• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం - ముఖ్యాంశాలు

చారిత్రక నేపథ్యం: 1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. 1955లో వచ్చిన విశాలాంధ్ర ఉద్యమం ప్రభావంతో 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం ద్వారా కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలన్నీ కలిసి 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, పెద్దమనుషుల ఒప్పందం సక్రమంగా అమలుకావడం లేదనే కారణాలతో తెలంగాణ ప్రాంతంవారు 1969లో జై తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తారు. 1972లో ఆంధ్రులు కూడా ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా జై ఆంధ్రా ఉద్యమాన్ని తీసుకువచ్చారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యమాలను సమన్వయంతో నిలువరించగలిగింది. 1973లో 33వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆరు సూత్రాల పథకాన్ని అమలుచేసి జోనల్ వ్యవస్థకు పునాది వేసింది. ఇన్ని జరిగినా తెలంగాణ ప్రజల్లో అసంతృప్తిని తొలగించలేకపోయారు.

2001, ఏప్రిల్ 27న కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రసమితి (TRS) పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. 2009, నవంబరు 29న సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఫలితంగా 2009, డిసెంబరు 9న అప్పటి కేంద్రమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీనికి నిరసనగా ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. 2010, ఫిబ్రవరి 3న కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. 2010, డిసెంబరు 30న శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించింది. కమిటీ ఆరు పరిష్కార మార్గాలను సూచించింది. తెలంగాణలో ఉద్యమం తీవ్రత కారణంగా కేంద్రం 'తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది' అని 2013, జులై 30న ప్రకటించింది. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగిన్పటికీ ఫలితం లేకపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం - 2014 ప్రకారం 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014
      కేంద్రం 2013, జులై 30న ఆంధ్ర, తెలంగాణాలను విభజించడానికి నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రివర్గం ఆమోదించిన బిల్లును రాష్ట్ర శాసనసభలో 2013, డిసెంబరు 16న స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రవేశపెట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో శాసన సభావ్యవహారాల మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబును తప్పించి శైలజానాథ్‌కు ఆ పదవి ఇచ్చారు. ఫలితంగా శ్రీధర్‌బాబు తన పదవికి రాజీనామా చేశారు. శాసన సభలోని సంఘటనలకు నిరసనగా తెలంగాణ జేఏసీ జనవరి 7, 2014న ఇందిరా పార్కులో సంపూర్ణ తెలంగాణా సాధన దీక్షను నిర్వహించింది. 2014, జనవరి 8న సభలో బిల్లుపై మంత్రి వట్టి వసంత్‌కుమార్ చర్చను ప్రారంభించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రూల్ 77 కింద తీర్మానాన్ని ప్రవేశపెడుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. శాసనసభ, శాసన మండళ్లు తిరస్కరించినప్పటికీ బిల్లు చెల్లుబాటవుతుందని కేంద్రహోంశాఖ ప్రకటించింది. 2014, ఫిబ్రవరి 18న లోక్‌సభ, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదించిన పునర్ విభజన బిల్లుపై 2014, మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేయడంతో అది చట్టంగా మారింది. 2014, జూన్ 2ను విభజన తేదీ (అపాయింటెడ్ డే)గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం - 2014లో 12 భాగాలు (పార్టులు), 108 అధికరణలు (సెక్షన్‌లు), 13 షెడ్యూళ్లు ఉన్నాయి. 
 

చట్టంలోని 12 భాగాలు
1. ప్రవేశిక
* ఇందులో 1, 2 అధికరణలు ఉన్నాయి.
2. రెండోభాగం - ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ
* ఇందులో 3 నుంచి 11 అధికరణలను పొందుపరిచారు.

3. మూడో భాగంలో చట్టసభల్లోని ప్రాతినిధ్య వివరాలు ఉన్నాయి.
* 12 నుంచి 29 వరకు గల (18) అధికరణలు వాటి గురించి వివరిస్తాయి.
4. నాలుగో భాగం హైకోర్టు గురించి వివరిస్తుంది.
* 30 నుంచి 43 వరకు అధికరణలను దీనిలో పొందుపరిచారు.
5. అయిదో భాగంలో వ్యయానికి అధికారం, ఆదాయ పంపిణీలకు సంబంధించిన అంశాలున్నాయి.
* 44 నుంచి 46 వరకు ఉన్న అధికరణలు ఇందులో ఉన్నాయి.
6. ఆరో భాగంలో ఆస్తులు, అప్పుల పంపిణీ గురించి పేర్కొన్నారు.
* 47 నుంచి 67 వరకు ఉన్న అధికరణలు ఇందులో ఉన్నాయి.
7. ఏడో భాగంలో కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నియమాలున్నాయి.
* 68 నుంచి 75 అధికరణలు వాటి గురించి వివరిస్తాయి.
8. ఎనిమిదో భాగంలో అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అంశాలున్నాయి.
* 76 నుంచి 83 వరకు గల అధికరణలు ఇందులో ఉన్నాయి.
9. తొమ్మిదో భాగంలో జల వనరుల అభివృద్ధి, నిర్వహణ సంబంధ విషయాలు పేర్కొన్నారు.
* 84 నుంచి 91 వరకు గల అధికరణలు ఇందులో ఉన్నాయి.

10. పదో భాగంలో మౌలిక వనరులు, ప్రత్యేక ఆర్థిక చర్యల గురించి వివరణలున్నాయి.
* 92 నుంచి 94 వరకు గల అధికరణలు ఇందులో పేర్కొన్నారు.
11. పదకొండో భాగంలో ఉన్నత విద్యావకాశాల గురించి పేర్కొంటూ 95వ అధికరణ చేర్చారు.
12. 12వ భాగంలో న్యాయసంబంధ నియమాలను 96 నుంచి 108 వరకు గల అధికరణల్లో పొందుపరిచారు.

చట్టంలోని 13 షెడ్యూళ్లు
1వ షెడ్యూల్: (13వ అధికరణ)
     ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యసభలో ఉన్న 18 స్థానాల్లో ఏడు స్థానాలను తెలంగాణకు కేటాయించే విధానాన్ని వివరిస్తుంది.
2వ షెడ్యూల్: (14 - 17 అధికరణలు)
     ఇందులో 2008 నాటి పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల ఉత్తర్వులకు ప్రతిపాదించిన సవరణలను పేర్కొన్నారు. 42 లోక్‌సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణకు 17 స్థానాలు కేటాయించారు. ఏపీలోని 25 స్థానాల్లో 4 స్థానాలు ఎస్సీలకు, 2 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. తెలంగాణలోని 17 స్థానాల్లో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 స్థానాలు కేటాయించారు. 294 అసెంబ్లీ స్థానాల్లో ఏపీకి 175, తెలంగాణకు 119 స్థానాలు కేటాయించారు. ఏపీ అసెంబ్లీ స్థానాల్లో 29 ఎస్సీలకు, 7 ఎస్టీలకు కేటాయించగా తెలంగాణలో అవి 19 + 12గా ఉన్నాయి.
3వ షెడ్యూల్: (24వ అధికరణ)
     రెండు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటరీ నియోజక వర్గాల గురించి ఈ షెడ్యూల్‌లో వివరించారు.

4వ షెడ్యూల్: (22(2) అధికరణ)
     ఇరు రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాలు 90. వీటిని ఏపీకి 50, తెలంగాణకు 40గా కేటాయించారు.
5వ షెడ్యూల్: (28వ అధికరణ)
     తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల గురించి వివరిస్తుంది.
6వ షెడ్యూల్: (29వ అధికరణ)
    తెలంగాణలోని షెడ్యూల్డ్ తెగల గురించి వివరిస్తుంది.
7వ షెడ్యూల్: (52వ అధికరణ)
     ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, బీమా ఫండ్, సింకింగ్ ఫండ్, రిజర్వ్ ఫండ్ లాంటి ఫండ్స్, నిధుల గురించి వివరిస్తుంది.
8వ షెడ్యూల్: (59వ అధికరణ)
     పింఛన్ చెల్లింపులు, జీతభత్యాల గురించి తెలియజేస్తుంది.
9వ షెడ్యూల్: (68, 71 అధికరణలు)
    ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్‌ల జాబితాలను గురించి వివరించారు.
10వ షెడ్యూల్: (75వ అధికరణ)
     ఇందులో కొన్ని రాష్ట్ర సంస్థల జాబితా, ఆయా సంస్థల్లో కొనసాగింపు లాంటి అంశాలను ప్రస్తావించారు.
11వ షెడ్యూల్: (85(7) అధికరణ)
    నదీ జలాల నిర్వహణ బోర్డుల పని విధానాన్ని నిర్దారించే సూత్రాలను పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి, వెలిగొండ, ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో అనుకున్న ప్రకారమే పూర్తి చేయాలి.

12వ షెడ్యూల్: (92వ అధికరణ)
   బొగ్గు, చమురు, సహజ వాయువు, విద్యుత్ లాంటి రంగాల గురించిన వివరణలు పేర్కొన్నారు.
13వ షెడ్యూల్: (93వ అధికరణ)
     విద్యారంగం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను గురించిన వివరణలు ఇందులో పొందుపరిచారు. జాతీయ ప్రాధాన్యం ఉన్న IIT, NIT, IIM, పెట్రోలియం, వ్యవసాయ గిరిజన విశ్వవిద్యాలయాల స్థాపనకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తుంది. తెలంగాణలో మాత్రం గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయాలను కేంద్రమే ఏర్పాటు చేస్తుంది.
* ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు.
* దుగ్గరాజపట్నంలో భారీ ఓడరేవు ఏర్పాటు.
* ఖమ్మం, కడప జిల్లాల్లో సమగ్ర ఉక్కు కర్మాగారాలు నెలకొల్పడం.
* విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను ఆధునికీకరించడం.
* విశాఖ, విజయవాడ, గుంటూరు మెట్రో రైలు సౌకర్యాల కల్పన.
    పై పనులన్నింటినీ కేంద్రమే చేపడుతుందని ఈ షెడ్యూల్‌లో వివరించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని 108 సెక్షన్‌లు/ ఆర్టికల్స్‌లో కొన్ని ముఖ్యాంశాలు:
* 1, 2 అధికరణల్లో చట్టం పేరు, కొన్ని పదాల నిర్వచనాలు వివరించారు.
* 3వ అధికరణ తెలంగాణ రాష్ట్ర అవతరణ, భూభాగాల గురించి వివరిస్తుంది.
* 5వ అధికరణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్, దాని పరిధిని వివరిస్తుంది.
* 8వ అధికరణ ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల రక్షణకు గవర్నరు బాధ్యతల గురించి వివరిస్తుంది.
* 10వ అధికరణ రాజ్యాంగం మొదటి షెడ్యూల్‌కు సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టంలోని 3వ అధికరణలో పేర్కొన్న ప్రాంతాలను చేర్చాల్సిందిగా పేర్కొంది.
* 12, 13 అధికరణలు రాజ్యసభలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల సభ్యుల సంఖ్య, ప్రస్తుత సభ్యుల కేటాయింపు, పదవీకాలాల గురించి వివరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు 11 స్థానాలు, తెలంగాణకు 7 స్థానాలు కేటాయించారు.
* 17వ అధికరణ శాసన సభ స్థానాల విభజనను పేర్కొంటుంది. 175 స్థానాలు ఆంధ్రప్రదేశ్‌కు, 119 స్థానాలు తెలంగాణకు కేటాయించారు.
* 18వ అధికరణ గవర్నరు 333 రాజ్యాంగ‌ అధికరణ ప్రకారం ఆంధ్రా తెలంగాణా శాసన సభల్లో ఆంగ్లో-ఇండియన్ ప్రతినిధులను నియమించాలని తెలుపుతుంది.
* 20వ అధికరణ శాసన సభల పదవీకాలం గురించి వివరిస్తుంది.
* 22వ అధికరణ శాసన మండలి సభ్యుల విభజన గురించి పేర్కొంటుంది. (ఏపీ 50, తెలంగాణ 40)
* 26వ అధికరణ నియోజక వర్గాల డీలిమిటేషన్ (పునర్విభజన) గురించి వివరిస్తుంది. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ శాసనసభ స్థానాలను 119 నుంచి 135కు పెంచాలని పేర్కొంటుంది.
Note: ఏపీలో 50, తెలంగాణలో 16 పెంచవచ్చు.
30వ అధికరణ: ఉమ్మడి హైకోర్టు గురించి పేర్కొంటుంది. న్యాయమూర్తుల జీత భత్యాలు జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలు భరించాలి.
31వ అధికరణ: హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు ఆఫ్ హైదరాబాద్‌ల గురించి వివరిస్తుంది. ఏపీ హైకోర్టు ఎక్కడ ఉండాలనే అంశాన్ని రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా తెలియజేస్తారని ఈ అధికరణ పేర్కొంటుంది.
46వ అధికరణ: 13వ ఆర్థిక సంఘం నిధులను ఇరు రాష్ట్రాలకు పంచే విధానం గురించి వివరిస్తుంది.
47వ అధికరణ: లాభాలు, అప్పుల పంపకం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం వస్తే కాగ్‌ని సంప్రదించి కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఒక ఉత్తర్వు ద్వారా పరిష్కరించాలని వివరిస్తుంది.
54వ అధికరణ: ప్రజా రుణం గురించి వివరిస్తుంది.
58వ అధికరణ: ప్రావిడెంట్ ఫండ్‌ల గురించి వివరిస్తుంది.
59వ అధికరణ: పెన్షన్లు.
67వ అధికరణ: సంచిత నిధి (కన్సాలిడేటడ్ ఫండ్)
76వ అధికరణ: అఖిలభారత సర్వీసులు
83వ అధికరణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు

84వ అధికరణ: గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డు, కృష్ణానదీ జలాల నిర్వహణ బోర్డుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం చూస్తుందని (60 రోజుల్లో) తెలుపుతుంది. గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డు తెలంగాణాలో, కృష్ణానదీ జలాల నిర్వహణ బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి.
90వ అధికరణ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రమే పూర్తి చేస్తుంది.
91వ అధికరణ: తుంగభద్ర నదీ బోర్డులో ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు సభ్యులుగా ఉంటాయని తెలియజేస్తుంది.
95వ అధికరణ: రాజ్యాంగం 371(D) ప్రకారం అన్ని రకాల విద్యావ్యవస్థల్లో, సంస్థల్లో 10 సంవత్సరాలపాటు ఇరు రాష్ట్రాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పిస్తారని వివరిస్తుంది.
96వ అధికరణ: రాజ్యాంగ 168(1)(A)లో తమిళనాడు, తెలంగాణ అనే పదాలు చేర్చాలని పేర్కొంటుంది.
98వ అధికరణ: ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 15కు సవరణ తేవాలని చెబుతుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కింద తెలంగాణ రాష్ట్రం, శాసన పరిషత్ ఏర్పాటు పదాలు చేకూర్చాలని పేర్కొంది.
99వ అధికరణ: రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1956, సెక్షన్ 15కు సవరణ చేయాలని చెబుతుంది. 15(B)లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పదానికి బదులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పదాలు చేర్చాలని పేర్కొంటుంది.

విభజన చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు
    2014, మార్చి 1న ఆమోదించిన రెండో రోజునే అంటే మార్చి 2వ తేదీన రెండు ప్రధానమైన సవరణలను కేంద్రం తీసుకువచ్చింది. మొదటిది పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడం కాగా, రెండోది ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 85 శాతాన్ని గాడ్గిల్ ఫార్ములా ప్రకారం రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం, మిగిలిన 15 శాతం విద్యుత్‌ను గత 5 సంవత్సరాల వాస్తవ వినియోగ గణాంకాల ఆధారంగా పంపిణీ చేయడం. 
లోక్‌సభ కూడా తర్వాత 38 సవరణలు చేసింది. వాటిలో ముఖ్యమైనవి:
* తెలంగాణ రాష్ట్రాన్ని అక్షర క్రమంలో 25వ రాష్ట్రంగా పేర్కొనడం.
* నిధుల జాబితాలో మొదటి బిల్లులో 41 సంస్థలుండగా వాటిని 69కి పెంచడం.
* కార్పొరేషన్లు, ఇతర సంస్థలను 44 నుంచి 89కి పెంచడం.
* రాష్ట్రస్థాయి సంస్థల సంఖ్యను 42 నుంచి 101కి పెంచడం.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌