• facebook
  • whatsapp
  • telegram

ప్ర‌భుత్వ పాల‌నా ప‌ద్ధ‌తులు

ప్రజలకు సరైన పరిపాలనను అందించేందుకు నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా అనేక ప్రత్యామ్నాయాల నుంచి ఒక కార్యాచరణ సరళిని ప్రభుత్వం ఎంపిక చేయడాన్ని ‘ప్రభుత్వ విధానం’ (Public Policy) అంటారు. వీటి ఆధారంగానే ప్రభుత్వ పాలన గురించి ప్రజలకు తెలుస్తుంది.

ప్రభావితం చేసే అంశాలు
* దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు
* ఉద్యోగస్వామ్యం, ప్రభావ వర్గాలు, రాజకీయ పార్టీలు
* రాజ్యాంగ స్ఫూర్తి, నియమాలు
* ప్రజల సామాజిక విలువలు, నమ్మకాలు, సంప్రదాయాలు
* వివిధ అంశాలపై న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు
* వివిధ అంతర్జాతీయ పరిణామాలు
* ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థల విధానాలు
* ఐక్యరాజ్య సమితి, కామన్వెల్త్‌ కూటమి, జీ-20, సార్క్‌ కూటమి విధానాలు, ప్రకటనలు

రూపకల్పన దశలు
భారతదేశం లాంటి భిన్నత్వంలో ఏకత్వం గల సమాజంలో ప్రభుత్వ విధాన రూపకల్పన సంక్లిష్టంగా ఉంటుంది. సమాజ నిర్మాణం, రాజ్యాంగ విలువల మధ్య ఉండే వైరుధ్యాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అనేక సవాళ్లను ఎదుర్కొంటాయి. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ప్రభుత్వ విధానాలు రూపొంది అమలవుతున్నాయి.

1) సమస్యల గుర్తింపు దశ: ప్రభుత్వ విధాన రూపకల్పనకు అవసరమయ్యే సమస్యలను గుర్తించడాన్ని ప్రాథమిక దశగా పేర్కొంటారు. సాధారణంగా శాసనసభ చర్చలు, రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో; వివిధ వర్గాలు, వ్యవస్థలు, సంస్థల డిమాండ్లలో సమస్యలను వ్యక్తీకరిస్తారు.
ఉదా: మన దేశంలో మహిళలు, బాలల సంరక్షణ ప్రగతి కోసం కింది చట్టాలను రూపొందించారు.
* సతీసహగమన నిషేధ చట్టం - 1829
* హిందూ వితంతు పునర్వివాహ చట్టం - 1856
* బాల్య వివాహాల నిరోధక చట్టం (శారదా చట్టం) - 1929
* మహిళల, బాలికల అక్రమ వ్యాపార నిషేధ చట్టం - 1956
* వరకట్న నిషేధ చట్టం - 1961
* గృహ హింస నిరోధక చట్టం - 2005
* బాలలపై లైంగిక దాడుల నియంత్రణ చట్టం (POSCO) - 2012
* నిర్భయ చట్టం - 2013

2) విధాన ప్రత్యామ్నాయాల అన్వేషణ: ఈ దశలో ప్రభుత్వానికి సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ విభాగాలు కొన్ని సూచనలు, ప్రత్యామ్నాయ మార్గాలను తెలియజేస్తాయి. వీటిని విశ్లేషించి వాటి ప్రభావం, వ్యయాలను అంచనావేస్తారు.
ఉదా: దేశంలో అక్షరాస్యతను సాధించడంతోపాటు శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచేందుకు కిందివాటిని రూపొందించారు.
* నూతన జాతీయ విద్యావిధానం - 1986
* ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డ్‌ - 1987
* జాతీయ అక్షరాస్యతా ప్రచార దళం - 1988
* సర్వశిక్షా అభియాన్‌ - 2001
* ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం - 2009

3) ఎంపిక దశ: కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గాలు విధాన ప్రత్యామ్నాయాలను చర్చించి అందులో తక్కువ వ్యయం, నిర్దిష్ట లక్ష్య సామర్థ్యం గల వాటిని ఎంపిక చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వాల్లోని భాగస్వామ్య పార్టీలు విధాన నిర్ణయాల ద్వారా జరిగే రాజకీయ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
ఉదా: * జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం - 2005
* పట్టణ ఆస్తుల గరిష్ఠ భూపరిమితి చట్టం - 1976

4) రూపకల్పన దశ: ప్రభుత్వ విధానాలను చట్టాలు, తీర్మానాలు, విధాన నిర్ణయాల ద్వారా చట్టసభలు ఆమోదిస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, పౌర సమాజ సంస్థలు విధాన నిర్ణయాలపై వివిధ స్థాయిల్లో చర్చించి, ప్రజలను చైతన్యపరుస్తూ నూతన చట్టాలను రూపొందిస్తాయి.
ఉదా: * రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్‌ పాండే కృషి ఫలితంగా రూపొందిన జాతీయ సమాచార హక్కు చట్టం - 2005
* అన్నాహజారే నాయకత్వంలోని పౌర సమాజం కృషి ఫలితంగా రూపొందిన జాతీయ లోక్‌పాల్‌ చట్టం - 2014

5) అమలు దశ: ప్రభుత్వ విధాన రూపకల్పన బాధ్యతను సంబంధిత పాలనా శాఖలు నిర్వహిస్తాయి. దీనికి సమగ్ర నియమ నిబంధనలు రూపొందించి లబ్ధిదారులకు విధాన ప్రయోజనాలు అందేలా చూస్తాయి. సాంఘిక సంక్షేమ విధానంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్‌; గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తారు. వీటి అమలుకు ప్రభుత్వం వనరులు, మార్గదర్శకాలు, బడ్జెట్‌ను సమకూరుస్తుంది. మన దేశంలో ప్రభుత్వ విధాన రూపకల్పన, అమలు వేర్వేరు సంస్థలు చేపడుతున్నాయి.
ఉదా: జాతీయ ప్రణాళికా సంఘం 1950లో ఏర్పడి అభివృద్ధి ప్రణాళికలు - విధానాలు రూపొందిస్తే, వాటి అమలును సంబంధిత శాఖలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే విధానాలు, ప్రణాళికలు జాతీయ ప్రణాళికా సంఘం ఆమోదంతోనే జరుగుతాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం జాతీయ ప్రణాళికా సంఘాన్ని ‘నీతి ఆయోగ్‌’గా మార్చింది.

6) అమలు పర్యవేక్షణ దశ: ప్రభుత్వ విధానాల అమలును ఉన్నత, మధ్యస్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. దీనివల్ల విధానాల స్వభావంలో లేదా వాటి అమలుకు సంబంధించిన నియమ నిబంధనల్లో లోపాలుంటే వాటిని సవరించవచ్చు.

7) మూల్యాంకన దశ: ప్రభుత్వ విధానాలను అమలు చేసిన తర్వాత విధాన మూల్యాంకనం ఉంటుంది. దీని ద్వారా విధాన పరిధి, విస్తరణ లేదా అనుబంధ విధానాల రూపకల్పన జరుగుతుంది.
ఉదా: 1952 అక్టోబరు 2న ప్రారంభమైన సమాజాభివృద్ధి కార్యక్రమం (CDP); 1953 అక్టోబరు 2న ప్రారంభమైన జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (NESS) లపై అధ్యయనం కోసం 1957 జనవరి 16న బల్వంతరాయ్‌ మెహతా కమిటీని నియమించారు. ఈ కమిటీ మూడంచెల పంచాయతీరాజ్‌ విధానాన్ని సిఫార్సు చేసింది. ఇది ప్రభుత్వ భూసేకరణ విధానంపై మూల్యాంకనం జరిపి ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణలో కొన్ని మార్పులు చేసింది.

రూపకల్పన సంస్థలు
 

పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలు

ఆర్టికల్‌ 79 ప్రకారం భారతదేశంలో అత్యున్నత శాసన నిర్మాణ సంస్థ పార్లమెంటు. ఇది దేశానికి అవసరమైన ముఖ్య విధానాలను రూపొందించి, చట్టాలుగా మారుస్తుంది.
ఉదా: * అస్పృశ్యత నేర నిషేధ చట్టం - 1955
* పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1976
* వన్యప్రాణి సంరక్షణ చట్టం - 1972
* జలకాలుష్య నివారణ చట్టం - 1974
* బాలకార్మిక నిషేధ చట్టం - 1986 ్య ఆర్టికల్‌ 168 ప్రకారం రాష్ట్ర స్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ సంస్థ శాసనసభ. ఇది రాష్ట్రానికి అవసరమైన విధానాలను రూపొందించి, చట్టాలుగా మారుస్తుంది.
రాష్ట్ర శాసనసభ 2002లో నీరు, భూమి, చెట్ల పరిరక్షణ చట్టం; ఆంధ్రప్రదేశ్‌ ధూమపాన నిషేధ ప్రజారోగ్య పరిరక్షణ చట్టాలను రూపొందించింది.

కేంద్ర, రాష్ట్ర కేబినెట్‌
కార్యనిర్వాహక పరంగా విధాన రూపకల్పనలో కేబినెట్‌ కీలకపాత్ర పోషిస్తుంది. అన్ని ముఖ్యమైన విధానాలు పరిశీలించి, ఆమోదించిన తర్వాతే అమల్లోకి వస్తాయి. కేబినెట్‌, దాని సబ్‌ కమిటీలు విధాన రూపకల్పన యంత్రాంగంలో కీలకంగా వ్యవహరిస్తాయి. జాతీయ స్థాయిలో ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండళ్లు విధాన రూపకల్పనలో కీలకపాత్ర వహిస్తాయి.

ప్రధానమంత్రి - ప్రధాని కార్యాలయం
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి కీలకపాత్ర పోషిస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తారు.
ఉదా: * జవహర్‌లాల్‌ నెహ్రూ - అలీన విధానం
* ఇందిరా గాంధీ - బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు
* మొరార్జీ దేశాయ్‌ - నిరంతర ప్రణాళికలు
* రాజీవ్‌ గాంధీ - సాంకేతిక విప్లవం
* వి.పి. సింగ్‌ - అంతర్‌రాష్ట్ర మండలి ఏర్పాటు
* పి.వి. నరసింహారావు - నూతన ఆర్థిక సంస్కరణలు, భారత విదేశాంగ విధానంలో ‘లుక్‌ ఈస్ట్‌’ విధానం
* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ - అమెరికాతో 123 పౌర అణు ఒప్పందం
* నరేంద్ర మోదీ - స్వచ్ఛ భారత్‌, జీఎస్‌టీ, ట్రిపుల్‌ తలాక్‌ విధానం రద్దు

నీతి ఆయోగ్‌
ఇది రాజ్యాంగేతర సలహా సంస్థ. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు. నీతి ఆయోగ్‌ వివిధ అభివృద్ధి పథకాలు, పంచవర్ష ప్రణాళికల రూపకల్పన, రాష్ట్రాల బడ్జెట్‌ విధానాల ఆమోదంలో కీలకపాత్ర పోషిస్తుంది.

జాతీయాభివృద్ధి మండలి
విధానాల రూపకల్పన, సమన్వయంలో ‘జాతీయాభివృద్ధి మండలి’ ప్రధానమైంది. ప్రధాని అధ్యక్షుడిగా ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు సభ్యులుగా ఉంటారు. ఇది రాజ్యాంగేతర సంస్థ. జాతీయ ప్రణాళికల రూపకల్పనలో మార్గదర్శక సూత్రాలను నిర్ణయిస్తుంది. పంచవర్ష ప్రణాళికలను ఆమోదించి, వాటి అమలును సమీక్షించి, అవసరమైతే ప్రాధాన్యతలను మార్పు చేస్తుంది.

కేంద్ర సచివాలయం
ఇది కేంద్ర పరిపాలనకు వెన్నెముక లాంటిది. దీనిలో అనేక మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉంటాయి. విధానాల రూపకల్పనలో కేంద్రమంత్రి మండలికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుంది. కేంద్ర సచివాలయం అందించిన గణాంకాలు, ఆధారాలు, ఇతర సమాచారం బట్టి మంత్రిమండలి తన విధానాలను రూపొందిస్తుంది.

రాష్ట్రస్థాయి
రాష్ట్రస్థాయిలో రాష్ట్ర సచివాలయంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, కమిషనరేట్లు, డైరెక్టరేట్లు విధానాల రూపకల్పనకు అవసరమయ్యే ప్రాథమిక సమాచారాన్ని అందిస్తాయి. విధానాల అమల్లో నియమ నిబంధనలు రూపొందిస్తాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలనా విభాగం విధానాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తాయి.

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌