• facebook
  • whatsapp
  • telegram

విద్యాభివృద్ధికి విలువైన పథకాలు

మానవాభివృద్ధి అనగానే మొదట గుర్తుకొచ్చేది విద్య. రాష్ట్రంలో అక్షరాస్యత ఎలా ఉంది, విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పేద, అట్టడుగు వర్గాల పిల్లలను బడికి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలను చదవాలి. ఇవన్నీ పరీక్షల కోణంలో ముఖ్యమైనవే.

విద్యారంగం
2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత 67.35%. ఇది పురుషుల్లో 74.77%, మహిళల్లో 59.96%గా ఉంది. జాతీయ అక్షరాస్యతా సగటు (72.98%)తో పోలిస్తే రాష్ట్ర సగటు అక్షరాస్యతా రేటు తక్కువగా ఉంది. రాష్ట్రంలో 2018-19లో అన్ని రకాల పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల నమోదు 70.41 లక్షలు. ఇందులో 1 - 5వ తరగతుల వారు 36.08 లక్షలు (51.24%), 6 - 8వ తరగతుల వారు 20.95 లక్షలు (29.76%), 9 - 10వ తరగతుల వారు 13.38 లక్షల (19%) మంది ఉన్నారు. 2018-19లో బడి మానేసిన విద్యార్థుల సగటు రేటు ప్రాథమిక స్థాయి (1 - 5వ తరగతి), ఎలిమెంటరీ స్థాయి (1 - 8వ తరగతి)లో సున్నా శాతంగా; సెకండరీ స్థాయి (9 - 10వ తరగతి)లో 3.94%గా ఉంది. ప్రభుత్వం రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లలు బడి మానేయకుండా ఉండటానికి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది. విద్యపై ఖర్చు చేసే ప్రతి రూపాయి మానవ మూలధన అభివృద్ధికి తోడ్పడుతుంది.

సర్వశిక్షా అభియాన్‌
బడి మానేసిన విద్యార్థులు, అనాథలు, సెమీ అనాథలు; షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన బాలికల కోసం రాష్ట్రంలో 352 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను ్బరీబితీజ్శు ఏర్పాటు చేశారు. 2018-19లో ఈ పాఠశాలల్లో 71,495 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇదే ఏడాదిలో 31 కేజీబీవీలను ఇంటర్మీడియట్‌ స్థాయికి పెంచారు.

మధ్యాహ్న భోజన పథకం
విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తోడ్పడే అత్యంత సమర్థవంతమైన అభివృద్ధి కార్యక్రమాల్లో మధ్యాహ్న భోజన పథకం ఒకటి. ఈ పథకాన్ని రాష్ట్రంలోని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్నారు. దీన్ని 2010 నుంచి ప్రత్యేక శిక్షణా కేంద్రాల (NCLP)కు విస్తరించారు. ఈ పథకం కింద 2013-14 నుంచి మోడల్‌ స్కూళ్లు కూడా లబ్ధి పొందుతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం అమలుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో కేటాయిస్తున్నాయి. 2018-19 (2018 ఆగస్టు 1) నుంచి 100 శాతం రాష్ట్ర నిధులతో ఈ పథకాన్ని ఇంటర్మీడియట్‌కు కూడా విస్తరించారు. విద్యార్థుల సంఖ్య, హాజరు శాతాన్ని పెంచడం, వారి ఆకలిని తీర్చడం, లింగ అంతరాన్ని తగ్గించి సామాజిక సమానత్వాన్ని పెంపొందించడం, పోషకాహార లోపాన్ని నివారించడం, పాఠశాల భాగస్వామ్యం, మహిళా సాధికారతను ప్రోత్సహించడం లాంటివి మధ్యాహ్న భోజన పథకం ప్రధాన లక్ష్యాలు. 2018 - 19లో ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 37.22 లక్షలు మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇందులో 17.61 లక్షల మంది ప్రాథమిక, 12.42 లక్షల మంది ప్రాథమికోన్నత, 7.18 లక్షల మంది ఉన్నత పాఠశాలలకు చెందిన పిల్లలు ఉన్నారు. ఈ పథకంలో భాగంగా అన్నం, సాంబారు, పులిహోర; వీటితోపాటు 2018-19 నుంచి వారానికి 5 గుడ్లను కూడా అందజేస్తున్నారు. ఈ పథకంలో అందించే ఆహార నాణ్యతను మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుక్‌-కమ్‌-హెల్పర్‌ల గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.3000కు పెంచింది. 2019-20కి గానూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ.1077 కోట్లను కేటాయించింది.

జగనన్న అమ్మఒడి పథకం
రాష్ట్ర ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరం నుంచి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఆర్థిక సాయం అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో అమ్మఒడి పథకం ఒకటి. దీని కింద తల్లులకు రూ.15000 అందిస్తారు. మొదట దీన్ని 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే అనుకున్నప్పటికీ తర్వాత ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ పథకంలో ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపే తల్లులు కూడా లబ్ధిదారులే. ఇది కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. దీన్ని దారిద్య్ర రేఖకు దిగువన (తీశిలి) ఉన్న కుటుంబాలకు మాత్రమే వర్తింపజేస్తారు. సుమారు 43 లక్షల మంది తల్లులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2020 జనవరి 26న రూ.15000 చొప్పున లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ పథకం అమలుకు 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,455.80 కోట్లు కేటాయించారు.

జగనన్న విద్యా దీవెన
పదో తరగతి తర్వాత పై చదువులు చదివే విద్యార్థుల (పోస్ట్‌మెట్రిక్‌ కోర్సులు) తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు; వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, కాపు, ఈబీసీ, దివ్యాంగులైన విద్యార్థులకు 100 శాతం ఫీజు రియింబర్స్‌మెంట్‌ అందిస్తారు. విద్యార్థుల కుటుంబాలపై అధికభారం మోపే ఆహారం, ప్రయాణం, వసతి, పుస్తకాలు తదితర ఖర్చులను తగ్గించడానికి ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.20,000ను అందజేస్తారు. దీని ద్వారా సుమారు 15.5 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఈ పథకానికి 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.4,962.3 కోట్లను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ విద్యోన్నతి
సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ప్రొఫెషనల్‌ గైడెన్స్‌ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఏటా 3850 సీట్లు కేటాయిస్తారు. ఇందులో కులాలవారీగా ఎస్సీ (700), ఎస్టీ (300), బీసీ (1000), ఈబీసీ (750), మైనారిటీ (300), కాపు (750), బ్రాహ్మణులకు (50) సీట్లను కేటాయించారు. నూతన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వైఎస్‌ఆర్‌ విద్యోన్నతిగా మారుస్తూ 2019 జులై 11న ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో దీన్ని ఎన్టీఆర్‌ విద్యోన్నతిగా పిలిచేవారు. దీనికి ఎంపికైన విద్యార్థులకు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో శిక్షణ అందిస్తారు. రెండేళ్లుగా యూపీఎస్సీ సివిల్‌ సర్వీసుకు ఎంపికైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా శిక్షణ సంస్థలను టాప్‌ 5, టాప్‌ 6 - 10, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు అనే మూడు కేటగిరీలుగా విభజించారు. దీనిలో భాగంగా మొదటి కేటగిరిలోని ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1,30,000; రెండో కేటగిరి ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1,15,000; మూడో కేటగిరి ఇన్‌స్టిట్యూట్‌కు రూ.1,00,000 ను అభ్యర్థి ఫీజుగా చెల్లిస్తారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు 80 శాతం బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా నెలకు స్టయిపెండ్‌ కింద హైదరాబాద్‌, ఇతర మెట్రోపాలిటన్‌ నగరాల్లో రూ.10000, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ దిల్లీలో ఉంటే రూ.12,000 ను అందిస్తారు. దీంతోపాటు అన్ని కేటగిరీల అభ్యర్థులకు ప్రయాణ ఖర్చు కింద ఒకసారి రూ.2000ను ఇస్తారు. అదనపు అలవెన్సులో భాగంగా మ్యాగజైన్‌ అలవెన్స్‌ కింద రూ.10000, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యే అభ్యర్థులకు ఇతర అలవెన్సుల కింద రూ.10,000 ఇస్తారు.


వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ నిధి

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు ఇచ్చే నిధులను ఇక నుంచి వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ నిధిగా పేరు మార్చనుంది. 2019-20కి వైఎస్‌ఆర్‌ పాఠశాలల నిర్వహణ గ్రాంటు కింద రూ.160 కోట్లను కేటాయించారు.

బడ్జెట్‌ నిధులు
2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి గత ఏడాది కంటే 34.87 శాతం నిధులను పెంచింది. 2019-20 మొత్తం బడ్జెట్‌లో విద్యా రంగానికి 14.31 శాతం నిధులను కేటాయించింది. 2019-20 బడ్జెట్‌లో మొత్తం విద్యా రంగానికి రూ.32,618.46 కోట్లు, సాంకేతిక విద్యకు రూ.580.29 కోట్లు కేటాయించారు.

మౌలిక సదుపాయాలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ప్రమాణాలను మెరుగుపరిచి కార్పొరేట్‌ పాఠశాలలతో సమానంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరణ కార్యక్రమాలను ప్రారంభించనుంది. దీని కోసం 2019-20కి గానూ రూ.1500 కోట్లను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌