కొన్ని అంతర్జాతీయ సంస్థలు మద్దతు ఇచ్చాయి. అవి..

* ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* భోపాల్ మెడికల్ అప్పీల్ - బ్రిటన్
* గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్ - బ్రిటన్
* అసోసియేషన్ ఫర్ ఇండియన్ - అమెరికా
* కోర్ వాచ్ - అమెరికా
* పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ - అమెరికా
* భోపాల్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ - జపాన్

విషయం మళ్లీ 2010లో వార్తల్లోకి వచ్చింది. 2011లో కేంద్రం బాధితులకు రూ.1500 కోట్ల అదనపు ప్యాకేజీని సిఫారసు చేసింది. ఇటీవల ఈ కేసును కొట్టేశారు.

కేంద్ర ప్రభుత్వం 1984లో 'పర్యావరణ పరిరక్షణ చట్టం'ను రూపొందించింది. 1986లో పారిశ్రామిక కాలుష్య నియంత్రణ చట్టాలను అమలు చేసింది.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌