• facebook
  • whatsapp
  • telegram

గాంధీయుగం

 భారత జాతీయోద్యమంలో 1920 - 1947 మధ్యకాలాన్ని గాంధీయుగంగా పేర్కొన్నారు. గాంధీజీ ఈ యుగంలో సత్యం, అహింస, సత్యాగ్రహాలను ఆయుధాలుగా చేసుకుని సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలను నిర్వహించి 1947లో స్వాతంత్య్రం రావడానికి కృషి చేశారు. జుదిత్‌ ఎం.బ్రౌన్‌ అనే చరిత్రకారిణి ‘‘గాంధీజీ అన్ని వర్గాలను జాతీయోద్యమంలో పాల్గొనేలా చేశారు. ప్రాంతీయ అవసరాలు తీర్చుకోవడానికి సత్యాగ్రహ ఆయుధాన్ని ప్రజలకు అందించారు’’ అని పేర్కొన్నారు.
 

తొలి జీవితం
గాంధీజీ అసలు పేరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. ఆయన 1869, అక్టోబరు 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించారు. తండ్రి కరమ్‌చంద్‌గాంధీ, తల్లి పుత్లీబాయి. గాంధీకి తన 12వ ఏటనే కస్తూరీబాయితో వివాహమైంది. 19వ ఏట బారిష్టర్‌ చదువు కోసం ఇంగ్లండ్‌ వెళ్లారు. తర్వాత భారతదేశానికి వచ్చి మొదట రాజ్‌కోట్‌లో తర్వాత బొంబాయిలో న్యాయవాదవృత్తిని చేపట్టారు. రాజ్‌చంద్ర రజ్వీభాయి ప్రభావంతో సత్యం, అహింస మార్గాలపై నమ్మకం పెంచుకున్నారు. 
                   1893లో గుజరాత్‌కు చెందిన దాదా అబ్దుల్లా కంపెనీ కేసు నిమిత్తం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. 1894లో అక్కడే నేటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌ను స్థాపించారు. ఫోనిక్స్‌ ఆశ్రమాన్ని, టాల్‌స్టాయ్‌ ఫామ్‌లను ప్రారంభించారు. 1906 నాటి నేటల్‌ జూలూ తిరుగుబాటు కాలంలో ‘‘ప్రపంచ శ్రేయస్సుకే బ్రిటిష్‌ సామ్రాజ్యం నెలకొని ఉంది’’ అని గాంధీ పేర్కొన్నారు. 1907లో ఆంగ్ల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏషియాటిక్‌ లా ఎమెండ్‌మెంట్‌ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్టయ్యారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జాతి వివక్ష విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. డర్బన్‌ నుంచి ప్రిటోరియాకు రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు గాంధీజీని బ్రిటిషర్లు పీటర్స్‌ మారిస్‌బర్గ్‌ అనే ప్రదేశంలో రైలు నుంచి కిందికి నెట్టేశారు. అప్పుడు కోట్స్‌ అనే డచ్‌ జాతీయుడు ఆంగ్లేయులపై కేసు వెయ్యమని, తాను సాక్ష్యం చెబుతానని అన్నప్పటికీ గాంధీజీ కేసు వేయలేదు. మీర్‌ ఆలమ్‌ అనే వ్యక్తి గాంధీపై అసత్య ఆరోపణలు చేసి దాడి చేశాడు. ఆ సంఘటనతో ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రికా సంపాదకుడైన జోసెఫ్‌డోక్‌ గాంధీని తన నివాసంలో ఉంచి చికిత్స చేయించాడు. గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు తన వ్యాసాలను ‘ఇండియన్‌ ఒపీనియన్‌’ పత్రికలో రాసేవారు.


జాతీయ కాంగ్రెస్‌ నాయకుడిగా..
1919లో ఆంగ్ల ప్రభుత్వం మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడంతో జాతీయ నాయకులు దీన్నివ్యతిరేకించారు. 1919, ఏప్రిల్‌ 6న ఆంగ్ల ప్రభుత్వం రౌలత్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భారతీయుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పూర్తిగా హరించే ఈ  చట్టాన్ని గాంధీ ‘ఒక నల్ల చట్టంగా, విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణంగా’ అభివర్ణించి రౌలత్‌ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. గాంధీ చేపట్టిన తొలి అఖిల భారత సమస్య (తొలి అఖిల భారత ఉద్యమం) రౌలత్‌ సత్యాగ్రహం. ఏప్రిల్‌ 6వ తేదీని ‘‘జాతిని అవమానించిన దినం’’గా ప్రకటించి ఉద్యమం ప్రారంభించారు. రౌలత్‌ సత్యాగ్రహ సమయంలోనే గాంధీ తొలిసారిగా ఆంధ్రదేశాన్ని సందర్శించారు. విజయవాడలోని రామ్మోహన్‌ రాయ్‌ గ్రంథాలయంలో ప్రసంగించారు. అయ్యదేవర కాళేశ్వరరావు గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. ఢిల్లీలో రౌలత్‌ సత్యాగ్రహ సమయంలో పోలీసు కాల్పులకు వ్యతిరేఖంగా పోరాడిన వ్యక్తి స్వామి శ్రద్ధానంద.

 

జలియన్‌వాలా బాగ్‌ దురంతం
రౌలత్‌ చట్టం ప్రకారం అమృత్‌సర్‌లో డాక్టర్‌ సత్యపాల్, సైఫుద్దీన్‌ కిచ్లూలను ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ విషయంపై చర్చించడానికి 1919, ఏప్రిల్‌ 13న అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్‌ పార్క్‌లో పంజాబ్‌ ప్రజలు సమావేశమయ్యారు. నాటి పంజాబ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మైఖేల్‌ ఒ. డయ్యర్‌ ఆజ్ఞ ప్రకారం నాటి అమృత్‌సర్‌ మిలటరీ కమాండర్‌ జనరల్‌ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి సమావేశంపై కాల్పులు జరిపాడు. సుమారు 400 మంది ప్రజలు ఈ కాల్పుల్లో మరణించారు. దీన్నే జలియన్‌వాలా బాగ్‌ దురంతంగా పేర్కొంటారు. ఈ ఘటనకు నిరసనగా రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తన ‘నైట్‌హుడ్‌’ బిరుదును వదులుకున్నారు. ఆంగ్ల ప్రభుత్వం దీనిపై హంటర్‌ కమిటీని నియమించింది. భారత జాతీయ కాంగ్రెస్‌ కూడా మోతీలాల్‌ నెహ్రూ, సీఆర్‌ దాస్, ఫజుల్‌ ఉల్‌హక్, అబ్బాస్‌ త్యాబ్జీ, ఎం.ఆర్‌.జయకర్, గాంధీలతో ఒక కమిటీని నియమించింది. జలియన్‌ వాలాబాగ్‌ ఘటనకు నిరసనగానే వైస్రాయ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న శంకర్‌ నాయర్‌ రాజీనామా చేశాడు.

 

ఖిలాఫత్‌ ఉద్యమం
ఖలీఫా పదవి రద్దుకు నిరసనగా భారతీయ ముస్లింలు ప్రారంభించిన ఉద్యమమే ఖిలాఫత్‌ ఉద్యమం. ప్రపంచ ముస్లిం మతాధిపతిని ఖలీఫా అంటారు. టర్కీ సుల్తాన్‌ ఈ పదవి నిర్వహించేవాడు. కానీ మొదటి ప్రపంచయుద్ధంలో టర్కీ మిత్ర రాజ్యాలకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంది. 1920లో మిత్ర రాజ్యాలు టర్కీతో సెవర్స్‌ సంధి చేసుకుని సుల్తాన్‌ పదవిని రద్దు చేశాయి. దాంతో ఖలీఫా పదవి కూడా రద్దయింది. దీనికి నిరసనగానే భారతీయ ముస్లింలు షౌకత్‌ అలీ, మహ్మద్‌ అలీ, హకీం హజ్మల్‌ఖాన్‌ల నాయకత్వంతో ఖిలాఫత్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. సెప్టెంబరు 17ను ఆల్‌ ఇండియా ఖిలాఫత్‌డేగా ప్రకటించారు. ఇదే సమయంలో తిలక్‌ మరణించారు. ఫలితంగా కాంగ్రెస్‌కు నూతన నాయకత్వం అవసరమైంది. గాంధీని కాంగ్రెస్‌ నాయకుడిగా ఆహ్వానించారు. 1920లో నాగ్‌పూర్‌ సమావేశంలో గాంధీని కాంగ్రెస్‌ నాయకుడిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. నాటి కాంగ్రెస్‌ సమావేశానికి సి.విజయరాఘవాచారి అధ్యక్షత వహించారు. 1920 - 47 మధ్య గాంధీ మూడు అతిపెద్ద ఉద్యమాలను నిర్వహించి విజయం సాధించారు.

 

సహాయ నిరాకరణ
గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం. 1920 నాటి కలకత్తా ప్రత్యేక సమావేశంలోనే ఐ.ఎన్‌.సి. సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలన్న ప్రతిపాదన చేసింది. కానీ 1920, డిసెంబరు నాటి నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించారు. 1919 మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల్లోని లోపాలను సవరించడం, రౌలత్‌ చట్టాన్ని తొలగించడం, జలియన్‌వాలా బాగ్‌ దురంతం ద్వారా పంజాబ్‌ ప్రజలకు జరిగిన అన్యాయానికి పరిష్కారాలను చూపడం, ఖిలాఫత్‌ ఉద్యమానికి సహాయం చేయడం లాంటి కారణాలతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో భాగంగా బహిష్కరణ, నిర్మాణాత్మక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మొదట బిపిన్‌ చంద్రపాల్, సి.ఆర్‌.దాస్, మదన్‌మోహన్ మాలవ్య లాంటివారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు.  స్వరాజ్య నిధికి కోటి రూపాయలు వసూలు చేయడానికి, కోటిమంది కొత్త సభ్యులను కాంగ్రెస్‌లో చేర్చడానికి, కాంగ్రెస్‌కు అనుబంధంగా ఒక కార్మిక సంస్థను నెలకొల్పడానికి తిలక్ అంగీకరించడంతో సి.ఆర్‌. దాస్‌ స్వయంగా సహాయ నిరాకరణ ఉద్యమ తీర్మానాన్ని ప్రతిపాదించాడు. విదేశీ వస్తువులు, విద్యాలయాలు, ఉద్యోగాలు, బిరుదులు బహిష్కరించడానికి గాంధీ పిలుపునిచ్చారు. ఫలితంగా అనేకమంది భారతీయులు తమ పదవులను వదిలి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీ ఈ ఉద్యమకాలంలోనే తన కైజర్‌-ఎ-హింద్‌ బిరుదును వదులుకున్నారు. చిత్తరంజన్‌దాస్, మోతీలాల్‌నెహ్రూ, టంగుటూరి ప్రకాశం పంతులు, రాజగోపాలాచారి, అరుణా అసఫాలీ, పటేల్‌ లాంటివారు తమ న్యాయవాద వృత్తిని వదులుకున్నారు. ఆంధ్రదేశంలోని కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటివారు తమ శాసనసభల సభ్యత్వాలను వదులుకున్నారు. దేశవ్యాప్తంగా రైతులు శిస్తు చెల్లించకుండా సహాయ నిరాకరణ చేపట్టారు. విదేశీ వస్త్రదుకాణాలను మూసివేశారు. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో భాగంగా జాతీయ విద్యాలయాల స్థాపన, స్వదేశీ స్టోర్స్, పంచాయతీ న్యాయస్థానాల ఏర్పాటు, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, అంటరానితనానికి వ్యతిరేక ఉద్యమం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. గాంధీ చరఖాను స్వదేశీ చిహ్నంగా ప్రకటించారు. 
                             బెంగాల్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ తొలి ప్రిన్సిపల్‌గా బెంగాల్‌ జాతీయ కళాశాలను స్థాపించారు. మహ్మద్ అలీ 1921లో ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా విద్యాసంస్థను నెలకొల్పారు. కాశీ (బనారస్‌), గుజరాతీ విద్యాపీఠాలను ఈ ఉద్యమ కాలంలోనే స్థాపించారు. 1921, మార్చి 31, ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశాలు విజయవాడలో జరిగాయి. పింగళి వెంకయ్య ఈ సమావేశంలోనే జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీకి అందించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్రదేశంలో చీరాల-పేరాల ఉద్యమం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, పుల్లరి సత్యాగ్రహాలు జరిగాయి.

 

భారతదేశంలో తొలి ఉద్యమాలు
గాంధీజీ తన రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలే పిలుపునందుకుని 1915 జనవరి 9న భారతదేశానికి శాశ్వతంగా తిరిగి వచ్చారు. (జనవరి 9న ప్రస్తుతం ప్రవాసీ భారతీయ దివస్‌ నిర్వహించడానికి అదే కారణం). 1916లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. ది క్రిటిక్‌ పత్రికా సంపాదకుడైన పోలక్, గాంధీజీకి జాన్‌రస్కిన్‌ రాసిన ‘అన్‌ టు దిస్‌ లాస్ట్‌’ గ్రంథాన్ని బహుకరించగా గాంధీ ఆ గ్రంథాన్ని ‘సర్వోదయ’ పేరుతో గుజరాతీ భాషలోకి అనువదించారు. 1916 నాటి లక్నో కాంగ్రెస్‌ సమావేశంలో రాజ్‌కుమార్‌ శుక్లా అనే వ్యక్తి చంపారన్‌ నీలి మందు రైతుల సమస్యను గాంధీకి వివరించాడు. ఫలితంగా గాంధీ 1917లో భారతదేశంలో తన తొలి పోరాటాన్ని ప్రారంభించారు. ఆ పోరాటమే చంపారన్‌ నీలిమందు రైతుల ఉద్యమం. బిహార్‌లోని చంపారన్‌ గ్రామంలో నీలి మందు రైతులు ఎదుర్కొంటున్న తీన్‌కథియా సమస్యపై గాంధీ తొలి పోరాటం చేశారు. ఫలితంగా ఆంగ్ల ప్రభుత్వం తీన్‌కథియా పద్ధతిని రద్దుచేసింది. ఈ ఉద్యమ సమయంలోనే బాబూ రాజేంద్రప్రసాద్‌ గాంధీకి ముఖ్య అనుచరుడయ్యాడు. 
                                  1918లో గాంధీ ఖేడా/ ఖైరా సత్యాగ్రహాన్ని చేశారు. గుజరాత్‌లోని ఖేడా ప్రాంత రైతులు అధిక భూమిశిస్తుతో బాధపడుతున్న విషయాన్ని మోహన్‌లాల్‌ పాండ్యా అనే వ్యక్తి గాంధీ దృష్టికి తెచ్చాడు. దాంతో ఆయన్ ఈ ఖేడా ఉద్యమాన్ని నిర్వహించి అధిక శిస్తు భారాన్ని తొలగించారు. 1918లోనే గాంధీ అహ్మదాబాద్‌ మిల్లు కార్మికుల ఉద్యమాన్ని నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని వస్త్ర మిల్లుల్లో పనిచేసే కార్మికుల జీతాలు తగ్గించడంతో గాంధీ ఉద్యమం చేసి వారి జీతాలు 35 శాతం పెరిగేలా చేశారు. ఖేడా సత్యాగ్రహ సమయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ గాంధీకి ప్రధాన అనుచరుడయ్యాడు. సైమన్‌ కమిషన్‌ గాంధీయుగంలో భారత జాతీయోద్యమంలో చోటు చేసుకున్న మరో ముఖ్య సంఘటన సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమం. 1919 నాటి మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల్లోని లోపాలను అధ్యయనం చేయడానికి, భారతీయుల సమస్యలను తెలుసుకోవడానికి 1927 నవంబరులో ఆంగ్ల ప్రభుత్వం సైమన్‌ కమిషన్‌ను నియమించింది. 1928, ఫిబ్రవరి 3న సైమన్‌ కమిషన్‌ బొంబాయి చేరుకుంది. ఈ‌ కమిషన్‌లో భారతీయులకు స్థానం కల్పించకపోవడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమానికి పిలుపునిచ్చింది. నాటి కమిషన్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. కానీ భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించలేదు. నాటి లార్డ్స్‌ సభలో సిన్హా, కామన్స్‌ సభలో షాపూర్‌జీ సక్లత్‌వాలా సభ్యులుగా ఉన్నారు. వీరిని కమిటీలో చేర్చుకోకపోవడంతో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ఉద్యమం జరిగింది. 1927 నాటి కాంగ్రెస్‌ సమావేశం మద్రాస్‌లో అన్సారీ అధ్యక్షతన జరిగింది. సైమన్‌ కమిషన్‌ను బహిష్కరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్‌ మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షుడిగా, జవహర్‌లాల్‌ నెహ్రూ కార్యదర్శిగా మొత్తం 11 మంది సభ్యులతో ఒక అఖిలపక్ష కమిటీని నియమించింది. ఈ కమిటీలో తేజ్‌బహదూర్‌ సప్రూ, సుభాష్‌ చంద్రబోస్, ఖురేషీ లాంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు. 1928, ఆగస్టు 28 - 30 మధ్య ఈ కమిటీ ఒక నివేదికను రూపొందించి సమర్పించింది. దీన్నే ‘నెహ్రూ నివేదిక’ అంటారు. అయితే ఈ నివేదిక భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని కాకుండా కేవలం డొమీనియా ప్రతిపత్తిని మాత్రమే కోరడంతో కమిటీలో సభ్యులు ‌ లాంటివారు దాన్ని వ్యతిరేకించారు. 

 

లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశం 
1929 డిసెంబరులో భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం లాహోర్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు. ఈ సమావేశానికి నెహ్రూను అధ్యక్షుడిగా గాంధీయే ప్రతిపాదించారు. ప్రతి ఏటా జనవరి 26ను స్వాతంత్య్ర దినంగా జరుపుకోవాలని తీర్మానించారు. 1929లోనే ఇంగ్లండ్‌లో రామ్స్‌ మెక్‌డొనాల్డ్‌ ప్రధానిగా, వెర్డ్‌ ఉడ్‌బెన్‌ భారత రాజ్య కార్యదర్శిగా అధికారంలోకి వచ్చారు. సంపూర్ణ స్వరాజ్య సాధనకు గాంధీ నాయకత్వంలో మరో ఉద్యమం చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

 

రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు
సైమన్‌ కమిషన్‌ నివేదిక ప్రకారం ఆంగ్ల ప్రభుత్వం లండన్‌లో అఖిలపక్ష సమావేశాలు (రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్సెస్‌) జరపడానికి నిర్ణయించింది. 1930 నవంబరులో లండన్‌లో మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. భారతదేశం నుంచి ఒక్క భారత జాతీయ కాంగ్రెస్‌ తప్ప మిగిలిన అన్ని పార్టీలు మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరయ్యాయి. కాంగ్రెస్‌ ఉప్పు సత్యాగ్రహాన్ని చేస్తున్నందువల్ల సమావేశానికి హాజరు కాలేదు. ఫలితంగా మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం విఫలమైనట్లు ప్రకటించిన ఆంగ్ల ప్రభుత్వం 1931లో రెండో సమావేశం ఉంటుందని పేర్కొంది. గాంధీ - ఇర్విన్‌ ఒప్పందం ప్రకారం గాంధీ రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైనప్పటికీ ‘కమ్యూనల్‌ అవార్డు’ ప్రకటన వల్ల అక్కడి నుంచి వెనుదిరిగారు. ఫలితంగా 1932లో మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిపి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ పత్రంలోని అంశాలనే 1935 భారత ప్రభుత్వ చట్టంగా ప్రవేశపెట్టారు.

 

గాంధీ - ఇర్విన్‌ ఒడంబడిక 
గాంధీని రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరయ్యేలా చేయమని నాటి ఆంగ్ల ప్రభుత్వం వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ను కోరింది. అందుకే ఇర్విన్‌ 1931, మార్చి 5న గాంధీతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అప్పటివరకూ ఆంగ్ల ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన ఉద్యమకారుల్ని విడిచిపెట్టడానికి, గాంధీ రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరుకావడానికి ఒప్పందం కుదిరింది. ఈ సమయంలోనే గాంధీపై ఒక విమర్శ కూడా వచ్చింది. లాహోర్‌ కుట్ర కేసులో ఉరిశిక్ష పడిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను విడిచిపెట్టమని గాంధీ ఇర్విన్‌ను కోరలేదని ఫలితంగా 1931, మార్చి 23న ఆంగ్ల ప్రభుత్వం వారిని ఉరితీసిందని విమర్శకులు పేర్కొన్నారు. గాంధీ 1931 నాటి రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి కాంగ్రెస్‌ ఏకైక ప్రతినిధిగా హాజరయ్యారు.
కమ్యూనల్‌ అవార్డు
              రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అంబేడ్కర్‌ కోరిక మేరకు దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయిస్తూ కమ్యూనల్‌ అవార్డును ఆంగ్లేయులు అంగీకరించారు. దీన్ని వ్యతిరేకించిన గాంధీ సమావేశం నుంచి నిష్క్రమించి భారతదేశానికి వచ్చి మళ్లీ ఉప్పుసత్యాగ్రహాన్ని కొనసాగించారు. కానీ ఆంగ్ల ప్రభుత్వం 1932లో మూడో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని జరిపి దళితులు, సిక్కులకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయిస్తూ అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని రామ్సే మెక్‌ డొనాల్డ్‌ కమ్యూనల్‌ అవార్డును ప్రకటించాడు.
పూనా ఒప్పందం  ధీ తిరిగి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడంతో ఆంగ్ల ప్రభుత్వం గాంధీని అరెస్ట్‌ చేసి, పూనాలోని ఎరవాడ జైలులో నిర్బంధించింది. కమ్యూనల్‌ అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీ జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఫలితంగా అంబేడ్కర్‌ జైలుకు వెళ్లి గాంధీతో 1932లో పూనా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో ఉమ్మడి నియోజక వర్గాల పద్ధతిని పాటించడానికి, దళితులకు కేటాయించిన స్థానాలను 71 నుంచి 148కి పెంచడానికి అంగీకారం కుదిరింది.
స్వరాజ్య పార్టీ స్థాపన  భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశం చిత్తరంజన్‌ దాస్‌ (సి.ఆర్‌. దాస్‌) అధ్యక్షతన గయలో 1922 డిసెంబరులో జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌లో గాంధీజీ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి. బాబూ రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ లాంటివారు అనుకూల వర్గంలో ఉన్నారు. వారు గాంధీజీ చెప్పిన సహాయ నిరాకరణను కొనసాగించాలన్నారు. మోతీలాల్‌ నెహ్రూ, చిత్తరంజన్‌ దాస్‌ లాంటివారు గాంధీ వ్యతిరేక వర్గంలో ఉండి, ప్రభుత్వంలో ప్రవేశించి, శాసనసభల్లో ప్రభుత్వ విధానాలను ఎదుర్కోవాలని వాదించారు. ఎన్నికల్లో పాల్గొనడమంటే ఆంగ్లేయులకు సహకరించడమే అని గాంధీ అనుకూల వర్గం పేర్కొంది. ఈ సమయంలో అఖిల భారత కాంగ్రెస్‌ ఖిలాఫత్‌ స్వరాజ్య పార్టీ (1923) ఏర్పడింది. దీని అధ్యక్షుడిగా సి.ఆర్‌. దాస్, కార్యదర్శిగా మోతీలాల్‌ నెహ్రూను ఎన్నుకున్నారు. ఈ పార్టీ 1923 ఎన్నికల్లో పోటీచేసి కేంద్ర శాసనసభలో సుమారు 48 స్థానాలను పొందింది. స్వరాజ్య పార్టీకి చెందిన విఠల్‌భాయ్‌ పటేల్‌ కేంద్ర శాసనసభ స్పీకర్‌గా పనిచేశారు. జిన్నా నాయకత్వంలోని స్వతంత్రపార్టీతో కలిసి స్వరాజ్య పార్టీ జాతీయ పార్టీగా ఏర్పడి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాయి.  1919 నాటి మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల పనితీరుపై ఆంగ్ల ప్రభుత్వం నియమించిన ‘మడ్డీమన్‌ కమిటీ’ నివేదికను తిప్పికొట్టాయి. ఉద్యోగుల సౌకర్యాలను మెరుగుపరచడానికి నియమించిన లీ కమిషన్‌ విషయంలో కొన్ని సవరణ ప్రతిపాదనలు చేశాయి. స్వరాజ్య సాధన కోసం కొన్ని తీర్మానాలు కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టాయి. సెంట్రల్‌ ప్రావిన్సెస్‌లో ఇతర పార్టీ మంత్రులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వారితో రాజీనామాలు చేయించాయి. కానీ 1925లో సి.ఆర్‌.దాస్‌ మరణించడం, 1926లో మోతీలాల్‌ నెహ్రూ రాజీనామా చేయడంతో స్వరాజ్య పార్టీ బలహీనపడింది.

 

ఉప్పు సత్యాగ్రహం 
లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశం తీర్మానం ప్రకారం గాంధీ అప్పటి వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌కు 11 అంశాలతో ఒక లేఖ రాశారు. ఆ లేఖలో భారతీయులకు ఆంగ్లేయులు చేయాల్సిన సంస్కరణలు, తీర్చాల్సిన కోరికలను పేర్కొన్నారు. కానీ ఇర్విన్‌ వాటికి సమాధానం చెప్పకపోవడంతో గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. 1930, మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో కలిసి యాత్ర ప్రారంభించిన గాంధీ 1930, ఏప్రిల్‌ 6న దండి గ్రామం చేరారు. దీన్నే ‘దండి సత్యాగ్రహం’ అంటారు. 25 రోజుల్లో 375 కిలోమీటర్ల మేర (240 మైళ్లు) ప్రయాణించి  దండి గ్రామం చేరి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించి ఉప్పు తయారుచేశారు. కాబట్టి దీన్ని శాసనోల్లంఘన ఉద్యమం అని పేర్కొంటారు. దండి యాత్రలో పాల్గొన్న ఏకైక ఆంధ్రుడు ఎర్నేని సుబ్రహ్మణ్యం. దండి యాత్ర సమయంలో ఆంధ్రులు గాంధీని జంబూసర్‌లో కలిసి తమ మద్దతును తెలిపారు. 1930, ఏప్రిల్‌ 6న దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం మొదలైంది. అఖిల భారత స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఉద్యమ నిర్వహణకు శిబిరాలను, ఉద్యమ నాయకులను (డిక్టేటర్‌లు) నియమించారు. ఆంధ్రలో ఉప్పు సత్యాగ్రహానికి కొండా వెంకటప్పయ్యను డిక్టేటర్‌గా నియమించారు.
              తమిళనాడులోని తిరుచునాపల్లి నుంచి వేదారణ్యం వరకు సి. రాజగోపాలాచారి సత్యాగ్రహ యాత్ర చేపట్టారు. కేరళలో కేలప్పన్‌ కాలికట్‌ నుంచి పాయనూర్‌ వరకు; అస్సాంలోని సిల్హెట్‌ నుంచి నౌఖాళీ వరకు యాత్ర చేశారు. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో (పెషావర్‌లో) ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ (సరిహద్దు గాంధీ) నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం జరిగింది. గఫార్‌ఖాన్‌ ఉద్యమ నిర్వహణకు ఖుదాయ్‌ - ఖిద్‌మత్‌ గార్డ్స్‌ అనే ఎర్ర చొక్కాల దళాన్ని ఏర్పాటుచేశాడు. దర్శన్‌ ఉప్పు కొఠారు వద్ద సరోజినీదేవి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. అమెరికా పత్రికా విలేకరి వెబ్‌ మిల్లర్‌ దర్శన్‌ వద్ద జరిగిన ప్రభుత్వ హింస గురించి పత్రికల్లో ప్రచురించాడు. బార్డోలీ వద్ద సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నాయకత్వంలో సత్యాగ్రహం (బార్డోలీ సత్యాగ్రహం) జరిగింది. ఆంధ్రలో తోట నరసయ్య, కేరళలో కృష్ణన్‌ పిళ్ళై లాంటివారు జెండా పండగలు నిర్వహించారు. కాకినాడ బాంబు కేసు ఈ ఉద్యమ సమయంలోనే ఆంధ్రాలో చోటుచేసుకుంది. ప్రభుత్వం ఉద్యమ అణచివేతకు అనేక చర్యలు చేపట్టింది.

 

స్వాతంత్రోద్యమ చివరి ఘట్టం
గాంధీ 1920-22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం, 1930-34 మధ్య ఉప్పు సత్యాగ్రహం నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములను చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్రిప్స్‌ రాయబారం విఫలమైంది. దాంతో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి ‘‘డూ ఆర్‌ డై’’ లాంటి నినాదాలిచ్చారు. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందింది. 1932 నాటి మూడో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అందులని అంశాలనే ‘భారత ప్రభుత్వ చట్టం - 1935’గా అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగం 1935లో తెచ్చిన చట్టానికి సవరణ చట్టంగా ఆధునిక చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టి, రాష్ట్రాలకు స్వయంపాలన కల్పించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ కేంద్రంలో ద్వంద్వ పాలనను వ్యతిరేకించినప్పటికీ 1937లో ఎన్నికలు జరిగి కాంగ్రెస్‌ స్వయంగా 7 రాష్ట్రాల్లో, మొత్తంగా 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. ఈ ఎన్నికలు ముస్లింలీగ్, ఐఎన్‌సీల మధ్య విభేదాలు పెరగడానికి కారణమయ్యాయి. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 
                     బ్రిటన్‌తో సంబంధమున్న అన్ని దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌కు సహకరించాలని అప్పటి ఇంగ్లండ్‌ ప్రధాని చాంబర్లీన్‌ కోరాడు. నాటి భారతదేశ వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో భారతదేశం కూడా బ్రిటన్‌ తరఫున యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించాడు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు 1939లో రాజీనామాలు సమర్పించాయి. కాంగ్రెస్‌ మంత్రివర్గాల రాజీనామాలను ముస్లింలీగ్‌ విమోచన దినంగా పాటించింది. యుద్ధంలో ఇంగ్లండ్‌ ఓడిపోతే నాజీ (జర్మనీ)ల నిరంకుశ అధికారం పెరిగిపోతుందని భయపడిన భారత జాతీయ కాంగ్రెస్‌ కొన్ని షరతులతో యుద్ధంలో ఇంగ్లండ్‌కు సహకరించడానికి తీర్మానించింది. యుద్ధానంతరం సంపూర్ణ స్వాతంత్య్రం ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని, ఇలా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం కేంద్ర శాసనసభకు బాధ్యత వహించాలనే షరతులు పెట్టింది.

 

ఆగస్టు ప్రతిపాదనలు (1940 ఆగస్టు 8)
భారత జాతీయ కాంగ్రెస్‌ తీర్మానానికి సమాధానంగా నాటి భారత వైస్రాయ్‌ లిన్‌లిత్‌గో 1940 ఆగస్టు 8న కొన్ని ప్రతిపాదనలు చేశాడు. వాటినే ‘ఆగస్టు ఆఫర్స్‌’ అంటారు. గవర్నర్‌ సలహా మండలిని విస్తృతపరచడం, అందులో భారతీయులకు స్థానం కల్పించడం, యుద్ధసలహా సంఘాన్ని ఏర్పరచడం లాంటి అంశాలు అందులో ఉన్నాయి. ఆగస్టు ప్రతిపాదనల్లో సంపూర్ణ స్వాతంత్య్రం అనే మాట లేకపోవడం లాంటి విషయాలతో విభేదించిన కాంగ్రెస్‌ వ్యక్తి సత్యాగ్రహాలకు పిలుపునిచ్చింది. 

 

వ్యక్తి సత్యాగ్రహాలు (1940 అక్టోబరు 17)
యుద్ధ సమయంలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తే జర్మనీ నాజీ శక్తులు విజృంభించే అవకాశం ఉన్నందువల్ల భారత జాతీయ కాంగ్రెస్‌ వ్యక్తి సత్యాగ్రహాలకు పిలుపునిచ్చింది. మొదటి సత్యాగ్రహిగా ఆచార్య వినోబాభావేను, రెండో సత్యాగ్రహిగా జవహర్‌లాల్‌ నెహ్రూను గాంధీ ఎంపికచేశారు. ఆ విధంగా 1940 అక్టోబరు 17న ఆచార్య వినోబాభావే ప్రారంభించిన వ్యక్తి సత్యాగ్రహం 1941 డిసెంబరు వరకు కొనసాగింది. జపాన్‌ 1941 డిసెంబరు 7న అమెరికా సైనిక స్థావరం పెరల్‌హార్బర్‌పై బాంబు దాడి చేయడంతో అమెరికా మిత్రరాజ్యాల తరఫున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంది.

 

అట్లాంటిక్‌ చార్టర్‌ (1941 ఆగస్టు 12)
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టు 12న అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్, ఇంగ్లండ్‌ ప్రధాని చర్చిల్‌ అట్లాంటిక్‌ సముద్రంలో ఒక నౌకపై సమావేశమై 8 అంశాలతో ఒక పథకాన్ని రూపొందించారు. ఈ అంశాలు ప్రపంచ దేశాలన్నింటికీ వర్తిస్తాయని నాటి అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కార్డెన్‌హల్‌ ప్రకటించాడు. కానీ చర్చిల్‌ కేవలం జర్మనీ ఆక్రమించిన భూభాగాలకే అట్లాంటిక్‌ చార్టర్‌లోని అంశాలు వర్తిస్తాయని ప్రకటించాడు. ఫలితంగా యుద్ధంలో ఇంగ్లండ్‌కు సహకరించడానికి భారతదేశం నిరాకరించింది.

 

క్రిప్స్‌ రాయబారం (1942)
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాటి చైనా అధ్యక్షుడు చాంగ్‌కైషేక్‌ భారతదేశంలో పర్యటించాడు. అమెరికా అధ్యక్షుడు ఎఫ్‌డీ. రూజ్‌వెల్ట్, చాంగ్‌కైషేక్‌ల ఒత్తిడితో ఇంగ్లండ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరపడానికి 1942 మార్చి 11న క్రిప్స్‌ రాయబారానికి అంగీకరించింది. 1942 మార్చి 23న సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ ఢిల్లీ చేరుకుని కొన్ని ప్రతిపాదనలు చేశాడు. యుద్ధానంతరం రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుచేయడం, రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు సైన్యం, దేశరక్షణపై ఆంగ్ల ప్రభుత్వానికే అధికారం లాంటి అంశాలు క్రిప్స్‌ రాయబారంలో ఉన్నాయి. ‘భారతదేశానికి మీరు చేయగలిగింది ఇదే అయితే వెంటనే బయలుదేరి విమానంలో ఇంగ్లండ్‌కు వెళ్లండి’ అని గాంధీ పేర్కొంటూ దివాళా తీసే బ్యాంకు పేరుమీద రాబోయే తేదీ వేసి ఇచ్చిన చెక్కుగా క్రిప్స్‌ ప్రతిపాదనలను అభివర్ణించారు. ఫలితంగా క్రిప్స్‌ రాయభారం విఫలమైంది. ఈ సమయంలోనే అర్ధ నగ్న ఫకీరైన గాంధీ ముందు మనం మోకరిల్లడమా అంటూ చర్చిల్‌ విమర్శించాడు. నాటి భారత రాజ్యాంగ కార్యదర్శిగా అమేరీ ఉన్నారు.

 

రాజాజీ ప్రణాళిక (1944)
యుద్ధానంతరం కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు కలిసి ఒక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటు లాంటి ప్రతిపాదనలతో రాజగోపాలాచారి రూపొందించిన ప్రణాళికనే రాజాజీ ప్రణాళికగా పేర్కొంటారు. కానీ దీన్ని ఇరుపక్షాలు అంగీకరించలేదు.

 

వేవెల్‌ ప్రణాళిక (1945)
1945లో నాటి భారత వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌ కొన్ని ప్రతిపాదనలు రూపొందించాడు. కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు నిర్వహించడం, రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభ ఏర్పాటు, భారతీయులకు స్వయం పాలననివ్వడం, కార్య నిర్వాహక సంఘం ఏర్పాటు, భారతదేశంలో బ్రిటన్‌ వాణిజ్య ప్రయోజనాల పర్యవేక్షణకు ఒక హైకమిషనర్‌ నియామకం లాంటి ప్రతిపాదనలు చేశాడు. దీన్నే వేవెల్‌ ప్రణాళిక అంటారు. వేవెల్‌ 1945 జూన్‌ 29న సిమ్లాలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రూపొందించిన ప్రణాళికను అంగీకరించలేదు.

 

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు (1946 సెప్టెంబరు 2)
1946 సెప్టెంబరు 2న నాటి వైస్రాయ్‌ లార్డ్‌ వేవెల్‌ విజ్ఞప్తి మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ముస్లింలీగ్‌ తరఫున అయిదుగురు మంత్రులుగా చేరారు. అసంతృప్తితో ఉన్న ముస్లింలీగ్‌ 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా మత కలహాలు చెలరేగాయి. ఈ సమయంలో దేశవిభజన ప్రక్రియను వేగవంతం చేయాలని లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ భావించాడు.

 

విభజన ప్రణాళిక (జూన్‌ 3 ప్రణాళిక)
1947 మార్చిలో భారతదేశ వైస్రాయ్‌గా లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ వచ్చాడు. భారతదేశంలో పనిచేసిన చివరి బ్రిటిష్‌ ప్రతినిధి ఆయనే. 1947, జూన్‌ 3న మౌంట్‌ బాటన్‌ విభజన ప్రణాళికను రూపొందించాడు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి సర్‌ సిరిల్‌ రాడ్‌క్లిఫ్‌ అధ్యక్షతన సరిహద్దు కమిషన్‌ను నియమించాడు. చివరికి 1947 ఆగస్టు 14న పాకిస్థాన్, 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. జిన్నా పాకిస్థాన్‌ తొలి అధ్యక్షుడిగా, బాబు రాజేంద్రప్రసాద్‌ భారత తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. భారత తొలి ప్రధానిగా జవహర్‌లాల్‌ నెహ్రూ, తొలి ఉపప్రధానిగా సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ నియమితులయ్యారు. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉండగా భారతీయులు తమ దేశ స్వాతంత్య్రం కోసం మేల్కొని ఉన్నారని నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు.

 

మంత్రిత్రయ రాయబారం (1946)
1945 జూన్‌లో ఇంగ్లండ్‌లో చర్చిల్‌ స్థానంలో లార్డ్‌ అట్లే (లేబర్‌ పార్టీ) అధికారంలోకి వచ్చాడు. అమేరీ స్థానంలో పెథిక్‌ లారెన్స్‌ భారత రాజ్య కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
అట్లే భారతదేశానికి స్వాతంత్య్రం ఇస్తామని చెప్పి, రాజ్యాంగ సంస్కరణల అమలు విషయాలు చర్చించడానికి 1946లో ముగ్గురు మంత్రులతో కూడిన బృందాన్ని భారతదేశానికి పంపాడు. దీన్నే కేబినెట్‌ మిషన్‌/ మంత్రిత్రయ రాయబారం అని పేర్కొంటారు. దీనిలో పెథిక్‌ లారెన్స్, సర్‌స్టాఫర్డ్‌ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్‌లు సభ్యులు. 1946 మార్చి 23న భారతదేశానికి వచ్చిన కేబినెట్‌ మిషన్‌ సభ్యులు అనేక ప్రతిపాదనలు చేశారు. బ్రిటిష్‌ ఇండియా, స్వదేశీ సంస్థానాలతో యూనియన్‌ ప్రభుత్వం ఏర్పాటు, కేంద్రానికి రక్షణ, విదేశీ వ్యవహారాలు, రవాణా శాఖలపై అధికారం అప్పగింత, A, B, C గ్రూపులుగా రాష్ట్రాల ఏర్పాటు, రాజ్యాంగ నిర్మాణం కోసం రాజ్యాంగ నిర్మాణసభ ఏర్పాటు లాంటి ప్రతిపాదనలు మంత్రిత్రయ రాయబారంలో చేశారు.

 

క్విట్‌ ఇండియా ఉద్యమం
క్రిప్స్‌ రాయబారం విఫలం కావడంతో భారత జాతీయ కాంగ్రెస్‌ 1942 జులై 14న  అహ్మదాబాద్‌లో సమావేశమై క్విట్‌ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని రూపొందించింది. 1942 ఆగస్టు 8న బొంబాయి సమావేశంలో క్విట్‌ ఇండియా ఉద్యమ తీర్మానాన్ని ఆమోదించారు. గాంధీ ‘డూ ఆర్‌ డై’ (సాధించు లేదా మరణించు) అనే నినాదంతో క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ‘భారతదేశాన్ని వదిలి వెళ్లండి’ (క్విట్‌ ఇండియా) అంటూ ఉద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఆంగ్ల ప్రభుత్వం జాతీయ నాయకులందర్నీ అరెస్టు చేయడంతో ఉద్యమం హింసాత్మకంగా మారిపోయింది.
                          దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలియాలో బిట్టూ పాండే, మధ్యప్రదేశ్‌లోని సతారాలో వైబీ చవాన్‌ నాయకత్వాల్లో ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బొంబాయిలోని బాందేల్‌ నుంచి రామ్‌ మనోహర్‌ లోహియా, ఉషా మెహతాలు రహస్య రేడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. కమ్యూనిస్ట్‌లు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆంధ్రాలో చండ్ర పుల్లారెడ్డి ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. మహ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని ముస్లింలీగ్‌ కూడా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ‘డివైడ్‌ అండ్‌ క్విట్‌’ అనే నినాదాన్నిచ్చింది. 1942 ఆగస్టు 12న తెనాలి రైల్వే స్టేషన్‌పై దాడి సమయంలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు మరణించారు. పోలీస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు తగలబెట్టండి లాంటి నినాదాలు మిన్నంటాయి. గాంధీ యుగంలో జరిగిన అత్యంత హింసాత్మక ఉద్యమం క్విట్‌ ఇండియా ఉద్యమమే.ఈ ఉద్యమ సమయంలోనే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ ద్వారా ఆంగ్ల ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో క్రమంగా విజయం సాధిస్తున్న ఇంగ్లండ్‌ భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చే విషయంలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ సమయంలోనే కొన్ని రాజ్యాంగ నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు.

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌