• facebook
  • whatsapp
  • telegram

క్షారాలు, లవణాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

 క్షారాలు
 

ధర్మాలు:
 క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. తాకితే జారిపోయే స్వభావంతో ఉంటాయి.
‣ క్షారాలు కూడా సూచికల రంగును మారుస్తాయి.
    » క్షార ద్రావణాలు ఎర్ర లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తాయి.
    » ఇవి మిథైల్ ఆరెంజ్ సూచికను పసుపు రంగులోకి మారుస్తాయి.
    » ఫినాఫ్తలీన్ సూచికను క్షార ద్రావణాలు గులాబీ రంగులోకి మారుస్తాయి.
‣ క్షారాలు, ఆమ్లాలతో చర్య జరిపి లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి.

 

వర్గీకరణ:

 

బలమైన క్షారాలు: జల ద్రావణంలో 100% అయనీకరణం చెంది ఎక్కువ మొత్తంలో హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH–) ఇచ్చేవి 'బలమైన క్షారాలు'.
 

బలహీన క్షారాలు: జల ద్రావణంలో పాక్షికంగా వియోజనం (అయనీకరణం) చెంది తక్కువ మొత్తంలో హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH–) ఇచ్చేవి 'బలహీన క్షారాలు'.
                   

 

తయారీ: లోహ ఆక్సైడ్‌లను నీటిలో కరిగిస్తే క్షారాలను తయారు చేయవచ్చు. లోహ ఆక్సైడ్ + నీరు  క్షారం
ఉదా: సోడియం ఆక్సైడ్ + నీరు  సోడియం హైడ్రాక్సైడ్
        మెగ్నీషియం ఆక్సైడ్ + నీరు  మెగ్నీషియం హైడ్రాక్సైడ్
         లోహ ఆక్సైడ్‌లు క్షార స్వభావం ఉన్న పదార్థాలు.

 

క్షారాల ఉపయోగాలు

1. సోడియం హైడ్రాక్సైడ్: దీన్ని 'కాస్టిక్ సోడా' అని అంటారు. దీనికి కారణం సోడియం హైడ్రాక్సైడ్‌కు చర్మాన్ని కాల్చే స్వభావం ఉంటుంది.
  దీన్ని సబ్బులు, మందులు (ఔషధాలు), కృత్రిమ సిల్క్ (రేయాన్), నైలాన్ తయారీలో వాడతారు.
  దీన్ని ప్రయోగశాలల్లో చర్యాకారకంగా కూడా ఉపయోగిస్తారు.

 

2. పొటాషియం హైడ్రాక్సైడ్: దీన్ని 'కాస్టిక్ పొటాష్' అని అంటారు. దీనికి చర్మాన్ని కాల్చే స్వభావం ఉంటుంది.
  దీన్ని ఎరువులు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.
 ‣ బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. (ఆల్కలీన్ బ్యాటరీలు).

 

3. మెగ్నీషియం హైడ్రాక్సైడ్: దీన్ని 'మిల్క్ ఆఫ్ మెగ్నీషియా' అని పిలుస్తారు.
  కడుపులో ఎసిడిటీని తగ్గించే యాంటాసిడ్‌గా ఉపయోగిస్తారు.

 

4. కాల్షియం హైడ్రాక్సైడ్: దీన్ని 'మిల్క్ ఆఫ్ లైమ్' లేదా 'సున్నపు తేట' లేదా 'తడి సున్నం' అని పిలుస్తారు.
  బ్లీచింగ్ పౌడర్ తయారీకి, నీటిలోని తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి, జంతువుల చర్మాన్ని శుద్ధి చేయడానికి, గోడలకు సున్నం వేయడానికి ఉపయోగిస్తారు.
  కార్బన్ డై ఆక్సైడ్‌ను గుర్తించడానికి సున్నపు తేటను ఉపయోగిస్తారు. CO2 సున్నపుతేటను పెరుగు లాంటి తెల్లటి అవక్షేపంగా మారుస్తుంది.

 

5. అల్యూమినియం హైడ్రాక్సైడ్: కడుపులో ఎసిడిటీని తగ్గించే యాంటాసిడ్‌గా ఉపయోగిస్తారు. అగ్నిమాపక పదార్థాల తయారీలో వాడతారు.
 

6. అమ్మోనియం హైడ్రాక్సైడ్: గాజు వస్తువులను శుభ్రపరిచే గ్లాస్‌క్లీనర్‌గా, దుస్తులపై గ్రీజు మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
 

7. కాల్షియం ఆక్సైడ్: దీన్ని 'పొడి సున్నం' అని అంటారు.
  దీన్ని సిమెంట్, గాజు తయారీలో ఉపయోగిస్తారు.
  కాల్షియం ఆక్సైడ్ (CaO)ను క్రిమిసంహారిణిగా, నిర్జలీకారిణిగా ఉపయోగిస్తారు.

 

8. అమ్మోనియా: దీని రసాయన ఫార్ములా NH3.
 దీన్ని నత్రజని ఎరువుల తయారీలో వాడతారు.
‣ ద్రవ అమ్మోనియాను 'శీతలీకరణి' గా ఉపయోగిస్తారు.
 ఫినాల్, అమైనో ఆమ్లాలు, నత్రికామ్లం తయారీలో వినియోగిస్తారు.

 

తటస్థీకరణం

 ఆమ్లం, క్షారంతో చర్య జరిపి లవణం, నీటిని ఏర్పరచడాన్ని 'తటస్థీకరణం' అంటారు.
 తటస్థీకరణ చర్య ఒక ఉష్ణమోచక చర్య. ఈ చర్యలో వెలువడే ఉష్ణాన్ని 'తటస్థీకరణోష్ణం' అంటారు.
     ఆమ్లం + క్షారం 

 లవణం + నీరు + ఉష్ణం
  ఒక బలమైన ఆమ్లం, బలమైన క్షారంతో చర్య జరిపితే 13.7 కి. కేలరీల తటస్థీకరణోష్ణం వెలువడుతుంది.
ఉదా: హైడ్రోక్లోరిక్ ఆమ్లం + సోడియం హైడ్రాక్సైడ్  సోడియం క్లోరైడ్ + నీరు + 13.7 కి.కేలరీలు.
 ‣ ఒక బలమైన ఆమ్లం, బలహీన క్షారం లేదా బలమైన క్షారం, బలహీన ఆమ్లం లేదా బలహీన ఆమ్లం, బలహీన క్షారాల మధ్య చర్య జరిపితే వెలువడే తటస్థీకరణోష్ణం 13.7 కి.కేలరీల కంటే తక్కువగా ఉంటుంది.
 

లవణాలు 

 ఒక ఆమ్లం ఏదైనా క్షారంతో తటస్థీకరణ చర్య జరిపితే ఏర్పడే అయానిక సమ్మేళనాన్ని 'లవణం' అంటారు.
ఉదా: సోడియం క్లోరైడ్, సోడియం కార్బొనేట్, కాల్షియం కార్బొనేట్ మొదలైనవి.

 

లవణాల ఉపయోగాలు
 

1. సోడియం క్లోరైడ్: దీని రసాయన ఫార్ములా NaCl. దీన్ని 'సాధారణ ఉప్పు' లేదా 'సాధారణ లవణం' లేదా
  'టేబుల్ సాల్ట్' అని అంటారు.
  దీన్ని ఆహారం రుచి పెంచడానికి, ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి (Pickling). ఉపయోగిస్తారు.
  దీన్ని సోడియం హైడ్రాక్సైడ్, వంట సోడా, బట్టల సోడా, బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ వాయువు తయారీకి ముడి పదార్థంగా ఉపయోగిస్తారు.
 ‣ మంచుతో కలిపి దీన్ని 'హిమీకరణ మిశ్రమం'గా ఉపయోగిస్తారు.

 

రాతి ఉప్పు: ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఘన సోడియం క్లోరైడ్ స్ఫటికాలు మలినాలతో కలిసిపోయి జేగురు రంగులో నిక్షేపాలుగా లభిస్తాయి. దీన్ని 'రాతి ఉప్పు' అంటారు. పూర్వం సముద్ర జలాలు ఎండిపోవడం వల్ల రాతి ఉప్పు మేటలు ఏర్పడ్డాయి.
 

2. సోడియం బై కార్బొనేట్: దీని రసాయన ఫార్ములా NaHCO3. దీన్ని 'బేకింగ్ సోడా' లేదా 'వంట సోడా'
లేదా 'తినే సోడా' అని అంటారు.
  బేకింగ్ సోడా + టార్టారిక్ ఆమ్లం = బేకింగ్ పౌడర్.
  దీన్ని యాంటాసిడ్ మాత్రల తయారీలో ముఖ్య అణుఘటకంగా వాడతారు.
  అగ్నిమాపక యంత్రాల్లో దీన్ని 'సోడా ఆమ్లం'గా ఉపయోగిస్తారు.
  బేకింగ్ పౌడర్‌ను నీటిలో కలిపినప్పుడు లేదా వేడి చేసినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ (CO2)వెలువడుతుంది. దోసెలు లేదా కేక్‌ల తయారీలో బేకింగ్ పౌడర్‌ను కలిపినప్పుడు, ఆ పదార్థాల నుంచి CO2 వాయువు రంధ్రాలు చేసుకుని బయటకు వెళ్లడం వల్ల అవి వ్యాకోచించి మెత్తగా మారతాయి.

 

3. సోడియం కార్బొనేట్: అనార్ద్ర సోడియం కార్బొనేట్‌ను 'సోడా భస్మం' అంటారు. దీని ఫార్ములా Na2CO3.
   సోడియం కార్బొనేట్ డెకాహైడ్రేట్ లవణాన్ని 'వాషింగ్ సోడా' లేదా 'ఉతికే సోడా' లేదా 'చాకలి సోడా' లేదా
'బట్టల సోడా' అని అంటారు. దీని రసాయన ఫార్ములా Na2CO3.10H2O.
   దీన్ని కాగితం, గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
  ‣ సబ్బులు, డిటర్జంట్‌లు, టూత్‌పేస్ట్‌ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.
   బోరాక్స్ తయారీకి, నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.

 

4. సోడియం నైట్రేట్: దీన్ని 'చిలీ సాల్ట్ పీటర్' అంటారు. దీని ఫార్ములా NaNO3. దీన్ని ఎరువులు, పొగ బాంబుల (Smoke bombs) తయారీలో ఉపయోగిస్తారు.
 

5. ప్లాస్టర్ ఆఫ్ పారిస్: దీని రసాయన నామం 'కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్'. దీని రసాయన ఫార్ములా
CaSO4.1/2 H2O
  శరీరంలో విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్టులో ఉపయోగిస్తారు.
  దీన్ని నీటిలో చేర్చినప్పుడు 'జిప్సం' అనే ఒక దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది.
 ‣ దీన్ని బొమ్మల తయారీ, వినాయక విగ్రహాలు, అలంకరణకు ఉపయోగించే వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.
  ఇది ఒక తెల్లటి నిర్మాణ పదార్థం. గోడలు, ఇతర కట్టడాల ఉపరితలాలను నునుపు చేయడానికి, ఇళ్ల పైకప్పుల అలంకరణ కోసం ఉపయోగిస్తారు.

 

6. జిప్సం: దీని రసాయన నామం 'కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్'. దీని రసాయన ఫార్ములా CaSO4.2H2O. 
  దీన్ని నల్లబల్ల సుద్ద తయారీలో, ఎరువుగా ఉపయోగిస్తారు.
  సిమెంట్ కాంక్రీట్ గడ్డకట్టకుండా ఉండే సమయాన్ని పెంచడానికి దీన్ని సిమెంట్‌లో కలుపుతారు.

 

7. పొటాషియం నైట్రేట్: దీని రసాయన ఫార్ములా KNO3
 ‣ దీన్ని ఎరువులు, గన్‌పౌడర్, టపాకాయల తయారీలో ఉపయోగిస్తారు.
  టూత్‌పేస్ట్‌ల తయారీలో వినియోగిస్తారు.

 

8. కాల్షియం కార్బొనేట్: దీని రసాయన ఫార్ములా CaCO3. దీన్ని 'సున్నపు రాయి' లేదా 'పాలరాయి' అని అంటారు.
  దీన్ని సుద్ద తయారీకి, చక్కెర, ఇనుమును శుద్ధి చేయడానికి వాడతారు.

 

9. బ్లీచింగ్ పౌడర్: దీని రసాయన నామం 'కాల్షియం హైపో క్లోరైట్'. దీని రసాయన ఫార్ములా Ca(OCl)2
  తాగునీరు, ఈత కొలనులో క్రిములను చంపడానికి 'క్రిమి సంహారిణి'గా ఉపయోగిస్తారు.
  వస్త్ర పరిశ్రమలో నూలు, కాగిత పరిశ్రమలో కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగపడుతుంది.

 

10. బోరాక్స్: దీని రసాయన నామం 'సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్' దీని రసాయన ఫార్ములా
Na2 B4O7.10H2O
  నీటి కాఠిన్యతను తొలగించడానికి, శిలీంధ్రనాశినిగా, కీటకనాశినిగా, యాంటీసెప్టిక్‌గా ఉపయోగిస్తారు.

 

11. హైపో: రసాయన నామం సోడియం థయోసల్ఫేట్ పెంటాహైడ్రేట్. రసాయన ఫార్ములా Na2S2O3.5H2O
  దీన్ని సయనైడ్ విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు.
  నీరు, బ్లీచింగ్ పౌడర్‌లో క్లోరిన్ శాతాన్ని లెక్కించడానికి, దుస్తులపై సిరా మరకలను తొలగించడానికి వాడతారు.

 

12. సోడియం హైపో క్లోరైట్: దీని రసాయన ఫార్ములా NaClO
  దీన్ని టీ, కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
  పళ్లపై మరకలను శుభ్రపరచడానికి వాడతారు.
  మరుగుదొడ్లను శుభ్రపరచడానికి 'ద్రవ బ్లీచ్‌'గా ఉపయోగిస్తారు.

 

13. సిల్వర్ అయోడైడ్: దీని రసాయన ఫార్ములా 'Agl'
  దీన్ని కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఉపయోగిస్తారు.
ఆర్ద్ర లవణాలు: ఒక లవణం ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను 'స్ఫటిక జలం' అంటారు. స్ఫటిక జలం ఉన్న లవణాలను 'ఆర్ద్ర లవణాలు' అంటారు.
ఉదా: అనార్ద్ర కాపర్ సల్ఫేట్ CuSO4 తెల్లటి పదార్థం.
        ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ CuSO4. 5H2O నీలిరంగు లవణం.
  పొటాష్ ఆలమ్ నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
  జింక్ పాస్ఫేట్‌ను ఎలుకలకు విషంగా ఉపయోగిస్తారు.
  సాధారణ ఉప్పు వర్షాకాలంలో తడిగా మారడానికి అందులో ఉండే 'మెగ్నీషియం క్లోరైడ్' అనే మలినం కారణం.
pH - స్కేలు
 ‣ ద్రావణాల ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని కచ్చితంగా చెప్పడానికి ఎస్.పి.ఎల్. సొరెన్‌సెన్ అనే శాస్త్రవేత్త pH స్కేలును ప్రతిపాదించారు.
  ఒక ద్రావణంలో ఉన్న హైడ్రోజన్ అయాన్‌ల (H+) గాఢత రుణ సంవర్గమానాన్ని pH అంటారు.
 pH = – log10 [H+]
 pH స్కేలు '0' నుంచి '14' వరకు వ్యాప్తిచెంది ఉంటుంది. అంటే వివిధ ద్రావణాల pH విలువలు 0 నుంచి 14 వరకు ఉంటాయి.
  pH = 7 అంటే తటస్థ ద్రావణాలు.
  pH < 7 అంటే ఆమ్ల ద్రావణాలు.
 ‣ pH > 7 అంటే క్షార ద్రావణాలు.
  pH విలువ ఎంత తక్కువ ఉంటే ఆమ్లం అంత బలమైందని అర్థం.
  pH విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత బలమైన క్షారమని అర్థం.

 

నిర్వచనాలు:
  అర్హీనియస్ భావన: నీటిలో కరిగించినప్పుడు హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH-) ఇచ్చే పదార్థాలను క్షారాలు అంటారు.
  బ్రాన్‌స్టెడ్-లౌరీ భావన: క్షారాలు హైడ్రోజన్ అయాన్‌లను (H+) స్వీకరించే ప్రవృత్తి ఉన్న పదార్థాలు.
  లూయీ భావన: ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చేసే రసాయన పదార్థాలు క్షారాలు.

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌