• facebook
  • whatsapp
  • telegram

గృహ నిర్మాణం

వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకం

 రాష్ట్ర ప్రభుత్వం 2019, జులై 19న గృహ నిర్మాణ పథకం పేరును ‘వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకంగా’ మార్చింది. ఈ పథకంలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు గృహాలు మంజూరు చేసి, వాటిని లబ్ధిదారులే స్వయంగా నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మొత్తం నాలుగు రకాల గృహ నిర్మాణ పథకాలు అమల్లో ఉన్నాయి.
1) వైఎస్‌ఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకం
2) వైఎస్‌ఆర్‌ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం
3) ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన - వైఎస్‌ఆర్‌ (గ్రామీణ) పథకం (పీఎంఏవై వైఎస్‌ఆర్‌ (గ్రామీణ))
4) ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన - వైఎస్‌ఆర్‌ (పట్టణ) పథకం (పీఎంఏవై వైఎస్‌ఆర్‌ (పట్టణ))

    వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకంలో భాగంగా వివిధ పథకాల ద్వారా మంజూరైన గృహ నిర్మాణాలను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ (ఏపీఎస్‌హెచ్‌సీఎల్)’ను నోడల్‌ ఏజెన్సీగా గుర్తించింది. ఈ సంస్థ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంతో వివిధ గృహ నిర్మాణ పథకాలను అమలు చేస్తుంది. వైఎస్‌ఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణ పథకాన్ని MGNREGS నిధుల అనుసంధానంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన వైఎస్‌ఆర్‌ (గ్రామీణ) గృహ నిర్మాణ పథకాన్ని MGNREGS నిధుల అనుసంధానంతో అంటే కేంద్ర ప్రభుత్వ సహాయంతో; ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన - వైఎస్‌ఆర్‌ (పట్టణ) గృహ నిర్మాణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అమలు చేస్తారు. వైఎస్‌ఆర్‌ ప్రత్యేక గృహ నిర్మాణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులతో హుద్‌హుద్, తిత్లీ తుపాను బాధితుల కోసం అమలు చేస్తారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించి వచ్చే అయిదేళ్లలో 25 లక్షల గృహాలను నిర్మించాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 2020, మార్చి 25న ఇళ్లులేని వారికి 25 లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేయాలని, కుటుంబంలోని మహిళ పేరిట దాన్ని అందజేయాలని నిర్ణయించింది. 
                                      వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకానికి ముందు రాష్ట్రంలో గృహ నిర్మాణం కోసం ఇందిరమ్మ (INDIRAMMA - Integrated Novel Development in Rural Areas and Model Muncipal Areas) గృహ నిర్మాణ పథకాన్ని 2005 డిసెంబరులో ప్రారంభించారు. 2014, అక్టోబరు 14న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పేరును ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంగా మార్చారు. నూతన ప్రభుత్వం దీన్ని 2019, జులై 19న వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకంగా మార్చింది. వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకం కోసం 2019 - 20 బడ్జెట్‌లో రూ.8,615 కోట్లను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ గ్రామీణ గృహ నిర్మాణం
ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1,50,000 మంజూరు చేస్తుంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.95,000, MGNREGS వాటా రూ.55,000. దీంతోపాటు షెడ్యూల్డు కులాల వారికి రూ.50,000; షెడ్యూల్డు తెగల్లోని అన్ని రకాల పీవీజేజీ వర్గాలకు రూ.1,00,000; యానాదులు, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ మండల్లాలోని ఎస్టీలకు రూ.75,000; ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ మండలాలకు చెందని ఎస్టీలకు రూ.50,000 అదనంగా మంజూరు చేస్తారు. 2019 - 20 నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, MGNREGS పథకం వాటాలను సవరించారు. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1,19,550; MGNREGS నిధులు రూ.30,450. అలాగే ఒక్కో ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.2,00,000, ఇతరులకు రూ.1,50,000 అందజేస్తున్నారు.

పీఎంఏవై - వైఎస్‌ఆర్‌ (గ్రామీణ) గృహ నిర్మాణం
 ఈ పథకం కింద యూనిట్‌ ధర రూ.2,00,000. దీనిలో భాగంగా మంజూరు చేసే మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో భరిస్తాయి. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అదనపు ఆర్థిక సహాయం అందిస్తోంది.

పీఎంఏవై - వైఎస్‌ఆర్‌ (పట్టణ) గృహ నిర్మాణం
ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఒక్కో యూనిట్‌ ధర కింద పట్టణ స్థానిక సంస్థలకు ్బగీలిత్శీ రూ.3,50,000, పట్టణాభివృద్ధి అథారిటీలకు (UDA) రూ.2,50,000 మంజూరు చేస్తుంది.

వైఎస్‌ఆర్‌ ప్రత్యేక గృహ నిర్మాణం
 ఈ పథకం కింద హుద్‌హుద్‌ తుపాను బాధితుల కోసం 9,170 ఇళ్లను మంజూరు చేశారు. ఒక్కో ఇంటి సగటు యూనిట్‌ ధర రూ.4 లక్షలు. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన 50 శాతం దాత వాటాగా ఉంటుంది. తిత్లీ తుపాను బాధితులకు ప్రభుత్వం ఒక్కో ఇంటి యూనిట్‌ ధరను రూ.2.50 లక్షలతో మొత్తం 18,152 గృహాలను మంజూరు చేసింది.


గృహ నిర్మాణానికి సంబంధించి నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు
నవరత్నాల్లో భాగంగా 2019 - 20 నుంచి 2023 - 24 మధ్య అయిదేళ్లలో సంవత్సరానికి 5 లక్షల చొప్పున 25 లక్షల గృహాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మొత్తం రూ.44,441.25 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణం కింద యూనిట్‌ ధర ఎస్సీ, ఎస్టీలకు రూ.2,50,000, ఇతరులకు రూ.2,00,000గా ప్రతిపాదించింది. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా 300 చ.అ. వరకు ఉన్న గృహాలకు సంబంధించి పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారుల రుణ భారాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌